27, మార్చి 2009, శుక్రవారం

ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం రండి




అందరికీ ఉగాది శుభాకాంక్షలు .. చిన్నప్పటి నుండి నాకు అర్దం కాని ప్రశ్న ఉగాది పచ్చడి మీద అన్ని కార్టూన్లు ఎందుకని ..ఉగాది అంటే నాకసలు పచ్చడివల్లే ఎంత ఇష్టమో .. నిజానికి మా ఇంట్లో అమ్మతప్ప అందరూ చేసేవారు ..ఇంట్లో చేసే అవకాశం పాపం అమ్మకు అసలు ఇచ్చేవారే కాదు .. ఎందుకంటే ఉదయమే దాదాపుగా 10 కుటుంబాలనుండి పదిరకాల పచ్చళ్లు వచ్చేసేవి మా ఇంటికి ..

అందరికంటే ఎక్కువగా పంపేవారు మా రాజు పెదనాన్న గారి కుటుంబం ..ఆయన అసలు పేరు ఠాగూర్ రాజు ..రాజు పెదనాన్న గారికి మా నాన్నమ్మ యశోదలాంటిది అన్నమాట.. చిన్నపుడు మా పెదనాన్న గారు చదివే స్కూల్ లోనే ఆయనా చదివేవారంట .. పాపం వేరే ఊరిలో నుండి వచ్చి ఇక్కడ చదవడానికి చాలా కష్టం గా ఉండేదని మా ఇంటిలోనే ఉండిచదువుకుంటా అన్నారంట .. అప్పటికే గంపెడు పిల్లలతో నెట్టుకొస్తున్న మద్యతరగతి కుటుంభానికి ..కలిగిన రాజుగారి అబ్బాయి ని పోషించడం మాటలు కాదు .. కాని అవి ఈనాటి రోజులా ?? అంతకన్నానా బాబు అని మా నాన్నమ్మ ఆయనను కూడా మా ఇంటిలోనే పెట్టుకుని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు .. ఆ రకంగా మా వాళ్ళకు ఆయన ఇంటికి పెద్ద అన్నయ్య అయిపోయారు ..


అప్పటి నుండి ఆయన తల్లిగారు బ్రతికున్నంత కాలం వారి ఇంటిలో ఏం పండగ వచ్చినా ముందు పిండి వంటలు మా ఇంటికే వచ్చేవి.. అబ్బ జున్ను పాలు,కొబ్బరి బొండాలు,పాలు,పెరుగు ,కూరగాయలు ఒక్కటికాదు తెగ పంపేవారు ఆవిడ ..నిజం గా రాజులంటే రాజులే అన్నంత అందం గా ఉండేవారు వారి కుటుంభంలో సభ్యులందరూ.. మా రాజు పెదనాన్న గారి ముగ్గురు కూతుర్లూ అందానికి అపరంజి బొమ్మలే .. వారి మాటలు, నడక భలే హుందాగా ఉండేవి .. ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నంత అందం ..


ఆయనకు మా నాన్నమ్మ అంటే అపారమైన ప్రేమ ఉండేది.. తరచూ వారి పిల్లలతో ఇలా అనేవారు ..మా అమ్మ కూడా అంత బాగా చూడలేదేమో ..అలా చూసేది నన్ను ...తన పిల్లలకి పెరుగన్నం పెట్టి నాకు మాత్రం ఆంలెట్ ,కోడి కూరా వేసి పెట్టేది.. మళ్ళా ఏ రోజన్నా వండకపోతే తెగ అలిగే వాడిని.. అయినా కోపం తెచ్చుకోకుండా వండిపెట్టేది ... అని తెగ పొగిడేవారు ...అలాగే నాన్నను ,పెదనాన్నను మిగిలిన వాళ్ళను చూపి వీరురా నిజమైన అన్నదమ్ములంటే.. రాత్రిళ్ళు చలివేస్తే నాకు పరుచుకోడానికి, కప్పుకోడానికి మొత్తం దుప్పట్లు ఇచ్చి వాళ్ళు ఊరికే పడుకునేవారు .. అలా ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసారా అని చెబుతుంటే చాలా గర్వంగా ఉండేది మా వాళ్ళను చూసి ..


