15, జులై 2009, బుధవారం

అలిగినవేళనే చూడాలి ...


ఎవరన్నారండి ,అలిగితే ఆడవాళ్ళు అందం గా ఉంటారని..నేను ఒప్పుకోను..అలిగినపుడు అబ్బాయిలే చాలా చూడ ముచ్చటగా ఉంటారు (కోపం వచ్చినపుడు కాదు సుమా ,అప్పుడు చంఢాలం గా ఉంటారనుకోండి) ఉబికి వస్తున్న నవ్వును,ప్రేమను భలవంతం గా ఆపేసి సీరియస్సుగా మొహం పెట్టినపుడు చూడాలి అయ్యగారి ముఖారవిందం భలే ఉంటుంది ...మచ్చుక్కి అలాంటి సంఘటన ఒకటి ...


నా ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ కుట్టిన బట్టలు లేదా కొన్న బట్టలు వేసుకోవడం తప్ప నాకు నేనుగా బట్టల షాపుకి వెళ్లలేదు ...అదే అలవాటు పెద్దయ్యాకా కూడా వచ్చేసింది ..ఏవో ఒకటి నువ్వెళ్ళి తెచ్చేయమ్మా అనేదాన్ని ... ఆఖరికి పెళ్ళి టైములో కూడా బట్టల విషయం లో అస్సలు పట్టించుకోలేదు ...నాకసలు ఏది బాగుంటుందో ,బాగోదో తెలిసి ఏడిస్తే కదా ..మరి ఎప్పుడు కొందో ,కుట్టించిందో తెలియదు గాని అత్తారింటికి వెళ్ళినపుడు సూట్కేస్ నిండా బోలెడు చీరలు సర్ది ఇచ్చింది అమ్మ..అన్నీ కొత్తవి అయ్యేసరికి రోజుకో కొత్త చీర కడుతూ తెగ మురిసిపోయేదాన్ని అమ్మ సెలెక్షన్ చూసి.. ఆ రోజు కూడా ఉదయం ఇంట్లో పనులన్నీ అయ్యాక తీరికగా బీరువా తెరిచీ ఏం కట్టుకోనబ్బా అని చూస్తుంటే నా దృష్టి నీలం రంగు కాటన్ చీరమీద పడింది..ఆ రంగు,డిజైన్ చూస్తుంటే అబ్బో తెగ నచ్చేసాయి ..మరి నాకు తెలియదు కదా ఆ చీరే మా ఇద్దరి మద్య మొదటి గొడవకి నాంది పలుకుతుంది అని ..


హాయిగా స్నానం చేసి అది కట్టేసుకుని ఆంద్ర జ్యోతి పత్రిక తిరగవేస్తుంటే మా అత్తగారు నా గదిలో కొచ్చారు అమ్మాయ్ ఏం చేస్తున్నావ్ అనుకుంటూ..దెబ్బకు ఒక్క ఉదుటున మంచం మీద నుండి దిగి చెప్పండి అత్తయ్య గారు అన్నాను .. మన పక్క వీధిలో ఫలాన వాళ్ళ అమ్మాయి శ్రీమంతం జరుపుతున్నారు,పేరంటానికి పిలిచారు,ఆవిడ నిన్నూ తీసుకు రమ్మన్నాది తయారవ్వు అన్నారు ...పేరంటం అనగానే మనకి ఉత్సాహం వచ్చేసింది..అసలే కొత్త పెళ్ళి కూతురిని కదా, అందరూ నావైపే చూస్తారు, వాళ్ళకు నచ్చినా ,నచ్చక పోయినా మీ కోడలు బంగారు బొమ్మ అని ఒక పొగడ్త పడేస్తారు కాబట్టి తప్పదు వెళ్ళాలి అనుకుని పదండి అన్నాను ఆవిడ వెనకే వస్తూ .. ఏంటీ ఇలాగా అన్నారు మా అత్తగారు నా వైపు చూస్తూ..కొత్త చీర బాలేదా అనుకుంటూ ఆవిడ వైపు చూసాను ..ఆమెకు నా మనసులో భావం అర్ధం అయినట్లుంది,చీర బాగుంది కానీ,మన వీధిలో అమ్మలక్కలందరూ అక్కడే ఉంటారు ,కొత్తగా పెళ్ళి అయింది కదా ఇలా కాటన్ చీర కట్టుకొస్తే చెవులు కొరుక్కుంటారు నిన్ను తక్కువ చేస్తారు ,కొన్నాళ్ళు పాత బడేవరకు తప్పదు కాస్త ఖరీదైన చీర కట్టుకుని ,నీ నగలేసుకో అన్నారు ..సరే అని బుద్దిగా తల ఊపాను ..

ఆవిడ వెళుతున్న ఆవిడ మళ్ళీ వెనుకకు వచ్చీ ,ఇదిగో ఖరీదయిన చీర అంటేమరీ పట్టుచీర కట్టుకోకు కాళ్ళకు పసుపు రాస్తారు పాడవుతుంది,అందుకని పసుపు అంటుకున్నా పర్వాలేదనిపించే మంచి చీర కట్టుకో అన్నారు... నాకదేదో పజిల్ లా అనిపించింది పాడైనా పర్వాలేదనిపించే మంచి చీర అంటే ఏంటబ్బా అని బుగ్గ మీద వేలుపెట్టుకుని తీవ్రం గా ఆలోచిస్తుండగా అమ్మా,అమ్మా అంటూ మా ఆయన హడావుడి హడావుడిగా వచ్చారు మా దగ్గరకు .. అమ్మా, ఫ్రెండ్ పెళ్ళి ఈ రోజు..విజయవాడ వెళ్ళాలి ఇద్దరం అన్నారు ..ఉన్నట్టుండి ఇదేంటిరా అన్నారు మా అత్తయ్య.. గుర్తులేదమ్మా మర్చిపోయాను ,ఇంకో ఫ్రెండ్ కూడా వెళుతున్నాడు ,క్రింద కార్ లో వెయిట్ చేస్తున్నాడు ,దగ్గరేగా రాత్రికి వచ్చేస్తాం అన్నారు .మరి పేరంటం అన్నారు అత్తయ్య .అబ్బా పెళ్ళిముఖ్యమా, పేరంటం ముఖ్యమా!!! అసలే వాడు నా క్లోజ్ ఫ్రెండ్ ,మొన్న నా పెళ్ళికి కూడా వచ్చాడు, బాగోదమ్మా విసుక్కున్నారు మా ఆయన ..నీ ఇష్టం రా అంతా హడావుడి గా చెప్తావ్ మా అత్తగారు వెళ్ళిపోయారు..


అప్పటివరకూ మా ఆయనవైపూ,అత్తయ్య వైపూ మార్చి మార్చి చూస్తున్న నా వైపు చూసి ఇంక చూసింది చాలు పదండి మేడం అన్నారు ..కాస్త మొహం కడుక్కుని,చీర మార్చుకుని వస్తాను బాబు అని అటు తిరిగానో లేదో ఇంకా నయం బ్యూటిపార్లర్ కి వెళ్ళి మేకప్ వేసుకుని వస్తాననలేదు ,అవతల ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడే అంటే తాపీగా మాట్లాడతావేంటి అని కారు దగ్గరకు బర,బరా లాక్కుపోయారు ..కారులో వెయిట్ చేస్తున్న ఆయన మా ఆయనకు బాగా మంచి ఫ్రెండ్,ఇంతకు ముందే పరిచయం చేయడం వల్ల అతని భార్య నన్ను చూడగానే నవ్వుతూ పలకరించింది ..నేనూ, ఆవిడ,వాళ్ళ పాప వెనుక సీట్లో కూర్చున్నాం..మా ఆయన, అతను ముందు సీట్లో కూర్చుని తెగ మాట్లాడేసుకుంటున్నారు..


నేను ఆవిడ వైపు చూసాను.. చక్కగా ఖరీదైన చీర కట్టుకుని బోలెడు నగలతో పెళ్ళికి ఎలా వెళ్ళాలో అలా వెళుతుంది..నా వైపు చూసుకున్నాను ..ఆవిడ చీర దగ్గర నా చీర బేల మొహం వేసుకుని బిక్కు బిక్కు మని చూసింది ...ఇందాక సూపర్,డూపర్ గా
కనిపించిన చీరలో బోలెడు లోపాలు కనిపించాయి..పైగా మంగళ సూత్రం తప్ప ఒక్కటంటే ఒక్క బంగారు నగ కూడా వేసుకోలేదు ..మా అత్తగారి మాటలు గుర్తు వచ్చాయి ... అసలే పెళ్ళి కొడుకు మా ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అంట ..ఖచ్చితం గా వాళ్ళింట్లో వాళ్ళు నా వైపు చూసి ఈ అమ్మాయి ఇలా వచ్చింది ఏంటీ పెళ్ళికి అనుకుంటారు,అంత దాక ఎందుకూ ఈమె కూడా అలాగే చూస్తుంది అని ఒక్క క్షణం అనిపించింది .కాని గాడిద గ్రుడ్డులే ఆయన గారికి లేని బాధ నాకేంటీ అనుకుని పక్కన ఆవిడతో మాటలు కలిపాను..


మీరూ కూడా పెళ్ళీకేనా అండి అన్నాను.. అవును అంది ఆమె ..నేనసలు ముందు రాకూడదు అనుకున్నాను ,కాని పెళ్ళి కొడుకు మా వారికి క్లోజ్ ఫ్రెండ్, మీ వైఫ్ ని తప్పకుండా తీసుకు రండి అని మరీ మరీ చెప్పారు ఇప్పుడే ఫోన్ చేసి, అందుకే ఉన్నపళంగా లాక్కొచ్చేసారు ఆయన అన్నాను అందం గా అబద్దం చెప్పేస్తూ ..ఎంత వద్దు అనుకున్నా,నేను ఆ చీరతో ఎందుకొచ్చానో చెప్పక పోతే నాకసలు మనసు ఆగడం లేదు..ఆవిడ చిన్నగా నవ్వింది అవునా అంటూ..ఆ ముక్క చెప్పేసాక, నాకు మనసులో భారం తీరిపోయినట్లు అయిపోయి మరి మీవారికి కూడా ఆ అబ్బాయి క్లోజ్ ఫ్రెండేనా అన్నాను ... ఆవిడ నవ్వి మా తమ్ముడేఅంది ..నాకు సౌండ్ లేదు..అయినా తమాయించుకుని ,అయితే మా ఆయన,మీ తమ్ముడూ ఫ్రెండ్స్ అన్నమాట అన్నాను..నాకన్నా బుద్దిలేదు ఆవిషయాన్ని అక్కడితో వదిలేయచ్చుగా ..అబ్బే అలా అయితే అది నేను ఎలా అవుతాను ... ఫ్రెండ్స్ అంటే ,మొన్న ఒక సారి వాడు మా ఇంటికొచ్చినపుడు, మీ ఆయన వచ్చారు మా ఇంటికి, అప్పుడు పరిచయం చేసాను అంది.. నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు ...ఆయన ఏమో క్లోజ్ ఫ్రెండ్ అంటారు.. ఈవిడేమో ఒక సారి పరిచయం చేసాను అంటుంది మరి క్లోజ్ ఎలా అవుతారు???? నేను వెంటనే ఫ్రంట్ సీట్ లో సీరియస్సుగా కబుర్లలో మునిగి పోయిన మా ఆయనను భుజం మీద తట్టీ ఏమండి పెళ్ళి కొడుకు మీకు నిజంగా క్లోజేనా అన్నాను చెవిలో గుస గుస గా... మా ఆయన నా వైపు తిరిగి ఒకసారి నా కళ్ళలో చూసారు సూటిగా... ఆ చల్లని చూపుకి నాకు అర్ధం తెలుసు ...నోరు మూసుకుని కూర్చో అని.. చీ ఏదీ సరిగా చెప్పరు అని తిట్టుకుని కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చున్నాను.


