12, ఆగస్టు 2009, బుధవారం

అసలు కృష్ణాష్టమి అంటే ???




చిన్నప్పటి నుండి నాకు కృష్ణుడు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం..మరి కారణం ఏమో తెలియదు..బహుసా మా నాన్న గారు ఎన్ టి ఆర్ గారి కృష్ణుని వేషం ఉన్న సినిమాలు ఎక్కువగా చూపించడం వల్లనో,తాతయ్య చెప్పే కృష్ణ లీలల కధల వల్లో మరెంచేతో ...ఒకానొక సమయంలో కవియిత్రి మొల్లలా కృష్ణుడి మీద కవితలుకూడా రాసేసాను ఆవేశం గా చిన్నపుడు ..దెబ్బకి కృష్ణుడు భయపడినట్లున్నాడు మళ్ళీ అలాంటి ఆవేశం ఉప్పొంగకుండా జాగ్రత్త పడ్డాడు... ఆ తరువాత ఎంత గింజుకున్నా కవితలు రాయలేకపోతున్నాను.. అయితే క్రిష్ణుడిమీద ప్రేమ అక్కడితో ఆగిందా అంటే ..లేదు ...

మా అమ్మ నెలగంటు సమయంలో మంచి మంచి ముత్యాల ముగ్గులు వేసేది ,ముఖ్యం గా పల్లకీ ముగ్గు వేసినపుడు ఒకసారి మా చెల్లిని బ్రతిమాలి దానిలో కృష్ణుని బొమ్మ వేయించాను ముగ్గుతో..అక్కడితో ఊరుకున్నా బాగుండేది దానిక్రింద దయ చేసి ఈ ముగ్గును ఎవరూ చెరపకండి అని రాసాను ..అంతే మరుసటి రోజు ఆకతాయిపిల్లలందరూ కసాబిసా అని తొక్కి పడేసారు ..అది చూసి మా అమ్మ కొట్టినంత పని చేసింది అందరూ కాళ్ళతో తొక్కేలా చేస్తావా క్రిష్ణుడిని అని .. ఇలా కృష్ణునిమీద చాలా ప్రయోగాలు చేసాను ప్రేమతో ..

ఒక సారి మా ఆయనతో ఏమండి నాకు రాముడికంటే కృష్ణుడంటే చాలా ఇష్టం అన్నాను ..ఎందుకలాగా !అన్నారు..ఎందుకంటే రాముడు ఒక్క భార్యను సంతోషంగా ఉంచలేకపోయాడు ..కానీ కృష్ణుడు 16000 వేల గోపికలను ఎంతో ఆనందంగా ఉంచాడు ,ఎవ్వరినీ బాధ పెట్టలేదు అన్నాను నేను చాలా గొప్పగా చెప్పేసాను అని సంభరపడిపోతూ.. మా ఆయన వెంటనే నా కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ నువ్వింత మంచిదానివని తెలియక ఎంతో అపార్ధం చేసుకున్నాను ,ఇన్నాళ్ళు నువ్వేమనుకుంటావో అని భయపడి చెప్పలేదు ..నేను అంటే ఇష్టంతో ఒక ఇద్దరు ముగ్గురు రెడిగా ఉన్నారు ఏమంటావ్ అన్నారు ..అప్పటి నుండి కృష్ణుడి మీద ప్రేమ మనసులోనే దాచేసుకున్నాను ...

సరే ఇదిలా ఉంచితే మొన్న జ్యోతిగారినుండి ఒక మెయిల్ వచ్చింది కృష్ణాష్టమి కదండి కాబట్టి ఏదన్నా రాస్తే బాగుంటుంది ఆ రోజు అని.. అబ్బో కృష్ణుడి మీద అంటే చాలా వీజీ రాసేద్దాం అనుకుని ok చెప్పేసాను ... సరే వంట మొదలు పెట్టాను కాని ఒక్కటంటే ఒక్క వాఖ్యం కూడా తట్టడం లేదు ..అంటే నేను ఏదన్నా రాయాలనుకున్నపుడు వంట చేస్తూ ఆలోచించి వంట అవ్వగానే పోస్ట్ తానన్నమాట ..నేను ముందే చెప్పాను కదా కృష్ణుడికి నా రాతలంటే బెంగ అని..అందుకే కాబోలు అన్నం వండేసి,పప్పు తాళింపు పెట్టి,కూర వండేసి ఆఖరికి అంట్లు కూడా తోమేసాను కాని అసలేమి రాయలో తోచడం లేదు ..ఇంకో ముఖ్య కారణం ఏంటంటే మా ఇంట్లో అసలు కృష్ణాష్టమి పెద్దగా చేయరు ..కాబట్టి ఒక్క సంఘటన కూడా గుర్తు రావడం లేదు ..ఏం చేయాలబ్బా అనుకుంటుండగా మా ఆయన గుర్తు వచ్చారు.. నా కనులు నీవిగా చేసుకుని చూడూ అన్నట్లు నీ ఙ్ఞాపకాలే నావిగా మలుచుకుని రాస్తా అనుకుని ఆయనకోసం వేయి కళ్ళతో ఎదురు చూసాను..

