1, ఆగస్టు 2009, శనివారం

దమయంతి ,హిడింభి పాకం


నాకు వంట చేయడం రాకపోవడానికి కారణం మాది ఉమ్మడి కుటుంభం కావడమే ,చాల్లే అసలు దానికీ దీనికీ లింకేమిటీ అని అనుకుంటున్నారు కదూ ,మరదే ..ఉమ్మట్లో బోలెడన్ని రాజకీయాలు ఉంటాయన్నమాట... మేము గాని వంట చేస్తే అందరూ (ఇంకెవరూ మిగిలిన తోడికోడళ్ళు)మా అమ్మని, అమ్మో చిన్నక్క అదృష్టమే అదృష్టం ..చక్కగా ఆడపిల్లలు అన్నీ చక్క బెట్టేస్తుంటే ఈమె కాలు మీద కాలేసుకుని సీరియల్స్ చూస్తుంది అనేస్తారంట ,అందుకని మమ్మల్ని వంట మాత్రం చేయనిచ్చేది కాదు (మిగిలిన పనులు చేయకపోతే మాత్రం తోలు తీసేసేది)నన్నసలు రానిచ్చేది కాదు వంట గదిలోకి ,నేను పావలా పనికి రూపాయి హంగామా చేస్తానని ..పోనీ తను ఊరెళ్ళినపుడు వండుదామంటే మా పిన్నులు వంతులేసుకునేవారు ఈ సారి నేను చేస్తా మీకు వంట అంటే నేను చేస్తా అని ...లేకపోతే మా అమ్మ దెప్పేయదూ ...అదీ సంగతి ,అయితే వంట చేయడానికి కావలసింది కొంచెం ఇంట్రెస్టు ,బోలెడు ఓపిక ..ఈ రెండూ నాలో యే కొసనాలేవు అది వేరే విషయం ..


అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..ఒక సారి మా అమ్మ,అక్క ఊరెళ్ళారు ..ఎప్పటిలాగే పిన్ని వండేస్తుంది కాబట్టి తీరికగా మంచం మీద పడుకుని ఈనాడు ఆదివారం మేగజైన్ చదువుతున్నాను ...మద్యలో వంటల పేజీ వచ్చింది ..నాకు వంట చేయడం రాకపోయినా ఆ వంటకాల పొటోలు చూడటం మహా ఇంట్రెస్ట్ ..అందులో ఒక వంటకం ఫోటొ తెగ నచ్చేసింది ..చూసి పేజీ తిప్పేయచ్చుగా ఎప్పటిలాగే ...అహా ,అది చూడగానే బుద్దుడికి బోధి వృక్షం క్రింద జ్ఙ్ఞానోదయం అయినట్లు నాకు మా మంచం మీద బోలెడంత ఙ్ఞానం వచ్చేసింది ,వంటరాని బ్రతుకు ఒక బ్రతుకేనా అని ఆవేశం గా పిన్ని దగ్గరకు వెళ్ళి పిన్నీ ఈ రోజు వంట నేనే చేసుకుంటా అన్నాను ..వద్దు అంది..కుదరదు అన్నాను..చివరకు తను అన్నం వండటానికి నేను కూర చేయడానికి ఒప్పందం చేసుకున్నాం ..


నాక్కూడా కాస్త పెట్టమ్మా అని వంటకం ఫొటొ చూస్తూ మా నాన్నమ్మ నోట్లో పావులీటర్ నీళ్ళు మింగింది ..ఓ యెస్స్ అని అభయం ఇచ్చేసి కావలసిన పదార్దాలన్నీ సేకరించాను.. చక్కగా ముక్కలు చేసాను ..బాణాలి వేడి చేసాను..ఆ సరికే నాకు విసుగొచ్చేసింది ..అందరూ హాయిగా T.v చూస్తుంటే నాకు ఇప్పుడు వంట చేయడం అవసరమా అనిపించింది..కాని తప్పదుగా, మొత్తానికి వండేసాను ... మా చెల్లి అప్పటికేఅబ్బా ఆకలి ఇంకెంత సేపు అని నస ,నస ..నేను వడ్డించగానే టక్కున కలుపుకుని ,నోట్లో పెట్టుకుని తుపుక్కున ఉమ్మేసింది .. ఛీ ఇదేంటి పిల్లా ఇంత ఛండాలం గా వండావ్..ఇప్పుడు నిన్ను ఎవరు వండమన్నారు..దీన్ని వంట అనరు పెంట అంటారు అని నానా తిట్లు తిట్టి మా పిన్ని వైపు చూస్తూ పిన్నీ కాసింత పెరుగు ,పచ్చడి ఉంటే వేయవా అంది ...అవమానం అవమానం..ఎన్ని మాటలంది గాడిద
అనుకుని మా నాన్నమ్మ వైపు చూసాను ఆశ గా , ఎందుకోనమ్మా ఇందాక నుండి ఒకటే కడుపునొప్పి,ఈ సారి మళ్ళీ వండుతావ్ కదా అప్పుడు తింటాలే అని మెల్లిగా జారుకుంది ..సరే పొండి ఎంచక్కా మొత్తం నేనే తింటా అనుకుని చక్కగా ఒక ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకున్నానో లేదో ప్రొద్దున్న తిన్నదానితో సహా కక్కేసాను.. ఇదేంటబ్బా తేడా ఎక్కడ జరిగింది? అంతా వాడు చెప్పినట్లే కదా చేసాను అని మళ్ళీ బుక్కు ముందెట్టి ఒక్కోటి చదువుతుంటే ఒక చోట కళ్ళు ఆగిపోయాయి ..పెరుగు 1/2 కప్ ,వంట సోడా 1/2 టి స్పూన్ పక్క, పక్కనే రాసి ఉన్నాయి .. అప్పుడు అర్దం అయింది ఎందుకు కక్కుకున్నానో ...