మరి ఎప్పుడు నిద్ర పోయానో తెలియదు నిద్ర లేచేసరికి ఆవిడ వళ్ళో హాయిగా పడుకుని ఉన్నాను ..గబుక్కున లేచి ఎంత సేపయింది పడుకుని అన్నాను సిగ్గుగా.. ఒక గంట అయిందేమో,వచ్చేసాం ఇంక ఊర్లోకి అంది.. మరి పెళ్ళి ఎపుడూ అన్నాను.. రాత్రి పదిగంటలకు అంది ఆవిడ.. మరి ఇప్పటి నుండీ అప్పటివరకూ ఎక్కడ ఉండాలి అన్నాను దిగులుగా ...నాకు అంతమంది తెలియని జనాలమద్య అప్పటి వరకూ ఉండాలంటే ఇష్టం లేదు అందులోనూ ఈ నలిగిపోయిన కాటన్ చీరతో..నాక్కూడా ఇష్టం లేదు ఇంత తొందరగా వెళ్ళడం.. తను మా సొంత తమ్ముడు కాదు ,వరుసకు తమ్ముడు ,కాస్త దూరం వరసే ..అందుకే పెళ్ళి టైముకు వెళదాం అనుకున్నా కాని మా ఆయన దారిలో ఏదో పని ఉంది అని ముందు గా తీసుకొచ్చెసారు..అది చూసుకుని వెళతాం అంది..


నాకు అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు ..తమ్ముడి పెళ్ళికి ముందుగా వెళ్ళడానికే ఈమె సంకోచిస్తుంది .. మేము ఇంత ముందుగా వెళ్ళి ఏం చేస్తాం అనుకుంటుండగా మా పిన్ని గుర్తు వచ్చింది (అమ్మ చెల్లి).. నేనంటే బోలెడు అభిమానం ,మా పెళ్ళి కుదిర్చింది వాళ్ళే ..తను కూడా ఇదే ఊరులో ఉంటుంది ..వెంటనే మా ఆయన్ని పిలిచి ఏమండీ ,మనం మా పిన్ని వాళ్ళింటికి వెళదాం సాయంత్రం వరకూ అక్కడ ఉందాం అన్నాను ఉత్సాహం గా .కాస్త ఆగుతావా, ఇప్పుడు పిన్ని ఇంటికి,పెద్దమ్మ ఇంటికి వెళ్ళడానికి కుదరదు మళ్ళీ వెళదాం అన్నారు చిరాకుగా .. చెప్పక పోవడమే నాకు చాలా కోపం వచ్చింది..ఈయనగారికి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటే చాలు ఎదుటివాళ్ళ గురించి అక్కరలేదు తిట్టుకున్నాను... ఇంతలో మా ఆయన ఫ్రెండ్ కారు ఆపి ఎక్కడికో వెళ్ళీ 2 నిమిషాల్లో తిరిగి వచ్చి ఈ రోజు ఆ పని అయ్యేటట్లు లేదు అప్పటి వరకూ ఏం చేద్దాం అన్నాడు ఆమెను చూస్తూ ... ఇప్పుడు ఎలా అంది ఆమె దిగులుగా..నా నోరు తిన్నం గా ఉండచ్చు కదా పోనీ సినిమాకి వెళ్ళండి అని ఒక ఉచిత సలహా పడెసాను ...ఈ సలహా ఏదో బాగుంది మరి మీ ప్లాన్ ఏంటీ అన్నారు అతను మా ఆయనను చూస్తూ ... మా ఆయన సమాధానం చెప్పే అంతలో ఆవిడ అందుకుంది, మీరు మాత్రం పెళ్ళి వరకు అక్కడేం చేస్తారు సినిమా కి మాతో పాటు రావచ్చుగా అని.. మా ఆయన ఫ్రెండ్ ఆక్చ్షర్యం తో నువ్వూ పెళ్ళికి వస్తున్నావా అన్నాడు మా ఆయన వైపు చూస్తూ ...అదేంటీ ఆయన ఫ్రెండ్ కి తెలియదా మేము పెళ్ళికొస్తున్నామని ఈ సారి నాకు అయోమయం గా అనిపించింది ... మా ఆయన నా వైపు సీరియస్ గా చూస్తూ అంటే సాయంత్రం ఒక మారు అలా వచ్చి విషెస్ చెప్దామని అనుకున్నాను అన్నారు ...మరి చెప్పవే, అప్పటి వరకు ఏం చెస్తాం సినిమాకెళదాం అన్నారు అతను.. సినిమాకా ..అదీ అని మా ఆయన నసుగుతుండగానే నేను ఏం సినిమా అయితే బాగుంటుందో లిస్ట్ చెప్పేసాను..


ఇంక అందరం కలిసి సినిమాకి వెళ్ళాం ..నాకు ఆవిడ తెగ నచ్చేసింది ..మా అక్కతో మాట్లాడినట్లుగా చక్కగా ఫ్రీగా కలసిపోయాను సినిమా హాల్ల్ లో కబుర్లు చెప్పేస్తూ ..సినిమా అయ్యాక హాల్ బయటకు వచ్చి మా అవతారాలు చూసుకున్నాం..జర్నీ వల్ల, ఇంకా బయలు దేరి చాలా సేపు అవ్వడం వల్ల జిడ్డు మొహాలతో చెదిరిన జుట్టుతో శ్రీలంక కాందీశీకుల్లా తయారు అయిపోయాము ,నేను అయితే మరీనూ మద్యలో నిద్ర పోయాకదా .... ఆవిడ కార్లో కూర్చోగానే ,ఎక్కడన్నా కాసేపు మొహం కడుక్కుని చీర మార్చుకునే వెసులుబాటు ఉంటే బాగుండును ..ఇలా వెళితే అసహ్యం గా ఉంటుంది అంది .. నాకు వెంటనే మా పిన్ని మళ్ళీ గుర్తు వచ్చింది .. ఇలా అయినా తనను చూసినట్లు ఉంటుంది అని..అందుకే మెల్లిగా ,ఇక్కడ దగ్గరలో మా పిన్ని ఇల్లు ఉంది అక్కడికి వెళదాం ,చక్కగా ఫ్రెష్ అయి వద్దాం అని ఆమెకు కీ ఇచ్చాను.. ఆవిడ చేత చెప్పిస్తే మా ఆయన ఏమి అనలేరు అని నా ప్లాన్..


మొత్తానికి అందరిని మా పిన్ని ఇంటికి బయలు దేరదీసాను .. మా పిన్ని నన్ను చూడగానే ఎంత సంబర పడిపోయిందో ... ఎలా ఉన్నావ్,ఇలా చిక్కిపోయావేంటి ఈ నాలుగు రోజులకే లాంటి పలకరింపులయ్యాక ,మేము ఈ వూరికి ఫలానా వాళ్ళ పెళ్ళికొచ్చాం అని చెప్పాను .. అదేంటే పెళ్ళికి ఇలా తయారయి వచ్చావ్ ..పైగా పెళ్ళి వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళో తెలుసా .. మా వూర్లో ని వాళ్ళు తెలియని వాళ్ళు లేరు అంది ..నేను దిగులుగా మొహం పెట్టి ఏం చేయను ఉన్నట్లు ఉండి లాక్కోచ్చేసారు ,అస్సలు ఏమీ తెలియదు అనుకో
తనకు.. మొదటి సారి మా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చేసాను..సరేలే మగాళ్ళకు ఏం తెలుస్తుంది ,మనమే మెల్లిగా నచ్చ చెప్పుకోవాలి ..ఒక పని చేయి, రాక రాక వచ్చావ్ మా ఇంటికి ,మీ ఆయనకు మెల్లిగా నచ్చ చెప్పి చూడు , నువ్వు ఇక్కడ ఉండిపో,తను పెళ్ళికి వెళ్ళి వస్తాడు ..తరువాత ఇద్దరు కలసి వెళ్ళిపోదురు అంది ...నాకు ఉత్సాహం వచ్చేసింది .ఒప్పుకోరెమో అన్నాను అనుమానం గా ,అసలు అడిగి చూడు కాదనరు..లేకపోతే మీ చిన్నాన్న తో అడిగించనా అంది ..వద్దులే అని నెమ్మదిగా తనను పక్కకు పిలిచి ..ఏమండీ పిన్ని ఉండమంటుంది ,నాకు కూడా ఇక్కడ కాసేపు ఉండాలని ఉంది,ఉండనా అన్నాను .. ఏం మాట్లాడుతున్నావ్ అసలు.. నోరుముసుకుని రా ,చిరాకు పెట్టకు అన్నారు..వస్తున్న కోపాన్ని అణుచుకుని మా పిన్ని దగ్గరకు వెళ్ళాను ..అదీ,తరువాత వస్తాను పిన్నీ ,చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట ,నేను రాకపోతే బాధ పడతారు అని అన్నారు అన్నాను..మా పిన్ని మొహం లో కొంచెం బాధ కనపడింది ..పర్వాలేదులే ,నా చీర,నగలు ఇస్తాను వాటితో వెళ్ళు సరేనా అని నాకు నప్పే చీర,నగలు తీయడం మొదలు పెట్టింది ..నాకు మనసంతా తేలిక అయిపోయింది.. అంత మంచి అయిడియా ఇందాక నుండి రానందుకు తిట్టుకున్నాను ..


