
అసలు పండగల విషయం వచ్చేసరికి మా ఇంట్లో ఆడపిల్లలందరికీ చాలా అన్యాయం జరిగిపోయేది ..మా సమానత్వపు హక్కులన్నీ దిక్కులేకుండా పోయేవి..వినాయక చవితికి అయితే మరీనూ .. పండగ ముందురోజునుండే మా తాతయ్య ,తమ్ముళ్ళు హడావుడి మొదలు పెట్టేవారు .అటక మీద పెట్టిన పాలవెల్లి,గంధపు చెక్క పీట క్రిందకు దింపి, వాటికి స్నానాలు చేయించి, చక్కగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పురికాసుని గుమ్మాలకు కొలిచి తెంపి ,మామిడాకులు మద్యలో పెట్టి, ముడివేసి తోరణాలు కట్టి అబ్బో ఇలా ఒకటేమిటీ అన్నీ వాళ్ళే చేసేవారు మమ్మలని ప్రేక్షక పాత్రలకు పరిమితం చేస్తూ..
కానీ నేను ఊరుకోను కదా ప్రతీ పండగకు గొడవే నేను చేస్తా ,నేను చేస్తా అని ,మా తాతయ్య మాత్రం నేను గొడవ చేసే ప్రతి సారీ ముందు నువ్వు పత్రి అని పలకడం నేర్చుకో అప్పుడు చేద్దువుగాని అని తాపీగా బదులు ఇచ్చేవాడు.. అంటే నాకేదో నత్తి అనుకునేరు నాకు కంగారు లో ఒక పదానికి బదులు మరొక పదం పెట్టి మాట్లాడేయడం అలవాటు.. అంటే పత్రిని ప్రత్తి అని ,ఆవేశాన్ని ఆయాసం అని ,ఆదుర్ధాని ఆరుద్ర అని ఇలా ఒకదాని బదులు ఇంకోటి పెట్టిమాట్లాడేసి అర్ధాలు మార్చేస్తూ ఉంటాను..అలా ఆ వీక్ పోయింట్ పట్టుకునే సరికి నా ఆయాసం (ఆవేశం )చప్పున చల్లారిపోయేది ..
ఇంక ఆ మరుసటి రోజు పాలవెల్లికి వెలగ కాయలు,జొన్నపొత్తులు,శీతాఫలాలు, ఇంకా అవేవో చిన్న చిన్న పసుపు రంగు పళ్ళు ఉండేవి అవేంటో మరి ..అవి ఇలా అన్నీ పురికాసుతో వ్రేలాడకట్టి ,పత్రి తో వినాయకుని అలంకరించి పూజ చేసేవారు ..మా తాతయ్య బ్రతికి ఉన్నంత కాలం ఇంటిల్లిపాది పండగలు సావిట్లోనే చేసే వాళ్ళం .. ఆ పండగ రోజు నేను చేసే ఒకే ఒక పని ఏంటయ్యా అంటే నా పుస్తకాలన్నీ వినాయకుడి దగ్గర ఒక్కటి కూడా మిస్ కాకుండా సంచితో సహా పెట్టేయడం .. మాటవరసకు ఒకటి రెండు పుస్తకాలు పెడితే సరిపోతుంది మిగతా పిల్లల పుస్తకాలు ఎక్కడ పెడతారు అని ఎవరు తిట్టినా ఒప్పుకునేదాన్ని కాదు.. నాకు అన్ని సబ్జెక్ట్లు డవుటేమరి ..మరి ఊరికే పాస్ అయ్యానా నా చదువు పూర్తి అయ్యేవరకూ ఒక్క సబ్జెక్ట్ కూడా తప్పకుండా .. అదన్నమాట
ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది. అయితే వినాయక చవితి రోజున ఒక్క విషయం లో మాత్రం తలుచుకుంటేనే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది.. అదే హారిది.. ఆ హరిదే అలా ఉంటుందో లేక మావాళ్ళే అంత చండాలంగా వండుతారో తెలుయదు కాని అదంటే నాకస్సలు పడదు .అసలు నాకు తెలియక అడుగుతాను వినాయకుడు కుడుములు ,ఉండ్రాళ్ళు ఇష్టము అని చెప్పాడుకానీ ..యే పురాణాల్లో అయినా మాటవరసకు హారిది ఇష్టం అని చెప్పాడా !!... ఈ విషయం మీకూ, నాకు అర్ధం అయింది కాని మా అమ్మా వాళ్ళకు ఎంత మొత్తుకున్నా అర్ధం అయ్యేది కాదు .. పోనీ ముచ్చట పడి చేసారనుకుందాం ..ఏదో వినాయకుని ప్రీత్యార్ధం నాలుగు కుడుములు ,కాసింత చిన్న గిన్నెలో హారిది వండి పెట్టచ్చుకదా అబ్బే ఆ పేరు వింటేనే వీళ్ళకు ఉత్సాహమే ఉత్సాహం అన్నమాట.. అక్కా! నువ్వు ఆ డేషా తో వండుతున్నావా అయితే నేను ఈ గంగాళం తో వండుతా అని ఒకరంటే, అక్కా!! నువ్వు బెల్లం హారిధి చేస్తున్నావా అయితే నేను పంచదారతో చేస్తాను అని ఇంకొకరు ...పైగా ఈవిడ వండిన హారిది ఆవిడ ,ఆవిడ వండినది ఈవిడ బకెట్లు బకెట్లు పంచుకోవడం ..
