22, డిసెంబర్ 2008, సోమవారం
అదన్నమాట సంగతి
చిన్నపుడు మా నాన్నమ్మ ,తాతయ్యలంటే ఒక్కోసారి మహా చెడ్డ కోపం వచ్చేసేది .విషయం ఏమిటంటే మా తాతయ్య కధ చెప్పాడంటే back ground music తో సహా సినిమా చూసినట్లు చెప్పేవాడు..కాని దానికి సవాలక్ష కండిషన్లు పెట్టేవాడు .అవేంటంటే పిల్లలం అందరం పరమానందయ్య శిష్యులు లాగ కాళ్ళు,చేతులూ పంచేసుకుని వత్తు తూ .. ఊ..ఊ అని ఊ కొడుతూ వినాలి .. కధ మద్యలో ఎవరన్నా లీనమై పోయి 'ఊ' కొట్టక పోయినా ..కాళ్ళు పట్టక పోయినా ఇంక అంతే అలిగేసేవాడు .. ఇంక ఎంత బ్రతిమాలినా ఆ పూటకు చెప్పేవాడు కాదు..
పోని నాన్నమ్మ దగ్గరకు వెళ్ళి అడిగామా అదో పేద్ద చిక్కు. తను వెంటనే రెడీ అయిపోయేది చెప్పడానికి.. కాని ఏళ్ళ తరబడి ఒకటే కధ చెప్పేది ..ఒక రాజు కి 7 గురు కొడుకులున్నారంటా .. నాన్నమ్మా!! ఎన్ని సార్లు చెబుతావ్ అదే కధ కొత్త కధ చెప్పు నాన్నమ్మ అని ఎంత ముద్దుగా అడిగినా ,నాకు మా అమ్మ అదే కధ చెప్పింది .నాకు అదొక్కటే వచ్చు వింటే వినండి లేక పోతే లేదు అని ఖరాకండి గా చెప్పేసేది, ఇంక చేసేది ఏమి లేక తాతయ్యనే ఆశ్రయించేవాళ్ళం .
అలా కధలు కూడ చెప్పని నాన్నమ్మకు మా వీధి అంతా అభిమానులు ఉండటం నాకు ఎంత తల కొట్టుకున్నా అర్దం అయ్యేది కాదు .
మా ఎదురింటి వరండా చాలా విశాలంగా ఉండేది . సాయంత్రం అయ్యేసరికి నాన్నమ్మ, ఇంకొందరు ఆడవాళ్ళు అక్కడ సమావేశం అయి మాట్లాడుకునేవారు ,ఒక్క రోజు నాన్నమ్మ అక్కడకు వెళ్ళకపోతే ఇంటి కొచ్చి పరామర్శించి వెళ్ళేవారు .
ఒక రోజు ఎదురు ఇల్లు బాగు చేయిస్తూ ఉండటం తో నాన్నమ్మ మా ఇంట్లొనే ఉండి పోయింది. అందువల్ల ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళతో మా ఇంట్లోనే సమావేశం మొదలుఅయింది.. నేను అక్కడే ఉండి ఏదో హోం వర్క్ చేసుకుంటూ ఒక చెవి వేసి వింటున్నా ..
అందులో ఒక ఆవిడ ఏంటో పిన్ని గారు ఆయనేమో ఇల్లంతా అప్పులతో నింపేసారు,పిల్లేమో పెళ్ళికెదిగి కూర్చుంది,పిల్లాడేమో చేతికందలేదు ఇంకా.. రాను రాను జీవితం ఎలాగ గడపాలో తెలియడం లేదు అంది.మరేం చేస్తాం కష్టాలు మనుషులకు కాక మానుల కొస్తాయా అంది నాన్నమ్మ..ఏం కష్టాలో లేండి ,పేదవాళ్ళ లా పుట్టినా ఏదో కూలినాలి చేసి బ్రతికేయగలం ఈ మద్యతరగతి బతుకులింతే అంది .