ఈ లోపల మా ఆయన ఫ్రెండ్ భార్య తయారయిపోయింది ,అందరూ నీ కోసం వెయిటింగ్ ఇంక రా మా ఆయన పిలిచారు.. ఇప్పుడే వస్తున్నా చీర మార్చుకుని వచ్చేస్తా అన్నాను ...మా ఆయనకు పిచ్చ కోపం వచ్చేసింది,వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ఎంత సేపూ చీర అంటావ్,పిన్ని అంటావ్ అంతా నీ ఇష్టమేనా..వద్దు, నువ్వు తొందరగా రా చాలు.. మీ పిన్నికి చెఫ్ఫేసి వచ్చెసేయ్ అన్నారు ...ఇంక వచ్చింది కదా నాకు కోపం .. ఇప్పుడేమయింది తన చీర కట్టుకుంటే అన్నాను ..నాకిష్టం ఉండదు అన్నాను కదా నువ్వు పరాయి వాళ్ళ బట్టలు వేసుకుంటే అన్నారు ..ఇందులో తప్పేముంది ..నా సొంత పిన్ని తను, పెళ్ళికి ముందు చాలా సార్లు తన చీరలు కట్టుకున్నా అన్నాను విసుగ్గా.. అప్పుడు వేరు,ఇప్పుడు వేరు ఇప్పుడు వస్తావా ,రావా అన్నారు ... ఏం, పెళ్ళి అయ్యాకా కొమ్ములు వస్తాయా ఇప్పుడు వేరంట వేరు అని మనసులో కచ్చగా తిట్టుకుంటూ పిన్ని దగ్గరకు వచ్చాను..పిన్నీ టైము అవుతుంది అందరూ రెడీ అయిపోయారు, వద్దులే నేను వెళతాను అన్నాను తన చీర తనకే ఇచ్చేస్తూ ...మా పిన్ని వేరుగా అర్దం చేసుకుంది..ఏమ్మా ఈ చీర నచ్చలేదా ,పోనీ ఇది బాగుంటుంది కట్టుకో నేను అసలు ఒక్కసారి కూడా కట్టుకోలేదు ,కొత్తది అని వేరేది ఇచ్చింది ..మా ఆయనకు ఇష్టం ఉండదు అని అంటే ఫీల్ అవుతుందేమో అనిపించింది ..పని లేక వాళ్ళింటికొచ్చి బాధ పెడుతున్నానా అనిపించింది .ఇంక ఆలోచించలేదు,లేదులే కట్టుకుంటాను ఇవ్వు అని మొండిగా చీర మార్చుకుని ,కాస్త మొహం కడుక్కుని ,గభ గభ జడ వేసుకుని బయటకు వచ్చాను ...


ఆ సరికే ఆయన ఫ్రెండ్ కార్ ని రివెర్స్ చేసి వీధి చివర ఆపడానికి వెళ్ళా రు.. నన్ను చూడగానే మా ఆయనకు కోపం ఆగలేదు..మొత్తానికి పంతం నెగ్గించుకున్నావ్ కదా అన్నారు,అది కాదు ,పిన్ని బాధ పడుతుందని కాస్త భయపడుతూ అన్నాను..ఒహో అయితే నేను బాధ పడినా పర్లేదన్నమాట అన్నారు ..ఏంటండి ,ఇప్పుడేమయింది అని ..పెళ్ళికి వెళుతూ అంత చండాలం గా ,జిడ్డుమొహం లా వెళితే ఏం బాగుంటుంది అన్నాను చిరాగ్గా .. ఇప్పుడు మనం పెళ్ళికి వెళుతున్నామని ఏవరు చెప్పారు నీకు అన్నారు కోపం గా ..అదేంటీ,మరి అత్తయ్యతో ప్రొద్దున్న అన్నారు గా అన్నాను అయోమయం గా ..నేనేమన్నా నీతో చెప్పానా ..అసలు పెళ్ళికొడుకు నాకు తెలియదు ,మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళితే బాగోదని నన్ను కూడా పెళ్ళికి రమ్మన్నాడు మాటవరసకు ..ఇదిగో నీ వల్ల సిగ్గు లేకుండా వెళ్ళాల్సి వస్తుంది అన్నారు .నాకేం తెలుసు నాకు ముందు గా ఒక్క మాట అయినా చెప్పచ్చు కదా అన్నా ..నాకింకా కంఫ్యూజ్ గానే ఉంది .నిన్నేదో సర్ ప్రైజ్ చేసేద్దాం అని ,బుద్ది తక్కువ అయి, నీ గురించి తెలియకా చెప్పలేదు ముందు గా ..ఇప్పుడు తెలుసుకున్నాను గా ..అమ్మవారి గుడికి వెళ్ళి అలా అన్నీ చూసి వద్దాం అనుకున్నాను ..అంతా చెడగొట్టావ్ మా ఆయన కోపం గా కారు ముందు డోర్ తీసుకుని కూర్చున్నారు మరొక్క మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా..


మా ఇద్దరి మొహాలు చూడగానే ఆమెకు అర్ధం అయినట్లు ఉంది అయినా నవ్వుతూ మామూలుగా మాట్లాడుతుంది.. నాకసలు ఏం వింటున్నానో అర్ధం కాలేదు, ప్రొద్దున్న ఆమె అంత క్లియర్ గా చెప్పింది తన తమ్ముడిని ఒక్కసారే మా ఆయనకు పరిచయం చేసాను అని అప్పుడైనా నా మట్టి బుర్రకు అర్ధం కాలేదు,అయినా ఫ్రెండ్ భార్య తమ్ముడు మా ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ ఏంటి అని కొంచమైనా అనుమానం రాలేదేంటి నాకు ,అయినా నా తప్పేముంది ..నాకు ఇక్కడ అంతా క్రొత్త ,అది ఆలోచించకుండా అలా అరుస్తారేంటి ,పోనీ ఆయన ఫ్రెండ్కి ముందు గానే చెప్పచ్చు కదా నేను పెళ్ళి కి రాలేదని ..ఎందుకంత మొహమాటం ..బోలెడు ప్రశ్నలు ..మా మొదటి గొడవ తాలూకు భయం తో పెళ్ళి మండపం లోనికి అడుగుపెట్టాను.. నా చీర ,నగలు నాకే బరువుగా అనిపించాయి ,తెలియని పెళ్ళికి వచ్చాం అన్న సిగ్గు ఒక ప్రక్క, పెళ్ళి కొడుకు మమ్మల్ని చూడగానే పలకరించి భోజనం చేసి వెళ్ళి తీరాల్సిందే అని పట్టుపట్టాడు ఎంత చెప్పినా వినకుండా ..నాకైతే మా ఆయన మొహం లో చూడాలన్నా భయం వేసింది..



ఇంటికి వచ్చేవరకు సారీ చెప్పే వీలే కలగలేదు నాకు,రాగానే సారి నాకు తెలియదు కదా ,నేను పెళ్ళికి అనుకున్నాను అని అన్నాను ..నీ సారీలు నాకు అక్కరలేదు ,ఈ సారి నీ పర్మిషన్ తీసుకుంటాను ఎక్కడికి వెళ్ళాలన్నా,అంత ఎందుకు అసలు ఎక్కడికీ తీసుకు వెళ్ళను అని మొండి సమాధానాలు చెప్పి హాల్ లో టి.వీ చూస్తూ కూర్చున్నారు ...చాలా బాధగా అనిపించింది ,ఇప్పుడేంజరిగిందని అంత కోపం .పొరపాట్లు అందరికీ జరుగుతాయి కదా..దీన్నే మగ అహంకారం అంటారు ..ఎప్పుడో పుస్తకాల్లో చదివాను ఇప్పుడు చూస్తున్నాను ..ఈయనగారు మనసులో ఏదో అనుకున్నారంట ,నేను అది కనిపెట్టలేక పోయానంట ..నాకేమన్న మా వాళ్ళూ మైండ్ రీడింగ్ ట్రైనింగ్ ఇచ్చిపంపారా ..ఎంత అన్యాయం గా మాట్లాడుతున్నారు,కనీసం జాలి యే కొసనన్నా ఉందా ఈ మనిషికి ... ఇలా నాకు నచ్చినట్లుగా బోలెడు తిట్టుకున్నాను ..ఎక్కడో ఆశ ..కాసేపు అయ్యాక వచ్చి సరేలే బాధ పడకు అంటారేమో అని.. అలా ఆలోచిస్తూ,చిస్తూ ప్రయాణపు బడలిక వల్ల నిద్రలో జారుకున్నాను ...


ప్రొద్దున్న లేచేసరికి సీరియస్స్ గా షూ లేస్ కట్టుకుంటున్నారు ఎక్కడికో వెళుతూ ,రాత్రి ఉన్న కోపం నిద్ర నుండి లేచేసరికి ఎక్కడికి పోయిందో నాకు,తప్పంతా నాదే అనిపించింది ..పాపం కదా ఎంత ఇబ్బంది పెట్టాను నిన్న అనుకుని ,టిఫిన్ చేస్తారా అన్నాను.. వద్దు అని మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు..చాలా బాధగా అనిపించింది ..కాసేపాగి ఫోన్ చేస్తే కట్ చేసి పడేసారు.. నాకు ఉక్రోషం ,ఏడుపు రెండు కలగలిపి వచ్చేసాయి.. అది కాస్త కోపం క్రింద మారిపోయింది ... ఆ కోపాన్ని అంతా వంట గదిలో గిన్నెల మీద,కూరల మీదా చూపిస్తూ ,ఈ మగాళ్ళు అందరూ ఇంతే ,దొంగ మొహాలు ..వీళ్ళనే నమ్ముకుని వస్తాం కదా అదీ చులకన .. వీళ్ళు మమ్మల్ని ఏమైనా అనేయచ్చు ,కానీ మేము మాత్రం ఒక్క ముక్క అనకూడదు ,వాళ్ళ వెనుకాలే వస్తాం కదా అదీ లోకువ ,అసలు పెళ్ళి అయితే అందరూ ఇల్లరికం వెళ్ళిపోవాలి అని ఒక రూల్ పెట్టి పడేస్తే బాగుండును గవర్నమెంట్..అసలు ఆ దేవుడు కూడా మగాడే కదా అందుకే అందుకే అమ్మాయిలకు ఇన్ని కష్టాలు పెట్టేసాడు ..ఇలా మగవాళ్ళనందరినీ కాసేపు తిట్టిపడేస్తే గానీ మనసు ప్రశాంతం గా అవ్వలేదు .. అసలు భార్య,భర్తలు ఇద్దరూ తగవులాడుకుంటే ఒకరినొకరు తిట్టుకోవడం మానేసి మొత్తం మగాళ్ళను ,ఆడవాళ్ళను కలిపి ఎందుకు తిట్టుకుంటారో నాకు అర్దం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నమాట ఇప్పటికీ..