మా ఆయన వచ్చి సుష్టుగా తిని ప్రశాంతం గా ఉన్న మూడ్ చూసుకుని ఏమండీ అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటీ అన్నాను గోముగా ...మా ఆయన ఉలిక్కిపడి వద్దే బాబు ,నువ్వు పండగల గురించి మాట్లాడకు..ఇలాగే అచ్చికబుచ్చికలాడి మొన్న నా చేత వరలక్ష్మీ వ్రతం చేయించావ్ ..అసలు వోల్ ఆంద్రాలో వరలక్ష్మీ వ్రతం చేసే మగాళ్ళు ఎవరన్నాఉంటారా ,అసలు నేను ఇంట్లో ఎంత పెద్ద పండగయినా ఉండేవాడిని కాదు ,మా అమ్మ ఉండమంటే కయ్యిమనేటోడినీ.. కాని నువ్వు గయ్యాళి గంపవి,రాకాసి రంపవి .. అరిచి,ఏడ్చి సాధిస్తావ్ ..అని ఆవేశపడిపోతుంటే మహా ప్రభో ఆపండి అమ్మవారికి అష్టోత్తరాలు చదవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కాని ముందు కృష్ణాష్టమి అంటే ఏమిటొ చెప్పండి..బ్లాగ్ లో రాయాలి అన్నాను సీరియస్సుగా .

ఛా..కృష్ణాష్టమి అంటే ఏమిటో తెలియకుండా పోస్ట్ రాసేద్దామనే ..హూం..ఎవరే నీ పోస్ట్లు మెచ్చుకుంటూ వాఖ్యలు రాసేది ఒక సారి ఇలా పిలు అమ్మా అన్నారు..పీకలవరకూ కోపం వచ్చినా అవసరం నాది కదా,కాబట్టి నవ్వుతూ మీరు కొంచం చెప్పండి నేను అల్లుకుపోతాను అన్నాను ..అల్లడానికి,కుట్టడానికి ఇవి బట్టలు కావమ్మా పురాణాలు..సరే విను ..కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పండగ అంటే కృష్ణుడి బర్త్ డే అన్నమాట ఈ పోయింట్ మీద పోస్ట్ అల్లేసుకో అని నా వైపు చూసి సరే సరే శాంతించు ..ఇంకా చెప్తాను ..ఆ రోజు కృష్ణుడి బుజ్జి బుజ్జి పాదాలు ఇంటినుండి బయటకు వేస్తారన్నమాట అన్నారు.. ఇంటినుండి బయటకు కాదు బయటనుండి ఇంటిలోకి అన్నాను సరి చేస్తూ ..అదేలే మొత్తానికి పాదాలు వేస్తారు ..తరువాత ఒక కుండలోకి అటుకులు,మరమరాలు,కారం,ఉప్పు ,ఉల్లిపాయలు,నిమ్మరసం మా ఆయన నోట్లో నీళ్ళు ఊరుతుండగా మద్యలో ఆపు చేసి అదేమీ పిడతకందిపప్పు కాదు అన్ని వేయరనుకుంటా ,అటుకులు ,పెరుగు వేస్తారు అన్నాను..అబ్బా అదేలే,అవి వేసి ఉట్టి పైకి కట్టి నాలాంటి హీరో కి చేతికి కర్రనిచ్చి కొట్టమంటారు అన్నారు..

