30, డిసెంబర్ 2008, మంగళవారం

సొగసు చూడ తరమా!!!


మావయ్య పెళ్ళి కనీ వెళ్ళి వారం రోజులు అమ్మమ్మ ఇంటిదగ్గర బిషాణా వేసి ఇంటి కొచ్చిన నేను మా పిన్ని మాటలు విని పక్కన బాంబ్ పడినట్లు అదిరిపడ్డాను..మీ ఫ్రెండ్ స్వాతి రెండుసార్లు వచ్చి వెళ్ళింది, తనకు పెళ్ళి కుదిరింది అంటా..తాంబూళాలకు పిలుద్దామని వచ్చింది అంది..( స్వాతి ఎవరో తెలుసుకోవాలంటే ఈ అమ్మాయి చాలా మంచిది పోస్ట్ చదవాల్సిందే.. :))

స్వాతి కి అప్పుడే పెళ్ళా..ఇంటర్ ఎగ్జాంస్ అయి నెల కూడా కాలేదు.. అంత తొందరేమొచ్చింది అనుకుంటూ వాళ్ళ ఇంటికి బయలుదేరాను .దారంతా ఆలోచనలే..పాపం డాక్టర్ కావాలని ఎన్ని కలలు కన్నాది..నా వల్ల వాళ్ళ అమ్మమ్మగారితో తిట్లు తిన్నపుడల్లా ఉడుకు మోత్తనంతో ...."చూస్తూ ఉండవే ,నేను బాగా చదువుకుని మా పిన్నిలా డాక్టర్ ను అయి పేదవాళ్ళకు ఉచితం గా సేవ చేస్తూ ఒక మదర్ ధెరిస్సాలా పేరు తెచ్చుకుంటాను.. మీ నాన్న గారికి ఎలాగూ మొత్తం ఆడపిల్లలే కదా ..నీకు ఉత్తరం ముక్క రాసే పాటి చదువు రాగానే ఎలాగూ పెళ్ళి చేసేస్తారు ..నేను డాక్టర్ ను అయ్యేసరికి ,నువ్వు ఇద్దరు పిల్లలని వేసుకుని మా ఇంటికి నన్ను చూడటానికి రాకపోతావా..మా అమ్మమ్మకి ఎవరు గొప్ప అనేది తెలియకపోతుందా అని శపధాలు చేసేది..

అలాంటిది సడన్ గా ఈ పెళ్ళి ఏమిటి..అది కూడా మరీ ధారుణం గా ఇంటర్ అవ్వగానే.. ఎలాగన్నా ఆపాలి ...బ్రతిమాలో,బెధిరించో పెద్దవాళ్ళకు నచ్చ చెప్పాలి,లేకపోతే ఫ్రెండ్షిప్ కి అర్దం ఏమిటి అని చాలా ఆవేశం గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ..మెల్లిగా గేట్ తెరుచుకుని లోపలికి అడుగేస్తూ... ,నన్ను చూడగానే బోరున వాటేసుకుని ఏడ్చే స్వాతిని ఎలా ఒదార్చాలో ఆలోచిస్తూ దాని బెడ్ రూం దగ్గరకు వెళ్ళి చూద్దును కదా ... మాయా బజార్ లో సావిత్రి మల్లే .. అహనా పెళ్ళియంటా ,ఓహొ నా పెళ్ళియంటా అని డాన్స్ కడుతూ జడ అల్లుకుంటున్న స్వాతి కనబడింది ..

నన్ను చూడగానే రండి మేడం .. నేను అంటే నీకెప్పుడు పడదు.. సరిగ్గా సమయానికి ఉండవు ..మొన్న అందరూ ఉన్నారు నువ్వు తప్ప అని అలక స్టార్ట్ చేసింది ..దాని మాటలు మధ్యలోనే ఆపు చేస్తూ అదేంటే అప్పుడే పెళ్ళి ఏంటి అన్నాను ..నా వైపు చూస్తూ హూమ్మ్..అని నిట్టూర్చీ మరి తప్పదుకదా ,ఎప్పుడోకప్పుడు చేసుకోవాలి కదా.. కాకపోతే మీ అందరి కంటే కొంచం ముందు పెళ్ళి చేసుకుంటున్నా అంతే అంది.. అవును అనుకో కాని మరీ ఇంత చిన్న వయసులోనా!!!అన్నాను.

