11, ఏప్రిల్ 2011, సోమవారం

గీతాంజలి

'భౌ 'భయపడ్డారు కదా...భయం మాట ప్రక్కన పెట్టు అసలెవరు నువ్వు అని అంటున్నారా? అయ్యబాబోయ్ అలా భయపెట్టేయకండీ ...నేను నేస్తాన్ని.మీరలా మర్చిపోతే ఒప్పుకోనంతే:) ..సరే విషయానికోచ్చేస్తే టైటిల్ చూసి గీతాంజలి సినిమా సమీక్షనో, లేక ప్రేమకధలు పలురకాలు లో గీతాంజలి గాడి గురించో రాస్తున్నాను అనుకుంటే తప్పులో కాలేసినట్లే .నిన్న అనుకోకుండా గీతాంజలి సినిమా చూస్తుంటే అలా ఏంటో ఏంటో చాలా విషయాలు గుర్తోచ్చేసాయి .సరేలే అని ఇక్కడ రాసేసుకుంటున్నా అంతే :)

ఎన్ని మంచి సినిమాలు చూసినా కొన్ని సినిమాలు మాత్రం చాలా రోజులు మనల్ని మర్చిపోనివ్వకుండా వెంటాడుతూ ఉంటాయి .అలాంటి వాటిల్లో నాకు బాగా నచ్చేసినవి స్వర్ణ కమలం ,సప్తపది ,పడమటి సంధ్యారాగం,మౌన రాగం ఇదిగో ఈ గీతాంజలి మొదలైనవి అన్నమాట .అయితే ఈ సినిమా చూడటానికి మాత్రం అబ్బో చాలా పెద్ద కధ జరిగింది .కొద్దిగా ఓపిక చేసుకోండి .మనం ప్లాష్ బ్యాక్ కి వెళ్ళామంటే సుత్తి ఓ రేంజ్ లో కొడతాం .మీకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా :)

ఈ సినిమా వచ్చేసరికి నేను ఆరో ,ఏడో చదువుతున్నాను .సరిగా గుర్తులేదు .అప్పట్లో వేసవి సెలవలు వచ్చాయంటే చాలు మా ఇంట్లో అమ్మ ,పెద్దమ్మ ,పిన్నులు పోటీలు పడి మరీ ఎవరి చెల్లెళ్ళను వాళ్ళు మా ఇంటికి తీసుకోచ్చేసేవారు.అసలే మా ఇంట్లో జనాభా ముప్పై మందికి పైగా ఉండేవాళ్ళం.ఇక అందరూ వస్తే అబ్బో భలే సందడిగా ఉండేది . అలా ఒక పిన్ని చెల్లే రాజమండ్రి ' కృష్ణక్క' (అంటే తను కూడా పిన్నే అవుతుంది అయినా అక్కా అని పిలిచేవాళ్ళం) .తను మా నాన్నమ్మ కు సొంత మేనకోడలు (తమ్ముడి కూతురు) కావడం వల్ల మిగతా పిన్నుల చెల్లెళ్ళ కంటే ఈ కృష్ణక్క తో ఎక్కువ చనువు ఉండేది మాకు .అందులోనూ ఈ రాజమండ్రి వాళ్ళు కబుర్లు భలే చెప్తారేమో రాత్రిళ్ళు మేడ పై నేను, మా పెద్దక్క, కృష్ణక్క అంటరాని వాళ్ళలా దూరంగా పక్క వేసుకుని తెగ కబుర్లు చెప్పెసుకునేవాళ్ళం.

"అప్పుడేమో నేను బస్ స్టాప్ దగ్గర నిన్చున్నానా, ఆ సిరాజ్ ఏమో నా ప్రక్కనే నించున్నాడు.నాకు చాలా భయం వేసేసింది ..'కృష్ణా' నువ్వు లేకపోతే నేను బ్రతకలేనూ అన్నాడు . అసలే వాడు ముస్లిం ,నేను హిందూ .వాళ్ళింట్లో తెలిస్తే ఖైమా కొట్టేస్తారు, మా ఇంట్లో తెలిస్తే చెప్పులు కుట్టేస్తారు . దానికి తోడు మా కిరాతకుడు చంటన్నయ్య లేడూ .. డేగ కళ్ళు వేసుకుని ఎప్పుడూ నాకు కాపలా కాయడమే . వాడు గాని చూసాడో అయిపోయానే. అసలు ఈ అన్నయ్యలున్నారే .పరమ కంత్రీలు .వీళ్ళు మాత్రం ఊరందరి అమ్మాయిలకూ లైన్ వేయచ్చు .మనల్ని మాత్రం ఎవ్వరూ చూడకూడదు .దొంగ మొహం గాళ్ళు " ఇలా అది కబుర్లు చెపుతుంటే మేమిద్దరం కళ్ళ ముందు సీన్లు ఊహించుకుంటూ వినేవాళ్ళం. అప్పటికి నేను చిన్నపిల్లని కావడం వల్ల నన్ను ముందు జోకోట్టేసి తరువాత బోలెడు సీక్రెట్స్ మాట్లాడుకునేవారనుకోండి.నేను కూడా వాళ్ళను ఆట్టే ఇబ్బంది పెట్టి టైం వేస్ట్ చేయకుండా కళ్ళు మూసేసుకుని మరీ జీవించేసి వినేసేదాన్ని.

అలా ఒకరోజున "అసలు సిరాజ్ ఎలా ఉంటాడో తెలుసా అచ్చం ' నాగార్జున 'లా ఉంటాడు "అంది తన్మయంగా .అప్పటికి మాకు నాగార్జున అంటే ఎవరో తెలియదు. నాగార్జున ఎవరక్కా ??అన్నాం ఇద్దరం ఒకేసారి . " నాగార్జున " ఎవరా!!! హూం ..తప్పు మీది కాదే మీ అమ్మలది .సంవత్సరానికో మారు సినిమాకు తీసుకువెళతారు.అది కూడా వాళ్ళ తరం హీరోల పాత డొక్కు సినిమాలు ...చూసిందే చూస్తూ ,చూసిందే చూస్తూ మీ కొంపకు వచ్చినందుకు మాకూ అవే చూపిస్తూ.. ఛీ వెధవ జీవితం" అని విసుక్కుంది."నీకేంటక్కా.. మీ వూర్లో రంభ ,ఊర్వసి ,మేనక దియేటర్లో పెద్ద మావయ్య పని చేస్తున్నాడుగా.మీరు ఎంచక్కా బోలెడు సినిమాలు చూడచ్చుగా అంది మా హేమక్క కొద్దిగా కుళ్ళుతూ.. "హ్మం ..ఎంచక్కా చూడచ్చా ??? ఎంత చక్కగా చెప్పావే నా తల్లీ .,, అసలు వాడు అక్కడ ఏడుస్తున్నాడు కాబట్టే ఓ సినిమా లేదూ ,సింగినాదం లేదూ నా బతుక్కి ...మా ఊర్లో మంచి సినిమాలన్నీ అందులోనే తగలడతాయి .నేను గాని ఫ్రెండ్స్తో వెళ్ళానో ప్రతీ తలకు మాసిన వెధవా నన్ను గుర్తుపట్టేసి మా అన్నయకు చెప్పెయడమే .. వీడికి తోడు చంటన్నయ్య ఇద్దరూ కలిసి క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారు" అని వాపోయింది .