ఇలాగాని రాస్తే చదివేవాళ్ళు నన్ను కొడతారు ముందు ఇదేమన్నా ఆవు మీద వ్యాసం అనుకున్నారా కృష్ణుడు వెన్న తిన్నాడు,మన్ను తిన్నాడు అని ఒకటొ క్లాసు పిల్లాడు చెప్పినట్లు రాయడానికి..బ్లాగు బాబు ..అక్కడ ఏమన్నా చిన్నా చితక వాళ్ళు ఉంటారనుకున్నారా ..మహా మహులుంటారు..మొన్న అమ్మ మీద వ్యాసాలు అదరగొట్టారు తెలుసా అన్నాను..మరి పెద్ద రచయిత్రి లా పోజులుకొడతావ్ కదే నాదగ్గరా..ఇప్పుడు నేను కావలసివచ్చానా అన్నారు ..ఎంత గొప్పోళ్ళు అయిన్నా నేల ఆసరా కావల్సిందే కదండి నిలబడటానికి అన్నాను ..అంటే ఇప్పుడు నీ కాళ్ళక్రింద ఉన్నాను అని ఉదాహరణతో సహా చెప్తున్నావా అన్నారు అనుమానంగా .. అబ్బా!! అపార్దాల చక్రవర్తి ఏదో ఒక ఉపాయం చెప్పండి సార్ అని వేడుకుంటే ఒక అయిడియా అన్నారు..ఏంటి అన్నాను ఉత్సాహంగా ..

నా చిన్నపుడు హింది ఎక్జాం అప్పుడు నాకసలు హింది రాదుకదా అప్పుడు ఏంచేసేవాడినంటే అన్ని ప్రశ్నలను కలిపి తిరగమరగ రాసి ఆన్సర్ దగ్గర రాసేసేవాడిని..దెబ్బకి 100 మార్కులు వచ్చేసేవి ..అలాగా నువ్వు కూడా అందరూ కృష్ణుడి గురించి రాసేవరకూ ఆగి అన్నిటిలోనూ ఒక్కో లైను తీసి నీ పోస్ట్లో రాసేయి అన్నారు... హమ్మో మీ సారు మరి ఆన్సర్ చదివేవారు కాదా అన్నాను ఆక్చర్యం గా .. మా సార్ చదివేవారు కాదు స్కేల్ తో కొలిచేవారు ఆన్సర్లను అన్నారు నవ్వుతూ..సరేలే గొప్ప సలహా ఇచ్చారు ,అప్పటికి గాని నన్ను కూడలి నుండి బయటకు తరిమేయరు ..వాఖ్యం కాదు ఒక్క పదం కాపీ కొట్టినా బూతద్దంతో వెతికి మరీ పట్టేసి చూపుతారు ఏమనుకున్నారో అన్నాను ...అందుకే కదే ఆ సలహా ఇచ్చాను..అప్పుడు ప్రశాంతం గా ,హాయిగా ఉంటుంది నీ గొడవలేకుండా వాళ్ళకు ,నాకు ఇద్దరికీ అన్నారు..

మీ కుళ్ళు బుద్ది పోనిచ్చుకోలేదు కదా అని సీరియస్సుగా లేస్తుంటే నన్ను బలవంతం గా కూర్చోపెట్టి ,ఒసే పిచ్చిమొహం ఎలాగూ మిగిలినవాళ్ళు బాగా రాస్తారు కదా నువ్వు ఏమీ తెలియకుండా పుడింగిలా మద్యలో ఏదో రాసేయడం ఎందుకు ..కాబట్టి చక్కగా ఒక కృష్ణుడి బొమ్మ పెట్టేసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని ఒక హెడ్డింగ్ పెట్టేసి పొస్టేసేయి నా మాటవిని ..అప్పుడు వాళ్ళు హేపి,నువ్వూ హేపి,కృష్ణుడు హేపీ ఏమంటావ్ అన్నారు.. హూం..అవుననుకోండి కాని అసలేమీ రాయకపోతే నా పోస్ట్ కోసం చూసేవాళ్ళు ఫీల్ అవుతారేమో అన్నాను (లోపల బోలెడంత గర్వం మా ఆయనను ఉడికించే చాన్స్ వచ్చిందని )...అబ్బా ఛా , మరి నువ్వు యండమూరివీ ,యద్దన పూడి సులోచనా రాణివి ..నీ పోస్ట్లకోసం ఎదురుచూడటానికి .. మొహం చూడు...ఏదో పాపం కొత్తగా వచ్చావు ,బాగుంది అని ఒక వాఖ్య రాసేస్తే సంతోష పడతావ్ అని వాళ్ళేదో రాస్తే అది చూసి ఫీల్ అయిపోవడమే అని ఏడిపించడం మొదలుపెట్టారు..

