10, మార్చి 2009, మంగళవారం

ఈ కధ కు శీర్షిక ఏమ్ పెట్టనబ్బా ??????



నా హైస్కూల్ చదువు గురించి ఆలోచించినట్లుగా నా పెళ్ళి గురించి కూడా ఆలోచించలేదు మా నాన్న గారు ..విషయమేమిటంటే మా తాత గారు ఇంట్లో ఆడపిల్లలను కో ఎడ్యుకేషన్ స్కూల్స్ కి పంపించడానికి లేదా దూరం గా ఉన్న స్కూల్స్ కి పంపడానికి అంతగా ఇష్టపడేవారు కాదు..పైకి అనకపోయినా మా నాన్నగారి అభిమతం కూడా అదే ..మా ఇంటికి కాస్త దగ్గరలో గర్ల్స్ హై స్కూల్స్ రెండు ఉన్నాయి ..ఒకటి సెంటాన్స్ హైస్కూల్ ,రెండోది మునిస్పల్ గర్ల్స్ హైస్కూల్ .. కాబట్టి ఈ రెండిటిలో ఏదో ఒకదానికి తప్పని సరిగా ఓటు వేయాల్సిందే ..

అయితే గవర్నమెంట్ స్కూల్స్ లో సరిగా చదువు చెప్పరు అని మా అక్కను సెంటాన్స్ లోనే జాయిన్ చేసారు.. ఏ మాటకామాట చెప్పుకోవాలి ఆ స్కూల్ చాలా విశాలంగా ,చక్కని వసతులతో ,మంచి క్రమశిక్షణ తో అంతా బాగుండేది కాని ,మత విషయం లో కాసింత ఎక్కువగా పిల్లలకు ప్రభువు గురించి చెప్పేవారనుకుంటా..ఆ ప్రభావం మా అక్క మీద బాగా పడిపోయింది ..మిగిలిన పిల్లలు బాగానే చదువుకుని ఇళ్ళకు వచ్చేవారు..ఇది మాత్రం ఇంట్లో కూడా ప్రొద్దున టిఫిన్ తినడానికి ముందు ,తరువాత,భోజనానికి ముందు, తరువాత పడుకోడానికి ముందు ,లేవగానే ఒకటే ప్రార్ధనలు చేసేది .. గాజులు వేసుకునేది కాదు,బొట్టు పెట్టుకునేది కాదు ..ఆఖరికి పండగలకు కూడా ..ఎందుకంటే అలెర్జిగా ఉంది అని సాకు చెప్పేది .. ఇంటికెవరన్నా వచ్చి ఏమ్మా నువ్వు చక్కగా పాడతావంట కదా ఒక పాట పాడమ్మా అనగానే ..నడిపించు నా నావా ..నడి సంద్రమునదేవ అని మొదలు పెట్టేది ..దానితో ఆ వచ్చేవాళ్ళు మా నాన్న వైపు దానివైపు అనుమానంగా మార్చి మార్చి చూసేవారు ..దానితో ఠారెత్తిపోయి మా నాన్న గారు తిడితే ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి మిస్సమ్మలో సావిత్రిలా తలపై ఒక ముసుగేసుకుని కరుణించు మేరి మాత పాట వింటూ మౌనంగా రోదించేది..

ఈ కారణాలవల్ల మా నాన్న గారు ..చదివే రాత వుంటే ఎక్కడన్నా చదువుతుందిలే అని నన్ను మున్సిపల్ స్కూల్ లో జాయిన్ చేసేస్తా అన్నారు..ఆ మాట వినగానే మా నాన్నకు చెప్పే ధైర్యం లేక అది నన్ను పక్కకు తీసుకు వెళ్ళి ఒకటే గొడవ .. నీకేమన్నా మతి పోయిందా.. పోయి పోయి ఆ చెత్త స్కూల్ లో జాయిన్ అవుతావా.. మా స్కూల్ ల్లో నుండి మొద్దులు అని తీసిపడేసిన జనాలందరూ అక్కడ జాయిన్ అవుతారే..అక్కడ చేరావో నువ్వూ కూడా ఒక మొద్దులా తయారవుతావ్.. నా మాట విని అక్కడ వద్దు అని నాన్నకు చెప్పేసేయి అని నస పెట్టేసేది .. కానీ మరేమో నేను మా అక్కకు టొటల్ గా వ్యతిరేఖం ..నా కెంత సేపూ పూల జడగుప్పెసుకుని,పట్టు పావడా వేసుకుని, కళ్ళకు కాటుకా, కాళ్ళకు పట్టీలతో చెంగు చెంగున లేడిపిల్లలా తిరగాలని మహా కోరిక .. వాళ్ళ స్కూల్ లో లా గంట గంటకూ ప్రేయర్ చేయడం నా వల్ల కాదు.. అందుకే నేను మా నాన్న పార్టీ లో చేరిపోయి గవర్నమెంట్ స్కూల్ లోనే జాయిన్ అయిపోయా..