అయ్యోపాపం మేము జాలిగా చూసాం."ఇదిగో ఇప్పుడే చెపుతున్నా .రేపు మీ అమ్మావాళ్ళు సినిమాకి తీసుకు వేళతారుగా ..ఏం సినిమాకి వెళదాం అనగానే నేను గీతాంజలి గీతాంజలి అంటాను .మీరు కూడా గీతాంజలి గీతాంజలి అనండి .పిల్లలం అందరం ఒక్క మాట మీద ఉంటే తప్పకుండా తీసుకువెళతారు అర్ధం అయ్యిందా!!!లేకపోతే మీతో అస్సలు మాట్లాడనే మాట్లాడను " అంది.సరే అంటే సరే అన్నాం.ప్రొద్దున్న అనుకున్నట్లుగానే అమ్మా వాళ్ళు సావిట్లో సమావేశం అయ్యారు .ఏ సినిమాకి వెళదాం అంటుండగానే మేము గీతాంజలి కి వెళదాం అని అరిచాము ."గీతాంజలియా అదేవరిది?" పెద్దమ్మ అడిగింది . "నాగార్జునది అక్కా .. నాగేశ్వరరావు కొడుకు ...చాలా బాగుంటుంది అక్కా వెళదాం" కృష్ణక్క బ్రతిమలాడటం మొదలు పెట్టింది."నాగార్జునా అంటే మజ్ను లో ఏక్ట్ చేసాడు వాడేనా ??? అచ్చే ..కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని రేపోమాపో అన్నట్లు చూస్తాడు వాడా ..వాడేం బాగుంటాడే" ఒక పిన్ని మొదట్లోనే వద్దనేసింది.పాపం ఇదేదో చెప్పాబోతుంది కరెక్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు దుర్గన్నయ్యా(మా పక్కింటబ్బాయి), మా ఆఖరుచిన్నాన.. ఏంటి వదినా ???అనుకుంటూ ..

ఏమి లేదు మహేషూ! గీతాంజలి సినిమా అంట ఎలా ఉంది ?కొత్త సినిమా కదా టిక్కెట్లు దొరుకుతాయా? మా అమ్మ అడిగింది." అజ్జి బాబోయ్ వదినా గీతాంజలి సినిమాయా ?ఆ సినిమా చూడాలని ఎలా అనిపించింది ?ఇదేనా చెప్పింది "అన్నాడు కృష్ణక్క ను చూస్తూ.."ఇదిగో బావా ఇప్పుడే చెపుతున్నాను మధ్యలో వస్తే మర్యాద దక్కదు జాగ్రత్త "కృష్ణక్క తర్జని చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. "నువ్వు నోరుముయ్యి" ...వదినా నా మాట విను .దాని అంత పరమ చెత్త సినిమా ఇప్పటివరకూ ఎవరూ తీయలేదంట .దియేటర్ మొత్తం ఖాళియే అంట .బయటకు వచ్చాకా ఇద్దరు ముగ్గురికి వాంతులు కూడా అయ్యాయంట ..తరువాత మీ ఇష్టం" అన్నాడు చిన్నాన .."వాళ్లకు కూడా నీకులాగే తిన్నది అరిగి ఉండదు ..అక్కా నువ్వు గాని ఈ సినిమాకి తీసుకు వెళ్ళకపోతే నేను ఇంక మీ ఇంటికి రాను.. ఇప్పుడే బట్టలు సర్దుకు వెళ్ళిపోతా" బెదిరించేసింది ఇది.. "మరేం పర్లేదు నేను దగ్గరుండి బస్ ఎక్కిస్తాను .ఆల్రేడి చంటిగాడికి ఫోన్ చేసే వస్తున్నాను .నువ్వు దిగగానే చూపిస్తాడు అసలు సినిమా నీకు" అన్నాడు తను కూడా తగ్గకుండా... "పోనీలే మహేషు ..ఎప్పుడో సంవత్సరానికోసారి వస్తుంది ..నువ్వు కరెక్ట్గా చెప్పు విషయం " మరో పిన్ని సమర్ధించింది క్రిష్ణక్కను ..." వదినా నా మాటలు నమ్మడం లేదుకదా...ఇక లాభం లేదు..అరే నువ్వు సినిమా స్టోరీ చెప్పరా వీళ్ళకు" అని అన్నయ్యను వైపు చూసాడు.


"ఏమీ లేదు పిన్ని.., హీరోకి, హీరోయిన్ కి భయంకరమైన రోగాలు ...అయినా ప్రేమించుకుంటారు..ఎవరు ముందు పోతారో అని ఇద్దరు భయపడి చస్తూ ఉంటారు .చివరకి హీరోయిన్నే ముందు మంచం ఎక్కేస్తుంది .చివరకు ఏమవుతుందో వెండితెరపై చూడాలి ..అదీ స్టోరి అని మా వైపు చూసాడు..అప్పటివరకూ గీతాంజలి గీతాంజలి అని గేంతులేసిన నేను, హేమక్కా స్టోరీ వినగానే దెబ్బకి సైలెంట్ .మావాళ్ళందరూ " ఛీ ఇదేం స్టోరీయే ఇంకా నయం దీని మాటలు పట్టుకుని వెళ్లాం కాదు "అని అప్పటికప్పుడు అది వెక్కి వెక్కి ఏడ్చినా సరే పట్టించుకోకుండా ముక్కు పుడకో ,మూడు ముళ్లో మొత్తానికి తీసుకు వెళిపోయారు . . అలా గీతాంజలి సినిమా మొదటి సారి చూడటం మిస్ అయిపొయింది.:)


మళ్లీ రెండేళ్ళకో, మూడేళ్ళ తరువాతో మరి ఒక సారి మా స్కూల్లో నేను ,స్వాతి సీరియస్ గా మా వెనుక బెంచ్ లో కబుర్లు చెప్పుకుంటుంటే శ్రీను వచ్చాడు .(ఈ శ్రీను ఎవరంటే ఒక సారి ప్రేమ కధలు పలురకాలు పోస్ట్ వేసా చూడండి అందులో నాకు గ్రీటింగ్ ఇచ్చాడు చిన్నపుడు అని చెప్పానే ...వాడన్న మాట ) "ఏంటి శ్రీను నిన్న రాలేదే స్కూల్ కి "అన్నాం ఇద్దరం. 'గీతాంజలి సినిమా మళ్ళీ వచ్చింది చూడటానికి వెళ్లాను 'అన్నాడు .నాకు వెంటనే గత చరిత్ర గుర్తొచ్చి .."ఛీ !ఆ సినిమాయా అస్సలు బాగోదంటగా" అన్నాను."ఎవరు చెప్పారు?? నాలుగోసారి తెలుసా నేను చూడటం "అన్నాడు ..."మా అన్నయ్య చెప్పాడు సినిమా ఏం బాలేదని" అన్నాను నేనూ ఒప్పుకోకుండా.."అదీ అలా చెప్పు అన్నయ్యలకు ఇలాంటి సినిమాలు నచ్చవులే" అన్నాడు తాపీగా . నాకు, స్వాతి కి అదేదో పజిల్లా అనిపించింది ".ఏం ఎందుకని " ???ఒకేసారి అడిగాం .వాడు అటుఇటు చూస్తూ "అందులో ఒక భయంకరమైన పాటుంది "అన్నాడు మెల్లగా.."ఏం హర్రర్ సినిమాయా??" అన్నాను అనుమానంగా.."కాదు కాని అమ్మాయిలు చూడకూడదు" అన్నాడు సీరియస్సుగా.. వెంటనే మా స్వాతిదానికి కోపం వచ్చేసింది ..అమ్మాయిలను తక్కువ చేస్తే అది అసలు భరించలేదు.....అంటే.. అబ్బాయిలు చూడచ్చా???అమ్మాయిలు మాత్రమే ఎందుకు చూడకూడదు ???ఒక్క అరుపు అరిచింది .."ఎందుకంటే ..ఎందుకంటే.... అమ్మాయిలు చిన్నపిల్లలు కాబట్టి ..అందుకే చూడకూడదు" అనేసి ఎందుకొచ్చిన గొడవనుకున్నాడో అక్కడినుండి వెళ్ళిపోయాడు ..ఈ లాజిక్ ఏమిటో ఎంత బుర్ర గోక్కున్నా అర్ధం కాలేదు ఇద్దరికీ ..