సరే తరువాత, తరువాత కూరలగురించి మా అక్క సింపుల్గా చెప్పిన ఫార్మూలా ఫాలో అయిపోయాను.. వేపుళ్ళంటే తాళింపువేసి కూరముక్కలు వేపి ఉప్పుకారం జల్లడం ..పులుసులంటే తాళింపు వేయకుండా వేపిన ముక్కల్లో చింత పండు పులుసు పోసి మరగ పెట్టడం ..ఇగుర్లంటే చింతపండు పులుసు బదులు నీళ్ళు పోసి ఇగరబెట్టడం ..అంతే సింపులు ...అలా బండి నెట్టుకొచ్చేస్తున్న తరుణం లో మా ఆయనకు నా ప్రశాంతత మీద కన్నుకుట్టింది ..ఒక రోజు రావడం, రావడం బాంబ్ లాంటి వార్త చెప్పారు ,ఏంటంటే మరుసటి రోజు ఫ్రెండ్స్ తో కలసి జూ కి వెళుతున్న సందర్భం గా అందరూ తలో అయిటం తెస్తున్నారు కాబట్టి మా వాటాకు ఆవడలు (మజ్జిగ గారెలు)తీసుకువస్తాం అని చేప్పేసారట .. కాబట్టీ రేపు అవి వండేయ్ అన్నారు చక్కగా ..నాకు తెలుగు వంటల్లో నచ్చని ఒకే ఒకే పదం వడ .. అది వండాలంటే నాకు ధడ ..ఆ పప్పు మిక్సీలో వేసి కొంచెం కొంచెం నీరు వేస్తూ గంట సేపు రుబ్బాలంటే నీరసం వచ్చేస్తుంది ..చాలా సార్లు ఓపికగా రుబ్బి ఆఖరి నిమిషం లో విసుగుతో గబుక్కున నీరు ఎక్కువ వేసి గారెల పిండి కాస్త బూరెల పిండిలా చేస్తాను.. ఆ కారణం చేత నేను అప్పటికి ఒక్కసారి కూడా గారి షేప్లో గారెలు వేయలేదు ..అలాంటిది ఆవడలా!!! ....పోనీ నాకు ఆవడలు చేయడం రాదు అన్నాననుకో ..మా వారు ,నీకు ఆవడలు చేయడం రాదా !!!!!అని ఎనిమిదో వింత చూస్తున్నట్లు ఒక ఎక్స్ ప్రెషన్ ఇస్తారు అది చాలు జీవితం మీద విరక్తి వచ్చేయడానికి..కాబట్టి ఎలాగోలా ఆవడలు చేయడమే బెటర్ అని డిసైడ్ అయిపోయి రాత్రి 12 గంటల వరకూ చా...లా ...ఓపికగా నీళ్ళు ఒక్క చుక్క వేయకుండా గారెల పిండి రుబ్బేసాను ,మొదటి సారి షేప్ ఉన్న గారెలు చేసేసి చిలికిన మజ్జిగలో వాటిని వేసేసి హమ్మయ్యా అనుకుని పడుకుండిపోయా ..

ఆ ప్రొద్దున్న అందరూ ఒక్కో అయిటెం ప్లేట్ లో వేస్తుంటే మన గారెలు డబ్బా వాళ్ళ ముందు పెట్టారు మావారు ,వాటినీ ప్లేట్స్ లో వేసి అందరికీ ఇచ్చింది ఒకామే ..చెంచాతో గుచ్చి తిందామని ఒక సారి నొక్క గానే గారె కాస్తా కప్పలా ఒక్క జంపు జంపి క్రింద పడింది ...తలెత్తి చూస్తే అందరూ ఇంచుమించుగా నా గారెలతో కప్పగెంతులాట ఆడుతున్నారు ... గొప్ప సిగ్గేసేసింది ..మరి నాకు తెలియదు కదా గారెలపిండి లో అసలు నీరు లేకుండా రుబ్బితే అలా రాళ్ళల్లా వస్తాయని.. పాపం అందరూ వాటిని తినలేక ,నా ఎదురుగా వాటిని పడేయలేక నానా పాట్లు పడి నేను అటుతిరగగానే గబుక్కున డస్ట్ బిన్లో పడేసారు..మనమసలే కంత్రీలం ..చూడకుండా ఉంటానా ...

అయితే ఆ దెబ్బకి మా ఆయనకు నా వంట మీద నమ్మకం పూర్తిగా పోయింది ..ఎంత దారుణం అంటే ఒక వేళ నేను వంట బాగా చేసినా, అది నేను చేసాను కాబట్టి అది బాగోదు అని డిసైడ్ అయిఫొయి ఇంకాస్త కారం పడుతుందేమో,ఇంకేదో తక్కువయింది అని ఒకటే వంకలు .. అక్కడితో ఊరుకునేవారా, యే పొరిగింటమ్మ పుల్ల కూర తిన్నా ..నా ఎదురుగానే ఆవిడ ఫలానా కూర సూపర్ వండింది కదా ..ఆవిడని అడిగి నేర్చుకోరాదు అని బోలెడు ఉచిత సలహాలు అన్నమాట ...దాంతో నా వంట మీద నాకే బోలెడంత డవుట్ వచ్చేసేది ..నాకు అస్సలు వంట చేతకాదు అని ..


సరే ఇలాకాదు అని ఒకరోజు చక్కగా చికెన్ బిర్యాని చేసి మా ఆయన రాగానే పక్కింటి ఆవిడ పంపింది అని ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చాను..అదే అనుకున్నా భలే ఘుమ ఘుమలు వస్తున్నాయి అని ఒక స్పూన్ నోట్లో వేసుకుని.. ఆహా,ఎలాగైనా ముస్లింలు ముస్లింలేనే ...బిర్యాని వాళ్ళు చేసినట్లు ఇంకెవరూ చేయలేరు అని ఒక్కో స్పూన్ తెగ ఆస్వాదిస్తూ తిన్నారు ..అమ్మ దొంగ మొహం అని మనసులో అనుకుని ఆయన అంతా తిన్నాకా నేనే చేసాను ఇది, పక్కింటావిడ కాదు అన్నాను గర్వం గా చూస్తూ ...అదేనే మద్యలో డవుటొచ్చింది ఉప్పు కాస్త ,అంటే కొంచెం ఎక్కువగా అనిపించిందేంటాబ్బా అని అన్నారు ప్లేట్ నా చేతికిచ్చి..ఎంత కోపం వచ్చిందంటే, పతివ్రతా శిరోమణిని కాబట్టి బ్రతికిపోయారు కాని లేకపోతేనా ఆ ప్లేట్ పెట్టి నెత్తిమీద టంగు టంగు మని నాలుగు పీకేదాన్ని ....


కొసమెరుపేంటంటే మొన్నామద్య ఫ్రెండ్స్ అందరం కలిసి బింతాన్ వెళ్ళాం ,మిగిలిన వారు అందరూ శాకాహారులు అవ్వడం చేత అక్కడ దొరకదని ఇంట్లో తయారు చేసుకుని వెళదాం అన్నారు ,నన్ను లంచ్ కి సరిపడే తీసుకురమ్మన్నారు ,ఇంచుమించుగా పదిమందికి వండాలన్నమాట ,కాని తప్పదు కదా, దేవుడా నువ్వే దిక్కు అనుకుని అన్నం ,కూరా,పప్పు,పచ్చడి అన్నీ చేసి జాగ్రత్తగా పేక్ చేసి తీసుకు వెళ్ళాను ,వంట చేసినంత సేపూ మా ఆయన ఒకటే నస ..అన్నం మెత్తగా చేసావేమో ,ఇందులో ఏదో తక్కువ అయినట్లుంది,దాన్ని ఇంకొంచం వేపాల్సింది అని...లంచ్ వడ్డించినప్పుడు మహా టెన్షన్ నాకు ,తిన్న వాళ్ళందరూ ఆహా ఎంత బాగున్నాయి,ఏం రుచి అని పొగిడేస్తుంటే నా కళ్ళలో నుండి ఒకటే ఆనంద భాష్పాలు.. వాళ్ళు అలా వాళ్ళ రూంస్ కి వెళ్ళగానే ,నా ఆనందబాష్పాలు ఇంకకముందే మా కుళ్ళు మొహం మొదలెట్టేసారు ,మరీ ఎక్కువ ఫీలయిపోకు ఎవరూ మొహం మీద బాలేదని అనరు అనుకుంటూ ... అప్పడాల కర్ర అనేది ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో నాకు తెలిసొచ్చింది అప్పుడు...


కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే కడవంత గుమ్మడికాయా కత్తి పీటకు లోకువ అని బంగారంలాంటి పెళ్ళాం కత్తిలాంటి మొగుడికి ఎప్పుడూ లోకువే ..అంతే ,అంతే ,అంతే ముమ్మాటికీ అంతే

76 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

I was laughing from beginning till end.

జీడిపప్పు చెప్పారు...

టైటిల్ బాగుంది, వ్యాసం బహుబాగుంది!

" నా గారెలతో కప్పగెంతులాట ఆడుతున్నారు" loll!!

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

>>అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..

:-)

చాలా కామెడీగా వ్రాసారు. రాత్రిన్ ఆఫీసులో నైట్ అవుట్ చేసిన నేను పొద్దునే మీ పోస్ట్ చూసి హాయిగా నవ్వుకున్నాను.

G Veera Sekhar చెప్పారు...

హ హ హ హ హ.., చాలా బాగా రాసారు.., నవ్వు ఆపుకోలేకపోయాము.
"అదేనే మద్యలో డవుటొచ్చింది ఉప్పు కాస్త ,అంటే కొంచెం ఎక్కువగా అనిపించిందేంటాబ్బా అని అన్నారు ప్లేట్ నా చేతికిచ్చి..ఎంత కోపం వచ్చిందంటే, పతివ్రతా శిరోమణిని కాబట్టి బ్రతికిపోయారు కాని లేకపోతేనా ఆ ప్లేట్ పెట్టి నెత్తిమీద టంగు టంగు మని నాలుగు పీకేదాన్ని ...."
"నా ఆనందబాష్పాలు ఇంకకముందే మా కుళ్ళు మొహం మొదలెట్టేసారు ,మరీ ఎక్కువ ఫీలయిపోకు ఎవరూ మొహం మీద బాలేదని అనరు అనుకుంటూ ... "

ఈ లైన్స్ దగ్గరైతే మరీను, బుగ్గలు నొప్పెట్టేసాయి.

టైటిల్ సూపర్, నల భీమ కు పేరడీగా బాగా రాసారు.

అజ్ఞాత చెప్పారు...

బ్లాగుల్లో ఆడవాళ్ళే కామెడీ బాగా రాస్తారెందుకో? సూపర్.

"పొరుగింటి పుల్ల కూర రుచి" కాదండి.

"పొరుగింటి పిల్ల కూర రుచి."

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ వీకెండ్ శుభారంభం :-) పొద్దున్నె భలే నవ్వించారు నేస్తం... చాలా బాగుంది.

ప్రేమికుడు చెప్పారు...

భలే రాశారండీ....
అవును మొగాళ్లకి పెళ్లాలు పక్కనున్నంత సేపూ వాళ్ల విలువతెలియదు. ఎంత చక్కగా చేసినా ఏదో ఒక వంక పెడతారు. నేనూ మా అమ్మని అలాగే అంటూ ఉంటాను అనుకోండి. కానీ అంతగా కాదన్నమాట....

కాని మీ పోష్టు చదివాకా అసలు వంకే పెట్ట కూడదు అనుకుంటున్నాను.
మీ బ్లాగుని మా ఇంట్లో వాళ్లందరికీ తెగ నచ్చేస్తోంది.:)

swapna@kalalaprapancham చెప్పారు...

ayithe inkenduku alasyam baga vantalu nerchukoni aadavalla paruvu nilabettndi. avunu inthaki mi marriage ayyi ennallu ayitundi, recent anukunta andukane papam vantalatho kusthilu padutunnaru. parvaledu nenu mito compare chesukunte ok annamata :).

miru job chestara andukane papam vantalu nerchukodaniki time saripodam ledemo ayina parledu lendi, weekends unnay kada denikina :).
ee madyane enduko naku vantala mida interest vachindi, parvaledu chestunna.

inthaki mi pellichupulu post continue chesta annaru, waiting for that post.

మీ శ్రేయోభిలాషి చెప్పారు...

"బంగారంలాంటి పెళ్ళాం కత్తిలాంటి మొగుడికి ఎప్పుడూ లోకువే ..అంతే ,అంతే ,అంతే ముమ్మాటికీ అంతే"

ఆదర గొట్టేసారు!

అజ్ఞాత చెప్పారు...

mI prati posT chaala chaala bAgunTumdi. mI jIvitamlo jarigina prati anubhavAnni EntO adbhutamga eduTivAriki vivaristunnaru. nEnu mI prati posT kosam eduru chUstunTA.Enta Tenshan lo unna mI posT chadivi navvukunTA

nijamcheppalanTE mI blog chadivina tarvaatE nEnu oka blog kriyeT chEyalanukunna.

paavani

తృష్ణ చెప్పారు...

"కడవంత గుమ్మడికాయా కత్తి పీటకు లోకువ అని బంగారంలాంటి పెళ్ళాం కత్తిలాంటి మొగుడికి ఎప్పుడూ లోకువే ..అంతే ,అంతే ,అంతే ముమ్మాటికీ అంతే"
అంతే ,అంతే ,అంతే,అంతే ,అంతే ,అంతే .......

sunita చెప్పారు...

హ!హ!హ!.
>>అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..
>>నా గారెలతో కప్పగెంతులాట ఆడుతున్నారు..
>>పాపం అందరూ వాటిని తినలేక ,నా ఎదురుగా వాటిని పడేయలేక నానా పాట్లు పడి నేను అటుతిరగగానే గబుక్కున డస్ట్ బిన్లో పడేసారు..

బాగుంది.

నీహారిక చెప్పారు...

నాకు వంట చేయడం రాకపోయినా ఆ వంటకాల పొటోలు చూడటం మహా ఇంట్రెస్ట్ ..
నాక్కూడా వంట కంటే వంటల ప్రోగ్రామ్స్ చూడడమంటే భలే ఇష్టం,మావారేమో ఎపుడూ చూడ్డమేనా చేసేదేమన్నా ఉందా అని అంటుంటారు.పెరుగు వడలు మాత్రం నేనే అందరికన్నా బాగా చేస్తాను.ముఖ్యంగా decoration బాగా చేస్తాను.బాగా వ్రాసారు

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అయ్యో! ఎన్ని కష్టాలండీ మీకు...
అదేంటోనండీ నిజంగానే పక్కింటి పుల్ల కూర రుచిగానే ఉంటుంది. ఈ వాక్యం చదివి మీరు చేసిన ఆవడతో నన్ను కొట్టడానికి రారు కదా!! :))
మీ నాన్నమ్మ భలే తప్పించుకున్నారే...
>>బంగారంలాంటి పెళ్ళాం కత్తిలాంటి మొగుడికి ఎప్పుడూ లోకువే
వహ్ వా వహ్ వా..ఏం చెప్పారండీ..
ఎప్పటిలాగే హాయిగా అనిపించింది మీ టపా.

yogi చెప్పారు...

meere naaku adarsham, ee madhyane vanta cheyatam modalettaa

యోగేంద్ర చెప్పారు...

meere naaku adrsham, nenu ee madyane vanta cheyatam modalu pettaa

భావన చెప్పారు...