కాసేపయ్యాక ఫొన్ వచ్చింది ..నిన్న కలసిన ఆమే ఫోన్ .. మీరు నిన్న కార్లో మీ బేగ్ మర్చిపోయారు మీ వారితో పంపించమంటారా అన్నాది ఆవిడ,తను అక్కడ ఉన్నారా అన్నాను.. ఆ.. మావారు ,తను బయటకు వెళుతున్నారు అంది .. మా ఆయన మార్నింగ్ టిఫిన్ తినడం మర్చిపోయారు అన్నాను ..తనని కాస్త టిఫిన్ పెట్టమ్మా అని చెప్పకనే చెపుతూ .. ఓ పర్వాలేదు ఇప్పుడే పకోడీలు వేసాను తిన్నారు
అంది .. హమ్మయ్య అనిపించింది ..మాట్లాడుతారా తనతో అని పిలిచి ఇచ్చింది ఫోన్ ..నేను హలో అనే లోపలే ఫోన్ పెట్టేసారు .. మళ్ళీ కాసేపు మగ జాతి అందరూ బలయిపోయారు నా నోటితో..మధ్యాహనం మా అత్తగారు భోజనం తినమన్నారు ..వద్దు అత్తయ్యా తను వచ్చాక తింటాను అన్నాను ..ఇప్పుడు నేను భోజనం చేసేస్తే ఎలాగా.. మా ఆయన్ని ఏడిపించాలిగా ఆ ఆయుధం తోని..కాని మా అత్తగారి దగ్గర నా ఆటలు సాగలేదు,వాడు ఎప్పుడొస్తాడో ,వేళకు తినకపోతే నీరసం వస్తుంది అని బలవంతం గా తినిపించేసారు ..

అక్కడి నుండి నా చూపులు వీధి గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయాయి ..రాత్రి అవ్వగానే మా అత్తయ్యగారు మళ్ళీ బోజనం తినమని గొడవ..ఇంక లాభం లేదు ఈ సారి తిన్నామో అంతే అనుకుని ఆకలి లేదు అని మొండికేసి పడుకున్నాను పది అయినా మనిషి రారే.. చిన్న సౌండ్ విన్నా తనేనేమో అనిపించేసేది,నా చెవులు ఎంత బాగా పని చేసేవంటే నాలుగు వీధుల అవతల బండి శబ్ధం అయినా వినబడిపోయేది ..మెల్లిగా ఆకలి మొదలయ్యింది.. ఏం చేయాలో అర్ధ కాలేదు ..అదేంటో మాములు టైములో రెండు పూటలా తినకపోయినా ఆకలి వేసేది కాదు..అందరూ నా మీద కక్ష సాధించేవారే .. అదృష్టం కొద్దీ నేను తెచ్చిన సారె బిందెలు మా రూం లోనే ఉన్నాయి .మెల్లిగా ఒక లడ్డు ఒక మైసూర్ పాక్ తినేసి కడుపునిండా నీళ్ళు తాగి పడుకున్నాను.. పన్నెండు అయినా రాలేదు ..ఎందుకో ఏడుపొచ్చింది ..ఒక్కరిదాన్నే ఉన్నాను అని బెంగగా అనిపించింది..పెళ్ళికి ముందు ఆయన పంపిన లెటెర్స్ ,చీర పక్కన పెట్టుకుని కాసేపు చదివాను ..చదివిన కొద్దీ కోపం వస్తుంది ..


ఎక్కడో చదివిన గుర్తు మగాడు ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఎప్పుడంటే పెళ్ళానికి పెళ్ళికి ముందు రాసిన లెటేర్స్ పొరపాటున మళ్ళీ చదివినపుడంట .. అందమైన అభద్దాలు ఎంత పొందిగ్గా రాసేస్తారు తిట్టుకుంటూ ఉండగానే మా ఆయన మాటలు వినబడ్డాయి హాల్లో నుండీ .. ఏంట్రా ఇప్పుడా రావడం ,నువ్వు వచ్చే వరకూ తినను అని మొండికేసి పడుకుంది ఆ పిల్ల మా అత్తగారు అంటున్నారు..ఇది మరీ బాగుంది నేనేమన్నా తినద్దు అన్నానా మా ఆయన రూం లోకి వస్తున్న చప్పుడు..గబుక్కున దిండు లో మొహం పెట్టేసుకుని నిద్ర పోతున్నట్లు పడుకున్నాను.. అసలే నాకు నిద్ర పోయినట్లు నటించడం చేతకాదు..కళ్ళు టక టకా కొట్టుకుంటుంటాను .. కాసేపు పర్స్, వాచ్ లాంటివి టేబుల్ మీద పెడుతున్న చప్పుడు వినబడి ఆగిపోయాయి.. మెల్లిగా నాకు దుప్పటి కప్పి హాల్లో క్రికెట్ చూడటానికి వెళ్ళిపోయారు.. శ్రీలంకకు ,పాకిస్తాన్ కి ఫైనల్ మేచ్ అంట..మావయ్య గారితో అంటున్న మాటలు వినబడుతున్నాయి..తిక్క కోపం వచ్చింది ...అమ్మో ఎంత బండ రాయి ,నేను అన్నం తినలేదు అన్న విషయం తెలిసి కూడా పట్టించుకోకుండా ,నన్ను తినమని అడగ కుండా వెళ్ళీ క్రికెట్ చూస్తున్నారా,బోడి ఈ దుప్పటి కప్పడం అవసరమా ..తీసి నేల కేసి కొట్టాను .ఇంకా నయం ఈ మనిషిని నమ్ముకుని ఆ స్వీట్లు కూడా తినకుండా ఉండలేదు ..ఆకలికి మాడిపోయేదాన్ని ..బోలెడు ఉక్రోషం వచ్చింది.. ఇదే మా నాన్న అయితే నేను అన్నం తినలేదంటే విని ఊరుకోగలిగేవారా .. ఏడుపొచ్చేసింది ..


ప్రొద్దున్న టిపిన్ తింటారా అని నోటి వరకు వచ్చింది గాని ఇప్పుడు అడిగితే మళ్ళీ స్టైల్ కొట్టీ వద్దు అని కడుపు మాడ్చుకుంటారు ..ఎందుకులే అని బీరువాలో బట్టలు తీసుకుంటున్నా...అసలు రాత్రే నిర్ణయించుకున్నా ఇంకోమారు బ్రతిమాల కూడదని.. టిఫిన్ తిన్నావా ఎప్పుడు వచ్చారో మా ఆయన వెనుకనించుని అడుగుతున్నారు ..లేదు ,ఆకలి వేయడం లేదు అన్నాను..వేయదు వేయదు నాలుగు పీకితే వేస్తుంది అన్నారు నవ్వుతూ.. ఆ..అదే మిగిలిపోయింది ఇంక,చిన్న విషయానికి అంత సాధిస్తారనుకోలేదు నాకు అణుచుకున్న కోపం కక్కేస్తే గాని ఫ్రీ అవ్వలేననిపించింది ..అబ్బా తప్పు నీది పెట్టుకుని రాక్షసిలా మళ్ళి నా మీద పడతావే అన్నారు నవ్వుతూ.. అసలు నేనేం చేసా చెప్పండి,నాకేమన్న పరకాయ ప్రవేశం తెలుసా మీ మనసులో ఏముందో చూడటానికి ..అరే అప్పటికీ సారీ చెప్పినా అదేదో క్షమించరాని నేరం లా అన్నం తినడం మానేసి,మాట్లాడటం మానేసి ఆ సాధింపేంటి ,మీ బాధ ఏంటి ఇప్పుడు మా పిన్ని చీర కట్టుకున్నాననేగా ..మీకు ఇంకొకళ్ళ బట్టలు నేను వేసుకోవడం ఇష్టం లేదనుకో మెల్లిగా చెప్పచ్చుకదా ..అయినా ఎంత సేపూ మీ వైపే ఆలోచిస్తారేంటీ ...నా గురించి ఆలోచించరే ..నిన్నగాక మొన్న వరకూ పిన్ని ,పిన్నీ అని తన చుట్టూ తిరిగీ ఇప్పుడు హఠాత్తుగా మా ఆయనకు మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు,నీ బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు అని వయ్యారంగా చెప్తే అవతలి మనుషులు ఎంత బాధ పడతారు..మీదే కరెక్ట్ కావచ్చు కాని నాకు టైం కావాలికదా మీ గురించి తెలుసుకోడానికి, అసలు అంత జాలి లేకుండా ఎలా ఉన్నారండీ ,కనీసం పాపం చిన్నపిల్ల ఇలా బాధ పెడుతున్నాను అని యే మాత్రం అనిపించలేదు కదా అని ఒక అరగంట తిట్టిపడేసాను ..

ఎవరూ నువ్వా ,చిన్నపిల్లవా, నా తల్లే మరి నాకు కోపం రాదా ..నా ఫ్రెండేమో మాటల మద్యలో విజయవాడ వెళుతున్నా అని చెప్పాడు ..సరేలే నిన్ను సరదాగా తీసుకు వెళ్ళి అలా అమ్మవారి గుడి ,ఊరు చూపిద్దాం అని అప్పటికప్పుడు ఏదో చెప్పి తీసుకు వచ్చేసా.. కానీ నువ్వెక్కడ ఆగుతావ్ ..ఆ అబ్బాయి నీకు క్లోజా,ఎంత క్లోజు అని వాళ్ళ ముందు ఆరాలు ..అక్కడితో ఊరుకున్నావా సినిమాకి వెళ్ళిపోదాం,పిన్ని ఇంటికి వెళ్ళిపోదాం అని డైరెక్షన్లు ..అసలు నన్ను చెప్పనిచ్చావా..అసలే ఆ మంట మీద ఉంటే నేను మా పిన్ని ఇంట్లో ఉండిపోతా,చీర కట్టుకొస్తా అని గొడవ ..ఎంత కోపం వచ్చిందో తెలుసా.. పోనీ సరే నాకేదో కోపం వచ్చింది ..నేను వెళ్ళి టీ.వి చూస్తుంటే మళ్ళీ వచ్చి కాసేపు బ్రతిమాలచ్చుగా ..అహా ,వీడి మొహానికి ఒకసారి సారి చెప్పడమే ఎక్కువ అన్నట్లు దున్నపోతులా పడుకున్నావ్ .. ఒక పక్క నాకేమో వేడి చేసిందో,ఆ ఫుడ్ పడలేదో తెలియదు ఒకటే కడుపునొప్పి ..మరి నువ్వు పట్టించుకోకపోతే నాకు కోపం రాదా అన్నారు..