ఆయన ఇంటినుండి వచ్చిన ఉగాది పచ్చడి తినకుండా మాకు ఉగాది ప్రారంభం అయ్యేది కాదు .. పెద్ద పెద్ద కేన్లతో ఇంటిల్లపాదికీ సరిపడేంత పంపేవారు .. బోలెడన్ని పిండి వంటలతో సహా ... అవి కాక మా పిన్నులు ,ఇరుగు పొరుగు కూడా తెగ పంపేవారు .. కాని ఈ పెద్దోళ్లు ఉంటారే ఏది ఇష్టమో అది మాత్రం వద్దు అనే చెబుతారు .. ఎక్కువ తినకు మంచిది కాదు ,ఎక్కువ తినకు మంచిది కాదు అని ఒకటే నస మా అమ్మ...

కాని అన్ని రోజులూ ఒకలాగే ఉండవుగా.. తప్పు ఎవరిదైతే నేమి, రాజు పెదనాన్న మా ఇంటి గుమ్మం తొక్కనని శపధం చేసి వెళ్ళి పోయారు ..ఆ తరువాత వారి పిల్లల పెళ్ళికి పిలవలేదు ..మా పెళ్ళిలకు వారూ రాలేదు ..కాని ప్రతి కార్తీక మాసం వారి పొలంలో జరిగే వనభోజనాలు ,వారి అమ్మగారి ఆప్యాయత అన్నీ మరిచిపోలేనివి ..అక్కడ నాన్న వాళ్ళు ఒక చోట అందరూ సరదాగా పేకాట ఆడుతుంటే ,అమ్మా వాళ్ళేమో చిన్న పిల్లల్లా పాటలు , ఆటలు ఆడేవారు.. పిల్లలం అందరం రకరకాల పువ్వులు ,ఆకులు ,గోరింటాకు కోసుకునేవాళ్ళం .. ఎంత బాగుండేదో ...కాని ఎంత పంతం అంటే ఆయనకు ... చివరకు నాన్నమ్మ చనిపోయినపుడు కూడా రాలేదు .. పాపం చివరి రోజుల్లో ఆయనను తలుచుకునేది తను..అప్పటి నుండి వద్దు అనుకున్నా ఆయన మీదకోపం వచ్చేది నాకు .. ఒకరిపైన కోపాన్ని ఇంటిల్లపాది పైనా ఎందుకు చూపారు .. నాన్నమ్మ కోసం అయినా రాలేదని..మొన్నామద్య మా పెదనాన్న గారు, నాన్న గారికి కనబడి చేసిన తప్పుకు బాధపడ్డారంట ...


ప్రొద్దున నుండి ఒకటే బాధగా అనిపించింది పాత రోజులన్నీ గుర్తువచ్చీ ..ఇక్కడికి వచ్చాక ఉగాది పచ్చడి లేదూ, ఆ సంభరమూ లేదూ.. వేప పువ్వు కొనాలంటే ఎక్కడికో వెళ్ళాలి .. పాపం ఆయన ఇంటికొచ్చే సరికి అర్దరాత్రి అయిపోతుంది ... వేప పువ్వు,మామిడి కాయ లేకుండా పచ్చడి చేసా గాని మొదటి సారి ఉగాది పచ్చడి మీద కార్టున్లు ఎందుకు వేస్తున్నారో నాకు అర్దం అయిపోయింది .. అసలే అత్తయ్య,అమ్మా అడుగుతారు పండగ ఎలా చేసుకున్నావు అని .. వేపపువ్వు కొనే తీరిక లేదని చెబితే అయిపోతాను..

ఇదిగో సరిగ్గా ఇప్పుడే పోన్ వచ్చింది పచ్చడి యే కాదు భోజనం తినడానికి కూడా వచ్చేయమని ఒక ఫ్రెండ్ ఆహ్వానం ...హమ్మయ్యా.. మరి మా వారికి చెప్పాలి ... చూసారా, కేవలం మీ అందరికీ శుభాకాంక్షలు చెబుదామని వస్తే ఏకంగా అదొక పోస్ట్ అయ్యి కూర్చుంది.. మరి నేను ఉగాది పచ్చడి తిని పండగ చేసుకుని వస్తా మరి .. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ...

31 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అసలు తెలుగు పండగలన్నీ కుటుంబ సభ్యులతో కలసి జరుపుకోవలసినవే.....అలా జరుపు కున్నప్పుడే మీకు జ్ఞాపకం ఉన్నంత స్వచ్చంగా గుర్తుంటాయి. దురద్రుస్టవసాత్తూ ఇప్పుడు ఒకరిద్దరి సమక్షంలోనే జరుపుకోవలసి వస్తుంది. మళ్లి మనందరికీ అలాంటి రోజులు రావాలని ఆశిస్తున్నాను.