హబ్బ నవ్వీ నవ్వీ కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి...
"పతివ్రతా శిరోమణిని కాబట్టి బ్రతికిపోయారు కాని లేకపోతేనా ఆ ప్లేట్ పెట్టి నెత్తిమీద టంగు టంగు మని నాలుగు పీకేదాన్ని ...." --అల్టిమేట్..
ఇంకో టెక్నిక్ నేనైతే ఏమి చేసే దాన్నో తెలుసా.. చాలా మంచి గా అడిగే దాన్ని "కూర ఎలా వుంది" అని మాములు గానే ఒక వంక పెట్టేవాడు.. పుల్ల గా వుంది అనో వుప్పు కొంచం తగ్గించాలో అని. ఆ మాట పూర్తి కూడా కాకుండానే నేను చాలా పొలైట్ గా చెప్పేదాన్ని నీ బొంద ఆ కూర అలానే పుల్ల గా వుండాలి, అందులో వుప్పు తగితే నీ మొహం లా వుంటుంది నీకేమి తెలియదు అని. కొన్నళ్ళాకు వుక్రోషం వచ్చి ఏది అన్నా ఏదో ఒకటి చెపుతావు ఇంక నన్ను అడగకు అలా ఐతే అని అలిగి చెప్పటం మానేసి, అసలు చెప్పక పోతే మళ్ళీ టెంకి జెల్లలుంటాయి కదా అందుకని అన్నిటి కి తలకాయ వూపేసి బానే వుంది అనటం మొదలు పెట్టేడు.. సొ అలా ఏదైన ట్రై చెయ్యండి మీరు కూడా.

Padmarpita చెప్పారు...

నవ్వించారు నేస్తం... చాలా బాగుంది.

priya... చెప్పారు...

hello nestam garu nen e madhyane me blogs chadavatam modalu pettanu. meru enta baga ratarante epudeppudu meru kottadi vrastara nen eppudeppudu chadivestana annatu.nijam chebutunnanadi nen e xam ki kuda inta interest ga chadavaledu...edi meru nammali.meru inta chalakiga rastaru ade naku chala nachutundi..intaki me peru naku teledu chepagalaru...

lalita చెప్పారు...

>>అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..
హ హ హ హ హ.., చాలా బాగా రాసారు.., నవ్వు ఆపుకోలేకపోయాము.

మాలా కుమార్ చెప్పారు...

title chusi emo anukunnaanu.
baagaaraasaaru.

priya... చెప్పారు...

me blog chadutunnanta seepu navvutune unna nandi.ma akka ma ammato "amma priya ni mundu erragaddaku pampu"ane salahalu kuda vachayi.nen me yokka prati blog antaga njoy chestunna.inka nayam ma chelli ledu lekapote na epatike satirlu vestu kurchunedi na navvuku.elane meru inka enneno navvinche blogs vrayalani korutu...

Raj చెప్పారు...

బాగుంది.

kiranmayi చెప్పారు...

నేస్తం
నా experience కూడా కొంచెం ఇంచుమించు ఇంతే. నాకేమిరాదు అని ముందే డిసైడ్ అయిపోయి ముందునుంచే కొంచెం ఉప్పెక్కువేయి, పసుపెక్కువేయి లాంటి బోలెడు సలహాలు ఒక word document లో రాసి పెట్టుకుని అవసరమయి నప్పుడు నా మీదకి ఒదులుతారేమో (మా అమ్మ, మా ఆయన కూడా) అని నాకు పెద్ద డవుటు. భావన గారి టెక్నిక్ నాకు చాల నచ్చేసింది, మరి మీకో?

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం భలే రాసారండి....మీకో విషయం చెప్పనా...ఆడవాళ్ళూ ఎంత బాగా వంట చేసినా మగవాళ్ళు ఎందుకు వంక పెడతారో తెలుసా...మీలో ఇంకా ఇంకా perfection రావాలని...సో అలా వంకలు పెడుతూ పోతే, మీకు రోషం వచ్చి ఇంకా ఇంకా బాగా చేసి, ఏదొక రోజు "శభాష్" అని అనిపించుకుంటారు...ఎందుకంటే అప్పటికే మీరు వంకలు పెట్టలేనంత గొప్పగా వంటల్లో ఆరితేరి పోతారనమాట... సో దీని మూల కారణం మగాళ్ళే కాబట్టి...ఇప్పటికే మీరు ఓ మోస్తరు perfection సాధించేఉంటారు కాబట్టి...మీ అయ్యనకి చెప్పండి మరి..ఒక..పెద్ద.."థాంక్స్.."...ఏమంటారు??

సుజ్జి చెప్పారు...

అంతే..అంతే..!!

అజ్ఞాత చెప్పారు...

లోకువే లోకువే..ముమ్మాటికీ నూరు మాటలకీ అన్ని మాటలకీ నిజం. కాని ఏం చేస్తాం.నేను పళ్ళు నూరుకుంటూ ఉంటా అంతే..ఫలితం నా పళ్ళు అరిగిపోతున్నాయి అంతే.

బ్రహ్మాండం గా రాసావు :)

~C

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

ఏంటా.. ఇన్ని రోజులూ అసలు పోస్టే లేదు నేస్తం నుంచీ... అనుకుంటున్నా..
వచ్చింది. కాకపోతే నవ్వుల విందుతో.

[పెరుగు 1/2 కప్ ,వంట సోడా 1/2 టి స్పూన్ పక్క, పక్కనే..]
అంటే.. అరకప్పు వంటసోడా వేసేశారా?

[చెంచాతో గుచ్చి తిందామని ఒక సారి నొక్క గానే గారె కాస్తా కప్పలా ఒక్క జంపు జంపి క్రింద పడింది ...]
జంపింది? బాగుంది!

[అప్పడాల కర్ర అనేది ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో నాకు తెలిసొచ్చింది అప్పుడు...]
హహహ్హా...

నేస్తం చెప్పారు...

కొత్త పాళి గారు ధన్యవాదాలు
జీడిపప్పు గారు :)
గణేష్ గారు ప్రొద్దున్నే మిమ్మలని నవ్వించానా అయితే :)
వీరశేకర్ గారు మరి అమ్మాయిల వంట కదా,మేము ఏం తక్కువ అని అలా పెట్టానన్నమాట టైటిల్

నేస్తం చెప్పారు...

బోనగిరి గారు పొరిగింటి పిల్ల కూరనా.. ఇదేదో ఆలోచించాలసిన విషయమేనండీ :)
శ్రీకాంత్ గారు ప్రొద్దున్నే నవ్వించానా బోలెడు ఆరోగ్యం మీకు :)
ప్రేమికుడు గారు మీ ఇంట్లోవాళ్ళకు ,మీకు నా బ్లాగ్ నచ్చినందుకు చాలా సంతోషమండి
అదేంటి స్వప్న గారు పెళ్ళి చూపుల తరువాత ,కబుర్లు,కాకరకాయలు,పెళ్ళి ,కొట్టుకోవడాలు,తిట్టుకోవడాలు అన్నీ రాసేసాను కదా ..చదవలేదా :)

నేస్తం చెప్పారు...