ఆ స్కూల్ లో చేరగానే నా పరిస్థితి ఎలా ఉందంటే పంజరం లో ఉన్న చిలకను బయటకు వదిలినట్లే..మిగిలిన స్కూల్స్ ఎలా ఉంటాయో తెలుయదుగాని మా స్కూల్ మాత్రం అసలు సిసలు గవర్నమెంట్ స్కూల్ కి ప్రతీక లా ఉండేది.. ఒక యూనిఫాం వేసుకు తీరాలని రూల్ లేదు,టీచర్స్ సరిగా ఉండేవారు కాదు,ఉన్నా చాలా వరకు సరిగా చెప్పేవారు కాదు, 30 మంది పట్టె క్లాస్ లో 60 మందిని ఇరికించేసేవారు.. ఎంచక్క బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు ..చదివినా,మానినా అడిగే నాధుడు ఉండేవాడు కాదు .. కొంత మంది అయితే ఏకం గా గోరింటాకులు పెట్టుకొచ్చేసి వెనుక బెంచి లో కూర్చునేవాళ్ళూ.. ఇంకొందరు చక్కగా ఊలు బండిలూ తెచ్చుకుని స్వెటర్ లు గట్రా అల్లుకునేవారు.. నాకూ కూడా నేర్పమంటే నీకు నేర్పించే టైము లో 4 స్వెటర్లు అల్లుకోవచ్చు అని దొంగమొహాలు నేర్పించలేదు అది వేరే విషయం అనుకోండి.. ఇలా నా చదువు 6 మాటలు 3 ఆటలతో 10 వ తరగతి వరకు వచ్చేసింది..
అయితే ఆ స్కూల్ లో అందరూ ఆకతాయి ,మొద్దులు కాకుండా నాకులా కాసింత చదువుకునే పిల్లలు కూడా ఉండేవారు వారిలో స్వాతి ,సత్య వగైర వగైరా అందరం కలిసి ఒక బెంచిలో కూర్చునే వాళ్ళం .. ఎప్పుడూ సోది కబుర్లే కాకుండా అప్పుడప్పుడు అందరం చదువుకునే వాళ్ళం ..ఒకరి డవుట్లు మరొకరం తీర్చుకునేవాళ్ళం ,, మా టీచర్లు స్కూల్ లో అంటే సరిగా చెప్పేవారు కాదుగాని వారిదగ్గర ట్యూషన్ పెట్టించుకుంటే అరటిపండు వలిచీ పంచదార అద్దినంత బాగా చెప్పేవారు.. పిల్లలను ట్యుషన్ లకు రాబట్టడానికి అదొక టెక్నిక్ ..

అయితే మా వెనుక బెంచీలో నా వెనుక కూర్చూనేది కుసుమ.. ఈ కధలో వీరోయిన్ ఆవిడే మరి.. కుసుమ అంటే అందరికీ హడల్ ..ఎందుకంటే అది దాని కంచు కంఠం తో ఒకేసారి 10 మంది తో గొడవపడి గెలిచే గయ్యాళీ పిల్ల .. దాని నోరుకి భయపడి ఎవరూ దాని జోలికి వెళ్ళేవారు కాదు..చదవడం మినహా దానికి అన్నీవచ్చు.. స్కూల్ ఎగ్గొట్టిసినిమాలు, షికార్లూ,ఆ వయసులోనే దానికో బోయ్ ఫ్రెండ్ ..మళ్ళీ వాడి మంచికోసం పూజలూ ..మొక్కులూ..ప్రదిక్షణాలు..ఉపవాసాలు..ఇలా అన్నమాట ..మరి నా ఖర్మ కాలో,పండో తెలియదు గాని దానికి నేను అంటే మహా ఇష్టం.. నన్ను మాత్రం ఏమీ అనేది కాదు..ఎదో ఒక సోది చెబుతునే ఉండేది.. కానీ పరిక్షలొచ్చాయంటే నా వెనుకనే పడేది.. ఇంక ఇస్స్ ,,ఇస్స్ అంటూ చూపించమని ఒకటే సౌండ్స్ చేస్తూ హింస హింస పెట్టెసేది.. నేను ఎలాంటిదాన్ని అంటే రాసే టైములో ఆకు కదిలిన చప్పుడువిన్నా.. ఏం రాయలేను.. మహ చిరాకు వస్తుంది..నోరుముయ్యి వెధవ సౌండ్స్ చేసావంటే చంపేస్తా అని తిట్టానో ..ఇంక మొదలు పెట్టేసేది ..అది కాదే నిన్న ఏమైందో తెలుసా మా అమ్మగారికి ఒంట్లో బాలేదు .. మొత్తం పని అంతా నేనే చేసాను.. నీకు తెలుసు కదా మా వీదిలో ఒకటే కుళాయి .. అక్కడి నుండి నీళ్ళు పట్టుకుని మెట్లు ఎక్కి ఇంటిల్లపాదికీ నీళ్ళు తెచ్చేసరికి ఎంత అలసిపోయానో తెలుసా అంటూ మొత్తం వర్ణించి వర్ణించి ఒక సెంటిమెంట్ సినిమా చూపించేసేది.. ఇలా మొత్తానికి ఎలాగయితేనో సాధించి చూసి రాసేసేది..