దీన్నే పిలిచి తన్నించుకోవడం అంటారు..మీ గురించి తెలిసి కూడా అడిగాను చూడండి ..మాములు చెప్పు కాదు కాస్త స్ట్రాంగుగా ఉన్న చెప్పుతో కొట్టుకోవాలి అని కయ్యమేసుకుని ఇలా వచ్చాను..కాబట్టి అదండి సంగతి ..రేపు కాస్త పని ఉండి ముందుగానే చెప్పేస్తున్నాను అన్నమాట ..మీకూ మీ కుటుంభ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు :)

49 కామెంట్‌లు:

dj చెప్పారు...

Bagundi... meeku kuda krishna aashtami shubhakankshalu :)

జ్యోతి చెప్పారు...

పండగ ఎల్లుండి కదా అప్పుడే రాసేసారా?? మిమ్మల్ని అంతలా సతాయించినందుకు, పండగరోజు మీవారికే కృష్ణుడి వేషం వేసేయండి..

Padmarpita చెప్పారు...

వెరైటీగా చెప్పారు....:)
శుభాకాంక్షలు!!మరి మీకు కూడా..:)

నేస్తం చెప్పారు...

ఏంటీ పండగ ఎల్లుండా???? మా ఆయన మాటలు విని ఎంత మోసపోయాను..రేపే అని వాదించారు ..ఇంట్లో తెలుగు కేలండర్ లేదు ..నెట్ ని నమ్ముకోకుండా మా ఆయన్ని నమ్ముకున్నాను అదీ సంగతి..పోనీ లేండి అడ్జస్ట్ అయిపోండి ..
పద్మార్పిత గారు dj గారు థేంక్స్ అండి :)

నేస్తం చెప్పారు...

అదేంటి జ్యోతిగారు పండుగ రేపేకదా 13 గురువారం క్రిష్ణాష్టమి అని ఉంది నెట్లో కూడా :) నేను ఎక్కడన్నా పొరబడుతున్నానా?

మేధ చెప్పారు...

:)
Happy Krishnastami to you too...

kumar చెప్పారు...

Nice narration

Shashank చెప్పారు...

హరే కృష్ణ కరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే

చిలిపి చేష్టలు చేసి భగవద్ గీత చెప్పిన వాడు ఆ పరమపురుషుడు. దశావతరాల్లో ఆ ఒక్క అవతారం లోనే చెప్తాడు 'నేనే భగవంతుడని" అని. కృష్ణుడు చేయని పని లేదు పారని పాచిక లేదు. 'తుళసీ దళానికే తేలిపోయి తూగునటి ఆనాందలీలా .." అన్నా "కన్నతోడు లేనివాడే కన్నెతోడు కోరినాడే .." అన్నా ఆ కృష్ణుడుకే చెల్లు.

మీరు భలే అండి కృష్ణాష్టమి గురించి చెప్పకనే చెప్పారు. మీకు తెలీదా కృష్ణాష్టమి అంటే కృష్ణుడి బర్త్ డే.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నేస్తం గారు,
హహ..హ్హ..మీరు భలేగా రాసి పండిస్తారు కామెడీని.

durgeswara చెప్పారు...

కన్నయ్య గూర్చి తెలియకనా ! మీరడిగేది
ఎదో ఒకరకంగా కొత్తగా చెప్పాలని చూసారు
బానేవుంది కాని కన్నయ్య లీలలేవన్నా వున్నయేమోనని వచ్చినందుకు కొద్దిగా నిరాశకలిగినది. ఆ జగత్ప్రభువు విభవాన్ని మరొక పోస్ట్ గా వ్రాస్తారని ఆశిస్తున్నాను.

శ్రీలలిత చెప్పారు...

నేస్తం,

మి కృష్ణాష్టమి ముచ్చట్లు ఎంత బాగున్నాయో..