ఆ తరువాత రెండు రోజులకు నేను మా ప్రక్క వీధిలో ఉండే చిన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లాను ..వాళ్ళ పెద్ద అమ్మాయి భావనక్కా నేను ఒక జట్టు... అది కూడా వరుసకు పిన్నే అవుతుంది కాని అక్కా అనే అంటాను ...తనకి సినిమాల పిచ్చి..కాని తన ప్రత్యేకత ఏమిటంటే సినిమా దియేటర్ లో చూడటం కంటే దాని దగ్గర స్టోరీ వింటే భలే ఉంటుంది. అదేదో సినిమాలో శ్రీ లక్ష్మిలా టైటిల్ నుండి మొదలుపెట్టి మాటలు, పాటలు ,దుస్తులు తో సహా భలే చెప్పేది.. " నిన్నోచ్చా అక్కా నువ్వు సినిమాకి వెళ్ళా వంట కదా "అన్నాను బుద్దిగా కూర్చుని వినడానికి రెడి అయిపోతూ.."ఆ ..గీతాంజలికి వెళ్లాను ...మీ అమ్మమ్మకు చెప్పకే.. ఇది మూడో సారి చూడటం" అంది గుస గుసగా ...ఎటు చూసినా అందరూ గీతాంజలి గీతాంజలి అంటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేసింది.పైగా మూడు సార్లు, నాలుగు సార్లు అని పోటీలు పడి చూస్తున్నారు.."అక్కా.. సినిమా ఏమి బాగోదంటగా ..వాళ్ళిద్దరికీ బోలెడు రోగాలు అంటగా " అన్నాను నేను విన్న లోపాలు వినిపిస్తూ.."నీ మొహం... ఎవరు చెప్పారు ... డిఫరెంట్ లవ్ స్టోరీ ..అసలు నేను చిరంజీవి సినిమాలు తప్పించి ఇంకో సినిమాను పొగడటం చూసావా? అలాంటిది నేనే మూడు సార్లు చూసానంటే ఆలోచించు" అంది ..సర్లే గాని నాకు స్టోరీ చెప్పు అన్నాను ఆసక్తిగా మొహం పెట్టేసి ..."మొహం చూడు ..కొన్ని సినిమాలు చూడాలిఅంతేనే వింటే మజా ఉండదు ..ప్రొద్దున్న లేస్తే గీతాంజలి డ్రెస్సులు వేసి అటు ఇటు తిరిగేస్తూ ఉంటావు ..దాని కోసమైనా సినిమా చూడాల్సిందే" అంది ..అప్పట్లో గీతాంజలి డ్రెస్ లు ,ప్రేమ పావురాలు డ్రెస్ లు అని ఏం సినిమా వస్తే అవి తెగ కోనేసేది అమ్మ .." మరీ... మరి ఏదో భయంకరమైన పాట ఉంటుంది అటగా " అన్నాను భయంగా ..." ఆ ... పాట అంటావా ...ఊ ..చిన్నపిల్లలు చూడకూడదులే మరి "అంది మెల్లగా ...


అందరూ చిన్నపిలలు చూడకూడదు చూడకూడదు అంటుంటే నాకేమో అదేదో భయం పెట్టేసే పాటేమో అని పెద్ద డవుటు.."మరి పెద్దవాళ్ళు ప్రక్కన ఉంటే చూడచ్చా?' అన్నాను ధైర్యం తెచ్చుకుని..."తిక్కదానా తిక్కదానా ..అసలు పెద్దవాళ్ళతో కూర్చుని చూడ కూడనిదే ఆ పాట ..కానీరా బుజ్జీ ..ఆ సినిమా చూస్తున్నంత సేపూ మనం థియేటర్లో ఉన్నట్లు ఉండదు .యే కొడైకేనాలో ,కులుమనాలియో వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది ...భలే ఉంటాయిలే లోకేషన్లు ..అసలు ఎవరైనా లోపలికి వచ్చారంటే హీరోకి ఎలా తెలుస్తుంది అనుకున్నావ్..తలుపు తీయగానే లోపలకి పొగలు పొగలుగా వచ్చే పొగమంచును బట్టి వెనుకకు తిరుగుతాడు ...ఆ పర్వతాలు ,ఆ వానా ...ఎంత బాగుంటాయో ..పైగా హీరోయిన్ ఎంత అల్లరి తెలుసా..ఎవరన్నాఅబ్బాయిలు ఏడిపిస్తున్నారనుకో వాడి దగ్గరకు వెళ్లి నువ్వంటే ఇష్టం ..పెళ్లి చేసుకుందామా అని రాత్రి చర్చ్ వెనక్కి రమ్మని చెప్పి .. తెల్ల డ్రెస్ వేసుకుని భయం పెట్టేస్తూ ఉంటుంది"... అని రెండు, మూడు సీన్లు చెప్పి మరీ ఊరిన్చేసింది..అదేంటో నాకు సూపర్ నచ్చేసేయి ఆ సీన్లన్నీ ..ఇక తప్పదు సినిమాకి వెళ్ళాల్సిందే అనుకుని ఎలా? అని ఆలోచిస్తుంటే మా పెద్దక్క కనబడింది..నేనూ, అది చిన్నప్పటి నుండి ఒకే స్కూల్ ఒకే కాలేజ్ ..అందుకే మా అక్కకంటే దానితోనే నేను ఎక్కువ ఉండేదాన్ని..