ఒక సారి మా హేడ్మాస్టర్ మన స్కూల్ కి కొత్త సైన్స్ టీచర్ వచ్చారని చెప్పీ ఒక ఆమెను పరిచయం చేసారు.. ఆమె బాగా పొట్టిగా తెల్లగా ఉన్నారు.. ఆవిడను చూడగానే కొందరు పక్కున నవ్వితే ఇంకొందరు పెదాల చాటున నవ్వును దాచుకున్నారు.. ఆవిడ అదేం పట్టనట్లుగా సీరియస్సుగా లెస్సెన్ చెప్పడం మొదలు పెట్టారు.. ఇంక వెనుక నుండి కుసుమ గొడవ స్టార్ట్ అయింది నాకు..ఏమే అడ్డుగా ఉండవా భయం గా ఉంది.... అడ్డుగా ఉండవా ఆవిడ చూస్తుంది అని నా వెనుక దాక్కుంటూ గోల గోల..నాకేమో చక్కిలి గింతలు వచ్చేసి కోపం వచ్చేస్తుంది.. యెహే.. వెధవ ఓవెర్ ఏక్షన్ చేయకు.. ఆవిడను చూసి నువ్వెందుకు భయపడటం అని ఒక్క గసురు గసిరాను చిరాకుతో .. ఆవిడ మా గుసగుసలకు వెనుకకు తిరిగి ఏమిటి మీరు సరిగా కూర్చోలేరా అని తిట్టి మళ్ళీ పాఠం మొదలు పెట్టింది.. ఆవిడ వెళ్ళేవరకు ఓపిక పట్టి కయ్యిమని లేచాను కుసుమ మీద.. అప్పుడు తాపీగా చెబుతుంది. అదికాదే ఈవిడ మొన్నే మా వీదిలోకి కొత్తగా అద్దెకు వచ్చారు .. కుళాయిదగ్గర నా వంతు అవ్వకుండానే ఆవిడ బిందె పెట్టింది.. నాకేం తెలుసూ ఆవిడే మనకి సైన్స్ టీచరుగా వస్తుంది అని.. అసలే చిరాకుగా ఉన్నాను ఆ బిందే ఎత్తి గిరాటేసి నాలుగు తిట్ట్లు తిట్టాను అందుకే కాసింత భయం వేసింది అంది .. నా..లు....గు తిట్లా ఏం తిట్టావ్ అన్నాను నోరు తడి ఆరిపోతుంటే .. అదే..ఏమన్నానబ్బా ..అని ఆలోచించి ..ఏమే పొట్టిదానా భూమికి జానెడు లేవు.. మద్యలో వచ్చావంటే బిందెతో పాటు నిన్నూ గిరాటేస్తాను అని అది ఇంకా చెప్ప బోతుండగా .. ఇంకా ఆపవే తల్లోయ్ .. నీ ఎంకమ్మా నువ్వు ఇలా తగులుకున్నావేంటే బాబు నాకు .. మొదటి రోజే నీతో చూసి నా మీద చెడ్డ అభిప్రాయాని కొచ్చేసి ఉంటుంది ఆవిడ ..ఇంక నీతో పాటు నేను ప్రతి చిన్న దానికి చీవాట్లు తినాలి అని తెగ బాధ పడిపోయాను..

అయితే నేను అనుకున్నట్లుగా ఆవిడ నన్ను ఎప్పుడూ తిట్టలేదు ...ఆ మాట కొస్తే కుసుమనూ ఏమీ అనలేదు..ఆ కారణం చేతనో మరి పాఠాలు బాగ చెప్పడం వల్లనో తెలియదుకాని ఆమే అంటే నాకు చాలా గౌరవం ఉండేది ... ఒక సారి క్వాటర్లీ పరిక్షలు వచ్చాయి .. ఆ రోజు సైన్స్ .. నేను చక చక రాసుకుంటున్నాను.. కుసుమ యధావిధిగా చూసి కాపి కొడుతుంది..నేను పేపర్ అంతా అయిపోగానే ఇంక సార్ కి ఇచ్చేద్దామని లేవ బోతుండగా ఏమే ప్లీజే ప్లీజే నేను సరిగా రాయలేదు నువ్వు టక టకా రాసేసావు ఆ లాస్ట్ ప్రశ్నకు జవాబు చెప్పవా అని నస ..ఆ ప్రశ్న ఏంటంటే మొక్కలకు నీరూ ,గాలి కావాలని ప్రయోగత్మకం గా వివరింపుము..ఇంక దీని బాధ పడలేక దాని ప్రశ్నా పత్రం తీసుకుని ఇలా రాసాను... అదేనే ఒక బీకరు తీసుకుని దానిలో ఒక పుల్ల కు మూడు విత్తనాలు కట్టి ఏడుస్తాం కదా ఒకటి నిండాగా మునుగుతుంది... ఒకటి గాలి లో ఉంటుంది... మద్యలోది గాలి నీరు తగిలేట్టుగా పెడతాం..అదే పెరుగుతుంది అది రాసి పడేయ్ అని రాసి దాని చేతికి ఇచ్చేసి వచ్చేసా..

ఆ తరువాతా మా సైన్స్ మేడం మార్క్స్ చెబుతూ క్లాస్లో ఒకరు చూసికాపీ కొట్టారు.. చూడటం ఎంత నేరమో దానికి సహకరించినవాళ్ళది కూడా అంతే నేరం కాబట్టి ఇద్దరు లేచి నిలబడండి.. అన్నారు.. నాకు గుండేల్లో రాయిపడింది .. అయినా బింకం గా ఆ రోజు నేను ఈవిడ క్లాసులో పడలేదు కదా నేను కాదులే అనుకున్నాను.. ఇంక లాభం లేదనుకున్నట్లు ఉన్నారు ఆవిడ ..కుసుమా లేచి నిలబడు నీకెవరు చూపారు చెప్పు అన్నారు.. ఎలా తెలిసింది ఈవిడకు అనుకుంటూ తప్పక లేచి నిలబడ్డాను ..ఆవిడ నన్ను చూసి ఏమనుకున్నారో సరే ఇంకెప్పుడూ ఇలా చేయకు అనేసి ఏ అమ్మాయ్ ఏంటి ఈ రాయడం అని పేపర్ ఇచ్చారు.. తీరా దాని పేపర్ చూద్దును కదా .. దానిలో నేను ఏమిరాసానో అదే మక్కీకి మక్కీ రాసేసింది.. విత్తనాలు కట్టి ఏడు ..అలా రాసి పడేయ్ వగైరాలన్నమాటా.. నాకు అది చూడగానే కళ్ళు అంటుకిపోయాయి.. ఏమే నువ్వు పనికి మాలినదానివని తెలుసుగాని ఈ రేంజ్ లో అనుకోలేదు ... నీకో నమస్కారమే బాబు అని దణ్ణం పెట్టేసా..

