
'దీనికేపనీ చేత కాదు 'అని నా మీద ఒక ISI ముద్ర వేసి పడేయడమే కాకుండా వచ్చే పోయేవాళ్ళకు ఆ విషయాన్ని పిలిచిమరీ చెప్పేవారు మా ఇంట్లో వాళ్ళందరూ...అసలు ఏదన్నా పని చెబితే కదా నాకు వచ్చో రాదో నిరూపించడానికి ,ఎంత సేపూ నీకేంరాదు,నీకేం చేత కాదు అని అనేయడమే ..
అసలా పేరు రావడానికి కారణం ప్రొద్దున లేవడం పాపం మా అక్కా, చెల్లెళ్ళు అందరూ నేను ముందు స్నానం చేస్తా అంటే నేను ముందు అని ఒకటే గొడవ పడేవారు,సరేలే పాపం వాళ్ళకు మళ్ళీ నేను కూడా పోటి ఎందుకు అని ఎంతో త్యాగం చేసి వాళ్ళూ అందరూ తయారయ్యేవరకూ పడుకునేదాన్ని,ఈ నా త్యాగ నిరతి అర్దం చేసుకోకుండా బారెడు ప్రొద్దెక్కేవరకూ లేవని నిద్ర మొహం అని నాకొక బిరుదు ప్రదానం చేసేసారు, తీరా నేను తయారయ్యే సరికి అక్క వంటలో అమ్మకు సహాయం చేస్తే మిగిలిన చెల్లెళ్ళు ఒకరు గదులు శుబ్రం చేయడం ఇంకొకరు దేవుని గది లో తులసిమాలలు కడుతూ అన్నమాచార్య కీర్తనలు పాడేసుకుంటూ నాన్న గారి పూజకు సిద్దం చేసేసేవారు.. ఇంక నేను చేయడానికి ఇంకేం మిగిలింది ఈ లోపల కాలేజ్ టైం అయ్యే పోయేది ....
సరే దాని మానాన బుద్ది గా చదువు కుంటుంది అని మా అమ్మ ఊరుకునేదా .. అబ్బే... ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరితో మిగితా వాళ్ళ గురించి ఏమి బెంగలేదు కానీ అండి, ఇదిగో దీనికే బొత్తిగా ఏదీ చేతాకాని రకం... కోడిగ్రుడ్లు ఉడక బెట్టమంటే గ్రుడ్డుకు ఎన్ని కప్పుల నీళ్ళు పోయాలమ్మ అని అడుగుతుంది ..అత్తారింటికి వెళితే ఎలా బ్రతుకుతుందో అని జాలి పడుతూ పరువు తీసిపడేసేది ,ఇక ఆ వచ్చేవాళ్ళు తమ కళ్ళ ముందు నేను ఒక చేతిలో గ్రుడ్డు తో మరొక చేతిలో కప్పుతో ఉన్నట్లు ఉహించేసుకుని మరీ నా వైపూ విచిత్రం గా చూసేవారు.
పోనీ ఎప్పుడన్నా కాళీ దొరికినపుడు గదులు తుడుద్దామని చీపురు తీసాననుకోండి.. వద్దులే అక్కా నువ్వు తుడిచినా మళ్ళీ మేము తుడవాల్సిందే ,ఎందుకూ డబల్ పని అని మెల్లగా నా చేతిలో చీపురు లాగేసుకునేవారు,చెప్పొద్దూ నాకు తిక్కలేచేది..దొంగ మొహాలు .. వాళ్ళ స్కూల్ లో ప్రతీ శనివారం పిల్లలకు శుబ్రత నేర్పే వంకతో స్కూల్ మొత్తం తుడిపించేవారు ,మరి నేను చదివిన గవర్నమెంట్ స్కూల్ లో మహారాణులం మేము ,పని మనిషి ఉండేది ..ఆ కుళ్ళు ఇలా తీర్చుకునేవారన్నమాట ..
