
నేనూ,మా అక్క ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ మా ఇద్దరికీ ఏ విషయం లోనూ ఒకే అభిప్రాయం ఉండేది కాదు,ముఖ్యం గా డబ్బు విషయం లో అస్సలు లేదు... నేను చిన్నప్పటి నుండి మహా పొదుపు ( అంటే మావాళ్ళు కాస్త వక్రీకరించి పిసినారి అనేవాళ్ళు గాని అది ముమ్మాటికీ పొదుపే అన్నమాట ,మీరు వాళ్ళలా అస్సలు అలా అనుకోకండి,సరేనా ) అలా పొదుపుగా ఉండడానికి ఒక కారణం ఉంది , అది ఏంటంటే నేను ఎప్పుడు మా అమ్మా, నాన్నలు మాట్లాడుకోవడం విన్నా ఆ సంభాషణ ఇలా ఉండేది..
అమ్మ: ఏమండీ ఈ నెల ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ కావాలి ఖర్చులకి,మా తమ్మూడి కూతురు ఫంక్షన్ ,ఏదో ఒకటి కొనాలి ..
నాన్న :మొన్న 3000 ఇచ్చాను కదా, అందులో ఏం మిగల లేదా??
అమ్మ: ఇంకేం 3000 బాబు.. ఎప్పుడో అయిపోయాయి మీ పిల్లలకు పండగలకు డ్రెస్సులు కొనద్దా ..పాపం వాళ్ళకు సంవత్సరానికి కొనేదే రెండు జతలు, మద్యలో పండగలకు పుట్టినరోజులకు కొనేదే ఉండదు ..
నాన్న: మరి అంతకు మొన్న 1000 ఇచ్చాను అది??
అమ్మ: ఇంకేం వెయ్యి మీ పెద్దమ్మ గారి అమ్మాయి ఇంటికి వస్తే వాళ్ళకు బట్టలు పెట్టాము కదా
నాన్న: మరి అంతకు ముందో వెయ్యి ఇచ్చాను కదా ... ( ఈ సారి అమ్మకు కోపం ఒక రేంజ్ లో వచ్చేది )అంటే నేనేమన్నా తినేస్తున్నానా అలా అడుగుతారు ,మొన్న ఫలానా వాళ్ళ పెళ్ళి కి చదివింపులు అందులోనుండే ఇచ్చాను, మొన్న చుట్టాల తాకిడికి విపరీతమైన ఖర్చు ,ఈ నెల గ్యాసు ఇట్టే అయిపోయింది పైగా చలికాలం వేడి నీళ్ళూ కూడా కాయాలి కదా ,మీకందరికీ ఎసర్లులా మరగకపోతే స్నానం చేసినట్లే ఉండదాయే... మీకేమో లుంగీలూ సరిపోవడం లేదని రెండు తీసుకున్నాను .. కనీసం నా కోసం ఒక్క చీరన్నా కొనుక్కున్నానా ,ఆ విషయం అసలు అడిగారా మీరూ.. అంతేలేండి మీ వాళ్ళు అంటే పరిగెట్టుకుని అడగక పోయినా సరే అన్నీ చూస్తారు ఏటొచ్చీ మా వాళ్ళేకదా పై వాళ్ళూ ,,అక్కడ మాత్రం బాగా లెక్కలు అడుగుతారు ..వాళ్ళు మీకు ఎంత చేసినా అంతే .. (ఇంక కళ్ళ నీళ్ళు జర జర వచ్చేసేవి )..
నాన్న: అయ్యబాబోయి ఇప్పుడేమన్నానే బాబు ఈ నెల ఖర్చు విపరీతం గా ఉంది అందుకే అన్నాను సరేలే ఇస్తాను .. ఏంటో ప్రతి నెలా ఖర్చు పెరుగుతుందే కాని తగ్గడం లేదు ..