నీకో విషయం తెలుసా నేను నీకంటే పెద్దదాన్ని నాకు మొన్న 18 యేర్స్ వచ్చేసాయి అంది ...అయితేమటుకు అప్పుడే చేసేసుకోవాలా!!...మరి డాక్టర్ అన్నావ్ ,సేవ అన్నావ్ ..కనీసం నీ పేరు పక్కన డిగ్రీ అన్నా లేకుండా పెళ్ళి చేసుకుంటే ఈ రోజుల్లో ఎలాగే అన్నాను..అవుననుకో....కానీ సేవ చేయాలంటే డాక్టరే అవ్వాలాఏంటి?..ఆ మాటకొస్తే పెళ్ళికి ముందే చేయాలా సేవ? ..అయినా ఆయన పెళ్ళి అయినాకా చదువుకో అన్నారు అంది చిన్నగా సిగ్గుపడుతూ..


నాకు చిర్రెత్తుకొచ్చింది ... ఏంటీ చేసేది సేవ పెళ్ళి అయ్యాకా!!.. పతి సేవ చేద్దువుగాని..నేనింకా నిన్నేదో బలవంతంగా ఈ పెళ్ళికి ఒప్పించాసారేమొ అని పరిగెట్టుకొచ్చేసా..చూడబోతే నువ్వే చేసుకుంటా అని వాళ్ళను ఒఫ్పించినట్లు ఉంది ..అయినా నీకేం తక్కువే,ఒక్కగానొక్క అమ్మాయివి,మీ నాన్న గారికి నిన్ను చదివించే స్తోమత ఉంది మరి నీ బాధ ఏంటి చక్కగా చదువుకోక,కాస్త చదువుకుని ఏడిస్తే ఇంత కంటే మంచి సంబంధం ..మంచి జాబ్ ఉన్నవాడు వస్తాడు తెలివితక్కువదానా..పెద్దవాళ్ళు అన్నాకా పెళ్ళి చేసేస్తే బాగుంటుందనే అనుకుంటారు ..కొంచం నచ్చ చెప్పచ్చుగా వాళ్ళకు అన్నాను అలుపొచ్చి ఆగుతూ ...


అంతా విని అయ్యిందా నీ గొడవ అన్నట్లుగా ఒక చూపు చూసి ,బీరువాలో నుండి ఒక ఫొటో తీసుకొచ్చి నా చేతికిచ్చింది..ఆ ఫొటో చూడగానే నాకు నోట మాట రాలేదు .. పెళ్ళికొడుకు మన మిల్క్బోయ్ మహేష్ బాబులా తెల్లగా,అందంగా,స్టైల్ గా సినిమా హీరోలా ఉన్నాడు..ఇక అది స్తర్త్ చేసింది మాట్లాడటం ..దీనికి మల్లే ఒక్కడే కొడుకంటా..కాబట్టి ఆడపడుచుల గోల లేదు, వేరే ఊరిలో జాబ్ కాబట్టి అత్తమామల పోరులేదు ,పైగా బోలెడు ఆస్తి.. బాగా మాట్లాడుతున్నాడు ,ఇష్ట పడి చేసుకుంటున్నాడు ..పైగా ఇంట్లో అందరికి నచ్చేసాడు ఇలాంటి అబ్బాయిని వద్దంటే మా వాళ్ళు ఇంకోసారి ఇంతకంటే మంచిసంబంధం తేగలరా.... నేను మరీ నువ్వు అనుకున్నంత వెర్రి వెంగళప్పను కాదే ..అన్నీ తెలుసుకునే ఒప్పుకున్నా అంది.

అవుననుకో .. కానీ .. అదీ నాకు ఏం మాట్లాడాలో అర్దంకావడం లేదు..నాకు అప్పటికే జ్ఞానోదయం అయి చాలా సేపైంది..ఇదిగో నీకో విషయం తెలుసా ..ఈ పెళ్ళి కుదిర్చిందే మా అమ్మమ్మ.. నువ్వు ఇలా నా మనసు పాడు చేస్తున్నావని తెలిసిందనుకో .. ఏ నోటి తో నిన్ను పొగిడిందో అదే నోటి తో నిన్ను భయంకరంగా తిడుతుంది చూసుకో అంది ..దెబ్బకు కధ కంచికి నేను మా ఇంటికి ..


