22, ఆగస్టు 2009, శనివారం
మా ఇంట్లో వినాయక చవితి
అసలు పండగల విషయం వచ్చేసరికి మా ఇంట్లో ఆడపిల్లలందరికీ చాలా అన్యాయం జరిగిపోయేది ..మా సమానత్వపు హక్కులన్నీ దిక్కులేకుండా పోయేవి..వినాయక చవితికి అయితే మరీనూ .. పండగ ముందురోజునుండే మా తాతయ్య ,తమ్ముళ్ళు హడావుడి మొదలు పెట్టేవారు .అటక మీద పెట్టిన పాలవెల్లి,గంధపు చెక్క పీట క్రిందకు దింపి, వాటికి స్నానాలు చేయించి, చక్కగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పురికాసుని గుమ్మాలకు కొలిచి తెంపి ,మామిడాకులు మద్యలో పెట్టి, ముడివేసి తోరణాలు కట్టి అబ్బో ఇలా ఒకటేమిటీ అన్నీ వాళ్ళే చేసేవారు మమ్మలని ప్రేక్షక పాత్రలకు పరిమితం చేస్తూ..
కానీ నేను ఊరుకోను కదా ప్రతీ పండగకు గొడవే నేను చేస్తా ,నేను చేస్తా అని ,మా తాతయ్య మాత్రం నేను గొడవ చేసే ప్రతి సారీ ముందు నువ్వు పత్రి అని పలకడం నేర్చుకో అప్పుడు చేద్దువుగాని అని తాపీగా బదులు ఇచ్చేవాడు.. అంటే నాకేదో నత్తి అనుకునేరు నాకు కంగారు లో ఒక పదానికి బదులు మరొక పదం పెట్టి మాట్లాడేయడం అలవాటు.. అంటే పత్రిని ప్రత్తి అని ,ఆవేశాన్ని ఆయాసం అని ,ఆదుర్ధాని ఆరుద్ర అని ఇలా ఒకదాని బదులు ఇంకోటి పెట్టిమాట్లాడేసి అర్ధాలు మార్చేస్తూ ఉంటాను..అలా ఆ వీక్ పోయింట్ పట్టుకునే సరికి నా ఆయాసం (ఆవేశం )చప్పున చల్లారిపోయేది ..
ఇంక ఆ మరుసటి రోజు పాలవెల్లికి వెలగ కాయలు,జొన్నపొత్తులు,శీతాఫలాలు, ఇంకా అవేవో చిన్న చిన్న పసుపు రంగు పళ్ళు ఉండేవి అవేంటో మరి ..అవి ఇలా అన్నీ పురికాసుతో వ్రేలాడకట్టి ,పత్రి తో వినాయకుని అలంకరించి పూజ చేసేవారు ..మా తాతయ్య బ్రతికి ఉన్నంత కాలం ఇంటిల్లిపాది పండగలు సావిట్లోనే చేసే వాళ్ళం .. ఆ పండగ రోజు నేను చేసే ఒకే ఒక పని ఏంటయ్యా అంటే నా పుస్తకాలన్నీ వినాయకుడి దగ్గర ఒక్కటి కూడా మిస్ కాకుండా సంచితో సహా పెట్టేయడం .. మాటవరసకు ఒకటి రెండు పుస్తకాలు పెడితే సరిపోతుంది మిగతా పిల్లల పుస్తకాలు ఎక్కడ పెడతారు అని ఎవరు తిట్టినా ఒప్పుకునేదాన్ని కాదు.. నాకు అన్ని సబ్జెక్ట్‌లు డవుటేమరి ..మరి ఊరికే పాస్ అయ్యానా నా చదువు పూర్తి అయ్యేవరకూ ఒక్క సబ్జెక్ట్ కూడా తప్పకుండా .. అదన్నమాట
ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది. అయితే వినాయక చవితి రోజున ఒక్క విషయం లో మాత్రం తలుచుకుంటేనే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది.. అదే హారిది.. ఆ హరిదే అలా ఉంటుందో లేక మావాళ్ళే అంత చండాలంగా వండుతారో తెలుయదు కాని అదంటే నాకస్సలు పడదు .అసలు నాకు తెలియక అడుగుతాను వినాయకుడు కుడుములు ,ఉండ్రాళ్ళు ఇష్టము అని చెప్పాడుకానీ ..యే పురాణాల్లో అయినా మాటవరసకు హారిది ఇష్టం అని చెప్పాడా !!... ఈ విషయం మీకూ, నాకు అర్ధం అయింది కాని మా అమ్మా వాళ్ళకు ఎంత మొత్తుకున్నా అర్ధం అయ్యేది కాదు .. పోనీ ముచ్చట పడి చేసారనుకుందాం ..ఏదో వినాయకుని ప్రీత్యార్ధం నాలుగు కుడుములు ,కాసింత చిన్న గిన్నెలో హారిది వండి పెట్టచ్చుకదా అబ్బే ఆ పేరు వింటేనే వీళ్ళకు ఉత్సాహమే ఉత్సాహం అన్నమాట.. అక్కా! నువ్వు ఆ డేషా తో వండుతున్నావా అయితే నేను ఈ గంగాళం తో వండుతా అని ఒకరంటే, అక్కా!! నువ్వు బెల్లం హారిధి చేస్తున్నావా అయితే నేను పంచదారతో చేస్తాను అని ఇంకొకరు ...పైగా ఈవిడ వండిన హారిది ఆవిడ ,ఆవిడ వండినది ఈవిడ బకెట్లు బకెట్లు పంచుకోవడం ..