శ్రేయోబిలాషి గారు థేంక్స్ అండి
పావని గారు మీ అభిమానానికి థేంక్స్ అండి ,మరి త్వరలో రాసేయండి మీ పోస్ట్ కోసం చూస్తూ ఉంటాం
తృష్ణగారు అంతే అండీ అంతే ఇంకోమాట లేనే లేదు
సునీత గారు థేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

నీహారిక గారు అన్నీ బాగానే చేస్తాగాని పెరుగు వడలు ఇప్పటికొచ్చి నేను ట్రై చేయలేదు,మా అత్తగారు వస్తారు త్వరలో ఇక్కడికి ,ఆమె మీదే ప్రయోగం చెస్తున్నా :) అంటే ఆవిడను ప్రక్కన పెట్టుకుని చేస్తా :)
శేఖర్ గారు పైన బోనగిరి గారు అన్నారు కదా పొరిగింటి పిల్ల కూర అని ఎందుకు రుచిగా ఉండదు చెప్పండి :)
యోగి గారు వంట నేర్చుకుంటున్నందుకు అబినందనలు కాని యే విషయం లో నన్ను ఆదర్శం గా తీసుకుంటున్నారు..వంట చెడగొట్టడంలో తిసుకోకండే :)
భావన గారు మన అమ్మాయిలందరికీ ఎంత మంచి సలహా ఇచ్చారండి..కాబట్టి అనదరూ భావనగారిని ఫాలో అయిపోండహో :)

నేస్తం చెప్పారు...

పద్మార్పిత గారు థేంక్స్ అండి
ప్రియ గారు మీ అభిమానానికి చాలా థేంక్స్ నేను బ్లాగ్ లోకం లో కొచ్చినపుడు నా విషయాలన్నీ వ్రాద్దాం అనుకున్నాను ..అప్పుడే నిర్ణయించుకున్నాను నాకు సంభందించిన యే వివరం ఈ నెట్ లో చెప్పకూడదని..అందుకే నేస్తం అని రాసానన్నమాట ,అర్ధం చేసుకోగలరు :)
లలితగారు మాలా కుమార్ గారు థేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

రాజ్ గారు థేంక్స్ అండి
కిరణ్మయి గారు భావనగారిని చక్కగా ఫాలో అయిపోండి..మనల్ని అనే లోపల తప్పు మీదే అని వాళ్ళ మీదే తోసేయాలి కన్ ఫ్యూజ్ చేసేసి ..:)
ఛా ..కిషన్ గారు ఏం చెప్పారండి ..:)
సుజ్జి అంతే అంతే :)

నేస్తం చెప్పారు...

~c లోకువే లోకువే ..బంగారం లాంటి అమ్మాయిలకు ఈ బాధలు తప్పవు ,అలా పళ్ళు నూరే కంటే చక్కగా ఒక అప్పడాల కర్రకొను నా మాటవిని
నరేష్ గారు మొన్నే రాసాను కదా అలిగిన వేళనే చూడాలి అని..అది చదివే సరికే అందరికీ నీరసం వచ్చేసి ఉంటుంది అంత పెద్ద పోస్ట్ :) హ హ అదే దాని పాళ్ళు దీనికీ దీని పాళ్ళు దానికి వేసేసాను కంగారులో :)

priya... చెప్పారు...

nestam garu marem parvaledu andi.inko vishayam nannu andi ankandi nen chala chinna ammai ni.meku inkokati chepana....ma intlo kuda ma amma vantintlo assalu pani chepadu enduko telusa??? anta a hanumantuni polike kakapote kasta teda..ayana chusi ra ante kalchochadu manam chusi ra ante chedagotti vastam annamata..adi sangati anduke ma akka eppudu rusa rusa ladurundi nak ma amma panule chepadu ani...edanta sahajame anukondi..

మరువం ఉష చెప్పారు...

"బంగారంలాంటి పెళ్ళాం" భేష్ అలాగే మనమి మనం గుర్తింపు ఇచ్చుకోవాలి. ;) నావి చాలా వున్నాయి కాని మొదటి కథ చెప్పి మరో నేస్తం కద చెప్తాను..
1) ఇంకా గరిటె తిప్పటం కూడా తెలియని, అవాలు అంటే ఏమిటి, పాలు పొంగించటం అంటే గిన్నె ఖాళీ అయ్యేదాకా మంట మీద వదలకూడదు, చింత పండు పులుసులో కూడా ఉప్పు వేయాలి అని తెలియని రోజుల్లో ఒకానొక వేసవి మధ్యాహ్నం, కొబ్బరి పాలు రుబ్బి తీయించి పాకం పట్టి ఓ తీపి ఘన పదార్దం చేసాను. రుచి చూట్టానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి, నా కళ్ళలో నీళ్ళు మాత్రం మున్ముందే ఉరికాయి. అపుడు నాన్న గారు, అన్నయ్య మాకివ్వరా ఉషడు అని తిన్నారు. పాపం ప్రేమ కారణంగా ఎంత భాదించబడ్డారో. నిజానికి నేను కూడా అది ముట్టలేదు. సరాసరి కుడితి తొట్టిలోకి వెళ్ళిపోయిందది.
2) చిన్న గీత పెద్ద గీత మాదిరి నేను వంటలో నిష్ణాతురాలిని అయ్యే సరికి, జననికి ఓ న మా లు రావు. ఎన్నో 'జాటర్ ఢమాల్" అయినా పట్టు వదలలేదు. పరదేశం బెటరని ఓ నల్గురు ఆస్ట్రేలియన్లని ఎంచుకుని రవ్వలడ్డూలు ఇచ్చిందట. కాస్త వెరైటీగా వుంటుందని "సెమోలినా కేక్" అని చెప్పింద[ట!]. మర్నాడు వాళ్ళంతా "ఆర్ యు ష్యూర్, ఇట్ ఇస్ కేక్, ఇట్స్ లైక్ రాక్" అన్నార[ట]. నా దగ్గరకొచ్చి రవ్వ లడ్డు నేర్చుకుని వెళ్ళింది. యాహూ, నాకు వంట బాగా వచ్చు. jokes apart పంతమాడి పందెం వేసి మిరప కాయ బజ్జీలు, పాప్డీ చాట్, వంకాయ-పకోడి, కిళ్ళీ బుట్టలు (స్వీట్) వంటి 20 వంటలు 100 మందికి ఒక్క చేత్తో చేసేసా. ఇక ఎవ్వరూ నన్ను శంకించరు. మా ఇంటికి వస్తారా మరి? ;)

Unknown చెప్పారు...

mee anni postlu chadivanandi..chala chala bgunnai...kasepu anni marchipoyi...haayi ga chaduvukunna.. :)..meeku pedda fan aipoyanu... :)

జ్యోతి చెప్పారు...

hmmm.. కాస్త ఆలస్యంగానైనా కంచులాంట మాట చెప్తాను. నిజంగా లోకువే. ఊరందరూ మన వంట బాగుందని అన్నా ఆయనకి మాత్రం నోటి నుండి ఆ మాట రాదు. మీ డైలాగే నాది. పతివ్రతది :).. మొత్తం తిన్నాక ఆలోచించి మరీ ఏదో ఓ వంక వెతుకుతారు. మనను కాళికలను చేస్తారు.
అందుకే ఓ మంచి , వర్కవుట్ అయ్యే ఐడియా చెప్తా ఇనుకోండి.. ఊరికే నస పెట్టే భర్తను దారికి తెచ్చా వంటింట్లోకి అడుగుపెట్టి వంట చేసేలా చేయాలంటే .. మన వంట చెడగొట్టాల్సిందే. అయ్యో! అనుకుంటే లాభం లేదు. మరీ లోకువై పోతున్నాం... హన్నా!!!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