ఈ లోపల పబ్లిక్ ఎక్జాంస్ రానే వచ్చాయి.. అందరికీ టెన్షన్ యే .. రాత్రీ పగళ్ళు కష్ట పడి చదువుతున్నాం .. రేపు ఎక్జాం అనగానే ఈ రోజు రాత్రి నాకు మా అక్క హిత బోధ మొదలెట్టింది.. పబ్లిక్ పరిక్షలు అంటే ఏమనుకున్నావ్ .. మీ స్కూల్ లో రాసినట్లు అల్లాటప్పా గా ఉండవు.. ఏ మాత్రం చూపు తిప్పినా మాట్లాడినా పేపర్ లాగేసుకుంటారు.. ఎవరి స్లిప్ అన్నా పొరపాటున నీ బెంచ్ క్రింద కనబడినా డిబార్ చేసేస్తారు .. అని భయపెట్టెయడం మొదలెట్టింది.. నువ్వు ఆగవే బాబు అసలే టేన్షన్ తో ఏడుస్తుంటే అని విసుక్కున్నా ...

ఎక్జాం హాల్ చూడగానే ఏదో భయం.. అసలే కొత్త స్కూల్ కొత్త ప్లేస్ ఇంకా వేరే స్కూల్ పిల్లలు ,టీచర్లూ అని కంగారుపడుతుంటే యదావిదిగా నా వెనక నెంబరే వచ్చి హాయ్ అంది కుసుమ నవ్వుతూ .. అయిపోయానురా దేవుడో అనుకుని అయినా బింకంగా ఇదిగో రాసేటప్పూడు గాని విసిగించావో అయిపోయావే ... నీ పాట్లేవో నువ్వు పడు.. పిచ్చి కహానీలు చెప్పకు .. ఎక్కువ చేస్తే సార్ కి చెబుతా డిబార్ చేసి పడేస్తారు అని బెదిరించాను.. ఈ లోపల పరీక్ష మొదలైంది ..ఎన్ని చెప్పినా అది మళ్ళీ మొదలు పెట్టింది ప్లీజ్ వే అనుకుంటూ ..ఈ లోపల ఎవరో వచ్చీ గుమ్మం దగ్గర సార్ తో ఏదో మాట్లాడుతున్నారు.. దీని నస భరించలేక మెల్లిగా లేచాను సార్ అంటూ .. ఆయన లోపలకు వచ్చి నన్ను ఆగు అన్నట్లుగా సైగ చేసి ఓరే ఎస్.ఆంజనేయులు ఎవరురా అన్నారు.. ఒక అబ్బాయి లేచి నేనే సార్ అన్నాడు .. అతని దగ్గరకు వచ్చీ సరే ఇది రాయి అని అతనికో చిన్న పేపర్ ఇచ్చీ ఆ చెప్పమ్మా ఏంటి అన్నాడు నా వైపు చూస్తూ ...నాకు నోట మాట రాలేదు అంత పబ్లిక్ గా అతనికి సార్ నే స్లిప్ లు అందించడం చూసి .. అయినా తమాయించుకుని సార్.. ఈ అమ్మాయి ..మరేమో .. డిస్టర్బ్ చేస్తుంది అన్నాను నసుగుతూ .. మా కుసుమ సార్ని చూడగానే టప టపా రెండు కన్నీళ్ళ చుక్కలు కార్చీ మరేమో సార్ నిన్న అంతా జ్వరం అంటుండగానే ఆయన ఆపమన్నట్లు సైగ చేసి ఏమ్మా మీ ఫ్రెండేగా మళ్ళీ ఈ పరిక్షలయ్యాకా కలుసుకుంటారా ,పాపం కొంచం హెల్ప్ చేయండీ మరీ అంత స్వార్దం కూడదు.. అని తిరిగి నాకే చీవాట్లు.. అసలే టైం అయిపోతుంది .. తిట్టుకుంటూ కూర్చున్నా .. ఈలోపల సార్ ఆంజనేయుల వైపు చూసి ఏంట్రా నేను భిట్ పేపర్ ఇస్తే కొచ్చన్ పేపర్ లో ఎక్కించేస్తున్నావ్..అని పక్కన ఉన్న మరో మాస్టార్ తో చూసారా మాస్టారు ఇలా చదువుతున్నారు వీళ్ళు. వీళ్ళ నాన్న ఏమో ఎలాగన్నా పాస్ చేయించేమంటారు ఎలా చచ్చేది అన్నారు విసుక్కుంటూ .. మా దెయ్యం లాగే మహ పండితుడు అని తిట్టుకుంటూ పరిక్ష రాయడం లో పడిపోయాను ..