బాగుంది.. వెనకటికి నీలాంటి వాడే ,ఇలాగే దిగాలుపడిపోయి దేవునితో ..దేవుడా ఇన్ని కష్టాలు నాకే ఇచ్చావ్.. ఆఖరికి పాలవాడు, నీళ్ళ వాడు కూడా ఒకరోజుకాకపొతే ఇంకొక రోజైనా సంతోషం గా కనబడుతున్నాడు నాకే ఎందుకు ఇలాంటి బ్రతుకిచ్చావ్ అని చాలా బాధ పడిపోయాడంట,ఆ రాత్రి కలలో దేవుడుకనబడి సరే నీకొక మేజిక్ సంచి ఇస్తాను దానిలో నీ బాధలు ,కష్టాలు, దిగుళ్ళు అన్నీ వేసుకుని ఫలానా గుడికి రా అన్నాడంటా ..వీడు సంతోషం గా అన్నీ గుర్తుతెచ్చుకుని ఆ సంచి నిండా అన్నీ నింపి బయలుదేరడంటా ,దారిలో వీడికంటే పెద్ద సంచులేసుకుని పాల వాడు, నీళ్ళ వాడు ఇంకా బాగా డబ్బులున్న సేఠ్ గారు,వ్యాపారం చేసే సుబ్బి శెట్టి ఏకంగా బస్తాలు మోసుకుని వస్తున్నారంటా ,అమ్మో వీళ్ళకు నాకంటే ఎక్కువ కష్టాలనుకుంటా అయినా మనకెందుకులే అనుకుని గుడికి చేరుకున్నాడంటా .. గుడిలో దేవుడు చిద్విలాసం గా ఎవరి ఖర్మలను బట్టి వాళ్ళ కష్టాలు ఉంటాయి కాబట్టి అనుభవించక తప్పదు కానీ ,ఒక సహాయం చేస్తాను..మీకు మీ కష్టాల కంటే మిగిలిన వాళ్ళ కష్టాలు తేలికగా అనిపిస్తున్నయి కాబట్టి ..మీ సంచులు అక్కడ ఉన్న కొక్కాలకు తగిలించండి , నేను 3 అంకెలు లెక్క పెట్టగానే ఇక్కడ చీకటి పడి పోతుంది , మీరు మీ చేతికి తగిలిన సంచి పట్టుకుని మీ ఇళ్ళకు పొండి అన్నాడంటా..
దెబ్బకు మనోడికి చమటలు పట్టేసాయంటా.. ఇదేం గోల రా బాబు, నా కంటే పెద్ద బస్తాలాంటి సంచితో ఈ సేఠ్ నా పక్కనే ఉన్నాడు .. ఎందుకొచ్చింది అని తన సంచి గట్టిగా పట్టుకుని నిలబడ్డాడంటా,విచిత్రంగా సేఠ్ కూడా భయంగా తన బస్తా జాగ్రత్తగా గట్టిగా పట్టుకున్నాడంటా,చీకటి అవ్వడం పాపం అందరూ బయటకు పరుగులు తీసారు .. అయితే వీడికి అనుమానం వచ్చి సేఠ్ తో నేను నా సంచి తో వస్తే అర్దం ఉంది, మరి నువ్వెందుకు నీ సంచే తెచ్చుకున్నావ్ అన్నాడంట ,దానికి సేఠ్ .. నా కష్టాలన్ని 30 ఏళ్ళు గా భరిస్తున్నా కొన్ని అలవాటు పడిపోయా,కొన్ని పరిష్కార మార్గాలు కనుగొన్నా ,కొన్ని పరిష్కరించ బోతున్నా .. ఇప్పుడు కొత్తగా నీవి పట్టుకుని మళ్ళీ బాధ పడలేను అందుకే నావే తెచ్చుకున్నా అన్నాడంటా ..
కాబట్టి నీ కంటె ఎక్కువ బాధలు ఉన్నవాళ్ళను తలుచుకుని ఆ స్థితి లో లేనందుకు సంతోష పడి ధైర్యంగా నీ సమస్యలు పరిష్కరించుకో అంది..ఆవిడకు ఏం అర్దం అయిందో తెలియదు కాని నాకు మాత్రం నాన్నమ్మ కు కధలు వచ్చని అర్దం అయిపోయింది ..అమ్మ నాన్నమ్మా అని అనుకుంటునంతలో మరొక ఆవిడ ...ఏమో లే అక్కా ,నాకు ఈ బాధ్యతలు ఏమి లేవు.. పిల్లల పెళ్ళి అయిపోయింది ,నా కొడుక్కి ,కోడలికి భారం అయిపోయాను ..ఇంక బ్రతికి ఏం సాధించాలి అంది ..మళ్ళీ నాన్నమ్మ రెడీ అయిపోయింది .
వెనకటికి నీలాంటోడే బాగా సంపాదించి విసిగెత్తి పోయి అరెరే తిండితిప్పలు మానేసి నేను ఇంత సంపాదించి ఏం ఉద్ధరించాను అనుకుని ,డబ్బు అంతా మూటగట్టి ఊరి చివరన ధ్యానం చేసుకుంటున్న సాదువు దగ్గరకు వచ్చి
స్వామి, నాకు మనశ్శాంతి లేదు ,పెళ్ళాం పిల్లలు మిధ్య,ఈ సంపాదన భ్రమ అని తెలుసుకున్నా .. నన్ను మీ శిష్యుడిని చేసుకోండి అని ఆయన పాదాల ముందు డబ్బు పెట్టి నమస్కరించాడంట వంగుని..అతను అలా వంగున్నాడో లేదో ఈ సాదువు ఆ డబ్బు మూట పట్టుకుని పారిపోవడం మొదలు పెట్టాడు, దెబ్బకి భయం వేసి మొత్తానికి సాదువుని పట్టుకుని, ఓరి దొంగ వెధవ ,నువ్వు నిజం సాదువు అనుకున్నా ఇంత మోసమా అన్నాడంట అప్పుడు సాదువు నవ్వి..