ఉగాది శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

హాయ్ నేస్తం ఉగాది సుభాకాంక్షలు
మీ లాగే మా చెల్లెమ్మ కూడా విదేసాల్లో ఉంది. దానికసలే వెరైటీ వంటలు చేయటం ఇష్టం . ఉగాది పచ్చడి ని కూడా వెరైటీగా చేసే ప్రయత్నం ఎక్కడ మొదలు పెట్టిందో అని కంగారుగా వుంది. అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళాయన గురించి బెంగగా వుంది. ఆయనసలే ఎదురు తిరగటం అలవాటులేని మనిషాయే.......

చైతన్య చెప్పారు...

మీకు , మీ కుటుంబానికి కుడా ఉగాది శుభాకాంక్షలండి...

మధురవాణి చెప్పారు...

నేస్తం గారూ,
మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు..!

Padmarpita చెప్పారు...

భలే గుర్తుచేసారు.....
మరి నా ఉగాది పచ్చడి సంగతి??????

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

నేస్తం గారూ... మీరు ఉమ్మడి కుటుంబంలో పెరిగినట్టున్నారు. ఆహా ఏమి ఆనంద కరమైన వాతా వరణమండీ అదీ... చదువుతుంటే నాకు అలాంటి అవకాశం కలగలేదే అనిపిస్తుంది., అప్పుడప్పుడూ..

నాకు తెలుసు ఉమ్మడి కుటుంబంలోను చేదు ఉంటుం దని... మీరు తీపి కబుర్లు మాత్రమే చెబుతున్నారనీ... కానీ చాలా చక్కగా చెబుతున్నారు... ఇలాగే కొనసాగించండి... నలుగురికీ ఆ తీపి పంచుతూ ఆనందంగా జీవించండి.

పాత రోజులు మళ్లీ రావండీ... ఉద్యోగాల కోసం ఎక్కడి కెక్కడికో ఎగిరిపోవలసి వస్తున్న ప్రస్తుత రోజుల్లో మనచుట్టూ ఉండే వారినే స్నేహితులుగా చేసుకుని జీవించడమే మనం చేయగలిగినది.

మీకూ, మీ వారికీ ఉగాది శుభాకాంక్షలు... :)

అభిసారిక చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు :)

నేస్తం చెప్పారు...

శేకర్ గారు అసలు పండుగలు పెట్టిందే కుటుంభసభ్యులందరూ కలవడానికి...వారి మద్య ఆప్యాయతలు మరింత గా పెంపొందించడానికి.. మీలాగే మళ్ళీ అలాంటి రోజులు రావాలని ఆశిస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు ..
లలిత గారు అవమానం ..అవమానం ... మేము సరిగా పచ్చడి చేస్తే ఇన్ని కార్టూన్లు పుట్టేవా ... ఇంత మంది పండగను తలుచుకుని నవ్వుకునేవారా చెప్పండి.. మా త్యాగ శీలతను పట్టించుకోకండా ఇంత మాట అనేస్తారా ..నేను తీవ్రంగా ఖండిస్తున్నాను... ఉగాది శుభాకాంక్షలు మీకూ మీ కుటుంభానికి

నేస్తం చెప్పారు...

మీకూ మీ కుటుంభానికి ఉగాది శుభాకాంక్షలు ..చైతన్య గారు మదురవాణి గారు

నేస్తం చెప్పారు...

పద్మగారు ఆ ఒక్కటి అడక్కండి.. చేదుకి వేపపువ్వుబదులు కాకరకాయ వేసి మరీ చేసాను మామిడి వేయనేలేదు.. చింతపండు రసమే పులుపు అనుకుని మొత్తానికి ఆరురుచులు వేస్తే గొప్ప చండాలంగా వచ్చింది చివరకు.. ఏం చేయాలిరా భగవంతుడా అనుకుంటే సరిగ్గా ఒక ఫ్రెండ్ కాల్ చేసిపిలిచారు మొత్తానికి చక్కని పచ్చడి, బోజనంతో హాయిగా మిగిలిన ఫ్రెండ్స్ సమక్షంలో పండుగా జరిగింది ..ఉగాది శుభాకాంక్షలు
అబిసారిక గారు మీకూ మీ కుటుంభానికి ఉగాది శుభాకాంక్షలు ..