సరే ఇదిలా ఉండగా ఒక రోజు మ పెద్ద చెల్లి హడావుడిగా వచ్చీ నాకు మా అక్కకు మద్య ఒక దుప్పటి పడేసింది ..తను హోం సైన్స్ చదివేది,అది క్లాస్ లో ఏం చదివేదో తెలియదు కాని రోజూ ఇంట్లో నుండి పప్పులు ,ఉప్పులూ తీసుకు వెళ్ళడం అక్కడ వండుకుని తినడం లేక పోతే ఊలు బండీలు ,బట్టలు తీసుకు వెళ్ళి స్వెటర్లు,డ్రెస్సులు కుట్టడం ఇదేపని ..ఈ మాత్రం దానికి నువ్వు అన్ని డబ్బులు పోసి హోంసైన్స్ చదవాలా !!!నాలుగు రోజులు వంటగదిలో ఉన్నా, టైలర్ దగ్గరకు వెళ్ళినా ఇంతకన్నా బాగా నేర్చుకుంటావ్ అని మా తమ్ముడు ఏడిపించేవాడనుకోండి అది వేరే విషయం ..
సరే అది వచ్చీ రాగానే అక్కా అక్కా ,ప్లీజ్,ప్లీజ్ ,ఇన్నాళ్ళూ రికార్డ్ వర్క్ లో పడి ఈ దుప్పటి కుట్టడం అశ్రద్ద చేసేసాను ,మా మేడం నాలుగు రోజుల్లో ఇచ్చి తీరాలని చంపేస్తుంది కాబట్టి మీ అందరి హెల్పూ నాకు కావాలి అంది ,
తీరా దుప్పటి చూస్తే అంగుళం కాళి లేకుండా మొత్తం డిజైన్ వేసేసి ఉంది .. అయ్యబాబోయ్ నాలుగు రోజుల్లో అయ్యే పనేనా అన్నాను ..అందుకే కదక్కా మీ హెల్ఫ్ అడుగుతున్నా అంది బ్రతిమాలుతూ.. దొరికింది గాడిద అనుకుని,మరి నాకు కుట్టడం రాదని ఎప్పుడు అంటావ్ కదా ఇప్పుడు సరిగా కుట్టక పోతే తిట్టుకుంటావ్ ,నాకెందుకు బాబు అన్నాను బెట్టు చేస్తూ ... ఈ కుట్టు చాలా సులువక్కా ..దీన్ని గొలుసు కుట్టు అంటారు,ఎలా కుట్టినా పర్వాలేదు మిగిలిన రకాలు నేను ,అక్కా కుడతాం అంది బ్రతిమాలుకుంటు..
దొరికిన చాన్స్ ఎలా వదిలేస్తా, దుప్పటి ఒక కొస నా వైపు లాక్కుని ఏకాగ్రతగా కుట్టెయడం మొదలెట్టా .. కాసేపటికి నా కొస వైపు చూస్తూ కెవ్వున కేక పెట్టింది .. ఏంటి పిల్లా నా దుప్పటి నాశనం చేసేసావ్ అని ఒక్క అరుపు అరిచింది.. నువ్వే కదే కుట్టు ఎలా వచ్చినా పర్వాలేదు అన్నావ్ అన్నాను ఉక్రోషంగా .. కుట్టు ఎలా వచ్చినా పర్లేదన్నాను కాని దుప్పటి రెండు కొసలు కలిపి కుట్టెయమనలెదు .. వార్నాయనో నీ సంగతి తెలిసి కూడా ఇచ్చాను చూడు ...నన్ను అనుకోవాలి ...వద్దులే అక్కా కావలంటే రాత్రి పడుకోకుండా అయినా కుట్టుకుంటాకాని నువ్వు మాత్రం కుట్టకు అంది నేను కుట్టిన కుట్లన్నీ విప్పి పడేస్తూ..