ఏం ,ఇంట్లో అంతమంది ఉన్నారు కదా చక్క గా మనిషికో రకం గారెలని,బూరెలని,పులిహోర అని వండితే వినాయకుడేమన్నా వద్దు అంటాడా .. పోనీ వండిన వాళ్ళు వండి ముచ్చట తీర్చుకోవచ్చు కదా ,అహా..అది మాకు కంచాల నిండుగా వేసేసి తినమని హుకుం ..పొరపాటున వద్దు అన్నామో .. నా బుజ్జికదా, మాచిట్టికదా అని బ్రతిమాలాడుతారనుకున్నారా.. మా వాళ్ళ అమ్ములపొదిలో మరుదులనే పవర్ఫుల్ అస్థ్రాలు ఉన్నాయి వాటిని ప్రయోగించేవారు ...ఒక్క సారి పిలవగానే వెంటనే మా నాన్నగారి రెండో తమ్ముడు.. ఆలిబాబా అరడజన్ దొంగల్లో గన్ మేన్ లా ప్రతి విషయానికి వేసేమంటారా అన్న టైపులో ఏం వదినా బెల్ట్ తెమ్మంటావా అనేవాడు ...ఇంకేం చేస్తాం ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్..సాంబార్ బుడ్డి అన్నమాట అందరం .
అలా ఏడుచుకుని ,ఏడ్చుకుని..తిట్టుకుని,తిట్టుకుని మద్యాహ్నపు భోజన సమయానికి అది పూర్తి చేసే సరికి అప్పుడు ఘమ ఘమ లాడుతున్న గుత్తొంకాయ,బంగాళ దుంప పిడుపు,పప్పు చారు వగైరా,వగైరాలతో అన్నానికి పిలిచేవారు..ఇంకేం తింటాం గొంతువరకు ఉన్న హారిది నోట్లోకొస్తుంటే ..అలా చాలా చాల అన్యాయం జరిగిపోయేది..
సరే ఈ విషయం ప్రక్కన పెడితే వినాయక వ్రతకధలో నాకు చాలా ఇష్టమైన కధ ..అందులో ఒక కధలో కుమార స్వామి కి, వినాయకునికి ఎవరు గొప్ప అని పోటీ వస్తుంది ..ముల్లోకాలు తిరిగి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే బెస్ట్ అని ఇద్దరూ బయలు దేరుతారు ..పాపం కుమార స్వామి గభ గభా తన నెమలి వాహనం మీద అన్ని చుడుతుంటే మన వినాయకుడు తాపీగా అంటే భక్తిగా అమ్మ,నాన్నల చుట్టూ తిరిగి గెలిచేస్తాడు..ఈ కధ వినగానే ఎంత సంతొషం వేసేసేదంటే అమ్మ,నాన్నల చుట్టూ తిరిగేస్తే బోలెడు పుణ్యం అన్నమాట అని పిండి రుబ్బుతున్న మా అమ్మ చుట్టు ,స్కూటర్ తుడుస్తున్న మా నాన్న చుట్టూ ,టి.వి చూస్తు నవ్వారు మంచం మీద కూర్చున్న అమ్మా,నాన్నల చుట్టు కలిపి,విడి విడి గా చాలా సార్లు తిరిగేసి సీక్రెట్‌గా బోలెడు పుణ్యం సంపాదించేసాను చిన్నపుడు..
ఇంకొక కధ కృష్ణుడు చవితి నాటి చంద్రుని పూజ చేయకుండా చూసి నీలాప నిందల పాలవడం.. నేను ఇంతకు ముందే చెప్పాను కదా నాకు కృష్ణుడంటే వల్లమాలిన ప్రేమ అని..మరి నాలో ఉన్న స్త్రీవాది ఏ మూలన కూర్చుని బట్టలు ఇస్త్రీ చేసుకుంటుందో తెలియదు కాని ఆ కధ చివరలో నీలాప నిందలు పడితేనేమి చక్కని చుక్కలైన ఇద్దరు భార్యలను తెచ్చుకున్నాడు కృష్ణుడు అని చదివి తెగ మురిసిపోయేదాన్ని..అక్కడికేదో కృష్ణుడు నాకు రెండుసార్లు ఆడపడుచు కట్నం ఇచ్చినంత సంబరపడిపోయేదాన్ని ఆ కధ విని ...కానీ పూజ చేసి అక్షింతలు వేసుకున్నా నాకు మాత్రం చవితినాడు చందమామాను చూడాలంటే మహా భయం ఉండేది అప్పట్లో ..ఇప్పుడేమో ఇక్కడ తల ఎత్తితే భవనాలుతప్ప ఆకాశమే కనబడటం లేదు ఏంటో..ఇలా చెప్పుకుంటు వెళుతే వినాయక చవితి గురించి రాస్తూనే ఉండచ్చు..