"హేమక్కా గీతాంజలి సినిమా అంట..చాలా బాగుంది అంటక్కా" ..అన్నాను దాని ప్రక్కనే చేరి.".అవునంట నా ఫ్రెండ్ కూడా చెప్పింది" అంది .."అయితే పెద్దమ్మను అడగచ్చుగా "అన్నాను ఉత్సాహంగా."ఎవరూ.. మీ పెద్దమ్మా !! కూతురని కూడా చూడదు.. చెప్పుతీసుకుని కొట్టేస్తుంది ..మొన్నేగా ఇంగ్లీష్ ,మేత్స్ మళ్లీ తన్నేను.. రోజు తలుచుకుని ,తలుచుకుని అక్షింతలు వేస్తుందే బాబు ..ఇప్పుడుగాని సినిమా అంటే ఏకంగా తలంబ్రాలే నాకు ..నువ్వే మీ అమ్మను అడగచ్చుగా " అదే సలహా నాకు పడేస్తూ అంది.. "హూం పెద్దమ్మ కనీసం తాలంబ్రాలతో ఆగిపోతుంది ..మా అమ్మ అస్సలు మొహమాట పడదు నాన్నకు చెప్పి దగ్గరుండి మరీ ఆకాశంలో అరుంధతి నక్షత్రం తో సహా చూపించిగాని వదలదు "నిట్టూర్చాను నేను. "పోనీ.. మీ అక్క చేత చెప్పిస్తే?? ..మన ఇంటి మహారాణి కదా...అది తందనాన అంటే తానతందనాన అంటారుగా అందరూ .. అందులోనూ మొన్న ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది" తప్పకుండా ఒప్పుకుంటారు అంది ..".ప్లిచ్ ..వాళ్ళు ఒప్పుకున్నా ఇది ఒప్పుకోవద్దూ ..దానికి మదర్ ధేరిసా...మేరీ మాత..పరలోక ప్రభువు లాంటి సినిమాలు తప్ప ఇంకేవి నచ్చవు ..తిరిగి మనకు క్లాస్ పీకుతుంది" అన్నాను నిరాశగా .."నిజమేనే బాబు మొన్న షాప్ కి తోడు రమ్మంటే దారంతా బైబిల్ చదివి వినిపించేసింది..మరి ఇంకేం చేద్దాం? పోనీ మా అమ్మను నువ్వు, మీ అమ్మను నేను బ్రతిమాలుకుంటే ?"కళ్లెగరేసింది ... అంతే ఆ సాయంత్రం నుండి మరుసటి రోజు ప్రొద్దున్న వరకూ పెద్దమ్మా పెద్దమ్మ పెద్దమ్మా ..పిన్ని పిన్ని పిన్ని అంటూ మా వాళ్ళ చుట్టూ ప్రదిక్షణాలు చేసి మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా దియేటర్లో కూర్చోపెట్టాం..


సినిమా మొదలైంది ...హీరోయిన్ ఎంటర్ అయ్యేవరకూ అబ్బో సూపరు ... ఉన్నట్లుండి హీరోయిన్ ఒక అబ్బాయిదగ్గరకు వెళ్లి లేచి పోదామా అనేసరికి నాకు, మా అక్కకు నూట రెండు ..."ఇదేం సినిమాయే బాబు ..వాడేమో పెద్దా చిన్నా తేడా లేకుండా ఐ లవ్ యూ చెప్పేస్తున్నాడు .ఇదేమో ఏకంగా లేచిపోదామా అంటుంది..చితక్కోట్టేస్తారేబాబు మనోళ్ళు " ...నన్ను గిచ్చేస్తూ చెవిదగ్గర గుసగుసగా అంది ..ఇస్స్ ..అబ్బా ..నాకు మాత్రం ఏం తెలుసు ..చేతిని రుద్దుకుంటూ ప్రక్కకు తిరిగి చూసేసరికి మా అమ్మ నా వైపు కొరకొరా చూస్తూ కనబడింది. గొంతు తడారిపోయింది .".అంటే అమ్మా ...అదినిజంగా లేచిపోదామని పిలవదమ్మా..ఉత్తుత్తినే అలా ఏడిపిస్తుంది అంతే "అన్నాను బలవంతంగా నవ్వుతూ... "నోర్ముయ్ ..ఇంకోసారి ఆ మాట మాట్లాడావంటే కాళ్ళు విరక్కోడతాను "మా అమ్మ ఘాట్టిగా వార్నింగ్ ఇచ్చేసే సరికి సైలెంట్ అయిపోయాను ..ఈ లోపల "నంది కొండ వాగుల్లోనా "పాట మొదలైంది .."అక్కా .. ఈ పాటేనేమోనే చాలా భయంకరంగా ఉంటుంది అంట "అన్నాను ఒక చేత్తో దాని చెయ్యి గట్టిగా పట్టేసుకుని ...ఎహే వదులు పిరికిదానా ..దీనికే భయపడిపోతారా ,,అది విసుక్కుంటూ సినిమా లో లీనమైపోయింది...నేను మాత్రం బోలెడు భయపడిపోవాలని ముందే ప్రిపేరైపోయాను కాబట్టి చెవులు మూసేసుకుని,కళ్ళు మూసేసుకుని మధ్య ,మధ్యలో చూస్తూ ఎలాగోలా పాట అయ్యింది అనిపించాను.. ఏంటో అంత భయపడిపోయారు పిచ్చి మొహాలు ..మామూలుగానే ఉంది కదా అని తెగనవ్వేసుకున్నాను కాని సినిమా సగం అయ్యాకా మొదలైన" ఓం నమః" పాట చూసాక గాని అర్ధం కాలేదు వాళ్ళు అలా ఎందుకన్నారో..'అయ్యబాబోయ్ బుజ్జోయ్ ..వీడెవడే పాట అంతా అదే సీను చూపిస్తున్నాడు.. వద్దు వద్దన్నా తీసుకొచ్చాం కదా ..ఈ రోజు రాత్రి ఇంటి దగ్గరమనకి సామజవరగమనే ...మీ పెద్దమ్మ నన్నేనా చూస్తుంది?" అంది మెల్లిగా .."ఊ ..నిన్నే చూస్తుంది ..మరి మా అమ్మో ?"అన్నాను భయం భయంగా .."మీ అమ్మ నిన్ను చూస్తుంది కాబట్టే మా అమ్మ గురించి అడిగాను ..అంతా నీవల్లే ..రేపటి నుండి నాతో మాట్లాడకు "అంది కోపంగా .."నన్నంటావేంటి..నువ్వు కూడా బాగుంది అనే కదా అన్నావు "నేను ఏడుపుమొహం పెట్టేసాను..పాట అయ్యేంతవరకూ ఇద్దరం వంచినతల ఎత్తితే ఒట్టు .. కాసేపు ఇంటిదగ్గర మాకు జరిగే సన్మానం తలుచుకుని భయపడ్డాను కాని కొద్దిసేపటికే మళ్లీ సినిమాలో లీనమైపోయాను..నిజంగా నాకు ఆ సినిమా ,స్క్రీన్ ప్లే ,లోకేషన్లు ,డైలాగ్స్ అన్నీ పిచ్చ పిచ్చ గా నచ్చేసాయి...సినిమా చూసిన వారం రోజులవరకూ ఆ సీన్లన్నీ కళ్ళ ముందే కనబడేవి..మొత్తానికి సినిమా అయిపోయింది .


మేమిద్దరంటెన్షన్ టెన్షన్ గా మా వాళ్ళ వెనుకే హాల్ బయటకు వచ్చేసాం ...అప్పుడు చూసాం ...మొత్తం మా బేచ్,బేచ్ కళ్ళు అన్నీ ఎర్రగా ఉబ్బిపోయి ఉండటం." ఆ పిల్ల ని చంపేస్తాడేమో అని భయపడిపోయాను " పెద్దమ్మ కళ్ళు ఒత్తుకుంటూ అంటుంది.."అంతే అక్కా మంచివాళ్ళకే దేవుడు అలాంటి కష్టాలు పెడతాడు "అని ముక్కు ఎగబీలుస్తూ మా అమ్మ. "కాని అక్కా ....అమెరికాలోని ఇలాంటి జబ్బులకు బోలెడు మందులు ఉంటాయంటకదా ??/అవి వేస్తే ఆ పిల్లకు తగ్గదంటావా?పిన్ని డవుటు.. ఆ రోగానికి మందులే లేవని వాళ్ళ నాన్న చెప్పాడుగా మరో పిన్ని నిరాశ... "ఎందుకు తగ్గదూ ..మొన్న మా వూర్లో అక్కా ఒక ఆవిడకు ఇలాగే ,,,,,,," అంటూ బోలెడు కధలు ...


హమ్మయ్యా బ్రతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకుని ఇంటికొచ్చేసాము :)

61 వ్యాఖ్యలు:

రాజ్ కుమార్ చెప్పారు...

first comment????