" మిరప కాయ బజ్జీలు, పాప్డీ చాట్, వంకాయ-పకోడి, కిళ్ళీ బుట్టలు (స్వీట్) వంటి 20 వంటలు 100 మందికి ఒక్క చేత్తో చేసేసా. "

ఆహా ఉష గారు... మీరిలా లిస్ట్ చెప్పేసి నోరూరించేస్తే రాక ఏం చేస్తాం చెప్పండి అర్జంట్ గా అడ్రస్ చెప్పేయండి రెక్కలు కట్టుకు వాలిపోతా :-)

Dhanaraj Manmadha చెప్పారు...

LOL.

నవ్వలేక చచ్చిపోతున్నాను బాబోయ్. పొద్దుణ్ణుంచీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నా. ఒకచోట మార్తాండ కామెంటు. ఇక్కడ మీ పోస్టు.

ఈ లింకు చూసి, మీరూ కడుపునొప్పి తెచ్చుకోండి. నవ్వీ నవ్వీ...

http://manishi-manasulomaata.blogspot.com/2008/06/blog-post_26.html?showComment=1249215247114#comment-c7897758618719746936

ప్రత్యేకించి ప్రవీణ్ కామెంట్లు.

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
హమ్మయ్య రాసేసారా ! చాల బాగా రాసారు ! మీరు వారానికో పోస్ట్ అయినా వేయకపోతే కష్టంగా ఉంది నాకు.నేస్తం ఎప్పుడు కబుర్లు చెప్తారా అని చూస్తూ ఉంటాను. :-)

భావన గారి సలహా బాగుంది, అలాంటిదే మరొకటి.
మీకో గొప్ప సలహా చెప్తాను, ముందే వార్నింగ్ ఇచ్చెయ్యండి, ఉప్పెక్కువ, కారం తక్కువ, లాంటి వంకలు పెట్టె మాటైతే, అంత కంటే గొప్పగా వండి చూపించమని,లేదూ అంటే వంకలు పెట్టె అర్హత లేదు అన్నమాట ( అంటే వంకలు పెట్టిన మరు రోజు మీరు వంటిట్లోకి వెళ్లారు అన్నమాట, వంట ఆయనకే అన్నమాట). అంటే శ్రీలక్ష్మి రెండు రెళ్ళ ఆరులో, నాకెలాగు వంట రాదు అని చెప్పి, చక్కగా ఎంజాయ్ చేస్తుంది,అలా ఎంజాయ్ చేయండి! ఇంకెందుకు నేను వంట చేయటం మీకెలాగో నచ్చదు కదా, మీరే చేయండి, లేదా రోజు హోటల్ అనండి ! రామ బాణం ఇది, దెబ్బకి ఇంకెప్పుడు వంకలు పెట్టరు ! జజ్జనక జనారే, హమ్మా, మనతోనే ఆటలా ? - పద్మ.

అజ్ఞాత చెప్పారు...

కిషన్ గారు చెప్పింది నిజమే, అలా వంకలు పెడితే, ఉక్రోష పడి, ఇంకా ఇంకా బోల్డు వంటకాలు చేసేసి శభాష్ అనిపించుకోవాలని, మరిన్ని వంటలు వండేస్తారు కదా అని వాళ్ళ ప్లాన్ ! మా అన్నయ్యలు కూడా అంతే ! చాల మంది ఆడవాళ్ళూ నిజంగానే ఛాలెంజ్ గా తీస్కుని ఇంకా ఇంకా వండేస్తూ ఉంటారు ! మనం మహా మొండి, వంకలు పెట్టేట్టు అయితే( బాగా చేసినా) ఇంకెప్పుడు మనం వండం అన్నమాటా ! అలాంటి పప్పులుడకవు అని వాళ్ళకి తెలిసేలా చేస్తే తప్ప, ఆపరు ! - పద్మ

Srujana Ramanujan చెప్పారు...

So nice. A very good laughter. I really enjoyed this post.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

baaga raasaaru........

ante bachelors ga vunde timelone maaku anni ruchullu telise sariki.....mee vanta lo lopaalu telustuvuntay annamata.........nenu pette vankalu vinaleka ma ammagaaru emantaaru ante ...vachhedevaro gani chachhi potundi ra neeku chesi pettaleka ani........

నేస్తం చెప్పారు...

ప్రియ మరి నాకు తెలియదు కదా నువ్వు చిన్నదానివని అలాగే అననులే ,అయితే వంట విషయం లో నా పోలికే అన్నమాట
ఉష గారు వేణు శ్రీకాంత్ గారి మాటే నాదీను ,పాపిడ్ కూడా చేస్తారా ...ఇంకేం నేనూ వచ్చెస్తా
కిరణ్ గారు మీ అభినందనలు థేంక్స్ అండి ఇంకా బ్లాగ్ నచ్చినందుకు సంతోషం :)

నేస్తం చెప్పారు...

హన్నన్నా... జ్యోతిగారు అయితే అదే మన తక్షణ కర్తవ్యం
ధనరాజ్ గారు ఆ పోస్ట్ నేను బ్లాగ్ లోకం లోకి వచ్చిన కొత్తలోనే చదివాను నేను సుజాత గారి ఫెన్ అయిపోయాను అప్పుడే :) ఇక కామెంట్స్ గురించి చెప్పాలంటే :)
పద్మ గారు అదే కదా ..బయట నాలుగు రోజులు తింటే ఎక్కడ మషాలా ల వల్ల ఆయన ఆరోగ్యం చెడుతుందో అని నా ప్రాణం ఒప్పదనే వీక్నెస్ మా ఆయనకు బాగా తెలుసు అదన్న మాట
సృజన :) థేంక్స్
వినయ్ గారు :) మరి అలా పెళ్ళికి ముందు వంకలు పెట్టిన వాళ్ళు వంట గదికి అంకితం అయిపోతారంట చూసుకోండి మరి

సీత చెప్పారు...

Chaala bavundi :)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,అయ్యో ! ఈ ప్రాబ్లం ఒకటి ఉంది కదా.కానీ కస్టపడి బాగా చేస్తే, వంకలేడితే, ప్రాణం ఒసూరంటుంది ఎవరికైనా ! భావన గారి సలహా మీకు బెస్టు అనుకుంటా.

నేను చెప్పిన సలహా మా వదిన పాటించింది.ఒకే ఒక్క రోజు, మూడు పూట్ల బయట తిని విసుగొచ్చి,ఇంట్లో వంట మొదలెట్టి మరు రోజు,చెత్తగా వండేసి, ఓటమి ఒప్పుకుని ఇంకెప్పుడు వంకలు పెట్టనని ఒట్టు పెట్టాడు అన్నయ్య.తను వంక లేకుండా తిన్న భోజనం నాకు గుర్తు లేదు ఇదివరకు ( వివాహ భోజనంబుతో సహా !) - పద్మ

జ్యోతి చెప్పారు...