ఈ టైపు లో ఇంచుమించుగా ఇదే మాట్లాడుకోవడం విని విని మా నాన్న మీద విపరీతమైన జాలి వచ్చేసేది..అయ్యో పాపం ఎన్ని కష్టాలో కదా పైగా ఇంత మంది ఆడపిల్లలం ..మా చదువులు ,పెళ్ళీళ్ళు ఎలా చేస్తారో అనే భయం వల్లో మరొకటో తెలియదు కాని డబ్బులు అస్సలు ఖర్చు చేసేదాన్ని కాదు .. ఇంటికి చుట్టాలొచ్చినా, ఎవరన్నా ఏదన్నా కొనుక్కోమని డబులిచ్చినా అస్సలు ఖర్చుపెట్టేదాన్ని కాదు ..మిగిలిన వాళ్ళు అయిస్ క్రీములూ అని డ్రింకులని కొన్నా నేను అహనాపెళ్ళంట కోటా లాగా చూసి ఆనందపడిపోయేదాన్ని ,పైగా మనం మున్సిపల్ స్కూల్ విధ్యార్ధినులం కాబట్టి పుస్తకాల విషయం లో కూడా ఖర్చు చెప్పేదాన్ని కాదు ...అక్క, చెల్లెళ్ళ పుస్తకాల్లో మిగిలిన పేపర్స్ చింపేసి బైండింగు చేసుకుని మరీ రాసేదాన్ని కాని నాన్నను డబ్బులు అడిగేదాన్ని కాదు ...ఇవన్నీ కాక నాకు మరొక గొప్ప సులక్షణం ఉంది ... నేను దాచిన డబ్బులు నాకోసం కొనుక్కోను ..పెళ్ళికి ముందు మా నాన్నకి పెళ్ళయ్యాక మా ఆయనకు ఎవరికో ఒకరికి ఇస్తానుగాని నాకోసం కొనుక్కోబుద్ది కాదు ..ఇదేం అలవాటో నాకు అర్దం కాదు ...కాకపోతే వాళ్ళు ఆ డబ్బులను సద్వినియోగం చేయాలన్నమాట ..మొన్న ఎంతో కష్టపడి కూరలకిచ్చిన డబ్బులను కొంత దాచి ఒక 600 $ మా ఆయనకిస్తే ఎంచక్కా రాత్రికి ఒక క్రికెట్ బేట్ ,బాల్స్ చెత్త చెదారం కొనేసి వచ్చేసారు.. దెబ్బకి కుక్కలా ఏడ్చాను అదివేరే విషయం అనుకోండి..
సరే డబ్బు విషయం లో నేను ఇలా ఉంటే మా అక్క నాకు పక్కా వ్యతిరేఖం ...ఈ రోజంటే చిరంజీవి ప్రేమే లక్ష్యం ,సేవే మార్గం అంటున్నాడు గాని అది ఒక పదిహేనేళ్ళ ముందే ఈ స్లోగన్ ని బట్టీపట్టేసింది ... వాళ్ళ స్కూల్ లో ఎప్పుడూ రెడ్ క్రాసు ,బ్లూక్రాసు అని ఏంటో ,ఏంటో తెగ ఉండేవి ..అందులోనూ ఇది లీడర్ ఒకటీ .. దీనిపని ఏంటంటే ఎప్పుడూ డబ్బులు వసూల్ చేయడం అవి వాటికి జమ చేయడం .. ప్రొద్దున లేస్తే.. నాన్నా దానికి చారిటి ఇవ్వండి, దీనికి డబ్బులు ఇవ్వండి అని ఒకటే గొడవ.. ఇంట్లో ఎక్కడన్నా డబ్బులు దొరికాయంటే చాలు ఎవరివి ,ఏంటి అని అడిగేది కాదు తీసుకువెళ్ళీ వాటికి ఇచ్చేసేది .. దీని బాధ పడలేక నా డబ్బులు పిల్లి ముప్పై మూడు ఇళ్ళల్లో తన పిల్లలని దాచినట్లు నేనూ అలా దాచుకోవలసి వచ్చేది .. అంతటితో ఆగేదా ,విపరీతమైన దాన ధర్మాలు.. అమ్మ ఒకసారి షాప్ కి వెళ్ళి ఏదో కొనుక్కు రావే అని డబ్బులిచ్చి పంపితే దారిలో అడుక్కుంటున్న ముసలావిడకు ఇచ్చేసి వచ్చేసింది.. ఇంటికెవరన్నా వచ్చి అడుక్కుంటే వాళ్ళకు అన్నం పెట్టీ పంపేవరకూ ఊరుకునేది కాదు ..