రాజ్ కుమార్ చెప్పారు...

Welcome back nestam akkaa.... :)

రాజ్ కుమార్ చెప్పారు...

.దానికి మదర్ ధేరిసా...మేరీ మాత..పరలోక ప్రభువు లాంటి సినిమాలు తప్ప ఇంకేవి నచ్చవు ..

"నిజమేనే బాబు మొన్న షాప్ కి తోడు రమ్మంటే దారంతా బైబిల్ చదివి వినిపించేసింది.>>>>>>

కెవ్వ్వ్వ్వ్వ్వ్....మొన్నేగా ఇంగ్లీష్ ,మేత్స్ మళ్లీ తన్నేను.. రోజు తలుచుకుని ,తలుచుకుని అక్షింతలు వేస్తుందే బాబు ..ఇప్పుడుగాని సినిమా అంటే ఏకంగా తలంబ్రాలే నాకు ..నువ్వే మీ అమ్మను అడగచ్చుగా " అదే సలహా నాకు పడేస్తూ అంది..
"హూం పెద్దమ్మ కనీసం తాలంబ్రాలతో ఆగిపోతుంది ..మా అమ్మ అస్సలు మొహమాట పడదు నాన్నకు చెప్పి దగ్గరుండి మరీ ఆకాశంలో అరుంధతి నక్షత్రం తో సహా చూపించిగాని వదలదు

మీ పెద్దమ్మ నన్నేనా చూస్తుంది?" అంది మెల్లిగా .."ఊ ..నిన్నే చూస్తుంది ..మరి మా అమ్మో ?"అన్నాను భయం భయంగా .."మీ అమ్మ నిన్ను చూస్తుంది కాబట్టే మా అమ్మ గురించి అడిగాను>>>>>>


ఈ సీన్లు ఊహించుకుంటూంటే... పొలికేక... సూపర్ నేస్తం అక్కా... ః)

అజ్ఞాత చెప్పారు...

thanks for the post.

KumarN చెప్పారు...

మీరు రాసే శైలి, పేరుమోసిన పెద్ద రచయిత్రుల కన్నా, ఎకబిగిన చదివించేలాగా ఉంటుంది నేస్తం గారూ. యు ఆర్ సింప్లీ అమేజింగ్. తరచుగా రాస్తూ ఉండండి.

-- గీతాంజలి వచ్చినప్పుడు ఆరులోనో, ఏడులోనో ఉన్నారా, అయితే మీ వయసు తెలిసిపోయిందోచ్ :-)

--మీరు మౌనరాగం సినిమా గురించి చెపితేనూ....మొదటిసారి అది చూసినప్పుడు నేను అంటారే, అలా అయిపోయాను. ఇప్పటికీ గుర్తు థియేటర్ లోంచి అలా ఓ ట్రాన్స్ లోంచి నడచుకుంటూ ఓ రెండు కిలోమీటర్లు నడచుకుంటూ వెళ్ళిపోయా, దించిన తల ఎత్తకుండా

--ఓం నమ: పాటకే మనం అంత ఇబ్బంది పడే వాళ్ళమే అప్పుడు, ఇప్పుడు ఇంట్లో అందరూ కూర్చుని ఎలాంటి సినిమాలు చూస్తున్నారు? ఇలియానా కూడా మైల్డ్ గా ఉందా? :-)

Sasidhar Anne చెప్పారు...

yahoo!!!!!!!!!!!!!!!!.. Nestam akka back.. raccha raccha.. Akka chala anandam ga vundi.. nee posts ni entho miss ayyam.. :)

Ika post gurinchi kothhaga cheppidhi emundhi.. as usual ga iraga vundi :)

kiran చెప్పారు...

నేస్తం గారూఊఊ :D
టపా రాసినందుకు బోలెడు థాంక్స్..:D
పోస్ట్ కేవ్వ్వ్వవ్వ్వవ్వ్వ్ కేకా..
చివర్లో బాగా టెన్షన్ పడ్డాను..ఎక్కడ మీ అమ్మగారి వాళ్ల చేత తిట్లు తింటారో అని..వాళ్ల ట్విస్ట్ సూపరు..:)
అక్కడక్కడ పంచ్ లు ఇంకా సూపరు..

..nagarjuna.. చెప్పారు...

>>మేరి మాతా..., పరలోక ప్రభువు సినిమాలు తప్ప ఇంకేవి నచ్చవు
లో.....ళ్
వబ్లాస/ సామూహిక లైక్ కొట్టుడు బ్యాచ్....., మీకు పని మొదలైందహో...

Sasidhar Anne చెప్పారు...

// "నేను ఏడుపుమొహం పెట్టేసాను..పాట అయ్యేంతవరకూ ఇద్దరం వంచినతల ఎత్తితే ఒట్టు .//

Post antha bavundi akka..kani 20 years lo entha maarpu.. Ippudu kontha mandhi pedda valle, pillalatho tv lo reality shows perutho pillalatho chepisthunna... daridrapu dances leela ga gurthuvacchayi :(

vani చెప్పారు...

welcome back... madyalo me new post kosam me blog open chestu unna. but enka meru rayaremo ani digulu vesindi :(

Venkat చెప్పారు...

Namaskaram Nestam Akka
chaaaaaalaaaaa rojulu ayindi ee madyalo nenu kud a2 months vacation poyi vachina . vachina roje mee blog open chesi chusina kaani new post raledu emaindo anukunaa mothaniki ee post to iragatesaru

శివరంజని చెప్పారు...

హహహ్హ నేస్తం అక్క పోస్ట్ కెవ్వ్ కేక ...

తింటే గారెలు తినాలి , వింటే బారతం వినాలి , చదివితే మా అక్క పోస్ట్ లు చదవాలి


మా బాబాయి వాళ్ళ చిన్న తమ్ముడికి కి ఇలాగే గీతాంజలి పాటలంటే చాల పిచ్చిగా వినేవాడట ....

ఒకసారి ట్యూషన్ లో ఉండగా దూరం గా మైక్ లోంచి వస్తున్నా గీతాంజలి పాటలు వింటూ .. డాబా పైకి కోతి రావడం చూసుకోలేదట ...అదోచ్చి తల గోకతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అనుకుని కసురుకుని చూసాడట పాపం ..

అప్పడినుండి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గీతాంజలి సినిమా చూసినప్పుడల్లా తెగ ఏడిపిస్తూ ఉంటారు

Unknown చెప్పారు...

నేస్తం గారు కేక పోస్ట్ :)
మేటర్ ఏంటి అంటే .. నేను ఈ సినిమా చూసేసాను .. అయినా కూడా ఎందుకు ఈ పోస్ట్ చదువుతూ పిచ్చ టెన్షన్ పడిపోయా .. .
మీరు రాసింది కామెడి సినిమా + గితంజలి .. ఇంకో కొత్త సినిమా తీసేయ్యచ్చు కదా ..
సూపర్ .. మీరు ఇలాగే వారానికి ఒక పోస్ట్ రాయాలి అంతే ..

మధురవాణి చెప్పారు...