ఇప్పుడేకదా డబ్బు ,సంసారం అనేది భ్రమ అన్నావు .. నీకు వచ్చింది విసుగే కాని విరక్తి కాదు నాయనా.. కాబట్టి హాయిగా ఎటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా జీవించు అన్నాడంటా ...
అది విన్నాక వాళ్ళందరూ మా నాన్నమ్మను తెగ పొగిడేసి వెళ్ళిపోయారు ..నేను కోపం గా రెండు చేతులు నడుము మీద వేసుకుని కధలు రావని చెప్పి వచ్చినోళ్ళందరికి సమాధానాలు కధలతో చెబుతావా ఆయ్.. ఈ విషయం అందరికీ చెపుతా అని వెళ్ళే లోపల నన్ను దొరకబుచ్చుకుని అది కాదమ్మ ఇప్పుడు నేను కధలు చెబితే పాపం తాతయ్య కాళ్ళు పట్టడం మానేస్తారు కదా.. పాపం తాతయ్య ముసలాడు అయిపోయాడు కదా .. అందుకే అంది..అమ్మో తాతయ్య మీద ఎంత ప్రేమ అనుకున్నా .. ఇప్పటికీ అనిపిస్తుంది భార్యభర్తల అనుబంధం అంటే అలా ఉండాలి అని ఏమైతేనో మా నాన్నమ్మ పేరు చెప్పి జీవితానికి పనికొచ్చే మంచి కధలు చెప్పేసా :) `
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
16 కామెంట్లు:
భలే ఉన్నాయి మీ ముచ్చట్లు. బాగా రాస్తున్నారు మీరు.
మీ బ్లాగు మొదటి సారి చూస్తున్నానండీ, కధలు సూపర్, నాన్నమ్మ సూపర్, బొమ్మ ఇంకా సూపర్. టపా చాలా బాగుంది తీరిక దొరికినపుడు మీ మిగిలిన టపాలు కూడా చదివేయాలి అనే ఆసక్తిని కలిగించారు.
sreekanth gaaru laxmi gaaru thanks andi :)
నేనర్జంటుగా నానమ్మైపోయి నీ వంటి మనవరాల్ని చూసుకుంటూ కాలం గడిపితే అని, అరే ఈ వూహేదో చాలా బాగుందే అననీపించింది. కాని మీఅంత మంచి తాతయ్యని నేనివ్వలేనమ్మీ?
చాలా బాగా నీ లొకంలోకినడిపావు, పిల్లోయ్!
బాగా చెప్పారు.
మీ నానమ్మ మీ ద్వారా చెప్పిన కథలు చాలా బాగున్నాయండి. ఇంకా మంచి మంచి కథలు చెప్తూ ఉండండి.
"ఇప్పుడు నేను కధలు చెబితే పాపం తాతయ్య కాళ్ళు పట్టడం మానేస్తారు కదా" --- ఈ వాక్యం బాగా రాశారు. ఆప్యాతలను ఒక్క మాటలో చెప్పారు.
ఉష గారు మీరు నాన్నమ్మ అవ్వాలేగాని మంచి తాతయ్యే దొరుకుతారు నాకు :) ధన్యవాదాలు.. ప్రసాద్ గారు మువ్వ గారు మిరియాల ప్రదీప్ గారు ధన్యవాదాలు అండి
బాగా రాసారండి. మీ కాన్సెప్ట్ నచ్చింది.
నా కామెంట్ కూడా సిరిసిరిమువ్వ గారు చెప్పినదే..
చాలా బాగా రాస్తున్నావు :)
~C
thanks anDi
super unnayi mee anubhavalu...mee peru telusukovacha? pictures kuda chala bagunnayi....verygood...ma office lo andariki printouts tisi mari panci pettanu
శిరీష గారు నాది సామన్యమైన పేరే ..ఎందుకో నేస్తం అని కలం పేరుతో రాయాలనిపించింది రాసాను .. ఇక బ్లాగు ఆపేస్తాను అనుకున్నపుడు చెప్పే వెళతాను :) మీ అభిమానానికి ధన్యవాధాలు
చాలా చాలా బాగున్నాయ్ మీ పోస్టింగ్స్..
meeru super andi...inni rojulu mee blog ni enduku chudaledu ani feel avuthunnanu
కామెంట్‌ను పోస్ట్ చేయండి