అయితే అసలు గొడవ అక్కడి నుండి మొదలుఅయింది నాకు .. మరుసటి రోజునుండీ ఫోన్ చేసి చంపేసేది నన్ను.. నాకు మీ అందరి కంటే ముందు పెళ్ళి అవుతున్నా సరే .. రేపు మీ అందరి పెళ్ళిళ్ళప్పుడూ నేను మిమ్మల్ని చూసి బాధ పడకూడదు.. అయ్యయ్యో వీళ్ళు నాకంటే బాగా సందడిగా చేసుకున్నారే అని..మీ అందరూ మీ పెళ్ళప్పుడు మన స్వాతిలా తయరవ్వాలి.. మన స్వాతి కొన్న చీరల్లాంటి చీరలు కొనుక్కోవాలి ..మన స్వాతి వేసుకున్న నగలు లా చేయించుకోవాలి అంతెందుకు స్వాతి లా పెళ్ళి చేసుకోవాలి అనుకోవాలి అని ఒకటే సోది..తల్లోయ్ అలాగే అంటాగాని హింసపెట్టకు అనేదాన్ని ..
అది.. అన్నట్లుగానే ప్రతీ విషయం లోను జాగర్తగా ఎంచి కొనుక్కుంది ..ఆ అబ్బాయికంటే పెళ్ళిలో తీసిపోకూడదని సగం జీవితం బ్యూటీ పార్లర్ లోనే గడిపేసింది మొహానికి ఫేషియల్స్ చేయించుకుంటూ ...


మొత్తనికి రానే వచ్చింది పెళ్ళి రోజు .. మా ఫ్రెండ్స్ మి అందరం ఉదయమే వెళ్ళాం ..మధ్యాహ్నం వరకు బాగానే ఉన్న పెళ్ళి పందిరి లో కొంచం కలకలం మొదలైంది ..విషయం ఏమిటంటే బంగాళా ఖాతం లో వాయుగుండం ..ఆ ముందురోజునుండే వర్షం వస్తున్నప్పటికీ ఉదయం మరింత జోరుగా కురవడం మొదలైంది.. మా ఫ్రెండ్స్ అందరం కబుర్లలో బయట వీచే ఈదురుగాలులను ,హోరువర్షాన్ని లెక్కచేయలేదు ..కాని మధ్యాహ్నం రావలసిన పెళ్ళికొడుకు ఇంకా రాకపోయే సరికి అందరి మొహంలో ఏదో తెలియని ఆదుర్దా కనబడటం మొదలైంది..ఈ విషయం స్వాతికి చెప్పకుండా మాలో మేమే రహాస్యంగా మాట్లాడుకునేవాళ్ళం ..


సాయంత్రం అయింది .. ఇప్పటిలా అప్పట్లో సెల్ఫోన్స్ లేవు ..సాయంత్రానికి తెలిసిన విషయం ఏంటంటే హోరుగాలివలన దారిలో చెట్ట్లు అడ్డంగా పడిపోవడం వల్ల పెళ్ళికొడుకు కార్ ,వాళ్ళ బంధువులు వస్తున్న పెళ్ళి బస్ ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోయాయి ..వచ్చేస్తారు అవి క్లియర్ అవ్వగానే అని..ఈ లోపల స్వాతి కి తెలిసిపోయి దిగాలుగా కూర్చుంది.. మేమందరం ఏం కాదులేవే వచ్చెస్తున్నారంట అని దైర్యం చెబుతున్నాం ..

ఈ లోపల ఎవరో పెద్దావిడ ముందు మంగళ స్నానాలకు ఏర్పాట్లు చేసేద్దాం... అబ్బాయి రాగానే ఆలస్యం లేకుండా పనులు అయిపోతాయి అంది .. వెంటనే స్వాతికి పాత చీర ఒకటి కట్టి (ఆ చీర చాకలికి ఇచ్చేస్తారు) నగలవి కొన్ని తీసివేసి ..తలంటు వేయాలి కాబట్టి జుట్టు విప్పదీసి కూర్చోబెట్టాం .. చీకట్లు ముసురుకుంటున్నాయి పెళ్ళికొడుకు ఇంతకీ రాడు అంతకి రాడు పెళ్ళి ముహుర్తం ఇంక దగ్గరికొచ్చేస్తుంది..ఇంక బంధువుల లో మెల్లగా గుసగుసలు మొదలైనాయి ...