పొద్దున్న అర్జెంటు పని మీద వెళ్ళాల్సి ఉన్నప్పుడే సరిగ్గా మీ టపా కనపడింది.. మొత్తం చదివి లేటుగా వెళ్ళా :P
అబ్బబ్బా.. నవ్వించిన డైలాగ్స్ కి కెవ్వ్ కెవ్వ్ అని అరవాలంటే నా గొంతు పోయేలాగుంది..
Very excited to see you.. Welcome back!!!!!!!! :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Welcome Back నేస్తం :-) Soooo Good to see your post :-)
ఎప్పటి లాగానే పోస్ట్ సూపరు ... మంచి మంచి సెటైర్లతో నవ్వించారు.. నేను కూడా మా పిన్నమ్మలు ఇద్దరిని అక్క అనే పిలుస్తాను :-) వాళ్ళు ఎంత పెద్దయి వాళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు అయినా కూడా నేనంతే పిలుస్తాను :-)
గీతాంజలి రోజులను మర్చిపోలేం.. ఏం..? ఏం..? ఏం..? అంటూ నాగార్జున వేసే ప్రశ్నలను మర్చిపోలేం :-) ప్రతిసీన్ ఒక అద్భుతం అప్పట్లో.. ఇక ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పేదేముంది..
మీ టపా చివర్లో భీభత్సమైన ట్విస్ట్ ఇస్తారసలే ఇక వీపు విమానం మోతే అని భయపడుతున్నాను కానీ చక్కగా ముగించారు.. పోనీలెండి మీ ఇద్దరి అదృష్టం బాగుంది. అలానే యూత్ మరియూ పెద్దలు సినిమా చూసే పద్దతిలో (పెర్సెప్షన్) లో తేడాను మీకు తెలీకుండానే చక్కగా చూపించారు :-P

అనుదీప్ చెప్పారు...

ముందు గా WELOCME BACK అండి మీకు.

చాలా రోజులనుంచి వెయిట్ చేస్తున్న మీ బ్లాగ్ కోసం... మొతానికి మంచి టపాసు లాంటి టప తో వచ్చారు.
ఇంగా మీ టప విషయానికి వస్తే.. టపాసు లాగా బాగా పేలింది అని నా అభిప్రాయం. నాకు గీతాంజలి సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు.. ఈ బ్లాగ్ చదివాక GOOGLE DADY చెప్పారు 19May1989 అని.
ను అయతే దూరదర్శన్ లో పలు సార్లు ప్రదర్శించిన తర్వాత చూసాను అనుకుంట. మంచి సినిమా అని నాక్ కొంచం పేద యాక తెలిసింది లెండి . CINEMA EXPERIENCE కంటే మీరు CINEMA చూడటానికి కష్టపడ్డ EXPERIENCE చాలా బాగా చెప్పారండి. కుమ్మేసార్ అనుకోండి.

అజ్ఞాత చెప్పారు...

Welcome back!!

Missed you Nestam!!

Padmarpita చెప్పారు...

Welcome back....nice to see u in blog.

రాజ్ కుమార్ చెప్పారు...

విషయం ఏమిటంటె.. నాదే ఫస్ట్ కామేంట్... హిహిహి.. సూపరొ.. సూపరు..

హరేక్రిష్ణా.. ఎక్కడున్నావ్??? తొందరగా రండి సార్..!

Sai Praveen చెప్పారు...

చాలా రోజుల తరువాత మీ కబుర్లు చదవడం చాలా సంతోషంగా ఉందక్కా
పోస్ట్ ఎప్పటి లాగే చాలా బావుంది :)

పవన్ కుమార్ చెప్పారు...

నేస్తం అక్క కు స్వాగతం
ఇంక రాయవెమో అనుకున్నా అక్కా. ఇప్పుడు హాపి.
టపా అదిరిపొయింది.

అజ్ఞాత చెప్పారు...

చాల రోజులు తరువాత మీ పోస్ట్ వేసినందుకు థాంక్స్

అజ్ఞాత చెప్పారు...

welcome back nestam garu..
excellent post again...

రాజ్ కుమార్ చెప్పారు...

hi akkaa..

నేస్తం చెప్పారు...

హాయ్ రాజ్ నచ్చిన౦దుకు బోలెడు దా౦క్యూలు ...
అజ్నాత గారు ః)
కుమార్ గారు
>>> మీరు రాసే శైలి, పేరుమోసిన పెద్ద రచయిత్రుల కన్నా, ఎకబిగిన చదివించేలాగా ఉంటుంది నేస్తం గారూ. యు ఆర్ సింప్లీ అమేజింగ్.
నేను డామ్ అని పడిపోయాన౦డి ..హా అప్పుడు ఆరులోకి వచ్చా అనుకు౦టా..అయినా అలా లెక్కలు వేస్తారా ఆయ్ ః)
అవున౦డి మౌనరాగమ్ సినిమా నాకు చాలా ఇష్టమ్.అలా౦టి సినిమాలు మణిరత్న్౦ గారు మాత్రమే తీయగలరని అనిపిస్తు౦ది ః)
శశి పోస్ట్ నచ్చిన౦దుకు ధా౦క్యూ..హూమ్ నిజమే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉ౦ది.. పెద్దవాళ్ళు అలా అదుపులో పెట్టేవారు కాబట్టే ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాళ్ళము ఇప్పుడు వాళ్ళే నేర్పుతున్నారు అన్నీ ...ఒక్కరిని అనేదేము౦దిలే .అన్ని రకాల మార్పులు ఇప్పటి యువత మీద ప్రభావమ్ చూపుతున్నాయి ..
కిరణూ ఊ ఊ ఊ ఊ థే౦క్యూ ధే౦క్యూ ః)చివర్లో టెన్శన్ పడ్డావా ..నీకే అలా ఉ౦టే నా పరిస్థితి ఆలోచి౦చు ః)

నేస్తం చెప్పారు...

నాగర్జునా...లోళ్ళు ఏన్టబ్బా అనుకు౦టున్నా ః)ః) ః)
వాణి గారు అలా మీరు దిగులు పడక౦డి నాక్కూడా దిగులొచ్చేస్తు౦ది ః)
వె౦కట్ అప్పుడు చెప్పానుగా కొ౦త గ్యాప్ తీసుకున్టా అని..మొన్నేదో అలా రాసేసాను అ౦తే ః)
>>తింటే గారెలు తినాలి , వింటే బారతం వినాలి , చదివితే మా అక్క పోస్ట్ లు చదవాలి
ర౦జని ఇక చాలు రాత్రి అన్నమ్ తినక్కరలేదు ..మీ బాబాయ్ గురిన్చి చెపుతు౦టే నాకేదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేస్తున్ది ..కొ౦పదీసి నువ్వూ నేను చుట్టాలన్టావా ః)

నేస్తం చెప్పారు...

కావ్యా సినిమా తీసేద్దా౦ అన్టావా అయితే సరే..నువ్వే హీరోయిన్ ..బొత్తిగా ఒక్క హీరోయిన్ రోల్ ఇస్తే ఏమ్ బాగు౦టున్ది నిర్మాత కూడా నువ్వే ..ఎప్పుడు మొదలు పెడదామో చెప్పు నేను రెడిః)
మధు నన్ను మునగ చెట్టు చిటారు కొమ్మన అతి జాగ్రత్తగా కూర్చోపెట్టేది నువ్వే ః)
హా వేణు గారు..మా పిన్నులు పాపమ్ మా క౦టే అయిదో ఆరో స౦వత్సరాలు పెద్దవాళ్ళు అ౦తే..అ౦దుకే అక్కా అనేసేవాళ్ళ౦ ...హా భయ పడ్డామ్ కాని ఎ౦దుకో తప్పి౦చేసేడు దేవుడు .. ః)

Unknown చెప్పారు...

nenu heroin aa ... (neeeeeeeeeetone aagenaa sangeeeeeeeeeetam ) ani dream lo oo song veskuni vaccha ...

hmm meeru mohamaata pettesar kabatti ee sarki call sheet icchestunna ...

sare nenu city ville lo kastapadi sampadinchina dabbu antha meeke istanu .. meeru matram magadheera budget lo teeyinchali cinemaa sarenaa

నేస్తం చెప్పారు...