అయ్యో కడుపునొప్పా అన్నాను కంగారుగా ..ఇప్పుడేం అడగక్కరలేదు తగ్గిపోయాకా అన్నారు..ఇదీ మరీ బాగుంది ఇవన్నీ కలగంటానా లేపచ్చుగా ..మరి పెళ్ళాన్ని బాధపెడితే ఆ పాపం ఊరికే పోతుందా అన్నాను నవ్వుతూ .. మరి ఆ మాత్రం ఏడిపించకపోతే నాకోపం తీరేదెలా ..అసలు ప్రొద్దున్నే కోపం పోయింది. టిఫిన్ తినను అనగానే నువ్వు బిక్కమొహం వేయగానే నవ్వు వచ్చింది నువ్వు అలా వెళ్ళగానే నవ్వుకునే వాడిని,అందులోనూ నిన్న నువ్వు ఆ లెటెర్ చీర ముందేసుకుని పడుకుంటే బోలెడు జాలేసింది అన్నారు..ఆ ఏడిపిస్తారు,కాలేజ్ లో నాటకాలేసే బుద్ది ఎక్కడ పోతుంది..పెళ్ళయ్యాక కూడా వేస్తున్నారు అన్నాను కోపంగా..నీకెలా తెలుసే నేను నాటకాలు వేసే వాడినని అన్నారు ఆక్చర్యం గా ..పెళ్ళికి ముందు మా అక్క మీ ఫొటో తెచ్చిందిగా ,అది నా దగ్గరే ఆల్బం లో పెట్టాను జాగ్రత్తగా అన్నాను గొప్పగా..అవునా ఏం ఫొటో అన్నారు కుతూహలం గా ..అదే మీరు అడుక్కున్న వాడిలా ఒక గడ్డం వేసుకుని ,తెల్ల విగ్ పెట్టుకుని జీవించేస్తున్నారుగా అది అన్నాను ..మా ఆయన కాసేపు ఆలోచించి అదా అని పడి పడీ నవ్వుతూ అదీ ,అది మా నాన్న దే బాబు నేను కాదు అన్నారు...ఆ... @$%^* అని ఉండిపోయాను ...

72 కామెంట్‌లు:

kiranmayi చెప్పారు...

నేస్తం
మీ ఫస్ట్ పోట్లాట మీద పోస్ట్ అదిరింది. పొద్దున్నే లేచి తొందరగా email చెక్ చేసుకుని రెడీ అవుదాం అనుకున్న నేను పొరపాట్న మీ బ్లాగ్ తెరిచాను. చదవటం పూర్తిచెయ్యకుండా ఆపలేక పోయాను. ఇవాళ నేను work కి late అవ్వటానికి మీరే కారణం. ఇలా మామీద కక్ష తీర్చుకోవటం ఏమి బాగాలేదు. పెళ్ళయిన కొత్తలో నగలతో ఇదే గొడవ. చెవుల కమ్మలు రాత్రి తేసేసి, పొద్దున్నే బ్రష్ చేసుకున్నప్పుడే మొదలు "కమ్మలు తేసేసావే అమ్మా , నచ్చలేదా? పోనిలే ఇవాళ్టికి పెట్టుకో. ఎవరైనా చూస్తే అత్తగారు, తల్లిగారు మంచి కమ్మలు పెట్టలేదేమో పాపం అమ్మాయి తేసేసింది అని ఎవరైనా అనుకుంటారు" అని. "ఇప్పుడే పెట్టుకుంటాను బాబు, రాత్రి గుచ్చుకుంటే తేసేసాను" అని ఎంత చెప్పినా వినరే? ఎవరి conclusion వాళ్ళు చేసేసుకోవడమే!!! పైగా ఈ మహానుభావుడు (మా ఆయన) నవ్వుతూ "నగలు పెట్టుకోమ్మా" అని వాళ్ళ నాయనమ్మని ఇమిటేట్ చేస్తుంటే భలే తిక్క ఒచ్చేసేది.
ఏమైనా మీ ఫస్ట్ కలహం చాల రొమాంటిక్ గా ఉంది. నేనే ఫస్ట్ comment చేశా. మీ నెక్స్ట్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తూ office కి లేట్ గా వెళ్ళిన
Mayi

అజ్ఞాత చెప్పారు...

tooooooooooooooooooo good !!!

--sk

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

baagundi koncham length ekkuvayinatlu anipinchindi ee saari

Srujana Ramanujan చెప్పారు...

hmm. ఇంత పెద్ద పోట్లాటా? అంత కష్టపడ్డారన్నమాట అంత చిన్న వయసులో. :-D

సినిమా చూపించారనుకోండి.

ప్రియ చెప్పారు...

గొడవ జరిగినట్టు రాయొద్దు అన్నానా?

గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ (అంటే నాకు కోపం వచ్చిందన్న మాట.

ఐనా మీరు నాకు కోపం రాలేదు.
ఆయన అలగలేదు. మేము పోట్లాడుకోలేదు అని రాయాలి. అదన్నమాట. అర్ధం ఐందా? :-D

పుల్లాయన చెప్పారు...

చాలా బాగుందండీ మీ టపా. హాయిగా ఉంది. మరి మీకు రాయటానికి ఎన్ని రోజులు పట్టిందో తెలీదు కాని నాకు మాత్రం చదవటానికి చాలా సమయం పట్టింది. ఇంతకి ఇది జరిగింది ఈ సంవత్సరం లో అని ఒక చిన్న డౌటు.

రాధిక చెప్పారు...

" ఆ చల్లని చూపుకి నాకు అర్ధం తెలుసు ...నోరు మూసుకుని కూర్చో అని"...:) :) :) :)
మీరు సారీ చెప్పాల్సిన పని లేదు.తప్పు మీది కాదు కాక కాదు. :)

శరత్ కాలమ్ చెప్పారు...

మొత్తం చదవలేకపోయానండి - పెద్దగా వుంది కదా. ఇంత పెద్ద టపాలు వ్రాసేంత ఓపిక ఎలా వుంటుందండీ మీకు?

జ్యోతి చెప్పారు...

ఈ మగాళ్ళు అందరూ ఇంతే ,దొంగ మొహాలు ..

నిజమే సుమండీ. నాదీ సేమ్ డైలాగ్ ఇలాటి సీన్ లో.కాని అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రింది.ఐతే అందరు మగాళ్లు ఇంతేనన్నమాట. :))

మాలా కుమార్ చెప్పారు...

మొదటినుంచి చివరి వరకు ఏక బిగిన చదివించేసారు ,నా సీరియల్ ను కూడా దూరం పెట్టి చదివేసా. బాగుంది అనే మాట సరిపోదేమో !

నేస్తం చెప్పారు...

కిరణ్మయి గారు మరే బాగా చెప్పారు, అసలే కొత్త కాపురం తికమకగా అనిపిస్తుంది అంటే వీళ్ళ హడావుడితో మకతిక అయిపోతుంది ... అయ్యో ఆఫీస్ కి లేట్ గా వెళ్ళారా ఈ సారి మీకు నైట్ టైం పోస్ట్ చేస్తాలేండీ :)
s.k గారు థేంక్స్ అండి :)
చక్రవర్తి గారు మీకు అలా అనిపించింది అంటే నేను సరిగ్గారాయలేదన్నమాటే

అజ్ఞాత చెప్పారు...

>> మెల్లిగా ఒక లడ్డు ఒక మైసూర్ పాక్ తినేసి కడుపునిండా నీళ్ళు తాగి పడుకున్నాను...
LOL. You started it as your hubby said. Should have asked HIM before talking everything with the 'other' lady. ;-)

And stamp you did - all men are the same! Wow How many men did/do you know btw ? :-)

నేస్తం చెప్పారు...

సృజన గారు ఎంత బాగా అర్ధం చేసుకున్నారు :)
ప్రియ గారు హ హ పోనీ ఇంకో పోస్ట్ లో ఇదంతా తూచ్ అసలేం జరగలేదు ,నాకు కోపం రాలేదు.
ఆయన అలగలేదు. మేము పోట్లాడుకోలేదు అని రాయనా :ఫ్
పుల్లాయన గారు ఇంత ఓపికగా చదివారంటే మీరు గ్రేటేనండి.. నాకైయితే ఒక్కళ్ళు కూడా చదవరనిపించింది ..భాగాలుగా విభజించి రాద్దామంటే ఇంతకు ముందు అందరూ అలా చేయద్దు అన్నారు ..కాబట్టి తప్పు నాది కాదు :)

నేస్తం చెప్పారు...

రాధిక గారు అంతే అంటారా..అనవసరం గా చెప్పేసానా ...ఇప్పుడు ఆ విషయం మళ్ళీ గుర్తు తెచ్చి మావారి తో మళ్ళీ గొడవ పడి నా సారి వెనక్కి తీసుకుని ఒక పోస్ట్ రాసేస్తా అయితే ..:)
శరత్ గారు నిజం చెప్పాలంటే బోలెడు పని మద్య కొంచెం కొంచెం చొప్పున హడావుడిగా రెండురోజులకొకమారు గేప్ తీసుకుని వారం రోజుల్లో రాసాను ...రాసినప్పుడు అర్ధం అవుతుంది చేట భారతం రాస్తున్నా అని..కాని గేప్ తీసుకుని హడావుడిగా రాయడం వల్ల సరిగా రాయలేకపోయా అనిపించింది ..
జ్యోతిగారు అంతే ,అంతే ఈ విషయం లో అస్సలు డౌట్ పడకండి ..:)

నేస్తం చెప్పారు...

మాలా కుమార్ గారు నిజ్జంగా నిజమా ..థేంక్స్ అండి :)
అఙ్ఞాత గారు మొత్తానికి తప్పు నాదే అంటారు..నేను అలిగేసాను :)

జ్యోతి చెప్పారు...

అదేంటి ఇక్కడ మీవారు అలిగితే , అక్కడ నిహారిక వారు అలిగారు. ఇద్దరూ ఒకేసారి అలిగితే ఎలా??
http://ramyamgakutirana.blogspot.com/2009/07/blog-post_15.html

Shiva Bandaru చెప్పారు...

బావుందండి. :)

సుజాత వేల్పూరి చెప్పారు...

పాడైనా పర్వాలేదనిపించే మంచి చీర ..:-))

.ఇంకా నయం ఈ మనిషిని నమ్ముకుని ఆ స్వీట్లు కూడా తినకుండా ఉండలేదు ....