మొత్తానికి లెక్కల పరిక్ష వచ్చేసింది ..ఆంజనేయులకు మాత్రం అన్ని ఎక్జాంస్ లోనూ ఠంచనుగా స్లిప్ లు అందుతున్నాయి.. నాకు లెక్కలంటే మహ వణుకు.. ఏదో కష్టపడి రాస్తుంటే వెనుక నుండి అబ్బా సరిగా కనిపించడంలేదు .. కాస్త పక్కకు పెట్టి రాయి అని ఇది దిక్కుమాలిన డైరెక్షనులు ఇస్తుంది .. కాసేపటికి దానికి చిరాకు వచ్చేసి ఇలా కాదు గాని ఆ రాసిన పేపర్ ఇలా ఇచ్చెసేయి నేను ఎక్కించుకున్నాక నీకు ఇస్తా అంది తాపీగా.. నాకు తిక్క నషాళానికి అంటింది.. మొన్న అంటే ఒక చెత్త మాస్టర్ వచ్చారు.. అందరూ అలా ఉండరుగా అనుకుని విసురుగా లేవబోయాను.. ఈ లోపల మొదటి ఎక్జాం అప్పుడు వచ్చిన సార్ వచ్చారు ..ఈయన ఎవరురా బాబు నా ప్రాణానికి సరిగ్గా సమయానికి వస్తాడు అనుకున్నాను.. ఈ లోపల ఆయన మా క్లాస్ సార్ తో ఏదో మాట్లాడి ఎస్.ఆంజనేయులు ఒకాసారి లే అన్నారు ..ఆ అబ్బాయి లేచాడు .. ఏరా బాగానే రాసావు కదరా ఇంటిదగ్గర మీ నాన్నకు ఏమీ హెల్ప్ చేయలేదన్నావంట కదా అన్నారు కోపంగా.. ఆ పక్కన ప్యూన్ అనుకూంటా ఇతను కాదు సార్ ఆ అబ్బాయి అని మూలన బిక్కు బిక్కు మని చూస్తున్న మరో అబ్బాయిని చూసి ఈ అబ్బాయి నాన్న సార్ మొన్న వచ్చింది అన్నాడు .. అతని ని లేపి ఏరా నీ పేరు ఏమిటీ అనగానే ఎస్.ఆంజనేయులు అన్నాడు భయం భయం గా .. మరి ఇన్నాళ్ళు ఏం చెసావురా .. ఇదిగో అండీ ఇలా ఉంటారు అయోమయాలు .. అనుకుని గొణుక్కుని వెళ్ళీపోయాడు ... మా సార్ నా వైపు చూస్తూ ఏంటమ్మా అన్నారు.. దెబ్బకి నాకు ఏమనాలో తోచక మంచినీళ్ళు సార్ అని తప్పించుకున్నాను.. ఎలా అయితేనో మొత్తానికి ఎక్జాంస్ రాసా అనిపించి చివరకు ఫస్ట్ క్లాస్ కొట్టేసాను ..

చాలా నాళ్ళ తరువాత మా చదువులు పూర్తి అయ్యాక ఒక సారి ఆంజనేయ స్వామిగుడి దగ్గర కనబడింది కుసుమ ... చాలా ఆనందం వేసింది.. నువ్వేనా ..ఇలా చిక్కి పోయావ్ ఏమిటి..ఎలా ఉన్నావ్ అంటూ అని తెగ సంతోషం పడిపోయింది.. అది సరే గాని ఏమి చేస్తున్నావ్..ఇంతకీ నీ హీరో ని పెళ్ళి చేసుకున్నావా అన్నాను.. సామాన్యం గా అలాంటి పిచ్చి ప్రేమలు సక్సెస్ కావని నాకు తెలుసు ..ఏం చెప్పమంటావే ..మా చెల్లీ వాడు నన్నూ మోసం చేసారు ... ఇద్దరూ ఒకరోజు ఇంట్లోంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు అని బాంబ్ పేల్చింది.. ఇద్దరూ చనువుగా మాట్లాడుకుంటుంటే మా చెల్లే కదా అనుకున్నాను ఇలా చేస్తుంది అనుకోలేదు అంది నీరసంగా మొహం పెట్టి.. కాని నాకు అప్పట్లోనె డౌటొచ్చింది అది చెప్పే మాటలు బట్టి.. సరేలే అలాంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు ..ఇంతకూ నువ్వేం చేస్తున్నావ్ అన్నాను అనునయంగా ..బాగా పేద కుటుంభం వారిది మరి.. పాపం వాళ్ళకు ఇంత కాలం అయినా పిల్లలు పుట్టలేదే అందుకే 108 ప్రదిక్షణాలు చేస్తాను అని మొక్కుకున్నా అంది పేపర్ పెన్ పట్టుకుని చూపిస్తూ ....ఎందుకో నాకా సమయం లో దాని మీద జాలి కాదు నాలుగు తన్నాలనిపించింది ...

47 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

మనం చేసిన సహాయాల గురించి అలా చెప్పుకోవచ్చా? :)
పదో తరగతి పరీక్షల్లో నా వెనుక కూర్చున్న అమ్మాయి తెలుగు పేపర్ కి సాయం అడిగితే దాదాపు మూర్చపోయా.. ఏ సబ్జక్టు రాని వాళ్ళు అయినా తెలుగు మాత్రం బ్రహ్మాండంగా రాసేస్తారని నాకో నమ్మకం అప్పటి వరకు.. మా ఇన్విజిలెటర్ బాగా స్ట్రిక్టు అయ్యేసరికి సాయం చేయలేక పోయా.. ప్చ్:)
మీదైన శైలిలో ఉండండి మీ టపా..

అజ్ఞాత చెప్పారు...

మీరు ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పినట్టుంది. ఇది చదువుతుంటే . చాలా బావుంది. ఇది చదివే అందరికీ తమ స్కూల్డేస్ తప్పక గుర్తొస్తాయి. సరే.... నేనో సీర్షిక చెప్పనా??? "నీ సుఖమే నే కోరుకున్నా...." .వుపసీర్షిక "ఇక తప్పిందికాదు" బావుందా!

చైతన్య చెప్పారు...

మీ పోస్ట్ చదువుతుంటే నాక్కూడా మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మా క్లాసు లో కూడా ఒక అబ్బాయి ఉండేవాడు... ఎగ్జామ్స్ అప్పుడు అతనేమి నా వెనక బెంచి కాదు... అయిన క్లాసు లో ఎక్కడ ఉన్నా వచ్చి 'నేనివ్వను' అంటున్న పేపర్ తీసుకుని వెళ్లి రాసుకున్నాక మల్లి తెచ్చి ఇచ్చేసేవాడు. హుహ్... నాకు మాత్రం పేపర్ నా చేతికి అందేవరకు ఒకటే భయం భయం గా ఉండేది...

అన్నట్టు... అంట జరిగినా కూడా వాళ్ళ చెల్లి కోసం ప్రదక్షిణాలు చేస్తుందే... నాకైతే కుసుమగారిలో అమాయకత్వం, నిర్మలత్వం కనిపిస్తున్నాయండి.