ఏం ,ఇంట్లో అంతమంది ఉన్నారు కదా చక్క గా మనిషికో రకం గారెలని,బూరెలని,పులిహోర అని వండితే వినాయకుడేమన్నా వద్దు అంటాడా .. పోనీ వండిన వాళ్ళు వండి ముచ్చట తీర్చుకోవచ్చు కదా ,అహా..అది మాకు కంచాల నిండుగా వేసేసి తినమని హుకుం ..పొరపాటున వద్దు అన్నామో .. నా బుజ్జికదా, మాచిట్టికదా అని బ్రతిమాలాడుతారనుకున్నారా.. మా వాళ్ళ అమ్ములపొదిలో మరుదులనే పవర్ఫుల్ అస్థ్రాలు ఉన్నాయి వాటిని ప్రయోగించేవారు ...ఒక్క సారి పిలవగానే వెంటనే మా నాన్నగారి రెండో తమ్ముడు.. ఆలిబాబా అరడజన్ దొంగల్లో గన్ మేన్ లా ప్రతి విషయానికి వేసేమంటారా అన్న టైపులో ఏం వదినా బెల్ట్ తెమ్మంటావా అనేవాడు ...ఇంకేం చేస్తాం ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్..సాంబార్ బుడ్డి అన్నమాట అందరం .
అలా ఏడుచుకుని ,ఏడ్చుకుని..తిట్టుకుని,తిట్టుకుని మద్యాహ్నపు భోజన సమయానికి అది పూర్తి చేసే సరికి అప్పుడు ఘమ ఘమ లాడుతున్న గుత్తొంకాయ,బంగాళ దుంప పిడుపు,పప్పు చారు వగైరా,వగైరాలతో అన్నానికి పిలిచేవారు..ఇంకేం తింటాం గొంతువరకు ఉన్న హారిది నోట్లోకొస్తుంటే ..అలా చాలా చాల అన్యాయం జరిగిపోయేది..
సరే ఈ విషయం ప్రక్కన పెడితే వినాయక వ్రతకధలో నాకు చాలా ఇష్టమైన కధ ..అందులో ఒక కధలో కుమార స్వామి కి, వినాయకునికి ఎవరు గొప్ప అని పోటీ వస్తుంది ..ముల్లోకాలు తిరిగి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే బెస్ట్ అని ఇద్దరూ బయలు దేరుతారు ..పాపం కుమార స్వామి గభ గభా తన నెమలి వాహనం మీద అన్ని చుడుతుంటే మన వినాయకుడు తాపీగా అంటే భక్తిగా అమ్మ,నాన్నల చుట్టూ తిరిగి గెలిచేస్తాడు..ఈ కధ వినగానే ఎంత సంతొషం వేసేసేదంటే అమ్మ,నాన్నల చుట్టూ తిరిగేస్తే బోలెడు పుణ్యం అన్నమాట అని పిండి రుబ్బుతున్న మా అమ్మ చుట్టు ,స్కూటర్ తుడుస్తున్న మా నాన్న చుట్టూ ,టి.వి చూస్తు నవ్వారు మంచం మీద కూర్చున్న అమ్మా,నాన్నల చుట్టు కలిపి,విడి విడి గా చాలా సార్లు తిరిగేసి సీక్రెట్గా బోలెడు పుణ్యం సంపాదించేసాను చిన్నపుడు..
ఇంకొక కధ కృష్ణుడు చవితి నాటి చంద్రుని పూజ చేయకుండా చూసి నీలాప నిందల పాలవడం.. నేను ఇంతకు ముందే చెప్పాను కదా నాకు కృష్ణుడంటే వల్లమాలిన ప్రేమ అని..మరి నాలో ఉన్న స్త్రీవాది ఏ మూలన కూర్చుని బట్టలు ఇస్త్రీ చేసుకుంటుందో తెలియదు కాని ఆ కధ చివరలో నీలాప నిందలు పడితేనేమి చక్కని చుక్కలైన ఇద్దరు భార్యలను తెచ్చుకున్నాడు కృష్ణుడు అని చదివి తెగ మురిసిపోయేదాన్ని..అక్కడికేదో కృష్ణుడు నాకు రెండుసార్లు ఆడపడుచు కట్నం ఇచ్చినంత సంబరపడిపోయేదాన్ని ఆ కధ విని ...కానీ పూజ చేసి అక్షింతలు వేసుకున్నా నాకు మాత్రం చవితినాడు చందమామాను చూడాలంటే మహా భయం ఉండేది అప్పట్లో ..ఇప్పుడేమో ఇక్కడ తల ఎత్తితే భవనాలుతప్ప ఆకాశమే కనబడటం లేదు ఏంటో..ఇలా చెప్పుకుంటు వెళుతే వినాయక చవితి గురించి రాస్తూనే ఉండచ్చు..
గమనిక:- ఎవరండి అక్కడ చవితి రోజు చందమామను చూసి తరువాత తీరిక గా పూజ చేసి ఇద్దరు పెళ్ళాలను కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంది.. నేనంటే చిన్నపుడు అమాయకత్వం వల్ల అలా అనేసుకుని సరదాగా రాసాను .. మా అమ్మాయిలకు అన్యాయం చేయాలని చూస్తే కళ్ళు ఢాం ఢాం అని పేలిపోతాయి జాగ్రత్త.. కాబట్టి బుద్దిగా లెంపలేసుకుని,10 గుంజీలు తీయండి ముందు ..
అందరూ వినాయక చవితి జరుపుకుని స్వామివారి కృపా కటాక్షాలతో ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఆయురారోగ్యాలతో ,సిరి సంపదలతో తులతూగాలని ఆశిస్తున్నాను.
(ఫొటో గూగులమ్మని అడిగినది )