ఇక్కడ పెళ్లికాని,పెళ్లైన మగవారికి పనికొచ్చేవిషయాలు నాగరాజుగారు గతంలో చెప్పారు. కాస్త శ్రద్ధగా చదివి గుర్తపెట్టుకోండి.

http://jyothivalaboju.blogspot.com/2008/05/blog-post_19.html

గీతాచార్య చెప్పారు...

నిజంగానే వంట బాగోక బాలేదన్నా సహృదయంతో తీసుకుని తరవాత సారన్నా బాగా చేస్తారనుకుంటే తింటే తిను లేకపోతే చేసుకోపో అంటారా? ఏఁ మేము చేసుకుంటే ఇక మీరు చేసేదేముంది? బ్రహ్మాండంగా చేసుకుంటాం. అందులో సిగ్గు పడటానికేముంది? చేసిపెట్టమన్నా అభ్యంతరం ఉండదు. పనిజేయటం వచ్చిన వాళ్ళకి, బిజీగా ఉండేవాళ్ళకి ఎప్పుడు ఎక్కడ అవసరమైనా అప్పుడు టైము వీలుచేసుకుని మరీ చేయగలరు. మరి ఆ టైములో మీరేమి చేస్తారో?
;-)

మా నలభీమ పాకాల్ని టైటిలుతో సహా కాపీ కొట్టి పెట్టటమా మళ్ళీ మా మగ పిల్లకాయల మీదే విమర్శలా? హన్నా! ఏది ఒప్పుకున్నా ఈ విషయాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

"బయట నాలుగు రోజులు తింటే ఎక్కడ మషాలా ల వల్ల ఆయన ఆరోగ్యం చెడుతుందో అని నా ప్రాణం ఒప్పదనే వీక్నెస్ మా ఆయనకు బాగా తెలుసు"

ఇదియునూ ఖండించదగినదే. హిహిహి.

నేస్తం చెప్పారు...

joy గారు థేంక్స్ అండి
పద్మ నిజమా :) అయితే మొత్తానికి మీ వదినను సేవ్ చేసావ్ అన్నమాట ...
జ్యోతి గారు చదివాను..పప్పు నాగరాజుగారి పేరు విన్నాను కాని ఆయన బ్లాగ్ చదవలేదు ..అంటే ఆ బ్లాగ్ నేను ఓపెన్ చేయడానికి కుదరడం లేదు ..ఇన్నాళ్ళకు ఆయన పోస్ట్ చదవగలిగాను..అది కూడా అనేకానేక బ్రహ్మాండమైన రహాస్యాల చిట్టాను చదివేసాను ..చాలా బాగారాసారు..లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
గీతాచార్యాగారు ఖండఖండాలుగా ఖండించేసుకోండి..ఆల్రెడి మగవాళ్ళ కు చాలా డెమేజ్ జరిగిపోయింది ఇక్కడ :)

మరువం ఉష చెప్పారు...

నేస్తం, చివరిలో ఆహ్వానం మీకు కూడా. మరిన్ని వంటలు నేర్చుకుని సిద్దమౌతా.
వేణూ గారు, నా వ్యాఖ్య చదివి అదీ వేరేవారి బ్లాగులో ప్రతి-వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు. నాకున్న చెడ్డ/మంచి లక్షణమదొక్కటేనండి. చేయాలనుకున్నది వెనకా ముందూ చూడకుండా దూకేయటం. ఈ ఆవేశం నన్ను ఏమి ఇబ్బందులపాలు చేస్తుందో అని దడ పుట్టించేదాన్ని. ;) ఆ వంటల ప్రహసనం అటువంటిదే. ఇక మీరు రావాలే కానీ ఎందుకు చేయనండీ మా వూరంతా భోజనాలు పిలిచేద్దాం. పందిళ్ళు కూడా పురమాయిస్తాను సుమా! :)

పరిమళం చెప్పారు...

నేస్తం గారూ !మీరు నిజంగా పతివ్రతా శిరోమణి అండీ ..దేవతండీ ....మీ వారు అర్ధం చేసుకోలేదుగానీ మీరు దేవతేనండీ ...నేనైతే ఆపరిస్థితుల్లో అప్పడాలకర్ర ఉపయోగించడానికి ఏమాత్రం సందేహించననుకోండి :) :)

అజ్ఞాత చెప్పారు...

అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..

soooparoooo.....sooper....

Rajkumar

అజ్ఞాత చెప్పారు...

నేను చెప్పిన సలహా మా వదిన పాటించింది.

వాక్యాల్లో comma ల విలువ, ఎప్పుడు తెల్సుకుంటానో ఏమిటో నేస్తం !

నాకంత తెలివి లేదు.
నేను చెప్పిన సలహా, మా వదిన పాటించింది.

మా వదిన పాటించిన చిట్కా( సలహా ) మీకు చెప్తున్నా అని నా మతలబు.తనకి ఈ సలహా సొంతంగానే తట్టింది, సో కాపీ రైట్లు తనవే, కాని నిరభ్యమ్తరం గా 'వంక' బాధితులు ఎవరైనా, వాడుకోవచ్చు !

గీతాచార్య గారు,
మీరు BC కాలం మాటలు చెప్తారెంటండి ? అక్కడికేదో, ఆడాళ్ళకి వంట తప్ప వేరే పన్లే లేనట్టు, మీ ఆఫీసులో ఇంట్లో వంట చేస్కుంటూ,ఉద్యోగం చేసే ఆడవాళ్లే లేరా ? మరి మగల్లెం చేస్తున్నట్టు ? అటు ఉద్యోగం, ఇటు వంట చేసి పెడితే, వంకలు పెట్టడమా? ఆ మాత్రం ఆడవారు సైతం చేయగలరు ! :-P మాతో పెట్టుకోకండి ! - పద్మ

నేస్తం చెప్పారు...

అబ్బో ఉష గారు ఆహ్వానమే అదిరింది,మీ చేతి వంట తినాలని నాకు చాలా ఆశగా ఉంది :)
హ హ పరిమళం గారు పైకి సత్య భామ పోజులు పెడతాం కాని అయ్యగారి సేవ విషయం లో రుక్మిణులం అయిపోతాం ..మన ఆడవాళ్ళందరికీ ఉన్న గోలే ఇది :)
రాజ్ కుమార్ గారు థేంక్స్ అండి :)
పద్మ హ హ మరేం పర్వాలేదు.. ఈ విషయం లో నేనూ అంతే ..ఒక్కోసారి ఎలా రాయాలో తెలియక కన్ ఫ్యూజ్ అయిపోతాను మొత్తానికి మీ వదిన ఆచరించిన చిట్కా ఇక్కడ చెప్పావ్ ..అర్ధం అయింది :)

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)

నేస్తం చెప్పారు...

http://cards.123greetings.com/cgi-bin/newcards/showimage.pl?no=361842&q1=eaug_rakshabandhan_happy&cat=Events&image=/thumbs/eaug_rakshabandhan_happy/8306-001-35-1062.gif&title=My+Best+Wishes+Are+With+You...&backgr=8306-001-35-1062_bg.gif&tcolor=7a0101&tsize=5&tface=comic+sans+ms&type=html&subcat=Happy+Raksha+Bandhan&log=s&newbgpath=new&newmuspath=eventsnew&src=&bigimagetype=new&DATE=[ Aug 5 ]&tempval=Rakshabandhan!!rakshabandhan.pl
విశ్వ ప్రేమికుడు గారు థేంక్స్ అండి ,మీకూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

ఎప్పటిలా చాలా బాగా రాసారు...