పదేళ్ళ తర్వాత ఇప్పుడు కూడా సరదాగా తింగరి ప్రశ్నలు వేసి(సారీ, మీరు కార్లో వేసిన ప్రశ్నలు అలాగే ఉన్నాయి కదండీ మరి)మా వారితో గొడవ పెట్టుకోవాలనిపిస్తొందండి మీ పోస్టు చదువుతోంటే! గుడ్!

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం, మీ అన్ని టపాలకంటే నాకు చాల బాగా నచ్చిన టపా ఇదేనండి...అసలు ఒక పది నిముషాల్లో మొత్తం చదివేసి అపుడే అయిపోయిందా? ఇంకొంచెం ఉంటె బాగుండు అనిపించింది నిజంగా.... పెళ్ళయ్యాక ఆ గిల్లికజ్జాలు ఎంత మధురంగా ఉంటాయో మీ ద్వారానే తెలుస్తుందండీ....అధ్బుతంగా రాసారు...టపా లెంగ్త్ ఎక్కువా తక్కువా అన్నది పాయింట్ కాదు, ఎంత బాగా చదివేవాళ్ళని కట్టిపడేస్తుంది అని చెప్పడానికి మీ టపా చక్కని ఉదాహరణ...ఈ సారి కొంచెం టైం ఎక్కువ తీసుకున్న పర్వాలేదు, ఇంకా పెద్ద టపా రాయండి నేస్తం...సరేనా మరి :)

గీతాచార్య చెప్పారు...

"అది మా నాన్న దే బాబు నేను కాదు అన్నారు...ఆ... @$%^* అని ఉండిపోయాను ..."

భలే ఉంది ఇది మాత్రం. ఎంత ఓపిక మీకు ఇంత పెద్ద పోస్టు వ్రాయటానికి? చక్కగా చదివించింది. హ్మ్ అంటే అలకలు కూడా బాగుంటాయన్నమాట. ఐతే నేర్చుకోవాలి.

@ప్రియ,

నేనీ కామెంటూ వ్రాయలేదు.

Padmarpita చెప్పారు...

అమ్మో ఇంత పెద్ద టపానా అనుకున్నాను....
చదివి తెలుసుకున్నా.... అదగొట్టారుగా!!!!!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుంది నేస్తం... నేనూ ఏకబిగిన చదివేసాను.. :-) మొత్తానికి భార్యమణికోసం ఇంట్లో ఆబద్దం చెప్పేముందు ఆ విషయం తనతో చెప్పాలి లేదా ఇప్పుడు నిన్ను సర్ప్రైజ్ చేయబోతున్నాను అందుకు సిద్ధంగా ఉండు అని ప్రిపేర్ చేయాలి అంటారు అంతేనా !! ఇదేదో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నట్లుందండీ నాకు :-)

మీరన్న మిలియన్ డాలర్ల ప్రశ్న నన్నూ వేధిస్తుంటుంది అప్పుడప్పుడూ :-) భార్యా భర్తలనే కాదు స్నేహితుల మధ్య కూడా ఇలా మగబుద్దులు ఆడబుద్దులు అని ఏకి పారేస్తుంటారు కొందరు.

Shashank చెప్పారు...

తప్పు మీదే. మీ వారికి చెప్పండి తను చేసింది కరెష్ట్ అని. అన్ని విడమర్చి వెంఠనే చెప్పాలా?
మీరు చెప్పారా మీ వారికి - నాకు ప్రైజులన్నా సర్ ప్రైజులన్నా ఇష్టం లేదని?

మీ మొదటి కొట్లాటా ఇంకా గుర్తుందా? నాకైతె గతవారం జరిగింది కూడా గుర్తుండదు..

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,

ఈ చీరతో ఎలా వెళ్ళడం అన్నా ఏమీ చెప్పకుండా తీస్కేల్లడం వల్ల మీకెలా తెలుస్తుంది పాపం !

ఈ మొత్తం ఎపిసోడ్లో, మీరు ఎంత బాధ పడి ఉంటారో, తోటి అమ్మాయిగా అర్థం చేసుకోగలను ! చివర్లో సుఖాంతం కాబట్టి, తేలిగ్గా నవ్వేసాను నేను కూడా !

ఇప్పటికైనా, మీ ఆయన మనసు కనిపెట్టే( ఏమీ చెప్పకుండా ) అద్భుత విద్య నేర్చుకున్నారా మరి ? :-))

సరళమైన భాషలో రాసారు, మళ్ళీ సీన్లు కళ్ళ ముందు కనపడ్డాయి ! :-)

- పద్మ

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఏదైనా గొడవతో మొదలయ్యే స్నేహమైనా, ప్రేమైనా కల కాలం నిలుస్తుందంటారు. మీ కథనా శైలి హృద్యంగా వుంటోంది. ప్రతి పోస్ట్ తమను తాము తడుముకొనేట్లు చెస్తోంది. ధన్యవాదాలు.

రఘు చెప్పారు...

చాలా చాలా బాగుందండి. ఒకటే నవ్వు చదివినంత సేపు, ఇంట్లొ అందరిని కుర్చొబెట్టి మల్లి చదివి వినిపించను. అందరు ఎవరి ఙ్ణాపకాలలొకి వాల్లు జారుకుని ఒకటే సోదీ అండీ బాబు.

అజ్ఞాత చెప్పారు...

రెండో అజ్ఞాత గారు,

మీరడిగిన గొప్ప ప్రశ్నకి ఏదో నా చిన్ని సమాధానం !

And stamp you did - all men are the same! గురించి ...

ఏంటండి ఈ తింగరి ప్రశ్న ? ఏదో కోపంలో అలా అనేసుకుంటాం ! నేస్తం ఇంత క్లియర్ గా రాస్తే చూడకుండా, ఎంతమంది తెలుసని అలా generalization అంటారేంటి విడ్డూరంగా ?

"..ఇలా మగవాళ్ళనందరినీ కాసేపు తిట్టిపడేస్తే గానీ మనసు ప్రశాంతం గా అవ్వలేదు .. అసలు భార్య,భర్తలు ఇద్దరూ తగవులాడుకుంటే ఒకరినొకరు తిట్టుకోవడం మానేసి మొత్తం మగాళ్ళను ,ఆడవాళ్ళను కలిపి ఎందుకు తిట్టుకుంటారో నాకు అర్దం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నమాట ఇప్పటికీ.."

అని నేస్తం చక్కగా చెప్తేనూ !

అదన్నమాట సంగతి !
- పద్మ

శ్రుతి చెప్పారు...

అయ్యొయ్యో! మీరు కూడా... నిజమే నండి. వాళ్ళ మనసులో ఏముందో కనిపెట్టాడం మనవల్ల కాదేమో. మరేంటి అందరూ ఆడవాళ్ళ మనసు తెలుసుకోలేము, అది బో..లెడంత లోతు అని చెప్పేస్తారు.

పోట్లాటలా లేదు, మీవారు మీకివ్వాలనుకున్నా షాక్ కంటే కలకాలంగుర్తుండే అనుభూతినిచ్చారు మీరు. ఆవిషయం చెప్పండి.

sunita చెప్పారు...

baagundi.!!

నేస్తం చెప్పారు...

జ్యోతిగారు నేను పోస్ట్ చేసి కూడలి లో వచ్చిందా రాలేదా నా పోస్ట్ అని చెక్ చేస్తుంటే నిహారిక గారి పోస్ట్ కనబడింది ..ఆమెకు ఆ విషయమే చెప్తూ ఒక వాక్య రాసాను ..ఇంకా ప్రచురించలేదు తను :)
శివ గారు థేంక్స్ అండి
సుజాత గారు ప్రశ్నలు వేసినప్పుడు నాకూ అర్ధం అవుతుంది తిక్క ప్రశ్నలు వేస్తున్నాను అని కాని ముందు నా చీర గురించి ఆవిడ ఏమనేసుకుంటుందో ,విషయం ఆవిడకు వివరించేయాలి అన్న ఆత్రుత అన్నమాట ..తరువాత వాటిని కవర్ చేసుకునే నేపధ్యం లో ఇంకాస్త చండాలం చేసాను :)

నేస్తం చెప్పారు...

కిషన్ థేంక్స్ అండి మీ అభిమానానికి ,అన్నట్లు మీ బ్లాగ్ ఓపెన్ చేస్తుంటే ఎందుకో ఓపెన్ కావడం లేదు,అంటే బ్లాగ్ ఓపెన్ అవుతుంది పోస్ట్ కనబడటం లేదు ..ఎందుకనో మరి
గీతాచార్య గారు హ హ నేర్చుకో అక్కరలేదు ..వాటికవే వచ్చేస్తాయి :)
పద్మార్పిత గారు థేంక్స్ అండి :)

అజ్ఞాత చెప్పారు...

మూడో అజ్ఞాత గారు
అవును నేస్తం గారు బాగా చెప్పారు
సంసార చక్రాలు లడ్డు మైసూర్ పాక్ లాంటివి
రెండిటిని మీరే తినిస్తే ఎలా ?

నేస్తం చెప్పారు...

వేణు గారు హమ్మా!! ఎంత మెత్తగా మా ఆయనవైపు వకాల్తా తీసుకున్నారు ...:) ఆ ప్రశ్నలు అంతే అండీ జవాబు దొరకదు :)
శశాంక్ గారు మరి దీన్నే మగబుద్ది అంటారు హ..హ .. ఎక్కడా ఒప్పుకోరు కదా ...
పద్మా గారు నన్ను అర్ధం చేసుకున్నారు అండి :) ఇంక మా ఆయన మనసు కనిపెట్టడం అంటే అలవాటు చేసుకున్నాను అంతే ,సపోజ్ ఏదన్నా పార్టీ కి వెళుతున్నాం అనుకోండి ఎవరో ఒక ఫ్రెండ్ ఎన్ని గంటలకు బయలు దేరుతున్నావ్ అని ఫోన్ చేసేఅంత వరకూ నాకు తెలియదు పార్టీ ఉందని ..10 నిమిషాలు ఉందనగా చెప్తారు అన్నమాట ,మిగిలిన వాళ్ళకు వారం రోజుల ముందే తెలుసు పార్టీ అని..అదన్నమాట కోపం వచ్చేది మొదట్లో ..తరువాత తరువాత అది ఆయన అలవాటు అని అర్ధం చేసుకున్నాను ...

నేస్తం చెప్పారు...

వర్మ గారు రఘు గారు మీ అభిమానానికి చాలా థేంక్స్ అండి :)

నేస్తం చెప్పారు...

సునీత గారు థేంక్స్ అండి
అఙ్ఞాత గారు లడ్డు,మైసూర్ పాక్ లు సంసార చక్రాల లాంటివా ..ఏం చెప్పారండీ :)

నేస్తం చెప్పారు...