రాక్షసి ఒక్క సారి ఏదో తప్పు చేస్తే ఇలాకాదని చెప్పచ్చుగా గాడిద అనుకుని అక్కడనుండి హాల్ లోకి వచ్చాను. మా అమ్మ కుట్టు మిషన్ దగ్గర చిరిగిన బట్టలన్ని ముందేసుకుని కళంకిత సీరియల్ స్టార్ట్ అయిపోయిందేమో ఒక సారి పిన్ని గదిలో చూసి రామ్మా అని కంగారు పడిపోతుంది ... మా T.V పాడైందిలేండి అప్పుడు..నేను విసుగ్గా వెళ్ళా బోయి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.. ఈ రోజు బట్టలు కుట్టి శబాష్ అనిపించుకోవాలి.. పైగా మిషన్ కుట్టడం చాలా వీజీ.. ఆ చక్రం ఇలా తిప్పి అలా కాళ్ళతో తొక్కితే కుట్టు పడిపోతుంది అనుకుని ..అమ్మా చక్కగా వెళ్ళి పిన్నితో హాయిగా సీరియల్ చూడచ్చు కదా ఈ బట్టలు నేను కుట్టిపెడతా అన్నాను ఎంతో ప్రేమగా ...
నువ్వా... అని అనబోయి .....ఓ కళంకితా .....కళలకే అంకితా అని టైటిల్ సాంగ్ విన బడగానే జాగర్తాగా కుట్టమ్మా మరి అని వెళ్ళిపోయింది ..హమ్మయ్యా అనుకుని చాలా హాయిగా నవ్వేసుకుని చక్రం ఒకసారి ఇలా తిప్పి కాళ్ళతో అలా తొక్కగానే మిషన్ అదేదో సౌండ్ చేస్తుంది .. ఏంటబ్బా అని చూస్తే చక్రం బెల్ట్ బయటకు వచ్చేసి ఉంది ..దాన్ని కష్టపడి పెట్టి ఎంత కుట్టినా చక్రం వెనక్కి తిరుగుతుంది కాని ముందుకు తిరగదే ...కుట్టు వంకర టింకర .. అంటే చూడటానికి ఈజీ గా అనిపించినంతమాత్రానా నిజంగా ఈజిగా ఉండవన్నమాట కొన్ని..ఈ లోపల పుటుక్కుమని సూది కాస్త విరిగిపోయింది ... అయిపోయానురా దేవుడో అనుకునేంతలో సీరియల్ అయిపోవడం ..మా అమ్మ నన్ను 2 జన్మలకు సరిపడా తిట్లు తిట్టడం అన్నీ టక టకా జరిగిపోయాయి ...
నేను ఏడుపు మొహం వేసుకుని వీది మెట్లదగ్గర కూర్చున్నా .. ఈ లోపల అమ్మ ముగ్గుచిప్ప పట్టుకుని నెలగంట స్టార్ట్ కావడం తో తన ముగ్గు ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంది ..ఈ లోపల మా ఆఖరు చెల్లి నా పక్కన కూర్చుని, ఎహే ఆ ఏడుపు మొహం ఏంటి..నీకంతగా ఇంట్లో సాయం చేయాలంటే ఒక మంచి అయిడియా ఇస్తా చేస్తావా అంది .. ఏంటి అన్నాను..
మా అమ్మ వైపు చూపిస్తూ చూసావా ఆ ముగ్గుచిప్ప చేతిలో ఉంది అంటే మూడో ప్రపంచ యుద్దంవచ్చినా పట్టించుకోదు ..అసలు ముగ్గు మీద కార్టూన్లు అన్నీ అమ్మను చూసే వేసారేమో అనిపిస్తుంది ..అలా వదిలేయాలే గాని ఒక k.G ముగ్గుపిండి ఇస్తే వంచిన నడుం ఎత్తకుండా మరీ ముగ్గులు వేసేస్తుంది అంది...