Bhãskar Rãmarãju చెప్పారు...

:):) మా కృష్ణుడు ఇంకా తయ్యారు కాలేదు. గోపిక మాత్రం కిచకిచా అంటోంది.
కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకూ మీవారికి కూడా.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ :-) చాలా బాగుంది నేస్తం గారు, విషయం ఏమీ లేదంటూనే బోలెడు విషయాలు చెప్పేశారు. మీరే టాపిక్ పట్టుకున్నా ఇలా అవలీలగా రాసి అవతల పడేస్తే ఎలాగండీ :-) మీకూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

సృజన చెప్పారు...

భలే..మీవారు కరెక్టుగా చెప్పారు.

భావన చెప్పారు...

అబ్బ నవ్వించి నవ్వించి మనుష్యులను చంపెయ్యాలని ఏమైనా ప్లాన్ వేసుకున్నారా ఏమిటి.. :-)
మీకు కూడా క్రిష్ణాష్టమి శుభా కాంక్షలు... స్వతంత్ర దినోత్సవం అంటే ఏమిటి అని మాత్రం మీ ఆయన ను అడగకండే ప్లీజ్...

నేస్తం చెప్పారు...

మేధ గారు కుమార్ గారు థేంక్స్ అండి
శశాంక్ అబ్బో క్రిష్ణుడి గురించి భలే వర్ణించారు
శేఖర్ థేంక్స్ అండి :)

నేస్తం చెప్పారు...

దుర్ఘేశ్వర గారు క్రిష్ణ లీలలు రాయడానికి మీ వంటి పెద్దలున్నారు ,అవి రాసే అంత గొప్ప పరిఙ్ఞానం నాకు లేదనే రాయలేదు :)
లలిత గారు థేంక్స్ అండి :)
భాస్కర్ గారు అయితే నాన్న బ్లాగ్ లో బుల్లి క్రిష్ణుడిని చూస్తామన్నమాట .. మరి ఈ సారి తప్పని సరిగా మీ గోపిక ఫొటోను కూడా పెట్టాలి ..:)

నేస్తం చెప్పారు...

హ హ వేణు గారు నిజానికి ఈ పోస్ట్లో మేటర్ ఏమీ లేదు ..సరదాగా రాసాను ..కృష్ణుడి మీద రాయాలంటే మాటలా మరి
సృజన గారు మావారు ఏ విషయం లో కరెక్ట్ గా చెప్పారు .కృష్ణుడి విషయం లోనా లేక నా విషయం లోనా :)
భావనగారు హహ అడగనులెండి నాకు కాస్త దేశభక్తి ఎక్కువే ..:)

సీత చెప్పారు...

:) Krishnashtami subhakankshalu nestham garu... nenu intlo unte oka ginne lo venna petti pedathanu krishnudi daggara :)

ప్రభాకర్ చెప్పారు...

కృష్ణుడి గురించి , క్రిస్ష్ణస్టమి గురించి ఏమి తెలియదని చెప్పి ఇంత పెద్ద పోస్ట్ రాసారు.. చాల చక్కగా ఉంది మీ వాక్య నిర్మాణం...మీ హాస్య చతురత అద్బుతం .. కృష్ణాష్టమిశుభాకాంక్షలు

మాలా కుమార్ చెప్పారు...

నేస్తం గారు,
నా అభిమాన రచయిత /త్రు లు రాయటము మానేసారే అని దిగులు పడుతున్న సమయములో జ్యొతిగారు మీ బ్లాగ్ లింక్ ఇచ్చారు. ఆవిడ నెత్తిన పాలు పోసి ఉక్కిరి బిక్కిరి చేయను కాని , మా తీగకు పూయగానే ఓ జాజిపూల దండ సమర్పించుకుంటాను .
మీ అభిమానుల జాబితాలో నా పేరు కూడా చేర్చుకోండి.
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

నేస్తం చెప్పారు...

జోయ్ గారు అవునా,నిజమేనండోయ్ క్రిష్ణుడికి ఇష్టమైన ఫుడ్ వెన్ననే కదా మంచి పని చేస్తారు
ప్రభాకర్ గారు నిజానికి క్రిష్ణష్టమి గురించి ఏదో ఆ కాస్త తప్ప క్రిష్ణ లీలలు వివరించడానికి నా భాషా పటిమ సరిపోదనిపించింది :)
మాలా కుమార్ గారు ఎంత మాట ..మీవంటి వారి వాఖ్యలే నా పోస్ట్ లకు అందాన్ని తెస్తున్నాయి

Phani Bodapati చెప్పారు...