శృతి గారు నాకూ మీకొచ్చిన డవుటే వచ్చింది..నిజానికి మగవాళ్ళ మనసు తెలుసుకోలేము..ఇది నిజం అన్నమాట ..మా ఆయనే సాక్ష్యం

సుజ్జి చెప్పారు...

... ఆ చల్లని చూపుకి నాకు అర్ధం తెలుసు ...నోరు మూసుకుని కూర్చో అని.. :))))

very very well written..!!

పద్మ చెప్పారు...

నేస్తం,

మీ సహనశీలతకి సాటి లేదు నేస్తం !

మీరు నమ్మరేమో, మా అన్నయ్య ప్రాణ స్నేహితుడికి ఈ మధ్యే పెళ్ళయ్యింది ! వాళ్ళ ఆవిడ ( సినిమాకెళ్ళాలి అన్నా, షికారుకెళ్ళాలి అన్నా) వారం ముందు చెప్తే కాని బయలుదేరదుట !

మీరంటే సర్దుకుపోదాం రండి ,అంటున్నారు కానీ...మీ ఆయనకీ అలాంటి అమ్మాయి భార్య అయ్యి ఉంటే .... ! :-)

హేమిటో ఈ కాలం కుర్రాళ్ళు విడ్డూరంగా కలహాలు చూసి పెళ్లి చేస్కోవాలి అనిపిస్తుంది అంటున్నారు ! :-))

నాకు మటుకు చదివితే బ్రహ్మచారి(ణి) జీవితం అంత హాయి లేదు అనిపిస్తోంది ! పెళ్ళంటే భయం కూడా వేస్తోంది !

MIRCHY VARMA OKA MANCHI PILLODU చెప్పారు...

ayyababoo emi rsaru andii tapa chaala bagundi. kani ala mgavallani ala tittadame konchem bada ga undi andii papamu kada andi ala antamuu magavarinii.

Please watch my latest posting

నీహారిక చెప్పారు...

నేస్తం గారు,
నేను నిన్న జ్యోతి గారు చెప్పిన చిట్కా అమలుచేయడానికి వెళ్ళి ఒక సరదా సన్నివేశంలో ఇరుక్కుపోయాను.దాని గురించి తర్వాత పోస్ట్ లో చెపుతాను.మీ comments కి reply ఇవ్వడానికి నాకు నిన్న కుదరలేదు.ఈ రోజే మీ పోస్ట్ చూసాను.మీరు చాలా బాగా వ్రాస్తారు.మీరు వైవాహిక సంబంధాలని positive way లో చూపించి దాంపత్యవిలువని పెంచటానికి ప్రయత్నిస్తున్నారు.నేను negative way అయినా కూడా ఎలా సర్దుకుపోవాలో చెప్పదలచుకున్నాను.
మనిద్దరి దారులు వేరైనా గమ్యం ఒకటే.భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడమే.అందుకే ఇద్దరం ఒకేసారి ఒకే పోస్ట్ వేసామేమో!

నేస్తం చెప్పారు...

సుజ్జి థేంక్స్ :)
పద్మ గారు మీరు భయపడటం లో తప్పులేదు ప్రస్తుతం చాలా మంది వైవాహిక జీవితంలో గొడవలు మరీ తెగే వరకు వస్తున్నాయి అటువంటి వన్నీ చూసి భయ పడకండి,అందరి జీవితాలు అదేమాదిరి ఉండవు...కాకపోతే తెగేవరకు లాక్కోకోడదు ..
నిజానికి నూటికి 80 % మగవారు తమ భార్య అమాయకం గా కొంచెం అల్లరిగా ,తను ఏది చెప్పినా ఇంతలేసి కళ్ళు వేసుకుని అవునా మీరెంత గ్రేటండి అనేటట్లు ఉంటే ఇష్టపడతారు,అలాగే ఆడ పిల్లలు తమను చిన్నపిల్ల మాదిరి లాలించాలని ,ఎంతో ప్రేమించాలని,గారం గా చూడాలని కలలు కంటారు...కాని మేము అబలం కాదు సబలం ,నిన్నగాక మొన్న వచ్చిన వాడిదగ్గర బేలగా మొహం పెట్టడం ఏంటీ ఎందులో తక్కువ, మేము మాత్రం సంపాదించుకోవడం లేదా అని అమ్మాయిలు, ఏడ్చింది దీన్ని నేను బ్రతి మాలడం ఏంటి ,కో అంటే బయట కోటిమంది దొరుకుతారు,నన్ను కాదని ఇదెలా బ్రతుకుతుంది నేనూ చూస్తాను అని అబ్బాయిలు బీష్మించుకుని కూర్చుంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే
వివాహ బంధం లో భార్యా భర్తలు ఒకరు మరొకరికి అనుకూలం గా ఉన్నట్లు ప్రవర్తిస్తూ తమకి అనుకూలంగా చేసుకునే టెక్నిక్ నేర్చుకోవాలి

నేస్తం చెప్పారు...

నీహారిక గారు మనసులో మాట చెప్పారు,నిన్న మీ పోస్ట్ చదివాను చాలా బాగా నచ్చింది ,మీరన్నట్లు ఒకే మాదిరిగా ఆలోచిస్తున్నాం :)
మిర్చిగారు తప్పకుండా చదువుతాను ధన్య వాధాలు :)

Ram Krish Reddy Kotla చెప్పారు...

నేస్తం మీకు నా బ్లాగ్ ఎందుకు ఓపెన్ అవడం లేదో నాకు తెలియలేదు...నేను తర్వాత చాలా సార్లు ఓపెన్ చేశా తర్వాత...ప్రతి సారీ ఓపెన్ అయింది...బహుశా అపుదేదో టెక్నికల్ ప్రాబ్లం ఏమో...హహ ప్రాబ్లం ఏంటో తెలియనపుడు ఈ "టెక్నికల్" పదం బాగా ఉపయోగ పడుతుంది...ఈ సారి ఓపెన్ చేసి చుడండి...ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది..దానికి ఇందాక క్లాస్ పీకాలెండి "మా నేస్తం ఓపెన్ చేస్తే , ఓపెన్ అవ్వవా...ఎంత దైర్యం నీకు !!" అని ..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం,
పైన మీరు పద్మగారికి ఇచ్చిన వివరణ నాకు బాగా నచ్చింది. ఎంత పురుషులతో సమానంగా అమ్మాయిలు ఉన్నప్పటికీ వివాహభందంలో మాత్రం మీరన్నట్టు ఉంటే ఎంతో బావుంటుంది. కొంతమంది భర్తలు అలాంటి ప్రవర్తనను అలుసుగా,చేతకానితనంగా తీసుకుంటారు. అప్పుడు మాత్రం బెట్టింగ్ చేస్తేనే వారు దిగి వస్తారు. అసలు విషయం చెప్పటం మరిచా...మీ టపాలు వివాహభందం పట్ల నాలో కాస్త సానుకూలదోరణిని పెంపొదిస్తున్నాయి.

జాహ్నవి చెప్పారు...

నేస్తం గారు బాగా వ్రాశారు.
ఇప్పటికి నేను 4 సార్లు కామెంట్ వ్రాశాను. ప్రచురించేసరికి ఏదో ఒక సమస్య వచ్చింది.
కష్ట పడి పెద్ద కామెంట్ వ్రాశాను నాలుగు సార్లూ. మీ టపా చదివినప్పుడు కూడా నాకు ఇంత టైమ్ పట్టలేదు. అసలే తెలుగు సరిగా రాదు టైప్ చేయడం.
కానీ పెళ్లి అయితే మరీ ఇంత గొడవలు వస్తాయా అండి. ఇంత చిన్న చిన్న విషయాలలో కూడా...??????

సృజన చెప్పారు...

భలే బాగుంది.

Shashank చెప్పారు...

"నిజానికి నూటికి 80 % మగవారు తమ భార్య అమాయకం గా కొంచెం అల్లరిగా ,తను ఏది చెప్పినా ఇంతలేసి కళ్ళు వేసుకుని అవునా మీరెంత గ్రేటండి అనేటట్లు ఉంటే ఇష్టపడతారు," - ఐతే నేను మిగితా 20% బాపతా? నాకు మాహా బద్దకం. విడమర్చి ఏదైన చెప్పలంటే అ "థ్రిల్" పోతుందని అనుకుంటా. సగం సార్లు క్లుప్తంగ చెప్తే మా ఆవిడకి అర్థం కాదు.. అంటే తప్పు నాది కూడాలేండి - నేనేం ఆలోచిస్తున్నానో తనకి తెలీదు కద.. ఆ background లేంది నేను చెప్పేది అర్థం కాదు.. మళ్ళా చెప్పమంటే ఎహే ఏదీ అర్థం కాదు అంటా - నూవేం ఆలోచిస్తున్నావో నాకెట్లా తెలుస్తుంది అంటుంది. ఇప్పుడు కొంచం బెటర్. ఇప్పుడైతే చెప్పకముందే అర్థం చేసుకుంటోంది. కాని ఎదైన సర్ ప్రైజ్ అంటే మాత్రం చచ్చానే ఏంటి ఏంటి ఏంటి అని చెప్పేదాక ఒదలదు. :)

"కో అంటే బయట కోటిమంది దొరుకుతారు,నన్ను కాదని ఇదెలా బ్రతుకుతుంది నేనూ చూస్తాను అని అబ్బాయిలు" - నిజంగా ఇలా ఉంటారా? సినిమాల్లో తప్ప నిజజీవితం లో ఇలాంటి వాళ్ళని నేను ఇంత దాకా చూడలేదండి. ఈ రోజుల్లో అమ్మయి ఐతే చాలు పెళ్ళికి ఒప్పుకుంటే చాలు అని కద అనుకుంటుండేది?

Kathi Mahesh Kumar చెప్పారు...

చాలాచాలాచాలా బాగుంది.

నేస్తం చెప్పారు...

కిషన్ నిన్న ఓపెన్ అయ్యింది మళ్ళీ ఈ రోజు లేదు ..Internet Explorer cannot display the webpage అంటుంది కవిత చాలా బాగుంది నిన్న చదివాను :)
శేఖర్ గారు మీరన్నది కూడా నిజమే మరీ అణీగిమణిగి ఉన్నా ప్రమాదమే .. రోగాన్ని బట్టి మందులా అన్నమాట ..మరీ చిన్న విషయాలు భూతద్దం లో చూడకుండా ఉంటే బాగుంటుంది
జాహ్నవి గారు హ హ భార్యా భర్తల మద్య ఆ పాటి గొడవలు లేకపోతే సంసారం మరీ బోర్ కొట్టేస్తుంది.. కాకపోతే మోతాదు మించకూడదు :) అయ్యో అయితే మీరు రాసిన వాఖ్యలు మిస్ అయిపోయానన్నమాట :(

నేస్తం చెప్పారు...