నిజమే అమ్మకి ముగ్గులు వేయడమంటే ఎంత ఇష్టం అంటే తనకు రాని ముగ్గులంటూ ఉండవేమో ..నెలగంటలో వేసే చందమామ నే లతలు ,తీగలు వేసి అరగంట అలంకరిస్తుంది .. ప్రతి గురువారాలూ గదులు కడిగినపుడు గదినిండా అంగుళం కాళి లేకుండా ముగ్గువేసి తొక్కకుండా తిరగమంటుంది ..ఆ పద్మ వ్యూహంలో పొరపాటున తొక్కామో అయిపోయామే.. అసలు అందువల్లే సగం నడుం నెప్పి అని బాదపడేది..
కాబట్టి అక్కా.. నువ్వు ఆ ముగ్గువేసే బాధ్యత తీసుకున్నావనుకో ఇటు అమ్మకి బాధలేకుండా చేసేదానివి అవుతావ్ అటు నాన్న తో అమ్మకు ఈ విషయం మీద పడే తిట్ట్లు తప్పించిన దానివి ,అవుతావ్ పైగా బోలెడు సాయం చెసినదానివి అవుతావ్..ఒక వేళ ముగ్గు సరిగా వేయక పోతే గుప్పెడు ముగ్గుపిండి వేస్ట్ అంతే కదా అంది...నాకు ఆ నిమిషం లో మా చెల్లిని చూడగానే ఎంత ఎదిగిపోయావమ్మా అని పాడాలనిపించింది..
సరే మరుసటి రోజు అమ్మ మీద యుద్దం ప్రకటించి బలవంతంగా ముగ్గు చిప్ప పట్టుకుని బయటకు వచ్చాను ,కాని
...చుక్కలు పెడుతుంటే అవి వంకర టింకర వెళ్ళిపోవడం మొదలయ్యాయి ..చీ..చీ ఇది కూడా మద్యలో ఆపేస్తే అంతకన్నా అవమానం ఉండదు అనుకుని ఎలాగో అలా చుక్కలు పెట్టడం పూర్తి చేసి ముగ్గు పెట్టడం మొదలు పెట్టేసరికి ముద్దలు ముద్దలు వస్తుంది ఈను ..అమ్మ ఇలా అంటే అలా సన్నంగా పడి చస్తుందిగా నా దగ్గర ఏంటి ఇలా వేషాలు వేస్తుంది అని పంతంగా పెడుతుంటే ఒకరిద్దరు దారిన పోయేవాళ్ళు ఆగి మరీ చూసి ఏంటమ్మా ఈ రోజు మీ అమ్మగారు పెట్టడం లేదు అని ఆగి మరీ అడిగారు,ఒకరిద్దరు పిల్లకాయలు మొహం మీదే చాలా చండాలం గా ఉంది అనేసారు .. ఓయ్ పొండి ఇక్కడి నుండి అని తరిముతుంటేవాళ్ళను అప్పుడు వినబడింది మా ఎదురింటి నుండి నవ్వులు ...
మా ఎదురింటి పక్కన చిన్న సందులా ఉండి లోపల పెద్ద కుటుంభమే ఉంటుంది కాకపోతే నాకు అంతగా తెలియదు అమ్మా వాళ్లకు వాళ్ళ పెద్ద వాళ్ళు తెలుసు..ఆ ఇంటి అమ్మాయిలు రోజు ముగ్గులేస్తారు .. ఆ పిల్ల నవ్వి ఊరుకోవచ్చుగా వాళ్ళ అన్నను పిలిచి చూపి మరీ నవ్వుతుంది.. వాడికి మాత్రం బుద్ది ఉండక్కరలేదు 36 పళ్ళూ బయట పెట్టి మరీ నవ్వాడు..అత్త తిట్టినందుకు కాదు గాని తోడి కోడలు నవ్వినందుకు అని ముగ్గు సరిగా రాలేదు అనే బాధ కంటే వాళ్ళ నవ్వులు భరించలేక పోయాను ..మొత్తానికి ఏదో వేసాను అనిపించి ఇంట్లోకి వచ్చేసాను దెబ్బకు నడుం పట్టేసింది చూపుడువేలు మొత్తం రోడ్డుకు తగిలి గీరుకుపోయింది..