ఒక సారి ఇలాగే మండుటెండలో ఒక సోది చెప్పే అమ్మాయి చిన్నపిల్లను వేసుకుని వెళుతుంటే ..ఆవిడకు చిన్న పిల్లను అలా కష్ట పెట్టద్దు అని దారంతా బుద్దులు చెప్పి ఇంటికి తీసుకొచ్చి మరీ అన్నం పెట్టి పంపింది ..ఆవిడ వెళీపోతూ వెళిపోతూ రెండు జతల చెప్పులను కూడా తీసుకు పోయింది అక్కడ పెట్టినవి..(అంటే ఆ అమ్మాయి వచ్చేటప్పటికి ఉన్న చెప్పులు వెళ్ళగానే మాయం అయిపోయాయి ..వేరే చాన్స్ లేదు ...ఒకవేళ ఆమే కాక పోతే పాపం శమించు గాక )
సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు మరొక జలక్ ఇచ్చేది అడపాదడపా... రాత్రిళ్ళు పడుకునేటప్పుడు ఇలా చెప్పేది.. మెరుపు కలలు సినిమాలో కాజోల్ లాగా కన్నే మేరి మాతయో ఏదోనమ్మా అది అయిపోతాదట .. అలా అయిపోయి పేదలకు,దీనులకు సేవ చేస్తుందట..అందుకని ఆ సంవత్సరం కాంగానే బస్ ఎక్కి అక్కడెక్కడో ఏదో సేవాసదన్ ఉందిట అక్కడకు వెళ్ళి సేవ చేసి తరిస్తా అనేది ..ఇక చూస్కోండి నాకు అలా ఇలా భయం వేసేది కాదు .. అది కాదక్క సేవ ఇక్కడ నుండి కూడా చేయచ్చు కదే అంటే.. నన్ను పెద్ద అఙ్ఞానిని చూసినట్లు చూసి ఆగ్నస్ ఇలాగే అనుకుంటే మధర్ ధెరిసా అయిఉండేదా ..మంచిపనులు చేయాలంటే ఇంట్లో నుండి చేయలేం అని ఒక గంట క్లాసు పీకి అమ్మావాళ్ళకు ఇవేమి చెప్పద్దు వాళ్ళను నువ్వే చూసుకోవాలమ్మా అని రెండు పెద్ద పెద్ద డయిలాగులు చెప్పి ఎంచక్కా దున్నపోతు లా పడుకునేది.. ఇక నేను జాగారమే రోజూ ఇదెక్కడ వెళ్ళిపోతుందో అని రాత్రిళ్ళు పడుకునేదాన్ని కాదు ..పగలు పొద్దెక్కేవరకు లేవకుండా నానా తిట్లు తినేదాన్ని ....
మా అక్క అంటే మా ఇంట్లో అందరికీ మహా ఇష్టం ..నాన్నకు మరీనూ ...మీ అందరికన్న ముందు ఇదేరా నాన్న అని పిలిచింది అని తెగ మురిసిపోయేవారు.. అది ఆడింది ఆట ,పాడింది పాటలా ఉండేది.. పాపం ఆ పెద్ద కూతురు బిరుదువల్లే దాని చదువు మద్యలోనే అటక ఎక్కేసింది.. ఒక సారి మా తాతగారు (అమ్మ నాన్న) హడావుడిగా ఒక సంబంధం తీసుకు వచ్చారు .. అప్పుడే నా కూతురికి పెళ్ళి ఏంటి నేను చేయను అని మా నాన్న ... అదెలా కుదురుతుంది వెనకాలా ఇంకా ఉన్నారు.. మంచిది వచ్చినపుడు వదులుకోకూడదు ..అబ్బాయి కి బోలెడు ఆస్తి ,మంచి వ్యాపారం.. చదువు దేముంది .పిల్ల సంతొషం గా ఉండాలి గాని, మొన్న రెండోదాన్ని చూసే మా ఊర్లో నీకు ఇంత పెద్ద మనవరాలు ఉందా అని తెగ ఆక్చర్య పోయారు అని ఒకటే ఊదరకొట్టేసి పాపం మా నాన్నను హడలెత్తించేసారు.. ఇంకేంటి కట్ చేస్తే మా అక్క పెళ్ళీ ఘనం గా జరిగిపోయింది ...