గమనిక:- ఎవరండి అక్కడ చవితి రోజు చందమామను చూసి తరువాత తీరిక గా పూజ చేసి ఇద్దరు పెళ్ళాలను కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంది.. నేనంటే చిన్నపుడు అమాయకత్వం వల్ల అలా అనేసుకుని సరదాగా రాసాను .. మా అమ్మాయిలకు అన్యాయం చేయాలని చూస్తే కళ్ళు ఢాం ఢాం అని పేలిపోతాయి జాగ్రత్త.. కాబట్టి బుద్దిగా లెంపలేసుకుని,10 గుంజీలు తీయండి ముందు ..
అందరూ వినాయక చవితి జరుపుకుని స్వామివారి కృపా కటాక్షాలతో ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఆయురారోగ్యాలతో ,సిరి సంపదలతో తులతూగాలని ఆశిస్తున్నాను.
(ఫొటో గూగులమ్మని అడిగినది )
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
40 కామెంట్లు:
ఈ హారిది ఏమిటండీ?ఎప్పుడూ వినలేదు ,కనలేదు తిననూలెదు.(అద్రుష్టవంతురాల్ని కదూ?)మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు నేస్తం.
>>ఎవరండి అక్కడ చవితి రోజు చందమామను చూసి తరువాత తీరిక గా పూజ చేసి ఇద్దరు పెళ్ళాలను కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంది..
అయ్య బాబోయ్...నా ప్లాన్ మీకెలా తెలిసిందండీ...మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా! మీరెన్నయినా చెప్పండి..కళ్ళే కాదు, కాళ్ళు పోయినా సరే నా ప్లాన్ నుండి వైదొలిగే ప్రసక్తే లేదు!! :) నేను కృష్ణుడులా మోసం చేయనులెండి. మీకు రెండు ఆడపడుచు కట్నాలు గ్యారెంటీగా ఇప్పిస్తాను. ఏమంటారు? :))
మీరు వాడిన పదాలను( హారిది,పురికాసు,పాలవెల్లి లాంటివి ) బట్టి చూస్తే మీరు తూర్పు కోస్తాంధ్ర ఆడపడుచులా ఉన్నారు. నాకు మాత్రం హారిది చాలా ఇష్టమండీ..అమ్మ బాగానే చేసేది.
మీ విశేషాలు ఎప్పుడు చదివినా అప్పుడప్పుడూ కలిసే మా కజిన్ ముచ్చట్లు వింటునట్టు ఉంటాయి.
Happy ganesh chaturdhi to you too. Haridi??
నేస్తం, అన్ని ఫీలింగ్స్ వ్రాసేంత తీరిక లేదు. బాగా వ్రాసారు. మేము చాలా ఘనంగా కుటుంబం అంతా నాన్న గారి ఎర్రపట్టు పంచె సాక్షిగా జరుపుకున్న పండుగ ఇది. పత్రి - పూలు - పళ్ళు - పాలవెల్లి - ప్రసాదాలు - పూజ - ఏడిళ్ళు తిరిగి రావటం - నిమజ్జనం; ఒక్కోదానితో ఒక టపా వ్రాయొచ్చు నా అనుభవాలు. మీరన్న ఆ ఇబ్బంది lisping నాకూ వుంది. "మీ తొంట వందరగా అయిపోయిందే?" "మీ పెల్లలు పిద్దవాళ్ళై పోయారు" ఇవి ఈ మధ్య నా వచనాలు. :) Again a very nice post, enjoy the festival.
మైత్రి
హారిది అంటే ఏంటి ?ఎప్పుడు వినలేదు .పాలతాలూకలా ?
హారిది అంటే ఏమిటి అండీ?
నేస్తం కుటుంబానికి కూడా’ వినాయక చతుర్థి ’ పర్వదిన శుభాభినందనలు !
వినాయక చవితి శుభాకాంక్షలు
నాకు కూడా కుమారస్వామి, వినాయకుడి కధే ఎక్కువగా నచ్చుతుంది. మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు నేస్తం.
నేస్తం, ఎప్పటిలాగే మీ చిన్న నాటి సంగతులు నవ్వుల విస్తట్లో పెట్టి పంచారు.చాలా నవ్వుకున్నాను, సరదాగా రాసారు మళ్లీ.నిజంగానే పాపం అనిపించింది, మీ హారిది?(అంటే ఏంటో తెలీదు) కష్టాలు చదువుతుంటే.
హారిది,పురికాసు,పాలవెల్లి, పాలతాలూకలు ???
ఈ పై పదాలకి అర్థం చెప్పి పుణ్యం కట్టుకోండి.ఇవి కోనసీమ పదాలా ?
అన్నట్టు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
- పద్మ.
ఇప్పుడూ.....