ఇంక ఈ ముగ్గు జోలికి వెళ్ళకూడదురా బాబు అనుకుంటుండగా నా ముగ్గు చూసి మా మేడ మీద కాపురం ఉంటున్న పిన్నులు క్రిందకు దిగీ అక్కా ఈ రోజు ముగ్గెవరు వేసారు అని అడుగుతుంటే వచ్చింది కదా కసి ..ఇక లాభం లేదు ఇప్పుడు గనుక మానేసానో నాకు చేతకానిదాన్ని అన్న పేరు సార్దకం అయిపోతుంది ..తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు అదే వస్తుందిలే అనుకుని మరుసటి రోజు నుండి ఎదురింటి అమ్మాయి రాక మునుపే గభ గభా ముగ్గేసి పారిపోయేదాన్ని ఇంట్లోకి .....
ఏం బ్రతుకురా బాబు దాన్నెవరో చూసి నేను భయపడటం ఏంటి అని మనసులో నన్ను నేను తిట్టుకున్నా ఏదో సిగ్గు ఉండేది ..క్రమం క్రమం గా నేను గమనించింది ఏమిటంటే నాలో ముగ్గు వేసే ప్రావీణ్యం మెరుగుపడటమే కాకుండా ఆ ఎదురింటి అమ్మాయి నాతో పోటి పడటానికి చూసేది...నేను కుందేళ్ళ ముగ్గు వేస్తే తను ఏనుగులు ముగ్గు నేను సీతాకోక చిలుక లేస్తే తను తూనీగలు..నేను మందారాలేస్తే తను గులాబీలు వేసేది .. అంతే నా మీద నాకు ఫుల్లు కాన్ ఫిడెంట్ వచ్చి పడిపోయింది.. ఇక అక్కడి నుండి రోజు కాలేజ్ నుండి రాంగానే మా అమ్మ వేసిన ముగ్గుల పుస్తాకలు తెరవడం కష్టమైన ముగ్గులన్నీ ప్రాక్టీస్ చేయడం అవి వేయడం..మా మద్య ప్రచ్చన్న యుద్దం కాస్తా పబ్లిక్ యుద్దం అయి కుర్చుంది .. మా వీదిలో పిల్లలు రెండు వర్గాలు అయిపోయి అటు ఇటు ముగ్గులు జాగర్తగా పరిశిలీంచేవాళ్ళు... అటు వాళ్ళ కుటుంబం లో పిల్లలు ఆమెకు సపోర్ట్ ఇస్తే ఇటు మా ఇంట్లో పిల్లలందరూ నాకు సపోర్ట్ .. కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా వాళ్ళా వాళ్ళూ మా వాళ్ళకు కనబడితే మొహాలు తిప్పేసుకునేవారు ...
ఈ లోపల జనవరి పస్ట్ రావడం మొదలైంది పిల్లలందరం ఈ సారి వాళ్ళ కంటే మాదే గొప్పగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాం ..ఏమేం వేయాలో ముందే నిర్ణయించుకున్నాం .......సరిగ్గా రేపు ఫస్ట్ అనగా ముందురోజు ముగ్గు అయిపోయింది, అమ్మా ....ముగ్గు తెప్పించి ఉంచు అని మరీ మరీ అమ్మకు చెప్పి నేను కాలేజ్ కి వెళ్ళి రంగులు కొనుక్కుని ఇంటికి వచ్చీ ఆ రాత్రి చూద్దును కదా నిన్న మిగిలిన గుప్పెడు ముగ్గు తప్పా ఇంకేం లేదు ...అమ్మా !!ముగ్గేది అని అరిచాను... అయ్యో మర్చిపోయానే ఈ సారికి ఏదన్న చిన్న ముగ్గు పెట్టెసేయ్ .. రేపు తెప్పిస్తాలే అంది అమ్మ పెద్దమ్మతో కబుర్లు చెబుతూ.... ఎంత కోపం వచ్చిందంటే నువ్వే వేసుకో ..నీకసలు నేనంటే ఇష్టమే లేదు ...నా మాట అంటే లెక్కేలేదు అని బుగ్గల మీదనుండి వద్దాన్న కారిపోతున్న నీళ్ళను కనబడ కుండా నా గదిలో దూరి తలుపేసుకున్నా .. ఎంత వద్దనుకున్నా ఎదురింటి వైపూ మా కిటికీ కర్టెన్ వారగా తీసి లైట్ ఆపు చేసి ఎవరికీ కనబడకుండా చూస్తున్నాను.. వాళ్ళు పువ్వులూ ,రంగులూ ,మెరుపులూ ఒక్కటేమిటి తెగ అలంకరించేస్తున్నారు. ..తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ నాకు ఆ సమయం లో ఎంత ఏడుపొచ్చింది అంటే.... అయిపోయింది ఇంక వాళ్ళే గెలిచేసారు తెల్లారగానే వాళ్ళు విజయ గర్వం తో చూస్తారు ... వీది లో పిల్లలందరికీ వాళ్ళే గొప్పోళ్ళు అయిపోతారు ఈ రోజు తరువాత ఎన్ని ముగ్గులు పెడితే ఏం లాభం .. అనుకుని ఏడ్చుకుంటూ పడుకున్నా ..