అనుదీప్ థే౦క్యూ థే౦క్యూ... ఈ సినిమా ఎనబై తొమ్మిదిలోనా వచ్చి౦ది అమ్మో ..చాలా రోజులై౦దే ః)
పద్మార్పిత నచ్చిన్దా ..హూమ్ చాలా మిస్ అయ్యాను పద్మ ...

అన్నట్లు పద్మ అన్టే గుర్తొచ్చి౦ది
ఒక అమ్మాయి పద్మ అని తను కామెన్ట్స్ పెట్టేది ..ఏమైపోయిన్ది ఆ అమ్మాయి?ఇన్కా మనోహర్,మహిపాల్,నరేష్ న౦ద౦ చాలా మ౦ది ఏమైపోయారు ః)
రాజ్ ..ఈ సారి హరే మిస్ అయ్యాడు ః(
సాయ్ ప్రవీణ్ నచ్చిన౦దుకు ధే౦క్యూ..నాక్కూడా మళ్ళీ మునుపటిలా బ్లాగ్లో కలుసుకు౦టే బాగు౦ది
పవన్ రాసేసా ః) నీ మెసెజ్ కి అప్పట్లో రిప్లయ్ ఇవ్వలేకపోయా..ఎలా ఉన్నావ్ ? ఎలా ఉ౦ది లైఫ్ ః)
ఇక అజ్నాతలు ..అసలె౦దుకని ఎ౦దుకని ఊరు పేరు లేకు౦డా ఆ కామె౦ట్స్ పెడుతున్నారు..భయమేస్తు౦దా నేను అ౦టే ..మీ అ౦దరికీ కూడా ధన్యవాదాలు ః)

నేస్తం చెప్పారు...

పిచ్చి కావ్యా ..డబ్బులు నీవైనపుడు మగధీర ఏము౦ది శక్తి రే౦జ్ లో తీసేద్దామ్..నువ్వేమ్ క౦గారు పడకు ..ః)

Sasidhar Anne చెప్పారు...

//డబ్బులు నీవైనపుడు మగధీర ఏము౦ది శక్తి రే౦జ్ లో తీసేద్దామ్..నువ్వేమ్ క౦గారు పడకు ..ః)

punches lo ninnu kottina varu leru akka.. bava ni taluchukunte chala badha vesthundi.. assalu bava garu intlo matlladuthara?

Unknown చెప్పారు...

picchi nestam gaaru .. naa daggara unnadi 30000 ee .. migata 39 kotla 99 lakshala 70 velu meeru pettandi ..

sarena .. cinema matram taggakudadu ippude cheptunna ...

రాజ్ కుమార్ చెప్పారు...

శక్తి సినిమా మళ్ళీ తీస్తారా??? వావ్.. ః) కెవ్వ్వ్...
ఫొటొగ్రఫీ నాకే ఇవ్వాలండీ ముందుగానే చెప్టున్నా.. :) :)

అజ్ఞాత చెప్పారు...

శింగనమల సారీ సూరి లాంటి నిర్మాత దొరకాలేకానీ నేనూ తీస్తా మౌనరాగాన్ని ఓ రేంజిలో యారాడ బీచ్ సెట్టింగ్ హుస్సేన్ సాగర్ లో వేసి, పక్కనే తాజ్ మహల్ పెట్టించి, వెయ్యిమంది డ్యాన్సర్స్ తో, కత్రిన, బిపాసా, మలైకాలని పెట్టి ఒక సాడ్ సాంగ్ మంచి టైములో పడితే ఉంటుంది .. సినిమా వెయ్యి రోజులు గ్యారెంటీ..

(హీరో, హీరోయిన్లు కొత్తవాళ్ళు)

అజ్ఞాత చెప్పారు...

వేణూ రాం ఏమైనా రాంగోపాల్ వర్మ అనుకుంటున్నాడా? మైసూర్ కెమెరాతో సినిమా తియ్యడానికి?

పద్మవల్లి చెప్పారు...

నేస్తం గారూ, చాలా రోజులకి మీ పోస్ట్ చూసాం. ఎప్పటిలానే సూపర్. పంచ్ లు రాయటంలో ...సరి లేరు మీకెవ్వరూ ....
ఏదైనా ఒక లైన్ తీసుకుని ఇది బాగుంది అని చెప్దామంటే, ఊహు.. మొత్తం పోస్ట్ కాపీ చెయ్యాల్సి వచ్చేలా ఉంది.

Gayathri చెప్పారు...

Nestam,

meru super ehe...frequent ga post cheyandi..lekapothe hunger strike chesestam ;)

..nagarjuna.. చెప్పారు...

సినిమా ఎవరు తీసినా రివ్యూ మాత్రం రాజ్‌కుమార్ చేత రాయించాలని మనవి చేస్కుంటున్నాం.
రాజ్ కుమారు, డైరెట్రు, నిర్మాత, వీరోయిను, వీరోల మీద సానుభూతి(భీతి) లేకుండా యమా కర్కశంగా రాసెయ్ సమీక్షను సరేనా...
తీయబోయే సినిమా ఎక్కడికో........ వెళ్ళి'పోవాలని' మనస్పూర్తిగా కోరుకుంటూ.... :D

>>నేస్తం అన్నారు...

నాగర్జునా...లోళ్ళు ఏన్టబ్బా అనుకు౦టున్నా <<

హ్హ హ్హ హ్హ హ్హ..., అది రౌడి గారి ఇంగిలిపీసు LOOOOOL నుండి ప్రేరణ పొంది [ కాపి కొట్టి] ఆంధ్రీకరించుకున్నా అక్కా.. :)

kiran చెప్పారు...

కావ్య ..u can 't cheat నేస్తం గారు u know .. :P
మీరే రివ్యూ కూడా రాయాలి రాజ్ కుమార్ గారు.. :ద
@sasidhar గారు - :D :D -- నేను కూడా బాగా నవ్వుకున్న ఆ పంచ్ చూసి..

రాజ్ కుమార్ చెప్పారు...

నాగార్జున, కిరణ్ గారు.. థాంక్యు..థాంక్యు.. ః) ః)
నాగార్జునా.. అలా అందరి మీదా అలా కర్కశంగా రాసేస్తానా? సినిమా బాగుంటె అహ. ఓహో అని పొగిడెయ్యమూ..???

gova చెప్పారు...

ఇక్కడ మహేష్ సినిమాల కోసం ఫాన్స్ వెయిట్ చేసినట్టు చేస్తున్నాం మీ పోస్ట్ గురించి
మొత్తానికి వేసారు .ఎలా వుందంటే మీ పోస్ట్.
మా వరంగల్ బాష లో చెప్పాలంటే ఉతికి ఆరేసిండ్రు ..

మా ఊరు చెప్పారు...

ఇక్కడ మహేష్ సినిమాల కోసం ఫాన్స్ వెయిట్ చేసినట్టు చేస్తున్నాం మీ పోస్ట్ గురించి
మొత్తానికి వేసారు .ఎలా వుందంటే మీ పోస్ట్.
మా వరంగల్ బాష లో చెప్పాలంటే ఉతికి ఆరేసిండ్రు ..