మేము హైదరాబాద్ వాళ్ళం. మాకేం అర్ధమవుతుంది మీరిలాంటి పజిల్ మాటలు మాట్లాడుతుంటే? పురికాసు అంటే పురుకోస నా? తాడు లా ఉంటుంది అదే కదా? మరి హారిది అంటే? ఎంత ట్రై చేసినా అర్ధం కావట్లేదు. ఇప్పుడు ఫోన్ చేసి మా అమ్మ నడిగితే పిచ్చ తిట్లు తిడుతుంది రాత్రి ముడున్నరకి లేపినందుకు. అందుకని మీరే తొందర తొందరగా అదేంటో చెప్పెయ్యండి. సరేనా?
హారిది అంటే బియ్యపు పిండితో పాముల్లా చేసి బెల్లపు పాకం లో వేసి ఉడికిస్తారు.మహా చెత్తలా వుంటుందిలెండి.అమ్మో ఇది ఇష్టమైన వాళ్ళు నన్ను కొట్టేత్తారా?పాలతాలికలు కాస్త తినబుల్ గానే వుంటాయి.ఈసారి వినాయకుణ్ణి ప్లే డౌ తో చేసాం వెరైటీగా. మా అబ్బాయికి కాస్త ఆశక్తి పెంచడానికి ఇన్ని పాట్లు/ఫీట్లు
రాధిక గారు
ఆన్సర్ పోస్ట్ చేసి మంచి పని చేసారు. నేనయితే ఇందాకటి నించి హారిది గురించే ఆలోచిస్తున్నా. ఈ మాట ఎ ఊర్లో వాడతారు?
సత్య గారు హారిది అంటే రాధిక గారు చెప్పినట్లు బియ్యం పిండిని పాలతో ముద్ద చేసి పాముల్లా వాటిని వత్తి ఆ తరువాత మరిగేపాలల్లో బెల్లం ఈ పాములు వేసి చేస్తారు .. అదన్నమాట ..:) మళ్ళి ఇంకోసారి హారిది అంటే ఏంటండి అని అడగరు అంత బాగా చెప్పాను కదా :P
శేఖర్ గారు సరిగ్గా కేచ్ చేసారు కరెక్టే గోదావరి ముద్దు బిడ్డనే ..ఆడపడుచుకట్నం ఇస్తానంటే మీకు కళ్ళు ఉంటే ఏంటి కాళ్ళు పోతే నాకేంటి చెప్పండి .. కావాలంటే 4 పెళ్ళిల్లు చేసుకోండి.. బాగా చెప్పానా :P
లక్ష్మీ మీకూ వినాయక చవితి హార్దిక శుభాకాంక్షలు :)
ఉషా ఒక్క వాఖ్యలో మొత్తం పండుగ సంభరాన్ని రాసేయడం మీకే చెల్లు :)
అఙ్ఞాత గారు ఏం చేప్పారండి మైత్రీ అని బాగుంది.. హారిది అంటే పైన చెప్పాను చూడండి
గనేష్ హారిది గురించి చెప్పాను చూడండి
విజయ మోహన్ గారు మీకూ కూడా పండుగ శుభాకాంక్షలు
ధరణీ గారు మీకూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు
పద్మార్పిత అయితే సేం పించ్ :)
పద్మ ఇవి కోస్తాంద్ర పదాలే ,పురికాసు అంటే అదే తాడు గుమ్మాలకు తోరణాలు కడతాం కదా ..పాల తాలికలు వేరు హారిది వేరు ..ఇప్పుడే అర్ధం అవుతుంది హారిది కోస్తాంద్ర ప్రజలు మాత్రమే చేసుకునే పిండి వంట అయితే
కిరణ్మయి గారు రాధిక తీర్చేసారుగా మీ సందేహం ..పురికోస అన్నా పురికాసు అన్నా ఒకటే అన్నమాట ..మా వైపు అలా అంటాం ..ఈ పదాలు తూర్పు గోదావరి ఇంకా వెస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాలు అంటారు :)
రాధిక ఒక హాయ్ 5 వేసుకోండి హారిధి విషయం లో ..అవునా మంచి పని చేసారు నేను అయితే పసుపుతో తొండం చెవులు పెట్టి విగ్రహం చేసి 9 రోజుల తరువాత నీళ్ళలో కలిపేసి మొక్కలకు వేసేస్తా ..సముద్రం వరకు వెళ్ళాలంటే చాలా దొంగ చాతుగా కలపాల్సి వస్తుంది ఒక్కోసారి ఇక్కడ :(
"పత్రిని ప్రత్తి అని ,ఆవేశాన్ని ఆయాసం అని ,ఆదుర్ధాని ఆరుద్ర అని" ...హ్హ..హ్హ..హ్హ..మా స్నేహితురాలు ఒకామె కూడా ఆవేశాన్ని ఎప్పుడూ ఆయాసం అనే అనేది.