తెల్లారి చూద్దును కదా ఎదురింటి ముగ్గు అంతా భీభత్సం గా చెరిగిపోయి అసహ్యం గా ఉంది ... మా ఇంటి ఎదురుగా మాత్రం చక్కగా అందం గా బుల్లి బుల్లి ,రంగు రంగుల పువ్వులతో అందమైన ముగ్గు నీట్ గా ఉంది happy new year అని రాసి...మా వీదిలో పిల్లలందరూ ఆగి మరీ చూస్తున్నారు..రాత్రి బాగా గాలి వీచి చిన్న పాటి జల్లు పడిందంట ,అమ్మ తెల్లార గట్టా లేచి వేసింది మా ముగ్గు ....నేను సైలెంట్ గా నా గదిలోకి వెళ్ళీ తలుపు గడియ వేసుకుని హేయ్ డండనకా... డండనకా ...డన్ అని కాసేపు డాన్స్ చేసాను....
మొన్నా మద్య ఇండియా వెళితే పిన్ని నువ్వు ఇంట్లో వేసుకునే బట్టలేమన్నా కుట్టించుకోవాలంటే మన శ్రీవల్లి కి ఇస్తే తనకి సాయం చేసినట్లు అవుతుంది అంది.. యే శ్రీవల్లీ అన్నాను అయోమయంగా...అదేనమ్మా మన ఇంటి ఎదురుగా ముగ్గులేసేది మీతో పాటు ... ఎవడో వెదవను ప్రేమించిందిలే వాడితో ఇంట్లో చెప్పకుండా పెళ్ళీ చేసుకుని ఒక సంవత్సరం కాపురం వెలగపెట్టింది ..దొంగ వెదవ ఇప్పుడు కట్నం కావలని బాగా కొట్టి పంపేసాడు పుట్టింటికి ... చావో రేవో అక్కడే ఉంటా అని మొన్నా మద్య అక్కడికి వెళితే చంపబోయాడంట ..ఇంక కన్నోళ్ళు వదులుకోలేరుగా ఆ పిల్లను వాళ్ళకు పుట్టిన పసిపిల్లను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు పగలు స్కూల్ లో టీచర్ గా చేస్తుంది కాళి టైములో బట్టలు కుడుతుంది అంది ...
ఎదురింటిలో చాలా మంది పిల్లలు ఉండేవారు కాని నాతో ముగ్గులేసిన అమ్మాయి ఈమే ఒకటేనా ??? మనసంతా బాధగా అయిపోయింది... నువ్వే ఇవ్వుపిన్ని అని పిన్ని చేతనే ఇప్పించా ... ఆమె ను ఒక్క నిమిషం
కూడా బాధగా చూడటం ఊహించుకోలేక పోయాను...
కూడా బాధగా చూడటం ఊహించుకోలేక పోయాను...