మా ఇంట్లో అక్క పెళ్ళికి మేము పెట్టుకున్నంత బెంగ ఇంకే మిగిలిన ఆడపిల్లల మీద ఎవరూ పెట్టుకోలేదు... తాళి కడుతున్నపుడు ఇంక మీ ఇంటి ఆడపిల్ల వారి ఇంటి పిల్ల అయిపోయింది, ఇంటిపేరుతో సహా ఇక మీ ఇంటికి సంభందం తెగిపోయింది అని ఎవరో అనంగానే ...నాన్న బాధ ,మా బాధ వర్ణించలేము ... ఎన్ని రాత్రిళ్ళు పడుకోలేదో నేను అయితే ...అందరం ఒకే సమయాని అన్నం తినడం అలవాటేమో పొరపాటున దానికి కూడా అన్నం వడ్డించేసి కళ్ల నీళ్ళు పెట్టుకునే వాళ్ళం.. నాన్న సంగతి చెప్పనక్కరలేదు అంతా మీ నాన్న వల్లే .. నా కూతురిని నా నుండి వేరుచేసాడు అని అమ్మ మీద చూపించేసేవారు .. అందులోనూ అక్క వెళ్ళే ప్రతిసారి నాన్న!!అక్కడ ఎవ్వరూ నాకు తెలియదు.. ఉండలేకపోతున్నా ..నన్ను పంపకండి నాన్న ..చాలా దిగులేస్తుంది అనగానే.. పైకి.. అదేం లేదమ్మా ..అలవాటు అయిపోతుంది ..అమ్మ చూడు నీలాగే వచ్చేయలేదా అని సర్ది చెప్పి పంపి వెక్కి వెక్కి ఏడ్చెవారు .. పైగా అక్క కూడా చిన్నపిల్లఏమో అప్పటికి , దాని లెటెర్ అంతా నాన్న,నాన్న ఎప్పుడొస్తావ్ నన్ను మన ఇంటికి ఎప్పుడు తీసుకువెళతావ్ అని చాలా దిగాలుగా రాసేది ...
అయితే తరువాత తరువాతా మెల్లిగా అక్కడిపరిస్థితులు అలవాటు పడినా దాని మాటల్లో చెప్పినపుడు చాల బాధ అనిపించేది.. మా అక్క అత్తవారింట్లో మహా పొదుపు.. మహా అంటే మహా అన్నమాట :) ఇక్కడ అమ్మగారు పిల్టర్ నీళ్ళు తప్ప వేరే నీళ్ళతో మొహం కూడా కడిగేది కాదు ..అక్కడ తాగేది కూడా ఆకులు అలములూ పడిపోయి ఉన్న బావి నీళ్ళాయే .. అప్పటివరకూ డ్రెస్సులలో చిన్నపిల్లలా అటు ఇటు తిరిగే పిల్ల ఒక్క సారిగా బారెడు బారెడు చీరలు కట్టుకుని ఆరిందలా కుటుంభ బాధ్యతలు అన్నీ దానివే అయిపోయినట్లు వచ్చేవారికి ,వెళ్ళేవారికి మర్యాధలు పలకరింపులు ఇలా చాలా మార్పు వచ్చేసింది దానిలో ..
అయితే పెళ్ళి అయిన చాలానాళ్ళవరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ... మొన్నామద్య పట్టుబట్టీ వాళ్ళీంటికి తీసుకు వెళ్ళింది ..వాళ్ళ ఇంటి ముందే షాప్ చేసి చాల చక్కగా టక టక మంటూ అటు పనులు, ఇటు షాప్ చక్కబెట్టుకుంటున్న అక్కను చూసి మా అక్కేనా అని ఆక్చర్యపొయాను .. ఇల్లు చక్కగా పొందికగా పెట్టుకుంది అన్నీ చూస్తూ అక్కడ కృష్ణుని మెడలో వేసిన ఇత్తడి పూసల లా ఉన్న హారం చూసి ఇదేంటే ఇలా వెలిసిపోయిన హారం వేసావ్ అన్నాను.. అది చూసి అడక్కేబాబు ఏడుపు వరదగొదావరిలా పొంగుకొస్తుంది దాన్ని చూస్తే అంది .. ఏం అంటే.. ఆ మద్య ఒక సోది అమ్మాయి వచ్చీ వద్దు మొర్రో అని అంటున్నా మొహమాట పెట్టేసి సోది చెప్పిందంట ,దాని సారం ఏంటంటే దీని ఇంటికి సిరి రాబోతుంది అంట ..కాని గ్రహబలం వల్ల ఇది వాటిని అందుకోలేకపోతుంది అంట అని ఏదో ఏదో చెప్పింది అంట ....