నేను చెప్పలే .. ఆ పంతులితో పెట్టకన్నయ్యా ముహుర్తం అంటే విన్నాడా.. ఇప్పుడుచూడు ఏమైందో అని ఒకావిడ...పెట్టినముహుర్తం మార్చకూడదంట .. ఏం చేస్తారో ఏమో అని మరొక ఆవిడా ఇలా మాట్లాడు కోవడం మొదలెట్టారు ....ఇంక పెళ్ళి ఆగిపోయినట్లే అనుకున్న తరుణం లో సరిగ్గా ముహుర్తానికి 5 నిమిషాల ముందు పెళ్ళికొడుకు వచ్చేసాడంటా అనే వార్త గుప్పుమంది ..

ఒక్కసారిగా హడావుడి మొదలైంది ,నాదస్వరాలు మోగడం start అయింది.. అసలేం జరుగుతుందో అర్దం అయ్యే లోపు మా స్వాతిని ఎవరో హడావుడిగా తీసుకు వెళ్ళి పీటల మీద కూర్చోపెట్టేసారు ..బజంత్రీలు.. బజంత్రీలు ఎవరో అరుస్తున్నారు ...పెళ్ళికొడుకు ఆ హోరులో జీలకర్రా ,బెల్లం స్వాతి నెత్తి మీద పెట్టేసాడు.. ఒక పక్క మిగిలిన మా ఫ్రెండ్స్ ఒకరు పై పైన దువ్వి జడ అల్లుతుండగా,ఇంకెవరో కాస్త పౌడర్ అద్ది బుగ్గ చుక్క ,పెళ్ళి బొట్టు పెట్టారు ..బాసికం కూడా కట్టాకా ఒకరు పూల జడ కుడుతుండగా ..పంతులుగారు పెళ్ళిబట్టలు పై పైన వేసి తాళి కట్టేయ్ అన్నారు.

పెళ్ళికొడుకు తాళి కడుతుంటే ఆ చేతుల మధ్యలో నుండి బిక్కమొహం వేసి నా వైపు చూస్తున్న స్వాతిని చూస్తే నాకెందుకో ఏడుపొచ్చేసింది...కాని అనుకున్న సమయానికి పెళ్ళయినందుకు స్వాతి అమ్మమ్మ గారు అమ్మ ,నాన్నలు ఎంత ఆనందపడ్డారో మాటల్లో చెప్పలేను..

ఆ తరువాత స్వాతి అత్తవారింటికి వెళ్ళడం ..వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు ఇల్లు మారిపోవడం వల్ల నేను చాలా రోజులు స్వాతిని చూడలేదు.ఒక సారి గుడిలో వాళ్ళ అమ్మగారు కనబడి స్వాతి వచ్చింది అని చెబితే ఇంటి అడ్రస్సు తీసుకుని వెళ్ళా ..నేను వెళ్ళేసరికి ఒక పాపను వీపున పడుకోబెట్టి ఊపుతూ ,బాబుకి అన్నం తినిపిస్తూ చిట్టీ చిలకమ్మా ,అమ్మా కొట్టిందా అని పాడుతూ మాతృమూర్తికి ప్రతీకలా ఉన్న స్వాతి నిండైన అందాన్ని చూస్తే సొగసు చూడతరమా అని పాడబుద్దేసింది

28 కామెంట్‌లు:

లక్ష్మి చెప్పారు...

బాగుంది మీ స్వాతి కథ, మొత్తానికి డాక్టర్ కావాలీ అన్న కోరిక గట్టెక్కిపోయిందా?

లక్ష్మి చెప్పారు...

అన్నట్టు మీ టపాల్లో పెట్టే చిత్రాలు అద్భుతంగా ఉంటాయండీ.

నేస్తం చెప్పారు...

thanks అండి లక్ష్మి గారు.. అసలు టపాలకంటే బొమ్మలు వెతుక్కోడానికే నాకు ఎక్కువ time పడుతుంది .. :)

సిరిసిరిమువ్వ చెప్పారు...

బాగుంది, కథ రివర్సు అయిందన్నమాట.

శ్రుతి చెప్పారు...

కనులకింపుగా ఉంది మీ పుత్తడి బొమ్మ
ఏంటి నమ్మడం లేదా? నిజమండి. నా కైతే భలే నచ్చేసింది. అదేనండి మీ బ్లాగు. మళ్ళీ వస్తానే.

నేస్తం చెప్పారు...