Unknown చెప్పారు...

మీరు వస్తారన్న ఆశ వదిలేకున్న నన్ను హఠాత్తుగా నా blog roll లో మీ కొత్త టపా భౌ అంటూ పలకరించింది. welcome back నేస్తం...మళ్ళీ ఎటూ పారిపోకండి

శివరంజని చెప్పారు...

ర౦జని ఇక చాలు రాత్రి అన్నమ్ తినక్కరలేదు ..మీ బాబాయ్ గురిన్చి చెపుతు౦టే నాకేదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేస్తున్ది ..కొ౦పదీసి నువ్వూ నేను చుట్టాలన్టావా ః)>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఈ దెబ్బతో కన్ఫర్మ్........ మీరు మేము చుట్టాలమే అక్కా ....

అక్కా , మేము చుట్టాలం తెలుసా ????(వ్వేవ్వేవ్వేవ్వే ..రాజ్ కుమార్ గారు , అండీ గారు , అప్పు , నాగార్జున గారు మీరంతా కుల్లుకోండి బాగా )

మనసు పలికే చెప్పారు...

హమ్మో హమ్మో.. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు..?????
నేనస్సలు ఒప్పుకోనంతే.. ఇన్ని రోజులూ బ్రేక్ అని మమ్మల్ని ఏడిపించేసి, ఇలా చెప్పా పెట్టకుండా నేను నాలుగు రోజులు ఊర్లో లేని రోజులు చూసి టపా వేసేస్తారా..?? నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను..;)
ఈ బంగారు చెల్లి కోసం ఇదే టపాని మళ్లీ పబ్లిష్ చేసెయ్యండి..:) నేను ఫస్ట్ కామెంటు పెడతా..:)) హిహ్హిహ్హీ..

అక్కయ్యా టపా మాత్రం కేఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏక. అంతే:) తలుచుకుని తలుచుకుని నవ్వుతున్నా..

ప్రవీణ చెప్పారు...

flow చాల బాగుంది..ఎక్కడ ఆపకుండా చదివించారు. చదువుతున్నంత సేపు నవ్వు ఆగలేదు.

మురళి చెప్పారు...

Welcome back.. nice post

నేస్తం చెప్పారు...

పద్మవల్లి గారు చాలా థేంక్స్ అండి.మీరు బజ్లో పద్మ ఉండవల్లిగారేనా?
గాయత్రిగారు ధన్యవాదాలు
కిరణ్ ,రాజ్ :),
అజ్ఞాత గార్లు :)
మా వూరుగారు గోవా కూడా మీరే కదా? ఉతికి ఆరేసినట్లు ఉందా ...భలే చెప్పారు :)
స్పురిత మరి మొన్న తలుచుకున్నారుగా :) పారిపోను కానీ మూడ్ బట్టి అంతే :)

నేస్తం చెప్పారు...

శశి :)
నాగార్జున లోళ్ళు అంటే ఆ తరువాత అర్ధం అయ్యింది.:)
కావ్య సరే అలాగే కానివ్వు నీ ఇష్టం నేను ఎందుకు కాదానాలి ఆ 30000 ఇచ్చేయి మిగిలిన డబ్బు సమకూరగానే మొదలు పెట్టేద్దాం
శివా అవునమ్మా మనం చుట్టాలం :)
అప్పోడు మళ్ళీ పోస్ట్ పబ్లిష్ చేయనా ..అలాగే... అప్పుడు ఎంచక్కా నీ ఒక్క కామెంటే ఉంటుంది
ప్రవీణ గారు నచ్చిందా :)ఆ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు
మురళిగారు థేంక్స్ అండి

పద్మవల్లి చెప్పారు...

<>
అవునండి నేనే. :-))

హరే కృష్ణ చెప్పారు...

హ హ్హ
నాకు మాత్రం గీతాంజలి గాడే గుర్తొచ్చాడు టైటిల్ చూసి
కళ్ళు కాయలు కాచి మజ్ను లో నాగార్జున లా తయారయ్యాము..అక్క పోస్ట్ లు లేక
హమ్మయ్య నాది కూడా అప్పూ డైలాగ్ నే :)

హరే కృష్ణ చెప్పారు...

కృష్ణా' నువ్వు లేకపోతే నేను బ్రతకలేనూ అన్నాడు . అసలే వాడు ముస్లిం ,నేను హిందూ .వాళ్ళింట్లో తెలిస్తే ఖైమా కొట్టేస్తారు, మా ఇంట్లో తెలిస్తే చెప్పులు కుట్టేస్తారు .

హ హ్హ..కేకో కేక

హరే కృష్ణ చెప్పారు...

దానికి తోడు మా కిరాతకుడు చంటన్నయ్య లేడూ .. డేగ కళ్ళు వేసుకుని ఎప్పుడూ నాకు కాపలా కాయడమే . వాడు గాని చూసాడో అయిపోయానే. అసలు ఈ అన్నయ్యలున్నారే .పరమ కంత్రీలు .వీళ్ళు మాత్రం ఊరందరి అమ్మాయిలకూ లైన్ వేయచ్చు .మనల్ని మాత్రం ఎవ్వరూ చూడకూడదు
డేగ కళ్ళు....కెవ్వ్..... వాట్ ఏ కంపారిజన్ సిస్టర్ జీ 200 % కరెక్ట్

హరే కృష్ణ చెప్పారు...

చిరంజీవి సినిమా కోసం బెనిఫిట్ షో టికెట్స్ కోసం ఎదురు చూసేలా ఉంది గీతాంజలి పోస్ట్ నాగర్జున సినిమా కి చిరు కలెక్షన్స్ ని తీసుకురావాలంటే నేస్తం అక్క కే సాధ్యం

beekay చెప్పారు...

Welcome back నేస్తం..

Ennela చెప్పారు...

ఏంటీ! భౌ అని భయపెట్టేద్దామనే!!!!
హమ్మయ్యా మీరొచ్చేసారు, అభిమానులు తెగ వెయిటింగ్...

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

Oh.. nannu bagane gurtu pettukunnaru nestam..
Work ekkuvai poyindi. adi kaka blogullo godavalu chusi chiraku vaccesindi. so, na blog ki kuda selav prakatincha.

Sorry, mee postlu chaduvu tunnanu gani comment cheyatam ledu. na galaxy tab lo telugu chadavachu kani, type cheyataniki ledu. nakemo telugulo comment cheste kani nachadu. kani, ippudu meekosam ee comment.

Intaki, ela vunnaru?
[First adagalsindi.. Chivarlo adiganu kada.. na friend okammayiki ide alavatu. Phone pettesetappudu adigedi.. Bagunnava.. ani! :) ]

నేస్తం చెప్పారు...

:)

అజ్ఞాత చెప్పారు...

thappu lo kaalesinatta leka pappu lo kaalesinatta :)

విరిబోణి చెప్పారు...

Welcome Back Nestam gaaru :))
Mee post lu anni nenu Eekabigina chadivesaanu last year. chala baaga raastaru meeru, koncham lengthy gaa vunati kaani but i like your narrating style. But koncham late gaa comment peduthunna :( endukante mee 2011 post lu anni eppude chustunna :)

నేస్తం చెప్పారు...

అజ్ఞాతగారు అంటే వెరైటీగా ఉంటుంది అని తప్పులో కాలేసారు అన్నాను
విరిబోణిగారు అన్నీ చదివేస్తున్నారా ..గుడ్ గుడ్ :) ధాంక్స్ అండి