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

నాకు కూడా ఇలాంటివి చాలా జరిగాయి. అప్పుడప్పుడు రిస్క్ కూడా తీసుకొని చూపించవలసి వచ్చేది. ఇవి "తప్పని తిప్పలు"

జ్యోతి చెప్పారు...

St.Anns అంటే హైదరాబాదా, సికందరాబాదా.. అర్జంటుగా చెప్పండి..

నేస్తం చెప్పారు...

హ హ మురళి గారు .. నిజమే ఆ రోజుల్లో తెలుగు కాపీ కొడితే విచిత్రం.. కాని ఈ రోజుల్లో తెలుగు కోసం తెగ పాట్లు పడుతున్నారు పిల్లలు
లలిత గారు మీరు ఏదంటే అదే .. అలాగే పెట్టెద్దాం :)
చైతన్య గారు ఇది మరీ ఘోరమండి ఎక్కడ ఉన్న వచ్చి మరీ పేపర్ ఎత్తుకుపోవడం :)
ప్రపుల్ల చంద్రగారు మరే ..:(

నేస్తం చెప్పారు...

హ హ జ్యోతి గారు రెండు కాదు మాది గొదావరి జిల్లా :) మీకు కూడా ఏదన్న ఫ్లాష్ బేక్ గుర్తువచ్చేసిందా

జ్యోతి చెప్పారు...

ప్చ్.. ఎందుకో అపేరంటే కాస్త ముద్దులెండి. నేను చదివింది హైదరాబాదులో, మా అమ్మాయి చదివింది సికిందరాబాదులో. కాని పరీక్షలప్పుడు తిప్పలు ఎవరికి మాత్రం తప్పవు.ఫ్లాష్ బ్యాక్ ... ఉందిలెండి. తీరిగ్గా చెప్తాను..

నేస్తం చెప్పారు...

హ హ అయితే ఇంకేం ఎదురు చూస్తూ ఉంటాను మీ పోస్ట్ కు

పిచ్చోడు చెప్పారు...

> నడిపించు నా నావా ..నడి సంద్రమునదేవ అని మొదలు పెట్టేది .
> ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి మిస్సమ్మలో సావిత్రిలా తలపై ఒక ముసుగేసుకుని కరుణించు మేరి మాత పాట వింటూ మౌనంగా రోదించేది..
> నాకూ కూడా నేర్పమంటే నీకు నేర్పించే టైము లో 4 స్వెటర్లు అల్లుకోవచ్చు అని దొంగమొహాలు నేర్పించలేదు

హహహహ... నేస్తం కేక.
కానీ asusual గా చివరలో మనసును తాకే మాట చెప్పారు. నాకైతే కుసుమ గారి మీద కోపం రాలేదు. ఆ అమ్మాయిలోని ప్రేమ, అమాయకత్వమే కనిపించాయి.

నేస్తం చెప్పారు...

పిచ్చోడు గారు నిజమే క్లాసు లో ఎంత గయ్యాళి అని పేరు తెచ్చుకున్నా పాపం తను కాస్త అమాయకురాలు ... ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అన్న సినిమా పక్కి లో ఇలాగే వాళ్ళను చూస్తూ జీవితం గడిపెస్తా అన్న లెవల్ లో చెప్పింది నాకు.. బాగా చీవాట్లు పెట్టాను :)

బుజ్జి చెప్పారు...

అదే..ఏమన్నానబ్బా ..అని ఆలోచించి ..ఏమే పొట్టిదానా భూమికి జానెడు లేవు.. మద్యలో వచ్చావంటే బిందెతో పాటు నిన్నూ గిరాటేస్తాను అని అది ఇంకా చెప్ప బోతుండగా .. ఇంకా ఆపవే తల్లోయ్ .. నీ ఎంకమ్మా నువ్వు ఇలా తగులుకున్నావేంటే బాబు నాకు ..

దానిలో నేను ఏమిరాసానో అదే మక్కీకి మక్కీ రాసేసింది.. విత్తనాలు కట్టి ఏడు ..అలా రాసి పడేయ్ వగైరాలన్నమాటా.. నాకు అది చూడగానే కళ్ళూ అంటుకిపోయాయి.. ఏమే నువ్వు పనికి మాలినదానివని తెలుసుగాని ఈ రేంజ్ లో అనుకోలేదు ... నీకో నమస్కారమే బాబు అని దణ్ణం పెట్టెసా..


ultimate asalu ee rendoo..

నేస్తం చెప్పారు...

హ హ బుజ్జి గారు నిజంగా భలే విషయాలు ఆ రెండూ ..నాకు ఇప్పటికీ గుర్తు వచ్చీ నవ్వుకుంటూనే ఉంటాను.. ఇంకో తమాషా ఏంటంటే ఆ మేడం మా తమ్ముని ఫ్రెండ్ అక్క అంట .. అది తెలియక ఈ విషయం ఆ అబ్బాయి ఎదురుగా చెప్పాను.. వాడు మెల్లగా అక్కా ఆమే మా అక్కయే అన్నాడు.. నాకు నోట మాట రాలేదు ఇంక :)

బుజ్జి చెప్పారు...

ha ha, u should have included that incident also in the post..!!

నేస్తం చెప్పారు...

నిజమే ఇప్పుడే గుర్తువచ్చింది ఆ విషయం.. పోనీలేండి ఇలా అన్నా గుర్తు వచ్చేలా చేసారు..ధన్య వాధాలు

రాజ్ కుమార్ చెప్పారు...

Sooooper.....Excellent....

సుజాత వేల్పూరి చెప్పారు...