అంతకు ముందు మా బావా ఏదో క్రికెట్ మేచ్ విషయం లో బెట్ కాయాబోతే ఎందుకులే మనకు అని ఇది బలవంతం గా ఆపేస్తే చాలా మొత్తంలో లాభం ఆగిపోయిందంట .. ఇలా రెండు,మూడు జరిగాయి అంట ... అయితే మా అక్క ఇదంతా సోదిలే యాదృచ్చికం అని కొట్టి పడేసి మర్చిపోయిందంట కాని ఆ రోజునుండి ఒకటే కలలు ఇంటినిండా బంగారం ,బంగారం ....నన్ను కాదనకు అని... ఇదేంటా ఇలా వస్తున్నాయి అని అనుకున్నాకా.. ఒక నొక ముహుర్తాన ఒక అతను వచ్చీ ఏమండీ మీవారు ఉన్నారా అని అడిగి బయటకు వెళ్ళారని తెలుసుకున్నాక తెగ బాధ పడి ..మా ఇంట్లో తరతరాల నుండి ఉన్న కొన్ని నగలున్నాయండి ...ప్రస్థుతానికి చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం ..కాబట్టి వాటిని అమ్మకానికి తీసుకు వచ్చాను ... బయట అమ్మజూపితే పురాతన నగలు కాబట్టి నన్ను అనుమానించే అవకాశం ఉంది అని ఇంకేంటో ఏంటో చెప్పి ఇది ఆకు రాయి దీని మీద గీటు పెడితే బంగారమో కాదో తెలిసిపోతుంది అని మా అప్పలమ్మకు మరి ఏ విధం గా చెప్పాడో తెలియదు మొత్తానికి నమ్మించేసేడు.. ఇది వాళ్ళయనకు పోన్ చేసి చెప్పిందంట .. అసలే మా బావ గారు ఇలాంటి విషయాల్లో చాలా ఆలోచిస్తారు.. వద్దు వద్దు అని చెప్పినా మా అక్కకి ఆ సోది ఆవిడ,కలలు , సూచనలు అన్ని గుర్తు వచ్చేసి ..అమ్మ బాబోయి మనం చాలా నష్ట పోతాం ఇది తీసుకోకపోతే,.. లేకపోతే విచిత్రం కాక పొతే ఇన్ని సూచనలా అని వినకుండా ఒక పదివేలు ఇచ్చి ఒక హారం తీసుకుంది అంట ..వాడు వెళ్ళేవరకూ చేతిలో తళ తళా మెరుస్తుంది అంటా అలా వెళ్ళగానే ఇంకేంటి ...అంతా విష్ణు మాయ అయిపోయింది ...
అంతా విని నేను నోరు వెళ్ళబెట్టి అలా ఉండిపోయాను..అక్కా నువ్వు నువ్వేనా... మూఢనమ్మకాలను ఖండ ఖండాలుగా ఖండించిపారేసే నువ్వా ఈ పని చేసింది .. డబ్బు కంటే సేవా,ప్రేమా,దయ ,కరుణ ,కారం,ఉప్పు,చింతపండు ముఖ్యమని క్లాసుపీకే నువ్వా ఈ పని చేసింది ,అని బోలెడు ఆక్చర్య పోతుంటే ... అలా మళ్ళీ మళ్ళీ గుర్తుచేయకే బాబు.. టైమే టైము ... ఇదే ఇంకొకరికి జరిగితే నీకంటే ఘాటుగా వాళ్ళను తిట్టిపడేసేదాన్నీ.. ఇలా ఎలా చేసారు అని తెగ ఆక్చర్యపడిపోయేదాన్ని ... ఇంకా నయం ఎప్పుడూ ఇంట్లో వ్యాపార పని మీద ఒక యాబై వేలు తక్కువ కాకుండ ఇంట్లో పెట్టేవారు ఆయన ..ఆ రోజు నా అదృష్టం.. తక్కువే ఉన్నాయి.. అమ్మో, మా ఇంటి ఎదురుగా ఉన్న గుడి అమ్మవార్లే కాపాడారు .. లేకపోతే అదెవరో నాకేదో చెప్పడమేమిటీ,నాకు కలలు రావడం ఏమిటీ ,నేను ముందు వెనుకలు ఆలోచించకపోవడం ఏమిటీ ...అయినా ఇంత స్వార్ధం నాకు ఎక్కడినుండి వచ్చిందో ..లేక వాడి మాటల గారడీనో ..మొత్తానికి ఇదీ కధ .. హుం అందుకే మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఎదురుగా పెట్టుకుని ఈ గొలుసు మరీ జాగ్రత్తగా ఉంటున్నా అంది...
కాలమహిమనా లేక పెళ్ళి తరువాత బాధ్యతల పేరుతో వచ్చే స్వార్ధమా మరేంటో కాని అలాంటి కన్ఫ్యూజ్ పరిస్థితి మాత్రం నాకు జరగకుండా చూడు స్వామి అని దణ్ణం పెట్టేసుకున్నా .. అసలే నేను పొదుపు మరి ...( మీరు వేరే అర్ధాలు తీయకండి మరి .. అది కేవలం పొదుపుమాత్రమే ..మీరు నమ్మాలి )