Gulabi చెప్పారు...

Me posts chala bavunnai Nestam..meru marintha frequent ga rayadaniki try cheyandi..me posts kosam eagerly waiting..:)

నేస్తం చెప్పారు...

ప్రపుల్ల చంద్ర గారు,sweeti గారు ధన్యవాదాలు :)

శివ చెరువు చెప్పారు...

Maa intlo vallandarikee chadivi vinipinchaa... baagundi.. :)

Shashank చెప్పారు...

దీన్ని నేను ఖండ ఖండాలుగు ఖండిస్తున్నా!! ఎందుకంటే మా ఇంట్లో కొంచం తేడా. మా ఆవిడ వాళ్ళా ఆఫీసులో ఏదో potluck అంటే curry, pUrI అని చెప్పిందట. ఓ రెండు గంటలు పట్టింది ఆ ముష్టి పూరిలు చేసేపాటికి. పోని వేయించు అంటే ఓ రెండు చేసి నా వళ్ళ కాదు అని వెల్లి సినిమా చూస్తూ కూర్చుంది. అమ్మన బూత్లు వచ్చాయి కాని ఏం చేస్తాం.. నేను గుడ్ బాయి కద. తర్వత నుండి జెస్ట్ కరి అని చెప్తుంది. కాని నాకు ఇంకా రానిది రౌండ్ వడలు. ఏం చేసినా షేప్ మాత్రం రాదు. అదేంటో. మా ఆవిడ మాత్రం భలే వేస్తది రౌండ్ గా.. సొ పిండి నేను రుబ్బి ఇస్తా.. టి. వీ చూస్తూ వడలు వేడిగా తింటా.. :)

పెళ్ళాఇన కొత్తలో అప్పటి దాకా కనిష్టం ఓ 10 మందికి రోజు వండి అలవాటు అదే రేంజ్ లో చేసేవాడ్ని .. ప్రతీది ఓ 2-3 రోజులు వచ్చేవి. చాలా రోజులు పట్టింది నాకు లెక్క అర్థం అయ్యేదనికి.

........................ చెప్పారు...

... అప్పడాల కర్ర అనేది ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో నాకు తెలిసొచ్చింది అప్పుడు...

intaki eppudaina vadara leda

నేస్తం చెప్పారు...

శివ గారు థేంక్స్ అండి
శశాంక్ హ హ అయితే భారీగా చేసి భారిగా వంపేసేవారన్నమాట ,మరిప్పుడు కొలతలు నేర్చేసుకున్నారా మొత్తానికి మీ వైఫ్ అదృష్టవంతురాలు అంటారు అంతేనా :)
సౌజన్య కుమార్ గారు లేదండి :( అలా చేయమనే కదా ఆ వంకలు గట్రా పెడతారు

అజ్ఞాత చెప్పారు...

నేస్తం, మీరెప్పుడు మళ్ళీ రాస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నా.మీరు అసలు రోజుకోటి రాస్తే ఎంత బాగుండు అనిపిస్తుంటుంది.కానీ పండగలు రోజూ రావు కదా. - పద్మ.

dj చెప్పారు...

Nestam gaaru chala chala chala baagarasaru... mee prati post vadalkunda chaduvutaa.... superb :)

నేస్తం చెప్పారు...

పద్మ నీ అభిమానానికి చాలా థేంక్స్...DJ గారు థేంక్స్ అండి

Shashank చెప్పారు...

అంత లేదు లేండి. ఏదో వంట వరకు పరిమితం అంతే.. ;)

Bhãskar Rãmarãju చెప్పారు...

ప్చ్!! నిజమే నిజమే.
పెరుగు ఆవడలు పెర్గులో వేసే ముందు, ఒకసారి నీళ్ళలోవేసి గబుక్కున తీసి చేత్తో కొంచెం పిండి అల్లం గిల్లం వేసిన పెరుగులో నానబెట్టాలి. ప్చ్!! పోనిలేండి.
నోట్ : నా స్నేహితులు నా పెళ్ళికానుకగా హెల్మెట్ ఇచ్చారు.

నేస్తం చెప్పారు...

శశాంక్ హహ :)
భాస్కర్ గారు ఈ మద్య నేర్చెసుకున్నాలేండి..మొన్న దూది పింజల్లా మెత్తగా వచ్చాయి పెరుగు వడలు ..హ హ మీ ఫ్రెండ్స్ కి కాస్త ముందు చూపు ఎక్కువేనండి అయితే :)

మధురవాణి చెప్పారు...

"ఎంత కోపం వచ్చిందంటే, పతివ్రతా శిరోమణిని కాబట్టి బ్రతికిపోయారు కాని లేకపోతేనా ఆ ప్లేట్ పెట్టి నెత్తిమీద టంగు టంగు మని నాలుగు పీకేదాన్ని ...."
:)))))

మీ టపా అంతా.. ప్రతీ పదానికీ నవ్వుతూనే ఉన్నాను. నవ్వీ నవ్వీ చచ్చానంటే నమ్మాలి మీరు :)
చాలా చాలా బాగా రాశారు. ఇంతకన్నా ఏం చెప్పమంటారండీ..? కొత్త పదాలు వెతుక్కోవాలి మిమ్మల్ని అభినందించడానికి :)

సుధీర్ వూణ్ణ చెప్పారు...

అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..

keko keka..

sphurita mylavarapu చెప్పారు...

నేస్తం,

ఎలా వున్నారు? మీరు టపాలు రాయటం మానేసారు, ఏం చేస్తాం...ఇవాళ ఏవో work tentions వల్ల చాలా నీరసం, నిరాశ బోల్డు తలనొప్పీ అన్నీ కట్ట కట్టుకుని వచ్చేసాయ్. ఇంటికొచ్చి ఇప్పుడేం చేస్తే తల నొప్పి వదులుతుందా అని అలోచించి మీ బ్లాగు లోకి దూరి మళ్ళీ మీ పాత టపాల్లో నా favorite వి అన్నీ చదువుకుని పక పకా గాట్టిగా నవ్వెస్కుంటే కాస్త relief అనిపించింది...

Miss you నేస్తం

స్ఫురిత

నేస్తం చెప్పారు...

మధు నువ్వెప్పుడో రాసిన కామెంట్ మళ్ళీ చదువుతుంటే అదో సరదాగా భలే ఉంది.:)
సుధీర్ గారు బోలెడు బోలెడు ధన్యవాధాలు
స్పురితా కెవ్వ్వ్వ్..ఇంకా గుర్తున్నానా?నిజ్జంగా? ఒట్టుగా ?నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ పాత కధలు చదివారా థేంక్యూ థేంక్యూ .. :)