పరీక్షల రోజులు అదోరకమైన ఉద్వేగం! కొంచెం టెన్షన్,మరి కొంత ఉత్సాహం,కొశ్చెన్ పేపర్ ఇచ్చేటప్పుడు మన దాకా వచ్చేలోపే మనం పడే ఉత్కంఠ, ఎక్కువ ఎడిషనల్స్ ఎవరైనా తీసుకుంటే, వాళ్ళు మనకంటే బాగా రాసేస్తారేమో అని కుళ్లు, భలే ఉంటుంది పరీక్షల సీజన్!

శ్రీనివాస్ చెప్పారు...

శీర్షిక -----> వెనక బెంచి అమ్మాయి :D ( మీ పాట టపా ని కాపీ కొట్టా కుసుమ లాగ )

asha చెప్పారు...

సూపర్ గా ఉంది మీ టపా.
ఎస్.ఆంజనేయులు ఎపిసోడ్ చదివి
నవ్వలేక చచ్చాను. మీ నెరేషన్
అదిరిపోయింది. ఎక్సలెంట్.

నేస్తం చెప్పారు...

వేణురాం గారు ధన్యవాధాలు :)
సుజాత గారు కరెక్ట్ గా చెప్పారు.. అబ్బో గుర్తువస్తే భలే నవ్వు వస్తుంది..
శ్రినివాస్ గారు కుసుమ మీకేమన్నా చుట్టమా ..నిజం చెప్పండి :)
భవాని గారు అసలు ఆ అబ్బాయి రాసిన తీరు తలుచుకుంటే ఇప్పటీకీ నవ్వు వస్తుంది ..ఆన్సర్ పేపర్ లో బిట్ పేపర్ని 1.A 2.B 3.D అని ఎక్కించేసాడు :)

శ్రీనివాస్ చెప్పారు...

మీరిలా కుసుమ నా చుట్టమా కాదా అంటూ అంతఃపుర రహస్యలడిగితే కష్టం.. శీర్షిక బాగుంది కదు

నేస్తం చెప్పారు...

హ హ హ చాలా బాగుంది

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ :) హాయి గా మనసారా నవ్వుకున్నాను నేస్తం. థ్యాంక్యూ..

krishna rao jallipalli చెప్పారు...

మార్చి నెలలో ఒక చక్కటి టపా. చాలా చాలా బాగుంది. అదేమిటి శీర్షిక గురించి మమ్మల్ని అడుగుతున్నారు. ఈ మద్య ఏదో ఒక శీర్షిక పెట్టేసి భలే బాగుంది చక్కగా ఉంది అని తమకి తామే పోగిడేసుకుంటున్నారు కదా కొంతమంది సత్యవంతులు.

అజ్ఞాత చెప్పారు...

మీదగ్గర బోల్డు కథలున్నట్టున్నాయి. కొసమెరుపులతో మనసుల్ని కదిలించటమూ తెలుసు. కొంచెం కష్ట పడితే చక్కటి కథలు రాయగలరు మీరు.

నేస్తం చెప్పారు...

శ్రీకాంత్ గారు మీ బాధలను కొద్ది సేపయినా మరచి మీరు మనసారా నవ్వారు అది చాలు ఈ నేస్తానికి..
క్రిష్ణారావు గారు ధన్యవాధాలండి
శ్రీనివాస్ గారు ధన్యవాధాలు :)

జీడిపప్పు చెప్పారు...

హమ్మయ్యా, మొత్తానికి పేరాలుగా విడగొట్టేశారు :)
ఎప్పటిలాగే చక్కని పోస్టు అందించారు. చదువుతుంటే బాల్యంలోకి వెళ్ళి ఒకసారి ఊరిలో తిరిగొచ్చిన ఫీలింగ్ వచ్చింది!!

పరిమళం చెప్పారు...

నేస్తం గారూ ! చర్చ చాలా జరిగిపోయింది ....లేటుగా వచ్చాను కానీ నేనుకూడా ఓ శీర్షిక చెప్పనా ? " 6 మాటలు 3 ఆటలు " బావుందా ? మీ టపా మాత్రం భలే వుందండీ !

నేస్తం చెప్పారు...

జీడిపప్పు గారు ఆ ..నేర్చుకున్నా అండి.. :)
పరిమళం గారు చాలా బాగుంది :)

శ్రుతి చెప్పారు...

నేను అలిగేశాను, రోజు టపా కోసం చూస్తున్నానా మరి చెప్పకుండా కాదు కాదు నాకు చూపించకుండా ఇలా పోస్ట్ చేసేస్తారా? మరిప్పుడు నేనేం వ్రాయాలి నా టపాలో?

వా.....వా........ కాపీ కొట్టే చాన్స్ లేకుండా అందరూ చదివేశాక చూపించారూఊఊఊఊ.....

నిజంగా గవర్నమెంట్ బడిలో చదువు చాలా బాగుంటుంది. నేను కూడా ZPH బడిలోనే చదివాను.
భలే గుర్తుచేశారు. Thanks.

సిరిసిరిమువ్వ చెప్పారు...

భలే అందరికి మరొకసారి పరీక్షలు కాపీలు గుర్తు చేసారు. మీదైన శైలిలో ముగింపు బాగుంది.
నేనయితే నా పేపరు వెనకవాళ్లకి కనపడకుండా వ్రాసిన దాని మీద ప్రశ్నాపత్రం పెట్టుకునేదాన్ని. 10వ తరగతిలో వరుసకి మామయ్య గారబ్బాయే నా వెనకాల, కాస్త బిట్ పేపర్ అన్నా చూపించు అని బతిమలాడుకునేవాడు..నేను హుహూ అనేదాన్ని. వాళ్లన్నయ్య అయితే ఓ వార్నింగు కూడా ఇచ్చాడు, మా తమ్ముడికి పేపరు చూపించకపోతే నీకుందే అని..మనమా భయపడేది:)

నేస్తం చెప్పారు...