మువ్వగారు thanks అండి .. శ్రుతి గారు నేను ఎదురు చూస్తూ ఉంటా అయితే :)

visalakshi చెప్పారు...

నేస్తం గారు మీ ఫ్రెండు స్వాతిని ప్రతి విషయంలోనూ మీరు డామినేట్ చేస్తున్నారు కదా !ఈ అమ్మాయి చాలా మంచిది లో కూడా........మొత్తానికి సొగసు చూడతరమా అంటూ మెప్పించేసారు.బాగుంది మీ కధ .

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

ఎప్పటిలా బాగా వ్రాసారు...

ప్రతాప్ చెప్పారు...

బావుంది. మీరు రాసే విధానం కూడా బావుంది.

నేస్తం చెప్పారు...

హ..హ.హ నిజమే వేద గారు ,నాకు ఒక్కోసారి తలుచుకుంటే నవ్వు,జాలి వస్తాయి..ఈ బ్లాగ్ గురించి తనకు తెలియదు.. చదివిందో మూడో ప్రపంచ యుద్దమే మా ఇరువురికీ .. ప్రతాప్ గారు,ప్రపుల్ల చంద్ర గారు thanks అండి .. :) ఒక్కో సారి అనుమానం వస్తుంది నేను రాస్తున్న శైలి ఎవరికన్నా అర్దం అవుతుందా అని..హమ్మయా :)

saisahithi చెప్పారు...

హమ్మయ్య ...tension పెట్టి చివరికి స్వాతి పెళ్ళి చేసారండి.కధనం బాగుంది. అంతకు మించి బ్లాగు లో చిత్రాలు చాలా బాగున్నాయి.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వావ్ చాలా బాగుంది నేస్తం.

నేస్తం చెప్పారు...

thanks andi sreekanth gaaru sai saahiti gaaru :)

Ajit Kumar చెప్పారు...

చాలా బాగుంది.బొమ్మలు బాగున్నాయ్, కధనం బాగుంది.

నేస్తం చెప్పారు...

thanks andi ajit gaaru

kiraN చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)


-కిరణ్

నేస్తం చెప్పారు...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)kiran గారు

cbrao చెప్పారు...

ఇది నిజకథా లేక కల్పితమా? కల్పితమైతే కథ బాగుంది కాని కథా ప్రయోజనమేమిటి? చదువు కంటే పెళ్లి ముఖ్యమనే సందేశం ఇచ్చినట్లు కదూ? దురద్రుష్ట వశాత్తు మన కథా నాయకుడు ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే, నాయిక తన కాళ్లపై నిలబడటానికి కావలసినంత చదువుకోవద్దా?

కొత్త నేస్తానికి నూతన సంవత్సర శుభాకాంషలు.

cbrao
San Jose, CA

నేస్తం చెప్పారు...

కల్పితం కాదండి ..నిజ్జంగా జరిగిన నిజం ..అసలందుకే నేను తనని చదువుకోమని ఒత్తిడి చేసింది :)కాని దేవునిదయ వల్ల తను ఇప్పుడు బాగానే ఉంది ..అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు కాబట్టి..జాగర్త గా ఉండాలి.. చదువు తప్పని సరి అని ఈ కధ లో దాక్కున్న సందేశం కూడా :)

నేస్తం చెప్పారు...

happy new year andi cbrao gaaru :)

పరిమళం చెప్పారు...

బాగుంది నేస్తం!జరిగిన కథ,మొత్తానికి స్వాతి పెళ్ళి అయింది.

నేస్తం చెప్పారు...

thnaks అండి parimalam గారు

గీతాచార్య చెప్పారు...

పాపం పెళ్ళైతే అయింది కానీ చదువు అటకెక్కింది అన్నమాట. అవును అమ్మ సొగసు చూడ తరమా? ఏమంటారు?

నేస్తం చెప్పారు...

నేనేమంటాను మీరేదంటే అదే అంటాను :)

Mana Brundavanam చెప్పారు...

mee writing style naku baga nachhindi. oka roju koorchuni mottam blog chadivestanu.

Unknown చెప్పారు...

mee writing style naku baga nachhindi. oka roju koorchuni mottam blog chadivestanu.

Ravi చెప్పారు...

Chala baaga blogaru. Climax super ga vundi.

tulasi చెప్పారు...

nenu ivale mee blog chusanandi .....chala bavundi ..inni rojulu ela miss ayyano naku ardam kavatledu