నేస్తం చెప్పారు...

ప్రేమికుడుగారు ఎన్నిరుచులున్నా తీపి స్థానం తీపిదే .. అందుకే తీపే రాస్తున్నా .. ఉమ్మడిలో ఆప్యాయతలే కాదు కష్టాలు ,భాధలు, విషాదాలు అన్నీ ఉంటాయి ..షడ్రుచులమాదిరి .. మీరు చెప్పినట్లుగానే స్నేహితుల సమక్షం లోనే పండుగను జరుపుకున్నా ..మీకూ మీ కుటుంభానికి ఉగాది శుభాకాంక్షలు

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీకు మీవారికి ఉగాది శుభాకాంక్షలు నేస్తం..

నేస్తం చెప్పారు...

శ్రీకాంత్ గారు మీకూ మీ కుటుంభసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

జ్యోతి చెప్పారు...

మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు.

పరిమళం చెప్పారు...

మీకు.. మీ కుటుంబానికి.. విరోధి నామ సంవత్సర ...శుభాకాంక్షలు

నేస్తం చెప్పారు...

జ్యోతి గారూ,పరిమళం గారూ మీకు , మీ కుటుంబానికి కుడా ఉగాది శుభాకాంక్షలండి

arunank చెప్పారు...

మా పల్నాటిలో చాలా పౌరుషాలు ఉంటాయి .పల్నాటి పౌరుషం అనే సినిమా కూడా తీసారు .మా నాన్న ,పెద నాన్న కూడా ఇప్పుడు మాట్లాడు కోరు.నేను కలుపుదామని ప్రయత్నం చేసి మానేసాను.
మీ కు కూడా అలానే ఉంటాయా?
బయట ఉంటే మన తెలుగు వాళ్ళందరూ కలిసే ఉంటారు లెండి.

నేస్తం చెప్పారు...

ఓ మీది పల్నాడు నా.. నిజమే చాలా విన్నాను పల్నాటి పౌరుషం గురించి.. నిజానికి గోదావరి ప్రజలు ఎక్కువగా బందుత్వానికే ప్రాముఖ్యం ఇస్తారు ..ఒక వేళ ఎవరన్నా మాట్లాడుకోక పోయినా మిగిలిన వారు సంధి చేస్తారు ..కాకపోతే అందరూ ఒకలా ఉండరుకదా ...ఇప్పుడు ఎక్కడన్నా ఒకటేలేండి అరుణాంక్ గారు కక్షలకు,పగలకు ఇచ్చిన మర్యాద ప్రేమలకు ,ఆప్యాయతలకు ఇవ్వడం లేదు ..అయితే ఒకటి నిజం మీరన్నట్టు బయట ఉంటే మన తెలుగు వాళ్ళందరూ కలిసే ఉంటారు లెండి. అన్నట్టు ఉగాది శుభాకాంక్షలు :)

arunank చెప్పారు...

నాకు గోదావరి జిల్లాతొ అనుబందం ఉంది.కాకినాడలో ఇంజినీరింగ్ చదివాను.సాథ్వికులు అక్కడి వారు,సమస్యలను కొర్ట్ కెళ్ళి పరిష్కరించుకుంటారు .దెబ్బలాటకు పోరు.
ఇప్పుడు అన్ని చోట్ల ఒకటే టార్గెట్ .ఏలాగైన డబ్బు సంపాదించాలి.

నేస్తం చెప్పారు...

hmm..మీరన్నది కూడా నిజమే

ఆత్రేయ కొండూరు చెప్పారు...

నేస్తం గారు చాలా బాగున్నాయి మీ ఊసులు. చాలా ఆలస్యంగా ఇటు వైపు వచ్చాను.. మీ బ్లాగు చాలా బాగుంది. ఇక తరచు వస్తూ ఉంటా.. మంచి మంచి కబుర్లు చెప్తూ ఉండండి. ఇలాగే... అభినందనలు.

నేస్తం చెప్పారు...

మీ అభిమానానికి ధన్యవాధాలు ఆత్రేయగారు .. మీ కవితలకు అభిమానిని నేను

పిచ్చోడు చెప్పారు...