శ్రుతిగారు హ హ హ అంత చక్కని కవితలతో అలరించే మిమ్మల్ని చూసి నేను కాపీ కొట్టకుండా చూసుకోండి :)
మువ్వ గారు నిజమే కష్ట పడి చదివి ఊరికే వెనుక వాళ్ళకు చూపాలంటే బాధ వచ్చేస్తుంది ఒక్కోసారి .. మొత్తానికి భయపడలేదన్నమాట :)

చైతన్య చెప్పారు...

@నేస్తం... హ్హ విడ్డురమే మరి...
అసలు విషయం ఏంటంటే... నేను ఆ స్కూల్ లో ఆ సంవత్సరమే చేరాను...క్లాసు లో మిగత పిల్లలకి ఈ అబ్బాయి సంగతి తెలుసు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండేవారు... ఎగ్జామ్స్ అప్పుడు ఇలా చేస్తాడని తెలీక నేను బాగానే మాట్లాడేదాన్ని ఆ అబ్బాయితో... ఆ చొరవతో అతను ఎగ్జామ్స్ అప్పుడు తన ప్రతాపం నా మీద చూపించాడు...
తర్వాతి సంవత్సరం నేను కూడా జాగ్రత్త పడ్డానులెండి.

నేస్తం చెప్పారు...

హూం ..చైతన్య గారు నాకూ మీకులా మొహమాటం,జాలీ ఎక్కువే.. పోనీలే అని హెల్ప్ చేస్తే అవతలివారు అదేదో వాళ్ళ హక్కులా ఫీల్ అయితే కోపం వచ్చేసేది ... అందుకే కుసుమతో అలా గొడవ పడేదాన్ని :)

teresa చెప్పారు...

అప్పుడప్పుడు మీ టపాలు చదివి బాగున్నాయని అనుకోడం, బొమ్మల్ని కాసేపు పరిశీలనగా చూసి 'ఎంత మంచి టేస్ట్' అనుకోడమే గానీ కామెంట్ ఎప్పుడూ పెట్టలేదు.
ఇవాళ తీరిగ్గా మీ పోస్టులన్నీ తిరగేశాను, చాలా బాగా రాస్తున్నారు. మూడు తరాల సందడి ఉన్న ఉమ్మడి కుటుంబంలో పెరటం అదృష్టం! మీ జ్ఞాపకాల భోషాణంలోంచి మరిన్ని సొమ్ములు పంచుకుంటారని ఆశిస్తూ, అభినందనలు!

నేస్తం చెప్పారు...

teresa గారు మీ అభినందనలకు ధన్యవాధాలు.. నిజమే ఆ కుటుంభం లో ఉన్నంత కాలం ఎన్నొ విషయాలను చక్కని ఙ్ఞాపకాలుగా మలుచుకున్నాను ..హ్మ్మ్ ఇప్పుడు ఏ విషయం అంత చక్కని అనుభూతిని ఇవ్వడం లేదు ఎంచేతనో ...

Padmarpita చెప్పారు...

నేస్తం..... మీ దగ్గర బోలెడన్ని కబుర్లున్నాయండి!!!
మీరు వ్రాస్తూండండి... మేము చదివేస్తుంటాము!!!

అజ్ఞాత చెప్పారు...

నేను ఆరు ,ఏడు తరగతులు పక్కా గవర్నమెంట్ స్కూల్ లో చదివాను.లేతుగా వెళితే రూం బయట కుర్చోవలసి వచ్చేది.నాకు కూడ మీలాంటి సంగటనలే జరిగాయి.తర్వాత రాస్తాను.

నేస్తం చెప్పారు...

ఇంకేం ఎదురు చూస్తూ ఉంటాను మీ పోస్ట్ కు.. :)

మరువం ఉష చెప్పారు...

చివరాకరికి వచ్చి ఇంకేం చెప్పగలను? టపా,వ్యాక్యలూ అన్ని చదివి ఆనందించి, నా గతంలోకి ఒకసారి చూచి వచ్చాను. బాగా వ్రాసారు, నేస్తం. అభినందనలు.

నేస్తం చెప్పారు...

ఉష గారు ధన్యవాదాలండి :)

అభిసారిక చెప్పారు...

చాలా బాగుంది :)

నేస్తం చెప్పారు...

చాలాబాగా రాసారండి ..ఇదే మొదటి సారి మీ బ్లాగును చూడటం :) బొమ్మ మీరే వేసారా చాలా బాగుంది

ప్రియ చెప్పారు...

Very good post. How bittersweet the post is.

Nice write up.

Visit,

priyamainamaatalu.blogspot.com

నేస్తం చెప్పారు...

ప్రియ గారు కృతజ్ఞతలు .. :)

swapna@kalalaprapancham చెప్పారు...

నాకు కూడా కొంచెం ఇలాంటి experiences అయాయి స్కూల్ లో .
ఒకతి ఉండేది మహా స్వర్దాపరురాలు . అ అమ్మాయికి అన్ని ఎగ్జామ్స్ లో నేను చూపించాలి ఎందుకంటే మా రోల్ నుంబెర్స్ పక్క పక్కనే. ఎగ్జామ్స్ టైం లో మాత్రం ఇంటికి వెళ్ళేటపుడు నాతో వస్తుంది మల్లి ఇంకేపుడు రాదు ఎగ్జామ్స్ కదా చూపించాలి కదా. ఏమినా చూపించకపోతే అందరితో చెప్తుంది నాకు చూపించలేదు అని అది ఏదో నేను తప్పు చేసినట్టు గా. ఇలా ఉంటారు జనాలు ఎం చేదాం లెండి.

నేస్తం చెప్పారు...

హ హ స్వప్న గారు అయితే అందరికీ ఇలాంటివి చాలా జరిగాయన్నమాట