"ఇవి కోస్తాంద్ర పదాలే"....ఆయ్ అదేం కాదండి. ఇవి అచ్చంగా మీ గోదావరి జిల్లాల పదాలేనండి. మా గుంటూరు వాళ్లకి ఈ హారిది అంటే ఏంటో తెలియదండి. ఆయ్ :)
"నా పుస్తకాలన్నీ వినాయకుడి దగ్గర ఒక్కటి కూడా మిస్ కాకుండా సంచితో సహా పెట్టేయడం".....మీరు అన్నీ సబ్జెక్ట్సులో పాస్ అవ్వాలని పెడితే మేమేమో ఇక వినాయకుడిని నిమజ్జనం చేసేదాకా బడికి పుస్తకాలు తీసుకెళ్ళే పని ఉండదని అన్నీ పెట్టేసేవాళ్లం.
మాకు చిన్నప్పుడు వినాయకచవితి అంటే అల్లరే అల్లరి. ఎలాంటి అల్లరో ఒకసారి http://vareesh.blogspot.com/2007/08/blog-post_30.html చూడండి.
అయ్య్ బాబోయ్ !!అమ్మాయ్ గోరో తవరిమాట కాదంటావేటండి ,ఆయ్ నిజవేనండే ,ఇవి నిఖార్సయిన గోదారి పదాలేనండే :)
చదివాను మువ్వగారు ఆ లింక్. మొత్తానికి అందరం అటు ఇటుగా చిచ్చర పిడుగులమే అన్నమాట చిన్నతనం లో :)
Hello nestham garu ...chakkati post malli....vinayka chavithi subhakankshalu....post chaduvuthuu unnantha sepu ..haridi entaa anukunaa..ii comments chudagane...na doubt teeripoindi.. :)
నేస్తం గారూ , రాధికగారూ మీ జట్టు పచ్చి !
ఆరిదిని అంతమాటంటారా ? ఒక్క పండగకే ఎందుకు చేస్తారా అని నేననుకుంటుంటే ...నాకేమో రాదు ...అమ్మ వాళ్ళింటి దగ్గర చవితి చేసుకుంటే అమ్మ బాగా చేస్తుంది మరి !పోయిన చవితికి నేనూ ట్రై చేశా ఫోన్ లో అడిగి మరీ ...దానిగురించి చెప్పాలంటే పెద్ద పోస్ట్ రాయాల్సోస్తుందని ఆగా !
ఈరోజుకు పచ్చి సంగతి పక్కన పెట్టా ..వినాయక చవితి శుభాకాంక్షలు !
mmmmm............
@radhika ....koncham verevalla gurichi alochinchi raste baagundedi.
కిరన్ అయితే ఓకే ...డవుట్ తీరిపోయిందిగా :)
హ హ పరిమళం గారు ఒక విషయం చెప్పనా ..ఈ సారి మా అత్తగారు దగ్గర ఉండటం వల్ల హారిది విషయం లో నా వేషాలు కుదరలేదు.. తప్పని సరిగా చేయాల్సివచ్చింది.. కాని కాకిపిల్ల కాకి కి ముద్దు అన్నట్లు నా హారిది నాకే తెగ నచ్చేసింది ..చిన్నపుడు మరీ కంచాలు కంచాలు పెట్టడం వల్ల నచ్చేది కాదేమో మరి
వినయ్ ఇక్కడ అందరం సరదాగా అనుకుంటున్నాం ఉత్తి ఉత్తినే అన్నమాట .. నిజం కాదు సారు ..:)
పాల తాలికలు అంటే ఏంటో కూడా మాకు తెలియదు ! కాకపొతే రెసిపీ ఆన్లైనులో ఉంది. రెండు ( హరిది, పాల తాలికలు) బియ్యం,బెల్లం, పాలతోనే కదా చేస్తారు. తేడా ఏమిటి ? నేస్తం, అంత బాగా చేసేసారా హారిది, ఇప్పుడు నాకూ హారిది తినాలనుంది.ప్చ్ , ఎలా ?
- పద్మ.
బాగు బాగు. భక్తురాళ్ళందరూ సాధారణంగా కృష్ణుణ్ణి బాయ్‌ఫ్రెండ్‌గా చూస్తుంటే, కన్నయ్యని అన్నయ్య చేసేసుకున్న మీ దూరదృష్టి అమోఘం. వినాయక చవితి కథలో రెండు ఆడపడుచు కట్నాలే కానీ వోలుమొత్తంఘా ఎనిమిది గదా!
చిన్నప్పుడు నాకు ఆ కథ గురించిన గొప్ప డౌటు, జాంబవంతుడు శమంతకమణిని తెచ్చి బాలిక తొట్టె మీద ఆటవస్తువు గా కట్టాడు అంటారు. యుద్ధం అయిపోయాక కృష్ణుడు అదే బాలికని పెళ్ళాడాడు అంటారు. ఈ బాలిక అంత తొందరగా ఎలా పెద్దదయిందో, లేక ఆమె పెద్దదయేదాకా ఈ యుద్ధం జరిగిందో గొప్ప కంఫ్యూజనుగా ఉండేది.