Me sence of humour chala bagundi... me kadalu chaduvuthunte chala releif ga vuntundi...inka manchi manchi kadalatho meru ravali ani korukuntunanu...krishna aashtami subakanshalu.

మధురవాణి చెప్పారు...

అసలు 'కృష్ణాష్టమి' అంటే ఎంతని ఇంత బాగా ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదండీ.. ఇది నిజ్జంగా నిజం.!
ఆహాహా..ఏం చెప్పారండీ..అద్భుతం..అమోఘం..అదరగొట్టేసారు... (ఈ కామెంటుని మీవారికి చూపించి మరో రెండు అక్షింతలు వేయించుకోండి ;)
అలాగే, మీ పోస్టుల కోసం ఎదురు చూసేవారం బోలెడుమంది ఉన్నామని మా కామెంట్ల సాక్షిగా మరోసారి నొక్కి వక్కాణించండి మీ శ్రీవారికి :)

G Veera Sekhar చెప్పారు...

ఎప్పటిలాగే సరదాగా రాసారు ...కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు కూడా....!

nuthakkis చెప్పారు...

Bagundi.. baagaa raasaru.. actually mi posts kosam memu antha wait chestu untam.. nenu ayitee google reader loo first meeru emanna blog chesara ani choosi, adi chadivesi appudu work chesukuntanu.. :)

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

క్రిష్ణాష్టమి చాలా మంది జరుపుకొనేది ఈ రోజే. అష్టమి రాత్రిగల ( క్రిష్ణుడు అర్ధ్రాత్రి పుట్టడు గనుక ) రోజే క్రిష్ణాష్టమి జరుపుకునే సాంప్రదాయం వారికి ఈ రోజే.

కానీ వైష్ణవ ఆగమం ప్రకారం వైష్ణవులు మాత్రం రేపు జరుపు కొంటారు.

ఇప్పుడు చాలా మంది ఆ సాంప్రదాయం కూడా పాఠిస్తున్నారు.

ఏమీ తెలియదంటూనే చాలా చక్కగా నవ్వించారు. :)

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

భలే రాశారు.

మీ ప్రొఫైల్ ఫోటో మార్చారే...?
నాకెందుకో పాతదే బాగుందనిపించిందండీ....

మీ ఇష్టం మీదనుకోండీ... :)

నేస్తం చెప్పారు...

boDapati గారు మీ అభిమానం ఉండాలే గాని తప్పకుండా రాస్తాను..
మదురవాణి గారు మీ వాక్య గురించే చూస్తున్నా ..తప్పని సరిగా చూపిస్తా ...హన్నా మరి నన్ను అంటారా:)
ఆదిత్య గారు థేంక్స్ అండి

నేస్తం చెప్పారు...

nUthakkis గారు చాలా థేంక్స్ అండి మీ అభిమానానికి
రాజశేఖర్ గారు నిన్నటి నుండే ఇదే కన్ ఫ్యూజ్ అవుతున్నాను..ఎవరన్నా చెప్తారేమో అని ఎదురుచూస్తున్నా..చాలా థేంక్స్ అండి
పాత ఫోటొ నాది కాదు కదా అదన్నమాట ప్రేమికుడు గారు ..అయినా మార్చేస్తాను :)

Srinivasa Charya Daruri చెప్పారు...

chaala gammaththuga vrasaaru.,
vishayam cheppi cheppanattuga cheppaaru,

krishnaashtami shubhakankshalu.

గీతాచార్య చెప్పారు...

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

Srujana Ramanujan చెప్పారు...

ఆహా! వాటేన్ ఇన్ఫర్మేషన్! వాటే బ్యూటిఫుల్ చిత్రీకరణ.

So nice.

పరిమళం చెప్పారు...