నేస్తం, మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఆలస్యంగా చెబుతున్నందుకు ఏమనుకోకండి :)

నేస్తం చెప్పారు...

నేను అనేసుకున్నానండి పిచ్చోడుగారు నేను అలిగేసానంతే.. :) మీకూ మీ కుటుంభానికి ఉగాది శుభాకాంక్షలు ..

పిచ్చోడు చెప్పారు...

:(

నేస్తం అలగొచ్చాండీ....... అయినా మా కుటుంబానికంతా శుభాకాంక్షలు చెప్పేశారుగా. అలక తీరిపోయినట్లే.... :)

అజ్ఞాత చెప్పారు...

Good

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు ధన్యవాదాలు

Surabhi చెప్పారు...

నేస్తం గారూ,
మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు..!

నేస్తం చెప్పారు...

surabhi గారు ఉగాది శుభాకాంక్షలు మీకూ మీ కుటుంభానికి

మరువం ఉష చెప్పారు...

ఉగాదితో ముడిపడి ప్రతి ఒక్కరికీ ఎన్నో జ్ఞాపకాలు వుండుంటాయి.

నేస్తం, నా జాబితాలో మరువలేనివి కొన్ని మాత్రం వ్రాస్తాను.

మా నానమ్మ ఉదయాన్నే స్నానం చేసి, చక్కని పొందూరు జరీఅంచు చీర కట్టుకుని, క్రొత్త దుప్పటి వేప చెట్టు క్రింద పరిచి కొమ్మల్ని నిదానంగా వూపుతు కాసినన్ని పూలు దులిపి, వాటిని సున్నితంగా నుసిమి రేకులుగా విడదీసి అమ్మకి ఇచ్చేవారు, నాన్న గారు కొబ్బరి కాయ కొట్టి,చిన్నగా ముక్కలు కోసేవారు, అమ్మ మిగిలిన అధరువులు వేసి ఆరు రుచులన్నీ సమపాళ్ళలో కలిపి పచ్చడి చేసేవారు, నేను కనీసం 3 గ్లాసులు తాగేదాన్ని రోజు మొత్తంలో, తిరిగి ఉగాది వరకు ఆ రుచే నాలిక మీద నిలిచేంత బాగుండేది.

ఒకసారి నానమ్మ లేరని నేను చెట్టు ఎక్కి పూల రెమ్మరు కొన్ని విరుస్తూ, ప్రక్క ఇంట్లోకి తొంగి చూస్తే రాజు అంకుల్ ఉదయాన్నే సీసాలో ఏదో తాగుతూ కనిపించారు. పచ్చడికి ముందు మరేమీ తాగకూడదన్న చిన్న ఆలోచనతో తర్వాత అమ్మనడిగి కొంచం ఆయనకి ఇచ్చి అదే మాట మరి కొన్ని కలిపి చెప్పి, ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానమిచ్చి వచ్చాను. మరుసటి ఏటికల్లా ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకుని నాన్నగారితో మీ అమ్మాయి మూలానే ఇలా తిరిగి సంసారినయ్యాను అని చెప్పి నాకొక బంగారు ఉంగరం బహుమతిగా ఇచ్చారు. అది తెల్ల రాళ్ళ కొమ్మకి చిన్న పువ్వు, ఎరుపు ఆకు పచ్చ రాళ్ళూ పొదిగివుండేది. నాకు త్యాగం అధిక పాళ్ళు కనుక తర్వాత అది చెల్లికి ఇచ్చేసాను. తనతోనే అదీ పోయింది.

మీ మాదిరే ఆస్ట్రేలియా వెళ్ళిన మొదట్లో పండుగలు, బెంగలు, బాధలు వచ్చేవి. ఇపుడు అలవాట్లు మారాయి నిర్లిప్తత బాగా అవసరమౌతుంది. అయినా కానీ సహౄదయులైన మిత్రుల కారణంగా పండుగ విందులు, వేప పూవు, మామిడి కాయతో సహా ఉగాది పచ్చళ్ళు, చలిమిడి వడపప్పులు, పూర్ణాలు, పులిహోరలు, ఇలా సాంప్రదాయ వంటకాల, ప్రసాదాల ప్రాప్తి, దంతసిరి బాగానేవున్నాయీ అమెరికాలో.

నేస్తం చెప్పారు...

చక్కన్ని శైలితో చాలా బాగా రాసారు ఉషగారు మి ఙ్ఞాపకాలను