పురికొస విన్నాను కాని పురికాసు వినలేదండీ... హరిది కూడా మొదటి సారే వినడం. మొత్తానికి మీటపా బాగుంది. మేమూ పుస్తకాలు అన్నీ పెట్టే వాళ్ళం కానీ అమ్మ వాటిని సాయంత్రమే తీయించి చదివించేది. పండగపూట చదివితే బాగా చదువు వస్తుంది అని. కానీ నా దృష్టంతా కుడుముల మీదో, పూర్ణం బూరెల మీదో ఉండేది ఇక చదువేం ఎక్కుతుంది.
పండగ రోజు మధ్యహ్న భోజనం విషయం లో నావీ మీతిప్పలే... అందుకే సాధారణం గా తేలికైన కూర ఏదో చేసేస్తే బెటర్ అని చెప్పేవాణ్ణి. తీపి పదార్ధాలకి విరుగుడు కోసం మాత్రం ఆవకాయ లాటి ఊరగాయ ఉండాల్సిందే... లేదంటే సాయంత్రం కోటా పిండి వంటలు తినలేను మరి :-)
కోనసీమ అబ్బాయిని చేసుకో పద్మ అన్నీ ఆటో మెటిక్ గా వచ్చేస్తాయి:P మా ఫ్రెండ్ అయితే దెప్పుతుంది ఏ వూరు అబ్బాయినయినా చేసుకో వచ్చు గాని మీ గోదారి వాళ్ళను చేసుకుంటే బ్రతుకు సతీ సావిత్రి,సతీ అనసూయా ల్లా ముద్దు ముచ్చట లేకుండా అయిపోతుంది అని :)ఇక పాల తాలికలు నేను నెట్ లోనే చదివా రెండిటిలోను బియ్యంప్పిండి,పాలు,బెల్లం కామన్ మిగిలినవి అటు ఇటుగా వేరుగా ఉన్నాయి ..
బహుశా ఆ యుద్దం ఏళ్ళ పాటు జరిగి ఉంటుంది ...పురాణాల విషయానికొస్తే నాకో పెద్ద డవుట్.. వరహా అవతారం లో భూమిని సముద్రం అడుగున దాస్తే విష్ణూమూర్తి తన కొమ్ములతో బయటకు తీస్తాడు ..భూమిలోనే కదా సముద్రం ఉంది ..ఇంకెక్కడ సముద్రంలో దాచేడు ఆ రాక్షసుడు భూమిని అని ...దానికి నాకు తోచిన సమాధానాలు చెప్పెసుకుంటాను కొత్త పాళిగారు :)
వేణూ అయితే మీది మా గోదావరి కాదన్న మాట :) హూం నిజమే ఆ రోజులు తలుచుకుంటేనే భలే అనిపిస్తుంది :)
నేస్తం గారు,
కోనసీమ అబ్బాయిని చేసుకో పద్మ అన్నీ ఆటో మెటిక్ గా వచ్చేస్తాయి:P మా ఫ్రెండ్ అయితే దెప్పుతుంది ఏ వూరు అబ్బాయినయినా చేసుకో వచ్చు గాని మీ గోదారి వాళ్ళను చేసుకుంటే బ్రతుకు సతీ సావిత్రి,సతీ అనసూయా ల్లా ముద్దు ముచ్చట లేకుండా అయిపోతుంది.
మీ friend చెప్పింది అక్షరాలా సత్యం.నేను కృష్ణా జిల్లా అమ్మాయినె అయినా గోదావరి జిల్లా మొగుడిని కట్టుకున్నందుకు నా బ్రతుకు సతీ సావిత్రి,సతీ అనసూయా ల్లా ముద్దు ముచ్చట లేకుండా అయిపోయింది.
వినాయకచవితి శుభాకాంక్షలు.
నేను గోదావరి వాడినే కాని ఈ హారిది అన్న మాట ఎప్పుడూ వినలేదు.
మీ వర్ణనని బట్టి పాలతాలికలు కావచ్చు.
ఆంధ్ర పిండివంటలలో నాకు నచ్చనిది పాలతాలికలు ఒక్కటే.
కోనసీమ కుర్రాళ్ళు ఏం తప్పు చేసారండి?
వాళ్ళని చేసుకోడానికి అదృష్టం ఉండాలి.
ఒహో, ఇద్దరు పెళ్ళాలు రవాలంటే వినాయకుడి కథ చదవాలా, నాకీ అలోచన ఇంత వరకు తట్టలేదు సుమీ,అదెంటొ చిన్నప్పటి నుంచి రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాలని బలే ఆశ నాకు.
ఈ కోరిక తీరుతుందో లేదో :)
హ హ నీహారిక గారు ..అయినా మా గోదావరి అబ్బాయిలను తిట్టాలన్నా ,పొగడాలన్నా రైట్స్ అన్నీ కేవలం మా గోదావరి అమ్మాయిలకే ఉన్నాయి కాబట్టి క్రిష్ణావాళ్ళు తిట్టకూడదన్నమాట ..సరేనా :P
బోనగిరి గారు ఇప్పుడు గోదావరి అబ్బాయిల గురించి ఒక పోస్ట్ వేయాలి హన్నా.. మీరిలా మరీ వెనకేసుకొచ్చేస్తుంటే :)
రాఘవ్ గారు దురాశ దుఃఖానికి చేటన్నారు మరి ఆలోచించుకోండి ..ఇద్దరు సత్యభామలు దొరికితే మీపని శంకరగిరి తిరుణాళ్ళే :)
ఎబ్బే లాభంనేదు!!