మీ శైలి , మీరు రాసే పోస్టుల కోసం ఎంతమంది అభిమానులున్నారో తెలీక మీవారలా అని ఉంటారు ..ఇప్పుడు చూపించండి మీ కామెంట్స్ ని ! మీ బ్లాగ్ లో మాత్రం బొమ్మ కంటే మీరు రాసే విశేషాలకే ప్రాధాన్యత ! మీక్కూడా శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు .

జ్యోతి చెప్పారు...

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ...

అజ్ఞాత చెప్పారు...

"అసలు కృష్ణాష్టమి అంటే"
AVS గారిని అడగకపోయారా?

kiranmayi చెప్పారు...

ఛా !!!! ఇలా పోస్ట్ పోస్టారో లేదో, అలా కామెంట్ మీద కామెంట్ వచ్చి పడుతుంటే ఇంకేం proof కావాలండి మీ వారికి? అయినా కృష్ణాష్టమి గురించి ఆయనల్ని అడుగుతారా ఎవరైనా? అమ్మమ్మల్ని కాని నాయనమ్మల్ని కాని అడగాలి కాని.

మరువం ఉష చెప్పారు...

ఇంతులందు మా నేస్తం పూబంతి, టపాల విందు నివ్వగ మా నేస్తానిదే తొలిపిలుపు. ఆహా ఏమి ఘనులు మీవారు ఆయనకి తగిన మీ జోరు..

నేస్తం చెప్పారు...

cnu గారు థేంక్స్ అండి
గీతాచార్య గారు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకునూ :)
సృజన హ హ :D
పరిమళం గారు మీ అందరి అభిమానం పొందినందుకు నిజానికి నేను అదృష్టవంతురాలిని

నేస్తం చెప్పారు...

జ్యోతి గారు మీకూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బొనగిరి గారు అసలు అలా అడగగానే మా ఆయన ఆ సినిమానే గుర్తు తెచ్చారు :)
కిరణ్మయి గారు అదే కదా మరి చివర్లో ఈ కధలో నీతి :)
సరిరారు మీకెవ్వరు ఉషగారు :D

శ్రీ చెప్పారు...

మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

Nestham garu..

eppati lage bagundi...nenu emaina raseddam anukuni..bayapadtharemo ani..chinna krishnudi bomma pettii...subhakankshalu cheppesa..teliviga.. :)

నేస్తం చెప్పారు...

శ్రీ మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా :)
కిరణ్ మావారు చెప్పిన సలహా మీరు అమలు చేసారన్న మాట :)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం, ఇప్పుడే మీ పోస్ట్ చూసాను.పండగ? హడావుడిలో, కుదరలేదు చూడటం ! ఇంతకీ పండగ రోజు నాకు సుస్తీ చేసింది.ప్చ్, ఏం చేస్తాం, పిండి వంటలు, స్వీట్లు కూడా తినలేకపోయా ! సరదాగా బాగా రాసారు ఎప్పటి లాగే !

మీ ఆయన కొంచెం కుళ్ళుకుంటున్నారేమో అని అనుమానంగా ఉందండీ, లేకపొతే మీ కబుర్ల కోసం ఎదురు చూసే ఇంత మంది వ్యాఖ్యలు ఆయనకి కనపడకనా అంటా ! -

మీకు, కృష్ణాష్టమి గురించి చెప్పిన మీ ఆయనకి, ( ;-), :-P) కృష్ణాష్టమి శుభాకాంక్షలు !

- పద్మ.

నేస్తం చెప్పారు...

padma :)
avunu ippudu elaa undi health

అజ్ఞాత చెప్పారు...

నేస్తం, ఇప్పుడు బాగానే ఉన్నానండీ. :-) పండక్కి ఊరికే హడావుడి చేస్తుంటా( తన కంటే) అని కృష్ణుడికి కోపం వచ్చిందేమో.:-P కృష్ణాష్టమి కి ఉట్టి కొడతారు( ఇదే కాలంలో? నేనెక్కడా చూడలేదు !) లాంటివి రాయకుండా మీ శైలిలో సరదాగా రాసారు.

Unknown చెప్పారు...

నేస్తం గారు యాధృచ్చికంగా ఈ పోస్ట్ చదివాను. చాలా వెరైటీగా రాశారు. ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్లు ఉంది, great way of presentation.

నేస్తం చెప్పారు...

శ్రీధర్ గారు థేంక్స్ అండి

గాయత్రి చెప్పారు...

:))