సృజన థేంక్స్ అండి
శశాంక్ మరి మీలా ఉంటారనే 80% అన్నాను .. :)
నిజ జీవితంలో అలాంటి వాళ్ళను చూడలేదా భలేవారండి..నాకు తెలిసిన చాలా జంటలు ఈ రకం గా కొట్టుకునేవారే ..ఇద్దరు అయితే విడాకులు తీసేసుకున్నారు ..ఇంతా చేస్తే అన్నీ అర్ధం పర్ధం లేని చిన్న చిన్న గొడవలే ..
మహేష్ గారు థేంక్స్ అండి

వైష్ణవి హరివల్లభ చెప్పారు...

హహ నేస్తం. భలే ఉంది. చాలా రోజుల్నుంచి చదువుతున్నా కానీ వ్యాఖ్య రాద్దామంటే బద్ధకం.

సర్లే ఇప్పుడు వచ్చాగా.

http://priyamainamaatalu.blogspot.com/2009/07/blog-post.html

ఆత్రేయ కొండూరు చెప్పారు...

చాలా బాగుందండి.. ఇంత పెద్ద టపానా అనుకున్నాను కానీ.. చదవడం మొదలెట్టాక.. కళ్ళు కాకతీయ ఎక్స్ప్రెస్సులాగా ఆలైన్ల వెంట పరుగెట్టింది. అభినందనలు. మధ్యలో మా మానేజరు వచ్చినా.. కాసేపాగి వస్తాను అని చెప్పి పంపేశాను. ఇలా ఉద్యోగాలకు ఎసరు పెట్టే టపాలు రాస్తే ఎలా గండీ..?.. ఐనా ఫర్వాలేదు.. ఉద్యోగానిదేముంది ఇంకోటి వస్తుంది.. ఇలాంటి టపాలు రావుగా.. మరోదాని కోసం వేచి చూస్తూ.. (ఉద్యోగం కాదులేండి. :-) .. మరో టపా.. )

అజ్ఞాత చెప్పారు...

మీరు చెప్పింది సబబే నేస్తం !

చిక్కెక్కడ అంటే, ఒక్కరు సరిగ్గా లేకపోయినా, ఎన్నాళ్ళని అవతలి వారే అస్తమానూ సర్దుకుపోతారు !

ఒకసారి ఒకరు, ఒకసారి మరొకరు సర్దుకుపోతుంటే, ఏ గొడవా రాదు !

ఊరికే ఒక్కరే నేట్టుకోచ్చేయ్యాలి ( లడ్డూ, మైసూరు పాకు ) అంటే, ఎవరికైనా విసుగు వస్తుంది ! - పద్మ

నేస్తం చెప్పారు...

వైష్ణవి ..ప్రియ మీరు అక్క చెల్లెళ్ళా ..హూం ..నాకు అర్ధం అయ్యేది కాదు ఇంతకు ముందు :) ఏంటా ఒకటే బ్లాగు రెండు పేర్లతో రాస్తున్నారు అనుకునేదాన్ని :)
ఆత్రేయ గారు థేంక్స్ అండి ..చక్కని కవితలతో అలరించే మీకు నా బ్లాగ్ నచ్చడం ఆనందం గా ఉంది \
పద్మ హ హ పెళ్ళి కాక ముందే ఇంత బాగా అన్నీ తెలుసుకున్నావ్..సో ఇంక నీకు ఎదురులేదు ,పెళ్ళి అయితే నెట్టు కొచ్చేయగలవ్ :)

తృష్ణ చెప్పారు...

నేస్తం ,బాగుందండి మీ పోస్టు.

అజ్ఞాత చెప్పారు...

నేస్తం, :-) :-) :-) అంతే అంటారా ? థాంక్యూ ! థాంక్యూ !

ఎవరూ పోస్టుని చూసి ఫోటో గురించి చెప్పలేదు, ( అంత బాగా పోస్టితే అంతే మరి ) ఫోటో రవి వర్మదే కదా ? చాలా మంచి సెలక్షన్, మీరు పెట్టే ఫోటోలు కూడా చాలా బాగుంటాయి !
-పద్మ

పరిమళం చెప్పారు...

హమ్మో ...మరీ అంత అలకా ? అదీ పెళ్ళయిన కొత్తలో ...ఇప్పుడు రివెంజ్ స్కీములేమన్నా ........:) :)

అజ్ఞాత చెప్పారు...

waiting for your next post ma'am !

నేస్తం చెప్పారు...

తృష్ణ గారు ధన్యవాదాలు
పద్మ గారు :) అంతే అంతే
అఙ్ఞాత గారు (పద్మ?)త్వరలోనే రాస్తాను :)
పరిమళం గారు నేను వదిలేస్తానా మరి బొలేడు సార్లు బోలెడన్ని పగలు ,ప్రతీకారాలు తీర్చేసుకున్నాను దెప్పేసి :)

సీత చెప్పారు...

Hello peru teliyani padaharanala adapaduchu garu,
Me posts chala chala bavunnayi.. na colleague nachuthundemo choodu ani ichina link ni chadivi nenu lunch antha vaallani me kathalu cheppi champesanu.. annitikante ekkuva me telugu chala bavundi.. edo pakkintlo jaruguthunnatu undi.. Mimmlani ee blog dwara kalasinanduku chala santhosham ga undi :)

........................ చెప్పారు...

:-)

నేస్తం చెప్పారు...

joy గారు మీకు నా బ్లాగ్ నచ్చినందుకు థేంక్స్ అండి ,మీకు లింక్ ఇచ్చిన ఫ్రెండ్ ఎవరు అండి తనకి కూడా థేంక్స్ :)
సౌజన్య కుమార్ గారు :)

సీత చెప్పారు...

padaharanala TELUGU adapaduchu garu :D Telugu ni marchipoyanu madhyalo.. ha ha ha ha ha ! Mee peru entandi.. nestham ani naku pilavalanipinchatledu.. na peru kooda bujji ne :)

s.Aditya చెప్పారు...

బ్లాగ్ చాలా బావుంది నేస్తం గారు, ఎప్పటి నుంచో కామెంట్ రాద్దాం అనుకుంటున్నా,
ఈ రోజుకి ఓ చిన్న వాక్యం రాస్తున్నాను.
చాలా బావున్నాయి మీ టపాలు అన్నీ, మొదట్లో మీ పోస్ట్స్ చదివి..,
ఇంత మంచి జ్ఞాపకాలు దాచుకున్న అమ్మాయినీ చేసుకుంటే లైఫ్ ఎంత బావుంటుందో అనిపించేది...
తర్వాత మీ పోస్ట్స్ చూసి అయ్యో...!
మనం వెళ్ళాల్సిన రైలు ఓ జీవిత కాలం పాటు లేట్ అని ...సారీ ముందు అని...
వి ర మిం చు కు న్నా ను.....

మీ రచనలు అన్నీ ఇట్టే కళ్ళకు కట్టినట్లు వుంది మనసుని హత్తుకుంతున్తున్నాయి .

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

చక్కగా రాశారు. :)

నేస్తం చెప్పారు...

నేస్తం అనే మాట నచ్చలేదా ఎంత మాట అనేసారు jOY గారు, ఈ మద్య కాలం లో నేను ఈ పేరు కి ఎంత అలవాటు అయిపోయానంటే ఎవరు నేస్తం అని రాసినా అది నన్నే అనేసుకుంటున్నాను :)
s గారు మీ రైలు కరెక్ట్ గానే వెళుతుంది ,మీ అభిప్రాయాలకు తగిన మంచి మనిషి భార్యగా వస్తుంది,దూరపు కొండలు నునుపు అని మా ఆయనకు నేను తప్ప ఊరిలో అందరు అమ్మాయిలూ చాలా మంచిగా అనిపించేస్తుంటారు ,అదన్నమాట అసలు సంగతి :)
విజయ్ గారు ధన్యవదాలు :)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,దూరపు కొండలు నునుపు తో పాటు, పొరుగింటి పుల్లకూర ఎంతో రుచిగా ఉండునులే syndrome ఇది అని కూడా చెప్పొచ్చు ! ;-)
నాకు తెల్సిన ఒకాయన ఇలా చెప్పారు: getting married is like going to a restaurant with your friends ! You look at the menu, you order something, then you look at what the other people have ordered, and you wish, you ordered that ! And then, just like others cellphones have more features than your's, but you're fine with it, you happen to like what you've anyway, and live with it ! బాగా చెప్పారు కదా ! మీ నెక్స్ట్ పోస్ట్ కోసం కళ్ళు కాయలు కాచేస్తున్నాయి ఇక్కడ ! :-) అన్నట్టు ఎవరు అజ్ఞాతగా రాసినా, నేనే అనేస్కుంటున్నారు మీరు ! - పద్మ

హను చెప్పారు...

చాలా బాగా రాశారు, ఇప్పుడే మీ బ్లాగూ చూశాను,మొదటిసారి చాలా బాగుంది.నిజంగా ఒక అమ్మాయి భావాలు చాలా బాగా చెప్పారు.

నేస్తం చెప్పారు...

padma :)
hanu గారు ..థేంక్స్ అండి :)

అజ్ఞాత చెప్పారు...

GREAT ONE!
GREAT EXPRESSION!

అజ్ఞాత చెప్పారు...

chala bagundandi ... maa potlatalu kuda gurthochayi idi chaduvuthunte ... :-)
Chakkati telugu lo chala baga rasaru ...

రామ చెప్పారు...

మీ పోస్టులు అన్నీ రెండు వేల ఎనిమిది నుంచీ నరుక్కుంటూ (చదువుకుంటూ) వస్తున్నానండి. ఈ పోస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఉత్తినే చెప్పెయ్యగలిగే ఒక వాక్యానికి కాసిన్ని చెమ్కీలు అద్ది చెప్పే పద్ధతి నాకు చాలా నచ్చుతుంది - నేను కూడా అలా ప్రయత్నిస్తూ ఉంటాను. "స్నానం చేసి కూర్చోగానే మా అత్తగారు వచ్చారు అమ్మాయి ఏమి చేస్తున్నావు అంటూ" బదులు " హాయిగా స్నానం చేసి అది కట్టేసుకుని ఆంద్ర జ్యోతి పత్రిక తిరగవేస్తుంటే మా అత్తగారు నా గదిలో కొచ్చారు అమ్మాయ్ ఏం చేస్తున్నావ్ అనుకుంటూ" వ్రాసారు కదా.. అలా.