>>హారిది అంటే బియ్యపు పిండితో పాముల్లా చేసి బెల్లపు పాకం లో వేసి ఉడికిస్తారు.
ఇదేంటీ అంటా?? ఇదేం వివరణ....
పాముల్లా చేసేదేంది, ఉడికించేదేంది పాకంలో....
ప్చ్.
:):)
భాస్కర్ గారు హనుమంతుని ముందు కుప్పిగెంతులా అని.. మీ రేంజ్ లో వివరించాలంటే కష్టం కదండి ... ఆ పాటి ప్రతిభే ఉంటే నేనూ దమయంతి-హిడింభీ పాకం అని ఒక బ్లాగ్ ఓపెన్ చేసేదాన్ని ఈ పాటికి :)
"అమ్మ,నాన్నల చుట్టూ తిరిగేస్తే బోలెడు పుణ్యం అన్నమాట అని పిండి రుబ్బుతున్న మా అమ్మ చుట్టు ,స్కూటర్ తుడుస్తున్న మా నాన్న చుట్టూ ,టి.వి చూస్తు నవ్వారు మంచం మీద కూర్చున్న అమ్మా,నాన్నల చుట్టు కలిపి,విడి విడి గా చాలా సార్లు తిరిగేసి సీక్రెట్‌గా బోలెడు పుణ్యం సంపాదించేసాను చిన్నపుడు.."
అంత పుణ్యం సంపాదించారు కనుకనే ఇంత బాగ కబుర్లని చెప్పగలుగుతున్నారు. మీకు ఇంకా పిచ్చిబోళ్డు పుణ్యం వచ్చి మరిన్ని కబుర్లని చెప్పాలని, అదిగో... మా (మీరు పోట్లాడే పనైతే మన ;-)) కృష్ణయ్యని ప్రార్థిస్తున్నాను.
నేస్తం,
>>కోనసీమ అబ్బాయిని చేసుకో పద్మ అన్నీ ఆటో మెటిక్ గా వచ్చేస్తాయి:P
హహహహహ...
>>మా ఫ్రెండ్ అయితే దెప్పుతుంది ఏ వూరు అబ్బాయినయినా చేసుకో వచ్చు గాని మీ గోదారి వాళ్ళను చేసుకుంటే బ్రతుకు సతీ సావిత్రి,సతీ అనసూయా ల్లా ముద్దు ముచ్చట లేకుండా అయిపోతుంది అని :)
ఇక్కడ కొంచెం వివరణ కావాలి నేస్తం. ఎందుకు అలాగా అయిపోతుంది బతుకు కోనసీమ భర్త అయితే ? అంటే వంటకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, వంటలకే టైం ఐపోతుందనా ? :-?
ఈ మధ్యే ఒక కోనసీమ సంబంధం వచ్చింది, జాతకాలు కుదరక తప్పింది, అందుకే కుతూహలంగా ఉందన్న మాటా . :-)
-పద్మ
నేస్తం, కాస్తా హారిది రెసిపీ పోస్టి పుణ్యం కట్టుకోండి ! మొత్తం లెక్ఖలతో సహా చెప్పాలన్నమాట,నలభీముడు గారికి మీరే మాత్రం తీసిపోరని నిరూపించేయ్యాలి. :-P
-పద్మ
గీతాచార్య గారు మీరు పొగిడారంటే నేను బాగా రాస్తున్నానన్నమాటే ..థేంక్స్ అండి :)
పద్మ గోదావరి అబ్బాయిలు నిజానికి చాలా అమాయకులు,వివాహ బంధానికి అపారమైన విలువనిస్తారు,బాధ్యతగలవారు ఇలా చాలా మంచి లక్షణాలున్నాయి కాని ఇటు సైడు సాంప్రదాయాలు ,కట్టుబాట్లు ,ఆచారాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ ..ఈనాటి అమ్మాయిలు అవి తట్టుకోవడం కొంచం కష్టం అని అలా అన్నాను ..అయినా ఇప్పుడు రోజులు మారాయి ..మార్పొచ్చేసింది ..భయ పడక్కరలేదు :)
ఇక హారిదంటే నేను ఉజ్జాయింపుగా మొన్న చేసాను మరీ కొలతలు వేయకుండా.. ట్రై చేయి నీ అదృష్టం.. అయితే ఇందులో చాల రకాలున్నాయి ఇది మా అత్తగారు చెప్పిన రెసిపీ అన్నమాట..కొద్దిగా చేసి చూడు
ముందు ఒక చిన్న గిన్నేలో (అంటే లోతు ఎక్కువ ఉన్న గిన్నే లేకపోతే పాలు ఊరికే పొంగుతాయి) కొన్ని పాలు అంటే ఒక మూడు కప్పులు పాలు వేసుకుని వేడిచేస్తూ ఉండూ ..ఈ లోపల ఒక రెండు చెంచాలు పెసరపప్పు నానబెట్టు అలాగే సగ్గుబియ్యం కూడా నాన బెట్టి ఒక అర కప్పు బియ్యం పిండిలో ఈ మరుగుతున్న పాలు కొద్దిగా వేసి చపాతి ముద్దలా చేయి ..ఈ లోపల మరుగుతున్న పాలల్లో సగ్గుబియ్యం ,పెసరపప్పు వేసేయి .. ఇప్పుడు ఈ బియ్యం పిండి రెండు చేతుల మద్యలో ఉండలా పెట్టుకుని సన్నని పాముల్లా వత్తాలి..అవి ఈ మరుగుతున్న పాలల్లో వేయాలి కావలసినన్ని వేసాకా అందులో తురిమిన బెల్లం వేసుకోవాలి .. చివర్లో చిక్కదనం కోసం కాసింత బియ్యం పిండిలో నీరుకలిపి ఆ పాలల్లో వేస్తారు..మరి కొందరు కొబ్బరి తురుము వేస్తారు ...ఆ తరువాతా వెంటనే కట్టెయడమే స్టవ్
టిప్స్ ఏంటంటే .. ఒక ప్రక్క పాలు మరిగిపోతుండగా ఇవన్ని హడావుడిగా చేయడం కష్టం కాబట్టి ముందు అన్నీ రెడీ పెట్టుకుని అప్పుడు పాలు మరగ పెట్టి చేయి ..బియ్యం పిండితో పాములు వత్తేటప్పుడు సన్నగా వత్తు..జంతికల గొట్టం లో వేసినా పర్లేదు ..మా వాళ్ళు దుబ్బల్లా ఇంత ఇంత లావు చేయడం వల్ల నాకు నచ్చేది కాదన్నమాట ..అన్నీ చేసాక కేవలం నువ్వు మాత్రమే తిని బాగానే ఉన్నావని నీకు నమ్మకం కలిగాకా మీవాళ్ళకు పెట్టు..నేను అలా నమ్మకం కుదిరేంత వరకు తిని చూస్తే పాపం మా వాళ్ళకు పెట్టడానికి అందులో హారిది లేదు :P
నేస్తం,
>>నేను అలా నమ్మకం కుదిరేంత వరకు తిని చూస్తే పాపం మా వాళ్ళకు పెట్టడానికి అందులో హారిది లేదు :P
హహహహహహః, భలేక్రిష్ణలా మీరు డైలాగ్ కొట్టేయోచ్చు - మాటలతో కాదమ్మా, నవ్వించి చంపేస్తా అని ! :-)
చాలా చాలా చాలా థాంక్స్, ఓపిగ్గా రెసిపీ చెప్పినందుకు.సగ్గు బియ్యం ఒక్కటే ఎంత వెయ్యాలో చెప్పలేదు ? :-P
మనకి అస్సలు ఐడియా లేదు కదా, ఎలా చెయ్యాలో.
ఆచారాలు, కట్టుబాట్లా ? :-D అంటే ఏమిటి అనే రకం నేను ! :-) ఇప్పుడు మార్పోచ్చేస్తే, అందరికీ హ్యాపీ కదా. :-) ఒక్కో సారి ఆచారాలు ఆడవాళ్ళని బిజీగా(సతీ అనసూయలా) ఉంచటానికే కనిపెట్టారేమో అని సందేహం వచ్చేస్తుంటుంది నాకు.ప్చ్, ఏమి చేస్తాం?
మీ పేరు నేస్తం అని పెట్టుకున్నారుగా, అందుకే మిమ్మల్ని నేస్తం గారు అనట్లేదు.ఎందుకో మీ పేరు, మీ రచనలు చూస్తే, మీరు నిజంగానే నా నేస్తం అనిపిస్తుంది.మీ రచనల గురించి మా అమ్మ గారితో ఎప్పుడు చెప్తుంటాను, మా నేస్తం ఈ రోజు ఎంత బాగా రాసారో,విను అంటూ ! :-) ముందే ఈ విషయం చెప్పల్సిందేమో, మొహమాటంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన భయంతో చెప్పలేదు.
-పద్మ
పద్మ ఇంత చక్కని అభిమానం సొంతం చేసుకున్నందుకు చాలా హాయిగా ఉంటుంది ఒక్కోసారి :) ఇక సగ్గు బియ్యం కూడా ఒకటొ రెండో స్పూన్స్ వేసేయ్ :) నాకొకటి తెలిస్తే కదా నీకు చెప్పడానికి..మన వంటలన్నీ ప్రయోగాలతోనే మొదలవుతాయన్నమాట :) ఏదీ పర్ఫెక్ట్ గా రాదు :)
Sorry for my late wishes. But Take my hearty wishes nestam
The tail piece, "ఎవరండి అక్కడ చవితి రోజు చందమామను చూసి తరువాత తీరిక గా పూజ చేసి ఇద్దరు పెళ్ళాలను కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంది.."
is excellent
thanks srujana :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి